7, జనవరి 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 191 (కలహంసల తప్పు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
కలహంసల తప్పు గాక కాకుల తప్పా?
దీనిని పంపించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

28 కామెంట్‌లు:

  1. చెలువంపు వెన్నె లందుట
    మలయజములు వీచ శీత మారుతములనున్
    విలుకాడు పూల నెక్కుట
    కలహంసల తప్పు గాక గాకుల తప్పా!

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు.
    __________________________________________
    01)
    కుల మత విద్వేషంబులు
    కలలోనూహింపలేని - కట్టనువు , హిమా
    చలముల మించెడు ఘోరము - (స్కాములు)
    కలహంసల తప్పు గాక కాకుల తప్పా

    రిప్లయితొలగించండి
  3. కుటిలకుత్సితధూర్తదుష్టమూర్ఖ
    నాయకులను

    కలహంసలతో పోల్చడం తప్పే గాని..........తప్పలేదు.
    విషయం ముఖ్యం గదా!!!

    రిప్లయితొలగించండి
  4. శ్రీ నరసింహ మూర్తి గారు మీ పూరణ అందంగా, మనోరంజకంగా ఉంది

    పలు మీమాంసలు జేసిరి
    పలుహింసల పాలు జేసి,పాలును నీరున్
    యిలవేర్జేయని నకిలీ
    కలహంసల తప్పుగాని కాకుల తప్పే?


    (కమేటీల మీద కమేటీలు వేసి,ప్రకటనల మీద ప్రకటనలు చేసి ప్రజలను కాకులను జేసి, కష్టాలలోకి నెట్టి వేసి, సమస్యను పరిష్కరించడములో మళ్లీ మొదటికొచ్చిన కేంద్ర ప్రభుత్వ నిర్వాకాన్ని దృష్టిలో పెట్టుకొని పూరించింది )

    రిప్లయితొలగించండి
  5. మూర్తిగారూ!
    అందితే---వీస్తే---ప్రేరేపిస్తే-----ఏం..లాభం???
    అసలు వంటకం(పూబోడి) లేనిదే !!!!!!!!!!!!!!

    అయినా మీ " కందాలు " అందవు గాని " సీసాలు " ఎత్తుకోండి స్వామీ!

    రిప్లయితొలగించండి
  6. పీతాంబర ధరా !
    మన యిద్దరి భావాలూ ఒకటే గాని
    నేను చేసిన తప్పు మీరు చెయ్యకుండా
    కలహంసలను
    నకిలీ కలహంసలను జేసి అందగించారు.
    అలరించారు.!!!

    రిప్లయితొలగించండి
  7. పలుగాకులు కలహించగ
    కలహము వలదంచు చెప్ప; కాకులు తమతో
    కలహించి గాయ పరచగ
    కలహంసల తప్పు గాక గాకుల తప్పా!

    రిప్లయితొలగించండి
  8. పలలము దిను కాకులతో
    విలువగు మౌక్తికములెంత పేరొందినవో
    తెలుపగ బూనుట అహహా !
    కలహంసల తప్పు గాక కాకుల తప్పా?

    రిప్లయితొలగించండి
  9. హరీజీ ! అయ్యో!
    హంసలను గాయపరచేరా!
    మీ పూరణ కోసం.
    ఐనా, బాగుంది.
    _________________________________________

    02)

    కలనన్ , అన్య మెరుంగని
    లలనన్, కానల బనుచుట - క్రూరము గాదే !
    కలతన్ కమలిని(కోమలి) క్రుంకిన-[ఖలు , మాటలు విన వచ్చునె?]
    కలహంసల తప్పు గాక గాకుల తప్పా!
    _________________________________________
    కమలిని = తామర తీగ వంటి జానకీదేవి
    _________________________________________

    రిప్లయితొలగించండి
  10. విష్ణు నందన!సుందరా!
    మీ పూరణ
    మౌక్తికము వలె
    మెరయు చున్నది.

    రిప్లయితొలగించండి
  11. ________________________________________

    03)
    విలువలు హెచ్చునె ? నేడిల
    వలువలు కురుచగ ధరించు - వలతీ మణికిన్
    తులువలు చెంగలి చేరరె ?
    కలహంసల తప్పు గాక గాకుల తప్పా!
    _________________________________________

    రిప్లయితొలగించండి
  12. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    లలిత లవంగ లతా పరిశీలన కోమల మలయ సమీరంలా సాగింది మీ పూరణ. అబినందనలు.

    వసంత్ కిశోర్ గారూ,
    మీ రెండు పూరణ పద్యాలు బాగున్నాయి కాని ఏదో లోపించిం దనిపిస్తున్నది.

    మంద పీతాంబర్ గారూ,
    నకిలీ కలహంసల కంటే కాకులే నయం. బాగుంది మీ పూరణ.
    అబినందనలు.

    హరి గారూ,
    దుర్జనులకు నీతి చెప్పడం సజ్జనుల తప్పే.బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. డా. విష్ణు నందన్ గారూ,
    మీ పూరణ బ్రహ్మండంగా ఉంది. ధన్యవాదాలు.

    వసంత్ కిశోర్ గారూ,
    మీ మూడవ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. _____________________________________
    04)
    నలువ సృజించె గాదొకొ
    లలనల మెలపున ! నెలకొన - లాలన ! నిలలో
    మెలతలు , కరుణను మరచిన
    కలహంసల తప్పు గాక కాకుల తప్పా?
    _______________________________________

    రిప్లయితొలగించండి
  15. ఆర్యా వసంతకా ! వేదిక మీకోసము,అలంకరించాను,చెలియని,చెలికాడుని రంగప్రవేశము చేయిస్తారేమోనని. మీరు తులువలను పంపించారు !

    మలుసంధ్య వేళ దాటెను
    చెలి యేలనొ జెంత రాదు చెదరును దలపుల్
    పలుకు నిడ వెఱపు నొందిన
    కలహంసల తప్పు గాక గాకుల తప్పా !!

    రిప్లయితొలగించండి
  16. గురువుగారు శలవిచ్చారు.మిత్రుల పూరణలు బ్రహ్మాండముగా ఉన్నాయి. అందఱికీ అభినందనలు. కిశోర్ జీ యిక వేదిక మీదే !

    రిప్లయితొలగించండి
  17. కిల కిల పక్షుల రవములు
    తెల వారగ మేలుగొలుప తరువుల పైనన్ !
    కలకంఠి కలలు కరిగెను
    కలహంసల తప్పు గాక కాకుల తప్పా ? "
    --------------------------------------
    కల భామిను లంత కలసి
    వల విసరుతు మురిపింపగ వలపులు కురియన్ !
    మలహరుని మతి చలించగ
    కలహంసల తప్పు గాక కాకుల తప్పా ?

    మలహరుడు = శివుడు.

    రిప్లయితొలగించండి
  18. ఖలుడని తెలిసియు కౌరవ
    కులపతి పక్షమున బోరి గురు, భీష్మాదుల్
    పలువురు మాయరె విలువలు
    కలహంసల తప్పు గాక కాకుల తప్పా?

    (కలహంసలదే తప్పు కానీ కాకులది కాదు అని.)

    **********************************************

    సమస్యను కొంచెం మార్చి:

    ఖలురా గాంధా రేయులు
    విలువీయమి ద్రోణ,భీష్మ, విదుర హితోక్తుల్
    విలయము తప్పక పోయెను
    కలహంసల తప్పు గాక కాకుల తప్పే.

    (కలహంసల తప్పు కాదు, కాకులదే తప్పు అని భావం)

    రిప్లయితొలగించండి
  19. గురువు గారికి నమస్సులు. మీ ప్రశంసయే యెంతో మనోజ్ఞంగా ఉంది. పీతాంబర్ గారి ఆవేదన ఆ రాజకీయ నాయకులు అర్ధం చేసుకొంటే బాగుండును. హరి గారి పూరణ చాలా బాగుంది. డా. విష్ణు నందన్ గారు పద్యము వ్రాసి నప్పుడల్లా క్రొత్త పదములు నేర్చుకొంటాను. వసంత కిశోర్ గారు నేను ఒకేసారి ఉన్నతపాఠశాల పూర్తి చేసాము.ఆయనతో నాకు కాకినాడ అనుబంధము ఉంది. ఆయన ఈ బ్లాగును ఉత్సాహభరితముగా చేసారు. ఆయన భాషా సంపత్తి చాలా యెక్కువ. ఈ దినము మిస్సన్నగారు మిస్సయ్యారు. రాజేశ్వరి గారి పూరణలు అద్భుతంగా ఉన్నాయి.ఊకదంపుడుగారూ,మిస్సన్నగారూ కలహంసలు మీకోసము ఎదురు చూస్తున్నాయి, పద్యాలు చెప్పమని !

    రిప్లయితొలగించండి
  20. మిస్సన్నగారూ మీకు నూరేళ్ళు ఆయుర్దాయము.బ్రహ్మాండముగా ఉంది మీ పూరణ.

    రిప్లయితొలగించండి
  21. వసంత్ కిశోర్ గారూ,
    మీ నాల్గవ పద్యం బాగుంది. అభినందనలు.
    నరసింహ మూర్తి గారి ప్రశంస లందుకొంటున్నారు. సంతోషం!

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ఈ పద్యం కూడ మనోహరంగా ఉంది. అభినందనలు.
    నాది కేవలం ప్రశంస మాత్రమే. మనోజ్ఞత "జయదేవుడిది".
    మిత్రుల పూరణలను మెచ్చుకుంటూ మీ సహృదయతను చాటుకుంటున్నారు. ధన్యవాదాలు.
    పూరణల మీద మీలో మీకు "చర్చావేదిక" కొనసాగాలని ఆశిస్తున్నాను.

    నేదునూరి రాజేశ్వరి గారూ,
    మీ రెండు పద్యాలూ మనోజ్ఞంగా ఉన్నాయి. అభినందనలు. లకార ఆవృత్తితో వృత్త్యనుప్రాసను భలేగా ప్రయోగించారే! మేలు .. మేలు!

    మిస్సన్న గారూ,
    మీ కత్తికి రెండు వైపులా పదునే. అత్యద్భుతంగా ఉన్నాయి మీ పూరణలు. వంక లేని మీ పద్యాలను శంకరయ్య నిశ్శంకగా మెచ్చుకుంటున్నాడు. సెహబాస్!

    రిప్లయితొలగించండి
  22. గురుదేవా ధన్యుడను.
    నరసింహ మూర్తి గారూ మీ ఆశీస్సులకు ధన్యవాదాలు.
    బ్రతికియుండిన సుఖములు బడయవచ్చు నన్నారు పెద్దలు.
    ఈ మధ్యన మా బండి లేటుగా నడుస్తోంది.

    రిప్లయితొలగించండి
  23. ఎవ్వడవీవు కాళ్లు మొగమెర్రన ? "హంసమ" నెందునుందువో?
    "దవ్వుల మానసంబునను " - దాన విశేషములేమి చెప్పుమా?
    " మవ్వపు కాంచనాబ్జములు , మౌక్తికముల్ కలవందు " నత్తలో?
    "అవ్వి యెరుంగనన్న " నహహా యని నవ్వె బకంబులన్నియున్ !!!

    మానససరోవరం నుండి ఎగిరి వచ్చి ఒక నీటిగుంటలో దిగిన రాజహంస తో కొన్ని గుడ్డి కొంగలు మాట్లాడే విధానం యీ ప్రాచీన పద్యం..మానస సరోవరంలోని విశేషాలేమంటే , అందమైన బంగారు పూలు , మేలి ముత్యాలూ , వుంటాయంటూ యేమేమో చెప్పబోతూన్న హంస ను ఆపి, నత్త లుంటాయా అని అడిగి , పాపం ఆ హంస "నత్తలా?అవేంటో నాకు తెలీదు " అంటే "హిహ్హిహ్హీ నత్తలు తెలీదంట " అని వెక్కిరించాయట కొక్కిరి కొంగలు.
    ఇలా వుంటుంది సజ్జనులతో నీచుల సంభాషణం. ఇదే నా పూరణకు మూలం!!!! " చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు " అన్నారు కదా!!!

    రిప్లయితొలగించండి
  24. విష్ణు నందను గారూ మీ పూరణ నేపథ్యం చెప్పి మా చిన్ననాటి కథను గుర్తు చేసారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. పలుకులు మానుట లోకులు
    పలు కాకులనుచు ప్రధాని పదవికి ముప్పున్
    కలిగిన మన్మోహను వలె...
    కలహంసల తప్పు గాక కాకుల తప్పా

    రిప్లయితొలగించండి
  26. చెలరేగే ఎన్నికలను
    మలినపు మాయలు మమతలు మైకుల కూయన్
    మిలమిల లాడెడి సుషుమల
    కలహంసల తప్పు గాక కాకుల తప్పా?

    రిప్లయితొలగించండి