23, అక్టోబర్ 2010, శనివారం

ప్రహేళిక - 16 సమాధానం

ఇది ఏ విద్య?
సీ.
పతి నెల్లకాలముఁ బాయని దెవ్వరు?
శ్రీ విష్ణుదేవుని చెలువ యెవరు?
బలిభుక్కుగా పేరుఁ బడసిన దే పక్షి?
నియతితోఁ దపముఁ బూనిన దెవండు?
ఏది సమాధాన మెలమిఁ గోరుచునుండు?
మృగయా వినోద మే మగుఁ దెనుఁగున?
ఏడేండ్లు పీడించు నే గ్రహం బందఱను?
పాదచారులు దేని బారిఁ బడుదు?
తే,గీ.
రన్నిటికిఁ జూడ రెండేసి యక్షరములు
మొదటి యక్షరముల నన్ని చదివి చూడఁ
దనువులన్ మార్చు దివ్య విద్యగఁ దనర్చు
నట్టి దెద్దియో తెలుపుడీ యనఘులార!
వివరణ -
పతి నెల్లకాలమ్ము బాయనిది - పత్ని
శ్రీవిష్ణు దేవుని చెలువ యైనది - రమ
బలిభుక్కుగా పేరు బడసినది - కాకి
నియతితో తపము బూనినవాడు - యతి
మన సమాధానమ్ము కోరెడిది - ప్రశ్న
మృగయ వినోదమ్ము తెలుగులో - వేట
ఏడేండ్లు పీడించు నట్టి గ్రహమే - శని
పాదచారులను బాధించేది - ముల్లు
పత్ని, రమ, కాకి, యతి, ప్రశ్న, వేట, శని, ముల్లు .... ఈ పదాల మొదటి అక్షరాలను చదివితే
సమాధానం ...... పరకాయప్రవేశము.
సమాధానాలు పంపినవారు .............
గన్నవరపు నరసింహ మూర్తి గారు, భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, డి. సుబ్రహ్మణ్యం గారు, నారాయణ గారు, మంద పీతాంబర్ గారు, మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు, నేదునూరి రాజేశ్వరి గారు.
అందరికీ అభినందనలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి