13, జులై 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 102 A (ప్రహేళిక - సమాధానం)

సీ.
ఏనుఁగు సింహంబు నెలనాగయును గూడి
యొక మాటలోపల నుండవలయుఁ
బక్షియు వస్త్రంబు పాషాణమును గూడి
యొక మాటలోపల నుండవలయుఁ
ఫణిరాజు ఫణివైరి ఫణిభూషణుఁడుఁ గూడి
యొక మాటలోపల నుండవలయు
రారాజు రతిరాజు రాజరాజును గూడి
యొక మాటలోపల నుండవలయు
తే. గీ.
దీని యర్థంబుఁ జెప్పఁగా ధీనిధులకు
నెలలు పన్నెండు గడువిత్తు నేర్పుగాను;
చెప్పు నాతఁడు భావజ్ఞ శేఖరుండు
లక్షణోపేత! కృష్ణరాయక్షితీంద్ర!
సమాధానాలు -
ఏనుఁగు + సింహము + ఎలనాగ = నాగము + కేసరి + ఆలు
= నాగకేసరాలు (ఒక దినుసు వడ్లు)
పక్షి + వస్త్రము + పాషాణము = కాకి + బొంత + రాయి
= కాకిబొంతరాయి (ఒక జాతి రాయి)
ఫణిరాజు + ఫణివైరి + ఫణిభూషణుఁడు = నాగము + గరుడుడు + ఈశ్వరుడు
= నాగగరుడేశ్వరము (ఒక క్షేత్రం)
రారాజు + రతిరాజు + రాజరాజు = రాజు + మదనుడు + కుబేరుడు
= రాజమదనకుబేరము (ఒక ఔషధం)
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
గోలి హనుమచ్ఛాస్త్రి గారొక్కరే దీనికి సరైన సమాధానాలు చెప్పారు. వారికి అభినందనలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి