27, నవంబర్ 2011, ఆదివారం

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 1/3

                    అయ్యప్ప కథాగానం - 1/3

(పల్లవి -
శ్రీకరం శుభకరం అయ్యప్పచరితం
        మధురం మనోహరం ఆనందభరితం || శ్రీకరం ||)


మహిషి బాధలు విన్న శ్రీమహావిష్ణుండు
        శంకరుని బ్రహ్మను దగ్గరకు పిలిచాడు
        వారి అంశలతోడ మహిష మొక్కటి పుట్టె || వారి ||
దత్తాత్రేయుని అంశతో - మహిషమ్ము
        పుట్టి తన కర్తవ్యము - అడిగింది
స్వర్గాన్ని ఏలుతున్న - మహిషిని
        చేర్చు భూలోకానికి - అన్నారు

అతి సుందరంబైన ఆ మహిష మప్పుడు
        పరుగు పరుగున స్వర్గలోకమే చేరింది
        కోరికలు చెలరేగ రంకెలే వేసింది || కోరికలు ||
మహిషాన్ని చూడగానే - మహిషికి
        కామవాంఛలు పుట్టెను - మనసులో
తన పొందుకై వచ్చిన - మహిషిని
        భూలోకమే చేర్చెను - మహిషమ్ము || శ్రీకరం || 


బహుకాల మిద్దరు భూలోకమందున
        స్వేచ్ఛావిహారమ్ము చేసి సుఖపడ్డారు
        మదనసామ్రాజ్యాన్ని పాలించినారు || మదన ||
రాక్షసులు వివరించగా - వాస్తవం
        తెలిసికొని విదిలించెను - మహిషాన్ని
మహిషరూపును వీడెను - దత్తుండు
        ఆ త్రిమూరుల కలిసెను - లీనమై

ఇంద్రలోకం నుండి తనను తప్పించిన
        దేవతల మోసాన్ని తెలిసికొన్నది మహిషి
        ఆగ్రహావేశాలతో ఊగిపోయింది || ఆగ్రహా ||
దేవలోకం చేరెను - ఇంద్రున్ని
        తన్ని తరిమి వేసెను - దివినుండి
మునులను దేవతలను - మానవుల
        ముప్పుతిప్పలు పెట్టెను - దయలేక || శ్రీకరం || 


ఏకాంత స్థలమందు దాగినా డింద్రుండు
        ఒకనాడు నారదుడు అక్కడికి చేరాడు
        ఇంద్రాది దిక్పతుల పూజలే కొన్నాడు || ఇంద్రాది ||
"ఇంకెంత కాలానికీ - మా బాధ
        తీరునో చెప్ప" మనిరి - నారదుని
"కలిసివచ్చే కాలము - ముందుంది
        అందాక ఆగు" మనెను - దేవముని

భస్మాసురుం డనే రాక్షసుడు ఉన్నాడు
        పరమేశ్వరుని గూర్చి తపమెంతొ చేశాడు
        మెచ్చి వచ్చిన శివుడు "కోరు వర" మన్నాడు || మెచ్చి ||
తన చేతి నెవరి తలపై - ఉంచినా
        భస్మమై పోవు వరము - అడిగాడు
శంకరుడు మన్నించియు - వరమిచ్చి
        కైలాసమే వెళ్ళగా - చూచాడు || శ్రీకరం ||


తనకంత సులభంగ వర మిచ్చి నందుకు
        అనుమానమే వచ్చె భస్మాసురున కపుడు
        వరము శక్తిని పరీక్షించగా దలచాడు || వరము ||
శంకరుని తలపిననే - చెయిబెట్ట
       మునుముందుకే వచ్చెను - రాక్షసుడు
ప్రాణరక్షణ కోసమై - భయముతో
        వెనువెనుకగా పోయెను - శంకరుడు

ఆగు మాగు మంటు రాక్షసుడు వెంటాడ
        వద్దు వద్దని శివుడు పారిపోసాగాడు
        తలదాచుకొనునట్టి స్థానమే వెదికాడు || తలదాచు ||
విష్ణు విది చూసినాడు - శంకరుని
        కాపాడ దలచినాడి - ఆ క్షణమె
సౌందర్యరాశి యైన - మోహినిగ
        కనిపించె మురిపించెను - రాక్షసుని || శ్రీకరం || 



క్రింది లింకుల ద్వారా పాటను వినవచ్చు.మొదటి భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32991161

రెండవ భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32992715

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి