16, నవంబర్ 2011, బుధవారం

ప్రాసభేదాలు - 1

                             ప్రాసమైత్రి - 1
పద్యపాదంలో రెండవ అక్షరం ప్రాస. పద్యపాదం యొక్క మొదటి అచ్చుకు రెండవ అచ్చుకు మధ్య ఉండే హల్లు లేదా హల్లుల సముదాయం ప్రాస. అంటే పద్యపాదంలో రెండవ వర్ణం హల్సామ్యం కలిగి ఉండడం ప్రాసమైత్రి. ప్రాసాక్షరానికి ముందు వర్ణం దీర్ఘమైతే మిగిలిన పాదాలలోను దీర్ఘం, లఘువైతే మిగిలిన పాదాలలోను లఘువే ఉండాలని నియమం. ప్రాసయతి వేసినప్పుడు కూడా ఇదే నియమాన్ని పాటించాలి.
ప్రాసభేదాలు.....
1) అర్ధబిందు ప్రాస -
మొదటి పాదంలో ప్రాసాక్షరానికి ముందు అరసున్న ఉంటే మిగిలిన పాదాల్లోను అలాగే ఉండడం.
ఉదా.
వాఁడిమయూఖముల్ గలుగువాఁ డపరాంబుధిఁ గ్రుంకె ధేనువుల్
నేఁ డిట వచ్చె నేకతమ నిష్ఠమెయిన్ భవదగ్నిహోత్రముల్
పోఁడిగ వేల్వఁగాఁ బడియెఁ బ్రొద్దును బోయెఁ గచుండు నేనియున్
రాఁడు వనంబులోన మృగరాక్షసపన్నగబాధ నొందెనో (భార - ఆది. 3-112)

2) పూర్ణబిందు ప్రాస -
నాలుగు పాదాలలోను పూర్ణబిందు పూర్వకమైన హల్లు ఉండడం.
ఉదా.
ఇందు గలఁ డందు లేఁ డను
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే గలఁడు దానవాగ్రణి వింటే. (భాగ. 7-275)

౩) సంయుతాక్షర ప్రాస -
మొదటి పాదంలో ప్రాసాక్షరం సంయుక్తాక్షరమైతే మిగిలిన పాదాల్లోను అలాగే ఉండడం.
ఉదా.
ఉండ్రా యోరి దురాత్మక!
యిండ్రాప్రాసమ్ము కవుల కియ్యఁదగున? కో
దండ్రాము పదము సోకిన
గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్. (చాటువు)

4) ఖండాఖండ ప్రాస -
ప్రాసాక్షరానికి ముందు అరసున్న ఉన్నా, లేకున్నా మైత్రి పాటించడం ...
ఉదా.
ఆ పన్నగముఖ్యులఁ దన
వీఁపునఁ బెట్టికొని పఱచి విపినములు మహా
ద్వీపములు గిరులు నఖిల ది
శాపాలపురములుఁ జూపెఁ జన వారలకున్. (భార. ఆది. 2-44)

మరికొన్ని రేపటి పోస్టులో. దీనిపై స్పందించవలసిందిగా కవిమిత్రులకు మనవి.

4 కామెంట్‌లు:

  1. శంకరార్యా ! చక్కని పాఠానికి ధన్యవాదములు !
    గురువును దీర్ఘమనవచ్చా?

    అర్ధబిందు ప్రాస - ఖండాఖండ ప్రాస
    ఈ రెండూ ఒకదానికొకటి విభేదించు చున్నవి గదా !

    రిప్లయితొలగించండి
  2. సారాంశం
    ప్రాసాక్షరానికి ముందు పూర్ణబిందువు ఉంటే నాలుగు పాదాలలోను పూర్ణబిందుపూర్వకంగానే ప్రాస నిర్వహించాలి.
    ప్రాసాక్షరానికి ముందు అరసున్న ఉంటే మిగిలిన పాదాల్లోను అలాగే ఉండాలని నియమం లేదు.
    ప్రాసాక్షరం సంయుక్తాక్షరమైతే అన్ని పాదాల్లోనూ అలాగే అదే సంయుక్తాక్షరం (గుణింతం వేరు కావచ్చును) ఉండాలని నియమం ఉంది.

    రిప్లయితొలగించండి
  3. మంచి పాఠాలు చెప్తున్న శ్రీ శంకరయ్య గారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మబుధవారం, నవంబర్ 16, 2011 9:13:00 PM

    శంకరార్యా,
    నమస్తే
    నాబోంట్లకు ఉపయోగకరమైన పాఠాలను అందిస్తున్నందులకు చాలా సంతోషం.

    రిప్లయితొలగించండి