1, జనవరి 2011, శనివారం

ప్రహేళిక - 34 (సమాధానం)

అత డెవరు?
చం.
మనసిజు మామ మామ యభిమాన మడంచినవాని మామ నం
దనుని విరోధి నందనుని నందను సుందరి మేనమామఁ జం
పిన జగజెట్టి పట్టిఁ బొడిజేసిన శూరుని తండ్రిఁ గన్నుగాఁ
గొనిన సురాధినాథుని తనూభవు నాయువు మీకు నయ్యెడున్.

(చాటుపద్య రత్నాకరము)
పరిష్కారం ...............
1. మన్మథుని మామ - చంద్రుడు
2. అతని మామ - దక్షుడు
3. అతని గర్వం అణచినవాడు - శివుడు
4. అతని మామ - హిమవంతుడు
5. అతని కొడుకు - మైనాకుడు
6. అతని శత్రువు - ఇంద్రుడు
7. అతని కుమారుడు - అర్జునుడు
8. అతని పుత్రుడు - అభిమన్యుడు
9. అతని భార్య - ఉత్తర
10. ఆమె మేనమామ - కీచకుడు
11. అతనిని చంపిన వీరుడు - భీముడు
12. అతని కొడుకు - ఘటోత్కచుడు
13. అతనిని చంపిన శూరుడు - కర్ణుడు
14. అతని తండ్రి - సూర్యుడు
15. అతనిని కన్నుగా పొందిన దేవుడు - విష్ణువు
16. అతని కుమారుడు - బ్రహ్మ
ఆ బ్రహ్మదేవుని ఆయువు మీకు కలగాలని ఆశీస్సు.
సమాధానం పంపినవారు జి. మైథిలీ రాం గారొక్కరే. అదికూడా 100% సరియైన సమాధానం వారికి అభినందనలు.

4 కామెంట్‌లు: