30, సెప్టెంబర్ 2010, గురువారం

సమస్యా పూరణం - 110

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...........
కట్టె మధియింప మధియింప గలుగు నిప్పు.
( 'వరవిక్రయం' నాటకంలోని ఈ పద్య పాదాన్ని సమస్యగా ఇవ్వమని సూచించిన నేదునూరి రాజేశ్వరి గారికి ధన్యవాదాలు )

చమత్కార (చాటు) పద్యాలు - 38

ఆర్తజన రక్షణోపాయ! ఆంజనేయ! - 3
సీ.
లవణ వారాశి కోలకుఁ దెచ్చె నీ రాజు
నగుచు నంబుధి దాఁటినాఁడ వీవు;
రాతి నాతిగఁ జేసి రక్షించె నీ రాజు
మకరి నంగనఁ జేసి మంచి తీవు;
మాయల మారీచు మడియించె నీ రాజు
చెడు కాలనేమి నుక్కడఁచి తీవు;
లంకేశుఁ ద్రుంచె నాలములోన నీ రాజు
వెస లంక నీఱు గావించె తీవు;
తే. గీ.
ఆశ్రితావనుఁ డగు రాము నంత రాజు
పతిహితుండగు నీ వంటి బంటు గలఁడె?
మహిత శ్రీరామ పదభక్తిమద్విధేయ!
ఆర్తజన రక్షణోపాయ! ఆంజనేయ!
( అజ్ఞాత కవి )

ఛందస్సు

ఛందస్సు నేర్చుకుందామా?
"అబ్బా! మళ్ళీ ఛందస్సు పాఠాలా? ఇప్పటికే చాలా బ్లాగుల్లో ఛందస్సు నేర్పించారు కదా!" అంటారా? నిజమే ... ఈ ధర్మసందేహం నాకూ కలిగింది. "ఆంధ్రామృతం, పద్యం.నెట్, నరసింహ, తెలుగు పద్యం, దట్స్ తెలుగు" తదితర బ్లాగుల్లో ఛందస్సు నేర్పే పాఠాలను ఇప్పటికే కావలసినంత పోస్ట్ చేసి ఉన్నారు. ఇంకా చేస్తూ జిజ్ఞాసువులకు అందిస్తూ భాషాసేవ చేస్తున్నారు.
ఇప్పుడిప్పుడే బ్లాగులను చూస్తున్న వాళ్ళూ, పద్య రచన చేయాలని నూతనోత్సాహం చూపుతున్న వాళ్ళూ ఆ బ్లాగుల సంగతి తెలియక ఛందస్సుకు సంబంధించిన తమ సందేహాలను నాకు రాసి సమాధానాలను కోరుతున్నారు. ఛందోపాఠాలను అందించే బ్లాగుల పూర్తి సమాచారం నా దగ్గర లేదు. తెలిసిన వాళ్ళు ఆ వివరాలను అందిస్తే నా బ్లాగులో ప్రకటిస్తాను. తద్వారా అందరూ ఆ బ్లాగుల్లోని ఛందశ్శాస్త్ర విశేషాలను తెలుసుకొంటారు. సందేహ నివృత్తి చేసుకొంటారు.
అలా కాదంటే నేను కొత్తగా ఛందస్సుకు సంబంధించిన పాఠాలను నా పరిధిలో, నా శైలిలో ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను.
"శంకరాభరణం" బ్లాగు అభిమానులు, మిత్రులు తమ సలహాలను, సూచనలను తెలియ జేయ వలసిందిగా మనవి.

29, సెప్టెంబర్ 2010, బుధవారం

సమస్యా పూరణం - 109

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...........
పుట్టినప్పుడే లిఖియించు గిట్టు మనుచు.
( 'వరవిక్రయం' నాటకంలోని ఈ పద్య పాదాన్ని సమస్యగా ఇవ్వమని సూచించిన నేదునూరి రాజేశ్వరి గారికి ధన్యవాదాలు )

చమత్కార (చాటు) పద్యాలు - 37

ఆర్తజన రక్షణోపాయ! ఆంజనేయ! - 2
సీ.
శ్రీరాము నాత్మలోఁ జేర్చుకొన్న మహాత్మ!
చిత్తంబులోన వసింపు మయ్య;
కడు లావుమైఁ జౌటి కడలి దాటిన ధీర!
కడలేని భవవార్ధిఁ గడపు మయ్య;
ధవుని సేమంబు సీతకు నొసంగిన మేటి!
పరిణామ మొసఁగి చేపట్టు మయ్య;
ధట్టించి మందుల గట్టుఁ దెచ్చిన దేవ!
జీవనౌషధ మిచ్చి ప్రోవు మయ్య;
తే. గీ.
హనుమ! నీవు సమర్థుఁడ వయ్యు యిపుడు
నింత నన్ను నుపేక్ష సేయింపఁ దగునె?
మహిత శ్రీరామ పదభక్తిమద్విధేయ!
ఆర్తజన రక్షణోపాయ! ఆంజనేయ!
( అజ్ఞాత కవి )

గళ్ళ నుడికట్టు - 56


అడ్డం
1. వేడిమి యొక్క తీవ్రత. కనిష్ట గరిష్టాలుగా వార్తల చివర చెప్పేది (4)
3. పొడుపు కథ. దీనిలోంచే హిందీ పహేలీ పుట్టింది (4)
7. వ్రణం నుండి రసికుడు కార్చే చీము (2)
8. విక్రయం. అమ్మతో మొదలు (3)
9. శిల్పి చేతిలోని దీని అలికిడికి శిలలు ఉలిక్కి పడతాయా? (2)
12. సహజీవనం కోసం కావాలి ఓర్పు (3)
13. వలదన్నా మనం అద్దంలో చూసే ముఖం (3)
17. సేవకుడు. దీని రీతి కొలువు కోరాడు త్యాగరాజు (2)
18. మావారు అంతంత కిటికీలు పెట్టారు .. ఇది బాగా రావాలని (3)
19. కూసింత ఆగు. మేత మేసే గాడిదను చెడగొట్టకు (2)
22. నగలు ఏవైనా కోరి వేసుకుంటాడీ పర్వతాల శత్రువు (4)
23. ఎరుక. ఉపరిచర వసువు సాయం తీసుకో (4)
నిలువు
1. ఉచ్చరించడం (4)
2. ఆగ్రహం చూపొద్దు. అది ప్లానెట్టే (2)
4. నీచం, అధమం (2)
5. కల్లోలపడే నది (4)
6. వింత, విడ్డూరం. మత్తు కలిగినట్టిది (3)
10. తెగింపు. ఇది చేస్తే రాకుమారి దక్కుతుందేమో? (3)
11. ఆమె దడుసుకునేలా ఆలోచిస్తుంది. మస్తిష్కం (3)
14. కట్టుబాటు, హిందీ వ్యాసంతో మొదలు (4)
15. సమయం, యౌవనం. తరుణికి చెందిందా? (3)
16. తెల్ల గుఱ్ఱం. ఇంద్రుని ఉచ్చైశ్రవం (4)
20. కోయంబత్తూరు. ఇదే ఇంటి పేరైన సరళ సినీ హాస్య నటి (2)
21. ఇంద్రుడైనా, సింహమైనా, కోతి ఐనా, చివరాఖరుకు దొంగైనా ఆ రెండక్షరాలు పాతకాలను హరిస్తాయన్నాడు పోతన (2)

28, సెప్టెంబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 108

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...........
బైబులుతో పాటు చదివె భగవద్గీతన్.

చమత్కార (చాటు) పద్యాలు - 36

శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు సేకరించి ప్రచురించిన "చాటుపద్య మణిమంజరి"లో "ఆర్తజన రక్షణోపాయ! ఆంజనేయ!" మకుటంతో ఏడు పద్యా లున్నాయి. వీటిని ఎవరు, ఏకాలంలో రచించారో తెలియదు. ఆ ఏడు పద్యాలు మీకోసం రోజు కొకటి!
ఆర్తజన రక్షణోపాయ! ఆంజనేయ! - 1
సీ.
శరధి లంఘించి దాశరథి యిచ్చిన భూష
ణము సీత కొసఁగిన నాఁటి రూపు
లంకా రమా ముఖాలంకార మాగ్రహో
న్నతి నీఱు చేసిన నాఁటి రూపు
నీవాలమునఁ జుట్టి నీ వాలమున దైత్య
నాథులఁ బొరిగొన్న నాఁటి రూపు
మరుదీశ సుతుఁడ నా మరుదీశ సుతు కేత
నం బెక్కి తోడైన నాఁటి రూపు
తే. గీ.
తలఁచు వారికి నాపదల్ తలుఁగు టరుదె
నీ కృపాస్ఫూర్తి నీ కీర్తి నిస్సమములు
మహిత శ్రీరామ పదభక్తిమద్విధేయ
ఆర్తజన రక్షణోపాయ! ఆంజనేయ!
( అజ్ఞాత కవి )

చమత్కార పద్యాలు - 35

అష్ట దిక్పాలక స్తుతి - 8 ( ఈశానుడు )
సీ.
హిమశైల శిఖరోన్నత మహా వృషభ వాహ
నాధిరోహణుఁడు విశ్వాధినేత
నిరతార్ధగాత్ర సన్నిహిత పర్వతరాజ
పుత్రీ ద్వితీయానుభూతిరతుడు
కైలాస పర్వతాగ్ర నివాస పరితోషి
వర వీర గణ వార పరివృతుండు
సర్వ భూతవ్రాత సర్వ విద్యాజాత
నిర్ణేత మహిత దృక్కర్ణభూషుఁ
తే.గీ.
డిష్ట సఖుఁడు కుబేరుని కిందుధరుఁడు
గగన కేశుఁ డతిస్వచ్ఛ కాంతితనుఁడు
ఈశ్వరుండు మహానటుం డెల్లవేళ
సర్వ సౌఖ్యంబు లిడి మమ్ము సాఁకుఁ గాత.
( ఆజ్ఞాత కవి )

27, సెప్టెంబర్ 2010, సోమవారం

వారాంతపు సమస్యా పూరణం - 10

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది .....
( దీనిని చంద్ర శేఖర్ గారు పంపించారు. వారికి ధన్యవాదాలు )
లంగానెత్తి లతాంగి చెంగు మనుచున్ లంఘించె దైత్యేంద్రుపై.

సమస్యా పూరణం - 107

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసినను సమస్య చంద్రశేఖర్ గారు పంపించారు. వారికి ధన్యవాదాలు.
ఆ సమస్య ఇది ...........

చదువు రానట్టి వారె విజ్ఞానఖనులు.

25, సెప్టెంబర్ 2010, శనివారం

గళ్ళ నుడికట్టు - 55


అడ్డం
1. వేరు చేయడం. జన భవితలో (4)
3. రచనలు చేసే స్త్రీ (4)
7. దృఢత్వం కలిగిన వాడు. మదిర ముట్టడా? (2)
8. ప్రసిద్ధి. ప్రశమించే మస్తిష్కంలో (3)
9. ఇది చిహ్నం. గుర్తుందా? (2)
12. దీపావళికి "మనమంతా బుద్ధిగా" కాల్చేది (3)
13. కంఠం. "గుండె ................ లోన కొట్లాడుతాది" అంటాడు కవి (3)
17. వెధవ చేస్తాడట .... హత్య (2)
18. అరటిపండు ఇంగ్లీషులో (3)
19. ఐనా వద్దు ఈ ఓడ (2)
22. యోజనగంధిని పెండ్లాడిన రాజు (4)
23. ఓల్డ్ లెగ్ నడిచేది పాపాల వైపు (4)
నిలువు
1. వినోదాన్ని కలిగించేది (4)
2. టీము. జత కట్టు (2)
4. శీతం పులిలా ఉంటుందా? (2)
5. మూర్తి త్రయం (4)
6. పదవది (3)
10. ధ్వజం (3)
11. ఆనాటి ఈ సీమ ఇప్పటి మెదక్ (3)
14. ఛాన్స్ లేదా గ్యాప్ (4)

15, నాశనమే (3)
16. యవ్వన పురుషులు (4)
20. నువ్వు రమ్మంటే నేను వస్తానా? (2)
21. తిండి. తృణమే తగినది (2)

సమస్యా పూరణం - 106

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసినను సమస్య చంద్రశేఖర్ గారు పంపించారు. వారికి ధన్యవాదాలు.
ఆ సమస్య ఇది ...........

జ్వరపీడితుఁ డచటినుండి జారుకొనెఁ గదా!

చమత్కార పద్యాలు - 34

అష్ట దిక్పాలక స్తుతి - 7 ( కుబేరుడు )
చం.
ఉనికఁట వెండికొండ దనయుండఁట రంభకు యక్షరాజు నా
ధనపుఁ డనన్ బ్రసిద్ధుఁడఁట దాప విభుండఁట పుష్పకంబుపైఁ
జనునఁట పార్వతీపతికి సంగతికాఁడఁట యాత్మ సంపదల్
పెనుపుగ నిచ్చి హెచ్చగుఁ గుబేరుఁడు మిమ్ము ననుగ్రహించుతన్.
( ఆజ్ఞాత కవి )

24, సెప్టెంబర్ 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 105

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య రవి గారు పంపించారు. వారికి ధన్యవాదాలు.
ఆ సమస్య ఇది ...........

చందమామను ముద్దాడసాగె చీమ.

చమత్కార పద్యాలు - 33

అష్ట దిక్పాలక స్తుతి - 6 ( వాయువు )
సీ.
సకల భూతవ్రాత సంజీవనఖ్యాత
ముఖ్య మహాప్రాణ మూర్తిధరుఁడు,
కర్పూర కస్తూరికా చందనాగరు
ధూపాది పరిమళ వ్యాపకుండు,
ఆత్మానుకూల మహావేగ మృగ వాహ
నారూఢుఁ, డఖిల విశ్వాభియాయి,
వైశ్వానరప్రభు శాశ్వత సహవాసి,
భీమాంజనేయుల ప్రియ జనకుఁడు,
తే.గీ.
పశ్చిమోత్తర మధ్య దిగ్భాగ నిరత
పాలనోద్యోగి, దేవతా ప్రముఖుఁ డెపుడు
వాయుదేవుండు చిరముగా నాయు విచ్చి
మంచి యారోగ్యమున మమ్ము మంచుఁ గాత!
( అజ్ఞాత కవి )

23, సెప్టెంబర్ 2010, గురువారం

సమస్యా పూరణం - 104

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
హనుమంతుని పెండ్లి కెన్ని యాటంకములో?

చమత్కార పద్యాలు - 32

అష్ట దిక్పాలక స్తుతి - 5 ( వరుణుడు )
సీ.
మహనీయ సమదోగ్ర మకర వాహనుఁడు, క
చ్ఛప మీన నక్రాది జంతు విభుఁడు,
పద్మినీ మానస పంజర కీరంబు,
ఫణగణాంచిత నాగపాశ ధరుఁడు,
భీకరాకార గుంభిత కనత్కల్లోల
వారి సంభృత వార్ధి వల్లభుండు,
నూత్న తృణగ్రాహి, రత్న విభూషితుం,
డఖిల జగద్వర్ష హర్ష దాత,
తే.గీ.
దుష్ట నిగ్రహకారి, యుత్కృష్ట మహిముఁ,
డభయ హస్తుఁడు, కరుణారసార్ద్ర హృదయుఁ,
డమృత జీవన మొనగూర్చి యన్వహంబు
వరుణ దేవుండు మిమ్ముఁ గాపాడుఁ గాత!
( అజ్ఞాత కవి )

22, సెప్టెంబర్ 2010, బుధవారం

చమత్కార పద్యాలు - 31

అష్ట దిక్పాలక స్తుతి - 4 ( నిరృతి )
సీ.
నర వాహనుండు, బంధుర ఖడ్గ హస్తుండు,
వర చర్మ ధరుఁడు, కర్బుర శరీరుఁ,
డతుల జగద్రక్షణాంచత్కృపానిధి,
చటులోగ్ర యామినీ సంచరుండు,
సన్మార్గ రోధి దుష్ట నిశాచర వ్రాత
వారకుం, డురు బలాధారకుండు,
నురుతర కుటిల నీలోన్నత కేశుండు,
నికషా వధూమణీ నిత్య రతుఁడు,
తే.గీ.
మహిత బల వైభవోద్దండ మండితుండు,
కింకిణీ రవ భూషణాలంకృతుండు,
మృదుల వచనుండు, నైరృతి మీకు నొసఁగు
చిరతరారూఢ భోగ విశేషములను.
( అజ్ఞాత కవి )

సమస్యా పూరణం - 103

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
పచ్చనైన చెట్టు భగ్గు మనెను.

చమత్కార పద్యాలు - 30

అష్ట దిక్పాలక స్తుతి - 3 ( యముడు )
సీ.
మహిష వాహనుఁడు, సమ్యగ్ధర్మ పాలుండు,
దారుణ తర దీర్ఘ దండపాణి,
దివ్య కాళింది నదీ సోదరుఁడు, నీల
వర్ణుండు, కమలినీ వర సుతుండు,
గత జన్మ కర్మ సంచిత ఫలదుఁడు, యుధి
ష్ఠిర గురుఁ, డమృత నిషేచనుండు,
గంధవతీ మనః కాసార సంచార
సంగతానంద చక్రాంగ విభుఁడు,
తే.గీ.
విష్ణు రుద్రాది భక్తి వర్ధిష్ణు హితుఁడు,
దక్షిణేశుండు, ధర్మ విచక్షణుండు,
శమనుఁ డనురక్త చిత్తుఁడై యమర మమ్ము
నాయురారోగ్య యుక్తులఁ జేయుఁ గాత!

21, సెప్టెంబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 102

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
వినువారికి చెప్పువాఁడు వెధవగఁ దోచున్.

చమత్కార పద్యాలు - 29

అష్ట దిక్పాలక స్తుతి - 2 ( అగ్ని )
సీ.
మేష వాహనుఁడు, సుస్మితుఁడు, చతుశ్శృంగ
ధరుఁడు, విస్ఫురిత పక్షద్వయుండు,
సప్త సంఖ్యార్చిరంచద్బాహు జిహ్వుండు,
మహనీయ పాద పద్మత్రయుండు,
స్వాహా స్వధా సతీ సహిత పార్శ్వద్వయుం,
డరుణ సువర్ణ భాస్వర తనుండు,
లోహిత మహిత విలోచనుఁ, డాజ్య పా
త్రస్రుక్స్రువాదికోద్యత కరుండు,
తే.గీ.
అఖిల పితృదేవతార్పిత హవ్య కవ్య
ధరుఁడు, సర్వతోముఖుఁడు, నిత్యశుచి, యనలుఁ,
డిహపరానందముల నిచ్చి యెల్ల వేళ
నంచితోన్నతి మిమ్ము రక్షించుఁ గాత!
- అజ్ఞాత కవి

20, సెప్టెంబర్ 2010, సోమవారం

చమత్కార పద్యాలు - 28

అష్ట దిక్పాలక స్తుతి - 1 ( ఇంద్రుడు )
సీ.
ఐరావతోచ్చైశ్శ్రవాధిరూఢుఁడు, నీల
దివ్యదేహుఁడు, పూర్వ దిగ్విభుండు,
శతమహాధ్వరకర్త, శతకోటి హస్తుండు,
బహు మహాపర్వత పక్షహర్త,
సౌందర్య లక్షణానంది, శచీప్రియుం,
డనుపమ నందన వనవిహారి,
శతపత్ర నిభ దశశత దీర్ఘ నేత్రుండు,
వారివాహ సమూహ వాహనుండు,
తే.గీ.
యుక్త సన్మంత్ర మఘ ఫల భోక్త, నిత్య
మభినవ సుధారసైక పానాభిరతుఁడు,
విక్రమ క్రమ దేవతా చక్రవర్తి
శ్రీలు మీఱంగ మిమ్ము రక్షించుఁ గాత.
- అజ్ఞాత కవి

సమస్యా పూరణం - 101

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
పార్లమెంటుఁ జొచ్చె పాములెన్నొ.

గళ్ళ నుడికట్టు - 54


అడ్డం
1. దొరతనం కల అతడు విధికాని పరిస్థితిలో ఉంటాడా? (4)
3. అందగాడు (4)
7. నీ వింతటి దానివే ... ఆశ్చర్యం (2)
8. తమరి మనస్సులో ఉంది చీకటి (3)
9. అంగదునికి కావాలి మ్రానిమొద్దు (2)
12. ప్రకాశించేది. పరాజితం కాదు (3)
13. చీటి కట్టి ఈ అంధకారంలో పడ్డావా? (3)
17. కాంతి, కిరణం. కాశ్మిరంలో చూడు (2)
18. సనక సనందుల గృహం (3)
19. నీడ, సూర్యుని భార్య (2)
22. తమిళనాడులో సరస్వతీ ప్రాచ్యలిఖిత భాండాగారం ఉన్న నగరం (4)
23. మానుము అనం. సందేహమా? (4)
నిలువు
1. అరవిరిసిన అందం ఈ పద్మానిది (4)
2. నల్లని ఇంగ్లీషు వాహనం (2)
4. బట్టలు కుట్టేవాడు దర్జాగా ఉంటాడా? (2)
5. తిరగబడ్డ శత్రువు. వాడు అహితుడు గద ... పద! (4)
6. ప్రాబ్లమే. పూరించమని నా బ్లాగులో రోజుకొకటి ఇస్తున్నది (3)
10. శివరంజినిలో వింటినారి (3)
11. నెంబర్ వన్ (3)
14. సాహిత్యం. సరస్వతీ సంబంధమైనది (4)
15. అందరూ లంఘిస్తే దీన్ని మోసేవారెవరు? (3)
16. కోర్టు (4)
20. ఎంతో పుణ్యం చేసుకున్న తోట (2)
21. మేలును కోరే శరీరం (2)

19, సెప్టెంబర్ 2010, ఆదివారం

సమస్యా పూరణం - 100

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
శతమానం భవతి యనుచు శాపము నొసఁగెన్.

వారాంతపు సమస్యా పూరణం - 9

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది .....
( ఏప్పుడో నా చిన్నప్పుడు విన్న ప్రసిద్ధమైన సమస్య )
మదగజయానకున్ రవిక మాత్రము చాలదె, చీర యేటికిన్?

చమత్కార పద్యాలు - 27

అష్ట దిక్పాలక స్తుతి
శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి సేకరించిన ఈ చాటుపద్యాలను రచించిన కవి పేరు కాని, అతని కాలం కాని తెలియవు.
చం.
హరి శిఖి ధర్మ దైత్య వరుణానిల యక్ష శివుల్, గజాజ కా
సర నర నక్రకైణ హయ శక్వర యానులు, వజ్ర శక్తి ము
ద్గర శర పాశ కుంత సృణి కార్ముక హస్తులు, భోగ శుద్ధి సం
గరజయ శౌర్య సత్త్వ జవ కావ్య విభూతులు మాకు నీవుతన్.

ప్రతి పదార్థాలు -
హరి = ఇంద్రుడు, శిఖి = అగ్ని, ధర్మ = యమధర్మరాజు, దైత్య = నిరృతి, వరుణ = వరుణుడు, అనిల = వాయువు, యక్ష = కుబేరుడు, శివుల్ = ఈశానుడు అనే అష్ట దిక్పాలకులు, గజ = ఏనుగు, అజ = పొట్టేలు, కాసర = దున్నపోతు, నర = మానవుడు, నక్రక = మొసలి, ఏణ = జింక, హయ = గుఱ్ఱం, శక్వర = ఎద్దు, యానులు = వాహనాలుగా గలవారు, వజ్ర = వజ్రం, శక్తి = బల్లెం, ముద్గర = గద, శర = బాణం, పాశ = త్రాడు, కుంత = ఈటె, సృణి = అంకుశం, కార్ముక = విల్లు, హస్తులు = చేతిలో ధరించేవారు, భోగ = సుఖం, శుద్ధి = పవిత్రత, సంగరజయ = యుద్ధంలో విజయం, శౌర్య = శూరత్వం, సత్త్వ = బలం, జవ = వేగం, కావ్య = క్షేమం, విభూతులు = సంపదలను, మాకున్ + ఈవుతన్ = మాకు ఇచ్చెదరు గాక!
వివరణ -
ఐరావతమనే ఏనుగు వాహనంగా, వజ్రం ఆయుధంగా గలిగి తూర్పు దిక్కును పాలించే ఇంద్రుడు మాకు సుఖాన్ని, మేషం వాహనంగా, బల్లెం ఆయుధంగా గలిగి ఆగ్నేయ దిక్కును పాలించే అగ్ని మాకు పవిత్రతను, మహిషం వాహనంగా, గద ఆయుధంగా గలిగి దక్షిణ దిక్కును పాలించే యముడు మాకు యుద్ధాలలో విజయాన్ని, మానవుడు వాహనంగా, బాణం ఆయుధంగా గలిగి నైరృతి దిక్కును పాలించే నిరృతి మాకు శూరత్వాన్ని, మకరం వాహనంగా, నాగపాశం ఆయుధంగా గలిగి పశ్చిమ దిక్కును పాలించే వరుణుడు మాకు బలాన్ని, మృగం వాహనంగా, ఈటె ఆయుధంగా గలిగి వాయవ్య దిక్కును పాలించే వాయువు మాకు వేగాన్ని, అశ్వం వాహనంగా, అంకుశం ఆయుధంగా గలిగి ఉత్తర దిక్కును పాలించే కుబేరుడు మాకు క్షేమాన్ని, వృషభం వాహనంగా, విల్లు ఆయుధంగా గలిగి ఈశాన్య దిక్కును పాలించే ఈశానుడు మాకు సంపదను ప్రసాదింతురు గాక!

18, సెప్టెంబర్ 2010, శనివారం

చమత్కార పద్యాలు - 26

దశావతార స్తుతి ( కల్క్యవతారం )
మ.
స్వమహాబాహు కృపాణకృత్త గళ తుచ్చ మ్లేచ్చ వీరచ్ఛటో
త్క్రమదాపాదిత పద్మినీ రమణ మధ్యచ్ఛిద్రఖస్వామికా
గమనానాస్ర పయఃపరాగ మథితక్ష్మా సౌర గంగా నదీ
భ్రమకృత్కీర్తిక కల్కిమూర్తిక పరబ్రహ్మం స్తుమస్త్వా మనున్.

( ఎలకూచి బాలసరస్వతి - 17 వ శతాబ్దం )
భావం -
కల్కిమూర్తివైన ఓ పరమాత్మా! నీ మహా బాహువు నందున్న ఖడ్గం చేత ఛేదింపబడిన కంఠ గుచ్ఛాలు గల మ్లేచ్చుల సముదాయం సూర్య మండలాన్ని ఛేదించుకొని వెళ్ళడం వల్ల మధ్యలో ఏర్పడ్డ ఛిద్రంలో కనబడే ఆకాశ నైల్యాన్ని చూచి ఆ సమయంలో గ్రహణం పట్టినదని అనుకొన్న వారికి భూమిపైన అంతటా స్నానార్థం గంగానది వచ్చిందనే భ్రాంతిని కలిగించేవాడా! నిన్ను స్తుతిస్తున్నాను - అంటున్నాడు.

సమస్యా పూరణం - 99

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...........
మంత్రపుష్ప మేల మద్యముండ.

17, సెప్టెంబర్ 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 98

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...........
మూగ గొంతెత్తి పాడును రాగ మలర.

గళ్ళ నుడికట్టు - 53


అడ్డం
1. వికలమై క్షణక్షణం "అసాధారణం"గా ఉండే లక్షణం (4)
3. శ్రీశైలంలోని తుమ్మెదమ్మ (4)
7. నిధులిచ్చే సాయి గుళ్ళో నిరంతరం వెలిగే నది (2)
8. ఆద్యుడైన గ్రహమణి (3)
9. పీకను తిరగేసి కోతిని పిలవండి (2)
12. ధర్మ సంబంధమైనది (3)
13. ప్రతివాది గళం పట్టి పగడాన్ని వెదకండి (3)
17. రథాలు వెళ్ళే రాజమార్గం (2)
18. దాస్య విముఖుని రక్తి దీని గురించే (3)
19. ఏదో మనల్ని కుట్టేది. మశకం (2)
22. నవ్వినా పండుతుందట ఈ చేను (4)
23. భీమునకు ఈ బాలుడు తమ్ముడే (4)
నిలువు
1. రోదించే విధులు గల శత్రువులు (4)
2. క్షమించే భూమి (2)
4. తామసిలో బొగ్గు నుసి (2)
5. బలమున్న వాడెక్కే పీట ప్రాణాంతకమే. రంగనాయకమ్మ నవల (4)
6. ఆయన చెప్పేవే మనకు నీతులు (3)
10. భర్తకోసం అందరూ వ్రతాలు చేస్తే ఈవిడ నిద్ర పోయింది (3)
11. పెళ్ళి. విద్యను నాశనం చేస్తుందట! (3)
14. శంకరాభరణం శంకరశాస్త్రికి ఇటువంటి సేవ "లభిస్తుందా?" (4)
15. మన్మథుడు కాముకుడు కదా! (3)
16. పొట్టివాడైనా త్రివిక్రముడు (4)
20. వస్త్రాన్ని తిరగేస్తే ఇంగ్లీషులో మధ్యాహ్న భోజనమే (2)
21. కులాసాగా చెప్పే మిష (2)

చమత్కార పద్యాలు - 26

దశవతార స్తుతి ( బౌద్ధావతారం)
మ.
గిరియుష్మద్ధనురస్త్రతా ప్రభృతి మోఘీకృద్వధూశీల వి
స్ఫురణావర్మభిదాఢ్య దార్ఢ్య సఫలీ భూతత్రిపూతత్రిపూ
ర్వర దైతేయ జిఘాంసు శాసన పరోగ్రప్రాప్య సారూప్య ని
ర్భర దైతేయ తథాగతాంగక పరబ్రహ్మం స్తుమ స్త్వా మనున్.

( ఎలకూచి బాలసరస్వతి - 17 వ శతాబ్దం )
భావం -
బుద్ధరూపుడవైన ఓ పరమాత్మా! శివుడు మేరుపర్వతాన్ని ధనుస్సుగాను, నిన్ను బాణంగాను గ్రహించినా, ఇంకా ఇతర ఉపకరణాలను ఉపయోగించినా వాటి నన్నింటినీ త్రిపురాసురుల స్త్రీల పాతివ్రత్యం అనే కవచం వ్యర్థం చేయగా, దానిని నీ తథాగత రూపం భేదించింది. అత్యధికమైన దార్ఢ్యం చేత సాఫల్యం పొందిన త్రిపురాసురులను సంహరించాలనే కోరికతో స్తుతించిన శివునితో సారూప్యంగా దిగంబరత్వాన్ని ధరించి ఆ స్త్రీల పాతివ్రత్యాన్ని చెరిచావు. అట్టి నిన్ను స్తుతిస్తున్నాను - అంటున్నాడు.

16, సెప్టెంబర్ 2010, గురువారం

సమస్యా పూరణం - 97

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్యను నేదునూరి రాజేశ్వరి గారు పంపించారు. వారికి ధన్యవాదాలు.
బమ్మకైన తిరుగు రిమ్మ తెగులు.

చమత్కార పద్యాలు - 25

దశావతార స్తుతి - (శ్రీ కృష్ణావతారం)
మ.
అతి దోఃపీడన కర్కరీ ఫలిత కంఠాభత్వదుత్తర్తు ధూ
ర్త తృణావర్త దృఢాంగపాతహత గోత్రాభర్తృకోత్పాదిత
క్రతుభుగ్రాడ్గ్రహణాగ్రహోన్ముఖ శతారధ్వస్త మైనాక ని
ష్పతనభ్రాంతిక నందగోపకసుతబ్రహ్మం స్తుమ స్త్వా మనున్.

(ఎలకూచి బాలసరస్వతి - 17 వ శతాబ్దం)
భావం -
నందగోపసుతుడవైన కృష్ణ పరమాత్మా! నిన్ను అపహరించుకొని పోయిన ధూర్తుడైన తృణావర్తుని కంఠాన్ని దోసకాయను నలిపినట్లు నీవు నీ హస్తాలతో నలిపివేయగా వాని శరీరం క్రింద పడగా గోపాలకులకు దెబ్బలు తగిలాయి. దేవేంద్రుని పట్టుకొనడానికి పైకి ఎగిరిన మైనాకుని రెక్కలను ఇంద్రుడు వజ్రాయుధంతో ఛేదించగా ఆ మైనాకుడు క్రింద పడిపోయాడనే భ్రాంతి గోపాలకులకు కలిగింది. అటువంటి నిన్ను స్తుతిస్తున్నాను - అంటున్నాడు.

15, సెప్టెంబర్ 2010, బుధవారం

సమస్యా పూరణం - 96

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .......
రెక్కలు గల చాప నెక్కె రేలంగి భళా!

చమత్కార పద్యాలు - 24

దశావతార స్తుతి - (బలరామావతారం)
మ.
కరిపూరుద్ధరణేద్ధ లాంగల విభగ్నక్ష్మా భరాదక్ష ది
క్కరి పాదప్రహతిస్ఫుటస్ఫుటిత భాగవ్యాపృతగ్రీవ సూ
కర పీఠీకృత పృష్ఠతాహిత మహా గాఢాధి కూర్మాధి రా
ట్పరిక్లుప్తప్రళయాంబుగాహన హలిబ్రహ్మం స్తుమ స్త్వా మనున్.

(ఎలకూచి బాలసరస్వతి - 17 వ శతాబ్దం)
భావం -
బలరామావతారుడవైన ఓ పరమాత్మా! నీవు హస్తినాపురాన్ని పెకలించే వేళ నీ నాగలిచే భగ్నమైన భూమిని భరించలేక దిగ్గజాలు ఆదిశేషుని పడగలపై పడ్డాయి. అప్పుడు ఆదిశేషుడు తన శరీరంతో వరాహమూర్తి కరాన్ని చుట్టినాడు. ఆ వరాహమూర్తి ఆదికూర్మం పీఠం మీద పడ్డాడు. ఈ అందరి బరువు మోయలేక ఆ కూర్మం ప్రళయ సముద్రపు జలంలో ప్రవేశించింది. దీనికంతటికీ కారణమైన నిన్ను స్తుతిస్తున్నాను - అంటున్నాడు.

14, సెప్టెంబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 95

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .......
సిగపువ్వే వాడిపోదు చిత్రము కాదే!

చమత్కార పద్యాలు - 23

దశావతార స్తుతి - (శ్రీరామావతారం)
శా.
చాపచ్చాత్ర నిషంగ భంగ కుపితక్ష్మాభృద్ధనుః పంచ వ
క్త్రీ పంచాళిక దృఙ్నియుక్త హుతభుగ్గ్రీవా ద్వయీ పంచక
వ్యాపారభ్రమకారి పంక్తిగళ గళ్యాఖండనాఖండ దో
ర్నైపుణ్యప్రదరౌఘ రాఘవ పరబ్రహ్మం స్తుమ స్త్వా మనున్.
(ఎలకూచి బాలసరస్వతి - 17 శతాబ్దం)
భావం -

రామావతారుడవైన ఓ పరమాత్మా! నీవు తన చాపాన్ని, శిష్యుడైన పరశురాముణ్ణి, అంబుల పొది అయిన సముద్రాన్ని భంజించడం చేత కోపించిన మేరుశరాసనుడైన శివుడు తన ఐదు ముఖాలలోని ఐదు ఫాలాగ్నులను నీపైప్రయోగించగాస్తుతిస్తున్నాను - అంటున్నాడు. వాటి పది తలలను (అగ్నికి రెండు తలలు, ఐదగ్నులకు పది తలలు) ఖండించినావేమో అనే భ్రాంతిని కలిగించే విధంగా దశకంఠుని పది తలలను ఖండించి నీ నైపుణ్యాన్నీ, నీ బాణాల మహత్త్వాన్నీ చూపించావు. అటువంటి నిన్ను స్తుతిస్తున్నాను - అంటున్నాడు.

13, సెప్టెంబర్ 2010, సోమవారం

గళ్ళ నుడికట్టు - 52


అడ్డం
1. మైథిలి చీరను కట్టుకున్న కీరం. ఇంగ్లీషులో వెన్న లాంటి ఈగ (7)
6. తెలంగాణా మాండలికంలో రచనలు చేసే మల్లయ్య ఇంటిపేరు అట్నుంచి (3)
7. చెప్పినట్టు వచ్చి చేసే నర్తనం (3)
9. మనలకు కొమ్ములు మొలిస్తే తాపసులు (3)
10. ఇతని వెన్నెముకే వజ్రాయుధం (3)
11. ఏమైనా శరీరమే (1)
12. సిద్ధుడు ప్రవరుని కిచ్చిన ఆకుల రసం (3)
13. అలతిగా కదిలే పూలతీగ (3)
15. శార్దూలాలు (3)
17. నీతులు వద్దనే కుత్సితుడు (3)
18. శ్రీరాముడు కట్టించిన వారధి నుండి పార్వతి పుట్టినింటి దాకా. బడి పంతులు సినిమాలోని దేశభక్తి గీతంలో ఉంది (7)
నిలువు
2. అప్పంతా కట్టు. లేకుంటే ఉందికదా పెట్టిన తనఖా (3)
3. "పట్టుబడము" అంటున్న ఉట్టి (3)
4. ట్విన్స్, జంటలు (3)
5. వీళ్ళు పదకొండు మంది. శివుని ప్రతిరూపాలే (7)
7. శృంగార నైషధం నాయికా నాయకులు (7)
8. చిలవలు పలవలుగా ప్రేమించి (3)
12. హరిద్ర. మనవాళ్ళు ఎప్పుడో కనిపెట్టిన ఆంటీబయాటిక్ (3)
13. ఆ వలపులో అవతల తలక్రిందయింది (3)
14. క్రింది నుండి చూతును కదా ... అది ముక్క (3)
16. చక్కని వలువలో చల్లదనం అస్తవ్యస్తమయింది

చమత్కార పద్యాలు - 22

దశావతార స్తుతి - 6 (పరశురామావతారం)
శా.
ఆజిప్రౌఢిమ దుర్జయార్జున గళోదగ్రాసృగాస్వాదన
వ్యాజాపోశనభాక్తదస్వపహృతిప్రాణాహుతిప్రస్ఫుర
ద్రాజాళీ దివసావసాన విఘసప్రాయేందు వేలాయితా
భ్రాజాధ్యక్ష కుఠారధారి భృగురాడ్బ్రహ్మం స్తుమ స్త్వా మనున్.
భావం -

పరశురామావతారుడవైన ఓ పరమాత్మా! నీవు ధరించిన కుఠారం యుద్ధంలో ప్రాగల్భ్యంతో దుర్జయుడైన కార్తవీర్యార్జునుని భుజాలలోని మిక్కిలి రక్తాన్ని ఆస్వాదించడం అనే సాకుతో ఆపోశనం పట్టి అతని ప్రాణాలనూపహరించడం ద్వారా ప్రాణాహుతులను తీసుకొన్నది. రాజులందరినీ చంపివేయగా ఒక రాజు (చంద్రుడు). మరికొందరు రాజులు (యక్షులు) తిని విడిచివేసిన అన్నంగా మిగిలిపోయారు. అటువంటి నిన్ను స్తుతిస్తున్నాను - అంటున్నాడు.

సమస్యా పూరణం - 94

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .......
పంచ పాండవు లన పదుగురు కద!

12, సెప్టెంబర్ 2010, ఆదివారం

సమస్యా పూరణం - 93

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .......
రొయ్యల పులు సడిగె నయ్యవారు.

వారాంతపు సమస్యా పూరణం - 8

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరంచ వలసిన సమస్యను మిత్రులు, తెలుగు పండితులు గుండు మధుసూదన్ గారు సూచించారు.
రాముని వెంట రాముఁ గని రాముని సంఘము మోదమందఁగన్.

చమత్కార పద్యాలు - 21

దశావతార స్తుతి - 5 (వామనావతారం)
మ.
స్వతలస్వచ్చతరారుణత్వ రచితస్వస్త్రిః పరేడ్భ్రాంతి వా
క్ప్రతికూలత్వ దశానుకారి గళగాద్గద్యక్షమాంభోజ భూ
నుతి హాసన్నఖరోర్ధ్వ సారిత పదార్ణోరుడ్జ గంగాసవా
ప్రతిమాళీశ కపర్ద మండల వటుబ్రహ్మం స్తుమ స్త్వా మనున్.

(ఎలకూచి బాలసరస్వతి - 17వ శతాబ్దం)
భావం -
వామనావతారుడవైన ఓ పరమాత్మా! నీ పాదపద్మం చాలా ఎఱ్ఱగా ఉండడం చేత బ్రహ్మ శరీరచ్చాయ మారిపోగా, సరస్వతి ఇతడు నా భర్తా? లేక పరస్త్రీ భర్తా? అనే సందేహం ఉండడం చేతనా అన్నట్లు నిన్ను స్తుతించడానికి ప్రయత్నించిన బ్రహ్మ మాట గద్గదం అయిపోయింది. అది చూచి నీ గోళ్ళు నవ్వుతున్నాయా అన్నట్లున్నది. అలాంటి ఊర్ధ్వ ప్రసారితమైన నీ పాదం మీద గంగ మకరందం వలె - అనగా ఈశ్వర జటాజూట స్థానీయమైన ఆకాశం- తుమ్మెద వలె ఉన్నది. అలాంటి నిన్ను స్తుతిస్తున్నాను - అంటున్నాడు.

11, సెప్టెంబర్ 2010, శనివారం

సమస్యా పూరణం - 92

కవి మిత్రులారా,
వినాయక చవితి శుభాకాంక్షలు.
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .......
గణపతిని వరించె కలువ భామ.

చమత్కార పద్యాలు - 20

దశావతార స్తుతి - 4 (నృసింహావతారం)
శా.
డింభద్రోహి వధోత్కటోత్క్రమణ రుష్టిక్లిష్టతా రోమ కూ
పాంభోజప్రభవాండ భాండ దళనోద్యద్ధ్వాన ధీకృత్సభా
స్తంభాంతస్తృటనాస్ఫురత్పట పటధ్వన్యాస్త నిశ్చేష్ట ని
ర్దంభోద్యోగ దిశావశాప నృహరిబ్రహ్మం స్తుమ స్త్వా మనున్.

(ఎలకూచి బాలసరస్వతి - 17 వ శతాబ్ది)
భావం -
నృసింహావతారుడవైన ఓ పరమాత్మా! బాలుడైన ప్రహ్లాదునికి ద్రోహి యైన హిరణ్యకశిపుని చంపడానికై నీవు శీఘ్రంగా వెడలగానే తీవ్రమైన రాపిడి చేత సభాస్తంభం బ్రద్దలై పటపట ధ్వని అంతటా వ్యాపించింది. అది వినగానే దిగ్గజాలన్నీ నీ రోమ కూపాలలో ఉన్న బ్రహ్మాండ భాండాలన్నీ బ్రద్దలైనాయని భ్రాంతి చెంది భయంతో నిశ్చేష్టా లైపోయాయి. అటువంటి నిన్ను స్తుతిస్తున్నాను - అంటున్నాడు.

గళ్ళ నుడికట్టు - 51


అడ్డం
1. నలుగురిని మోసము చేసి పెట్టేదా నవ్వుముఖం? (4)
3. వివాహాల సమయంలో వెదికితే దొరుకుతుంది ఆకాశం లేదా పక్షి (4)
7. రాశిచక్రం లోని పొట్టేలు (2)
8. పొడి, పుప్పొడి, త్రిగుణాలలో రెండవది (3)
9. ఇంపొదవే గుల్మం (2)
12. సంగర మంతమై తరతమ భేదం పోతే కలయిక (3)
13. అతను వున్నాడనడానికి సాక్ష్యం శరీరం (3)
17. ఒడ్డు. ఒట్టు తీసి దీని మీద పెట్టు (2)
18. సూర్యుణ్ణి కలువనంటుందీ పువ్వు (3)
19. ఎందరొ చేసే గోల, శబ్దం (2)
22. "జయ జయ వనితా కమనీయ రూపా!" అంటుంటే లేచింది తెర (4)
23. నష్టానికి ప్రతిగా సపరివారంగా ఇచ్చే హారం (4)
నిలువు
1. పూర్వం రాజులు చేసింది అశ్వమేధం. ఇప్పుడు తీవ్రవాదులు చేసేది? (4)
2. ఏమో, విప్పదు పెదవి (2)
4. ఆహా! మీదే జామీను (2)
5. రాబడి. పాద సందర్శనలో వెదకండి (4)
6. గెలుపు (3)
10. అభివృద్ధి, పురోగమనం (3)
11. విల్లు (3)
14. "వియోగమా? యమునా!" అంటూ పార్వతిని వెదకండి (4)
15. చిత్రంగా పలుకగల కీరం (3)
16. నాదబ్రహ్మ సుస్వరంగా పలికిస్తాడు సన్నాయి (4)
20. యుద్ధమని చెప్పి చూడు (2)
21. నలుగురిదీ లక్ష్యం (2)

10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 91

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .......
పరహిత మొనరించువాఁడె పాపాత్ముఁ డగున్.

చమత్కార పద్యాలు - 19

దశావతార స్తుతి - 3 (వరాహావతారం)
శా.
ఆద్యాలోకన భక్తి సంభ్రమదనేహః పూరుషత్యక్త స
త్పాద్యాంభస్తులసీ భ్రమప్రద ఖురప్రక్షాళనా మాత్ర జా
గ్రద్యోగాంబుధి దంష్ట్రికాగ్ర రిపు హృత్కాలామిషప్రాయ శుం
భద్యాదోనిధి సప్తకీస్థలి కిటిబ్రహ్మం స్తుమ స్త్వా మనున్.

(ఎలకూచి బాలసరస్వతి - 17 వ శతాబ్ది)
భావం -
వరాహ రూపుడవైన పరమాత్మా! సముద్ర జలం నీ డెక్కలు కడుగుకొనడానికే సరిపోతుంది. నీ దంష్ట్రాగ్రం పైన నిలిచిన సముద్రమే మొలత్రాడుగా గల భూమి శత్రువు హృదయాన్ని చీల్చగా అంటుకొన్న నల్లని మాంసపు ముక్క వలె ఉంది. ఈ రెండూ (సముద్ర జలం, భూమి) నిన్ను ఆకస్మికంగా చూడగానే భక్తి సంభ్రమాలతో కాలపురుషుడు సమర్పించిన పాద్యం, తులసీ దళాల వలె ఉన్నాయి. అటువంటి నిన్ను స్తుతిస్తున్నాను - అంటున్నాడు.
వివరణ -
విష్ణువు వరాహావతారాన్ని ధరించాడు. హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరించాడు. ఆ సమయంలో సముద్రం ఆ వరాహం డెక్కలు కడుగుకొనడానికి (డెక్కలు మాత్రమే మునగడానికి) సరిపోయింది. సముద్రమే మొలనూలుగా గల భుమిని తన దంష్ట్ర పైన నిలిపాడు. శత్రువు హృదయాన్ని చీల్చగా ఆ కోరకు అంటుకున్న నల్లని మాంసం ముక్క లాగా భూమి ఉంది. ఆ సముద్ర జలం, ఆ భూమి రెండూ ఎలా ఉన్నాయంటే, విష్ణువు యొక్క వరాహ రూపాన్ని అకస్మాత్తుగా చూడగానే భక్తి, సంభ్రమాలతో కాలపురుషుడు అతన్ని పూజించి సమర్పించిన పాద్యం, తులసీదళం వలె ఉన్నాయి. అటువంటి వరాహరూపుడవైన ఓ పరమాత్మా! నిన్ను స్తుతిస్తున్నాను - అంటున్నాడు.

9, సెప్టెంబర్ 2010, గురువారం

సమస్యా పూరణం - 90

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .......
ప్లేటు మీల్సు నడిగె ఫ్లైటులోన.

8, సెప్టెంబర్ 2010, బుధవారం

సమస్యా పూరణం - 89

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్యను మిట్టపెల్లి సాంబయ్య గారు పంపించారు.
పోలీసును కలిసె దొంగ పొలిమేర కడన్.

చమత్కార పద్యాలు - 18

దశావతార స్తుతి - 2 (కూర్మావతారం)
శా.
ద్యూత్తంభద్గిరి కల్పితావతరణ ద్యోవాహినీ సంగమో
పాత్తేందూదయ నిష్పితౄణ జలధి ప్రారబ్ధ పుత్రోత్సవో
దాత్తత్పాత్త గజాశ్వ వన్యశన కన్యా గో మణీ దాన సం
పత్తి ప్రీణిత దేవఢుల్యధిపతి బ్రహ్మన్ స్తుమ స్త్వా మనున్.

(ఎలకూచి బాలసరస్వతి - 17 వ శతాబ్ది)
భావం -
ఆకాశాన్ని అంటుతూ నిలిచిన మందర పర్వతం మీదనుండి దిగి వచ్చిన ఆకాశగంగతో సంగమించడం వల్ల చంద్రుడు జన్మించగా పితృ ఋణాన్ని తీర్చుకొన్న సముద్రుడు పుత్రోత్సవాన్ని ప్రారంభించి, ఏనుగు, గుఱ్ఱం, వనం, ఆహారం, కన్య, గోవు, మణులను దానం చేశాడు. ఈ విధంగా దేవతలను సంతోషపెట్టిన కమఠప్రభూ! నిన్ను స్తుతిస్తున్నాను - అంటున్నాడు.
వివరణ -
విష్ణువు కూర్మావతారాన్ని ధరించాడు. సముద్రమథనం సమయంలో మందర పర్వతం భూమిలో కూరుకుపోకుండా దానిని తన వీపున మోసాడు. దానివల్ల సముద్ర మథనం నిరాటంగా సఫలమయింది. ఆ సమయంలో ఆకాశగంగ మందర పర్వతం మీదుగా క్రిందికి దిగివచ్చి సముద్రునితో సంగమించింది. ఆ కారణంగా చంద్రుడు జన్మించాడు. పితృ ఋణాన్ని తీర్చుకున్న సముద్రుడు పుత్రోత్సవాన్ని జరిపించాడు. ఆ ఉత్సవానికి వచ్చిన దేవతలకు సముద్ర మథనం వల్ల లభించిన ఏనుగు (ఐరావతం), అశ్వం (ఉచ్చైఃశ్రవం), వనం (కల్పవృక్ష వనం), ఆహారం (అమృతం), కన్య (లక్ష్మి), గోవు (కామధేనువు), మణి (చింతామణి) మొదలైన వాటిని దానం చేసాడు. ఆ విధంగా సముద్రుడు దానం చేయడానికి మూల కారకుడై దేవతలను సంతోష పెట్టిన కూర్మావతారుడైన విష్ణుదేవుని స్తుతిస్తున్నాను - అంటున్నాడు.

7, సెప్టెంబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 88

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
హరి యహల్యను మోహించి యాపదఁ గనె.


చమత్కార పద్యాలు - 17

దశవతార స్తుతి - 1 (మత్స్యావతారం)
శా||
సాధీయో ముఖ పూరితోద్వమిత తాసత్యోర్ధ్వ గోదన్వ ద
ర్ణో ధారాంతర టత్తిమింగిలగిల ప్రోద్ధాన నిధ్యాన ల
బ్ధాధీశ ప్రభుతా స్వభాగ హరణార్థాయాయి నాథానుజ
ప్రాధాన్యాంక విలోల వాగ్ధృగభట బ్రహ్మన్ స్తుమ స్త్వా మనున్.

( ఎలకూచి బాలసరస్వతి - 17 వ శతాబ్ది )
భావం -
మత్స్యావతారా! నీవు అతి విశాలమైన ముఖంలో నింపి పైకి ఎగజిమ్మడంతో సత్యలోకం దాకా పైకి వెళ్తున్న సముద్ర జలాల మధ్య సంచరిస్తున్న తిమింగిలగిలాల ఎగరడాన్ని చూచి, తన భర్తయైన బ్రహ్మ నుండి తనకు రావలసిన సోదర భాగాన్ని తీసికొనడానికి వస్తున్న మన్మథుని ధ్వజం మీద ఉన్న మీనం అనే భ్రాంతితో సరస్వతి చూపులు చలించాయి. అటువంటి నిన్ను స్తుతిస్తున్నాను - అంటున్నాడు.

వివరణ -
విష్ణువు మత్స్యావతారాన్ని ధరించాడు. తన విశాలమైన నోటిలో సముద్ర జలాలను నింపి పైకి ఎగజిమ్మాడు. ఆ జలాలు బ్రహ్మదేవుని సత్యలోకం దాకా పైకి వెళ్ళాయి. ఆ జలాలలో తిమింగిలాలున్నాయి. అవి మాటిమాటికి ఎగురుతున్నాయి. వాటిని సరస్వతి చూచింది. రెపరెపలాడుతున్న ధ్వజం మీది చేప గుర్తుగా భ్రమించింది. మీన ధ్వజుడైన మన్మథుడు బ్రహ్మకు సోదరుడు కదా! ఆ మన్మథుడు తన భర్తను ఆస్తిలో వాటా అడగడానికి వస్తున్నాడనుకొని ఆమె చూపులు చలించాయి. ఆ విధంగా సరస్వతికి భ్రాంతిని కలిగించిన మత్స్యావతారుడైన విష్ణుదేవుని స్తుతిస్తున్నాను - అంటున్నాడు.

6, సెప్టెంబర్ 2010, సోమవారం

సమస్యా పూరణం - 87

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
రంభ కేలెత్తి పిలువగా రాముఁ డేగె.

5, సెప్టెంబర్ 2010, ఆదివారం

సమస్యా పూరణం - 86

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
అగ్నిశిఖల మీద నాడె శిశువు.

వారాంతపు సమస్యా పూరణం - 7

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ....
సారా త్రాగిన మోక్ష మందెదము శిష్యా! శంక నీ కేలరా?

గళ్ళ నుడికట్టు - 50


అడ్డం
1. సుషుప్తి దశ (4)
3. యజమాని భార్య (4)
7. పురుగు తొలిస్తే కొయ్యనుండి రాలిన పొడి (2)
8. పర్వం. చెరుకు గడకు ఉంటుంది (3)
9. నగ, మాల, ఒక తెలుగు బ్లాగుల అగ్రిగేటర్ (2)
12. బహుమతి (3)
13. గౌరవనీయులు (3)
17. సిగ్గు. తస్లీమా నవల (2)
18. హుటా హుటి. చెర + చెర (3)
19. వెల (2)
22. పుత్రుడు (4)
23. గడ్డి కప్పిన గుడిసె (4)
నిలువు
1. మనుష్యులెవ్వరూ లేనిది (4)
2. వృద్ధికి వికృతి (2)
4. సూర్యుడు (2)
5. సమూహం. నిరంజన్ బంకులో వెదకండి (4)
6. సైన్యం, పరివారం (3)
10. శవం (3)
11. ఇతరులు (3)
14. మా కాలనీలో కనం అన్నప్పుడు సమయ పరిమాణం చెప్పండి (4)
15. నెర నెర నెర చెలి. స్నేహితు(డు)రాలు (3)
16. పల్లకీ (3)
20. మేముకు ఏకవచనం (2)
21. కృష్ణుడు. శూరుని మనుమడు (2)

4, సెప్టెంబర్ 2010, శనివారం

సమస్యా పూరణం - 85

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
నక్కకు జనియించె కుక్క యొకటి.

2, సెప్టెంబర్ 2010, గురువారం

సమస్యా పూరణం - 84

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
ఫాలనేత్రుండు మరునకు ప్రాణసఖుఁడు.

గళ్ళ నుడికట్టు - 49


అడ్డం

1. పొట్టి ఇంటిపేరున్నా "...... నీవే కలవు" అని తలుస్తారు తెలుగువాళ్ళు (4)
3. సంక్రాంతితో ముగిసే ఈ నెల వైష్ణవులకు ముఖ్యం (4)
7. చిలుము (2)
8. కొంచము రుద్దితే జారే తైలం (3)
9. భయంబేల బాలా? (2)
12. ఆ హాలుకు రంది భోజనం కోసం (3)
13. ప్రాపు. దానికోసం ఆపాటి శ్రమ న్యాయం కదా (3)
17. ఈ పక్షి ఏకాకి కాదు. రాముడి బాణం తగిలి ఏకాక్షి అయింది (2)
18. నుదురు (3)
19. బూడిద (2)
22. పడమటి సంధ్యారాగం చిత్రంలో నీగ్రో యువకుడుగా నటించిన డ్రమ్మర్ (4)
23. వసిష్ఠుడులో ఒక అక్షరం మారితే శ్రేష్ఠుడు (4)
నిలువు
1. లక్ష్మికి భర్త (4)
2. చుంబనం (2)
4. పొగడ్త. తిను పదార్థం కాదు (2)
5. కూడిక. కవితలనో, కథలనో, వ్యాసాలనో ఒకచోట ప్రకటించడం (4)
6. ఇది తాగి ముఖం అలా పెట్టావేమిటి? ఆ సంతోషం ఏది? (3)
10. బహిరంగం (3)
11. బ్రహ్మచర్యం, గార్హస్త్యం అనే పర్ణశాల (3)
14. పదకొడవ తిథి (4)
15. కర్నాటకంలో డ్రామా (3)
16. మొదటితో మొదలైన సూర్యుడు (4)
20. పార్వతి (2)
21. అల్లెత్రాడు లాంటి స్త్రీ (2)

1, సెప్టెంబర్ 2010, బుధవారం

సమస్యా పూరణం - 83

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
అల్లా! కాపాడు మనుచు హరి వేడుకొనెన్.