12, అక్టోబర్ 2010, మంగళవారం

ప్రహేళిక - 7 సమాధానం

ఇత డెవరు?
ఆ.వె.
శిల, హృదయము, త్రోవ, చెలువైన యమృతమ్ము
ద్వ్యక్షర పదము లగు; వాని మొదటి
యక్షరములఁ జూడ నతని పేరై యొప్పుఁ
గీర్తనల రచించి కీర్తిఁ గనెను.

శిల = రాయి, హృదయము = మది, త్రోవ = దారి, అమృతమ్ము = సుధ.
రాయి, మది, దారి, సుధ .... మొదటి అక్షరాలను చదివితే
సమాధానం ...... రామదాసు.
సరియైన సమాధానాలు పంపిన వారు
భాస్కర్ రామి రెడ్డి గారు, భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, మందాకిని గారు, చంద్రశేఖర్ గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు, రెహమాన్ గారు, నేదునూరి రాజేశ్వరి గారు, కోడీహళ్ళి మురళీ మోహన్ గారు.
అందరికీ అభినందనలు.

గన్నవరపు నరసింహ మూర్తి గారి సమాధానం
రాయి గాదు మదియు రాగమ్ము తీయనై
దారి సులభమయ్యె త్రాగి సుధలు

రాయి,మది,దారి,సుధ = రామదాసు

కోడీహళ్ళి మురళీ మోహన్ గారి సమాధానం
కోరి వ్రాయుమిదె గుడారము మశకము
తనిఖియును తరాజు కనుము తుదలు
రెండు అక్షరములు నుండవలయునన్ని
తెలియవచ్చునతడు సులభముగను

వివరణ: గుడారము = డేరా, మశకము = దోమ, తనిఖీ = సోదా, తరాజు = త్రాసు.
డేరా, దోమ, సోదా, త్రాసు ... చివరి అక్షరాలను చదివెతే
సమాధానం ......... రామదాసు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి