19, ఆగస్టు 2010, గురువారం

చమత్కార పద్యాలు - 17

డా. నండూరి రామకృష్ణమాచార్య
స్వర్గీయ డా. నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య లోకంలో బహుళ ప్రసిద్ధి చెందిన మహాకవి. వీరు రచించిన ’శీర్ణ మేఖల’ ఖండ కావ్యం ఏభయ్యేళ్ళ క్రితం ఒక సంచలనాన్ని సృష్టించింది. అందులోని కర్ణ, సుయోధన మైత్రికి సంబంధించిన ఘట్టం వీరి స్వీయ కల్పితం. ఈనాటికీ అది ఒక అపురూపమైన సృజనగా నీరాజనాలందుకొంటూనే ఉంది. వీరు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ’అధికార భాషా సంఘం’ అధ్యక్షులుగా (1987- 1990) పని చేసారు. వీరి రచనలలో ’తారా తోరణం’, ’ఆలోచనం’, ’ప్రగతి గీత’, ’కవితా ప్రభాస’,’ముత్యాల గొడుగు’, ’కచ్ఛపీ కింకిణీకం’ వంటి కవితా సంపుటులు; ’శివాజీ’, ’ధర్మ చక్రం’, ’జ్యోత్స్నాభిసారిక’, ’గోదావరి’ వంటి నాటికలు; ’కావ్యాలోకం’ అనే లక్షణ గ్రంథం; ’కవిత్రయం’, ’పద్య శిల్పం’ వంటి విమర్శన గ్రంథాలు ప్రముఖమైనవి. ఇవి గాక 'Maha Bharata', 'Gandhian Era' ఆంగ్లంలో ప్రసిద్ధ రచనలు. ’కవిత్రయం’ గ్రంథానికి ’తెలుగు భాషా సమితి’ పురస్కారాన్ని ఆనాటి రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా అందుకొన్నారు. ' Gandhian Era ' గ్రంథానికి నాటి రాష్ట్రపతి డా. శంకరదయాళ్ శర్మ ’ముందు మాట’ ను వ్రాసారు. మహాకవి ’కరుణశ్రీ’, వీరు ఆత్మీయ మిత్రులు. ’కరుణశ్రీ’ గ్రంథాలన్నిటికీ ’నండూరి’ వారే పీఠికలు వ్రాసారు. ’కేంద్ర సాహిత్య అకాడమి’ 1955 ప్రాంతంలో వీరితోబాటు ’జాషువ’, ’కరుణశ్రీ’ లను ’నవ్య సంప్రదాయ కవులు’గా గుర్తించింది. ఆచార్యుల వారు ’ఆంధ్ర పద్య కవితా సదస్సు’ రాష్ట్ర స్థాయి అధ్యక్షులుగా ఆమరణాంతం పద్య కవితాభివృద్దికై విశేష కృషిని సలిపారు. ( డా. ఆచార్య ఫణీంద్ర గారి బ్లాగు నుండి కృతజ్ఞతలతో )
నండూరి రామకృష్ణమాచార్య గారి "ముత్యాల గొడుగు" అనే ముక్తకాల, చాటువుల సంకలం నుండి మూడు పద్యాలు.....
ఈగ - తేనెటీగ
మసలు పూల యందు మల మూత్రముల యందు
ఈగ వేరు, తేనెటీగ వేరు
విశ్వమందు కలరు వివిధ విమర్శకుల్
వారి వారి తీరు వేరు వేరు.
ఓటు
అర్హుఁడైనవాని యన్వేషణము సల్పి
కన్య నీయఁ దగును కాళ్ళు కడిగి
ఓటు చేయఁ దగును యోగ్యుండు నిలుచుచో
నతఁడు నోరు విప్పి యడుగకుండ.
కట్నము
ఏమి లాభమయ్య యెఱలేని గాలమ్ము
చేప లుండవచ్చు చెరువు నిండ
కన్నె పెండ్లి యందు కట్నమే ముఖ్యమ్ము
చక్కదనము కాదు, చదువు కాదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి