11, నవంబర్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 522 (స్వామియే శరణ మనెడి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
స్వామియే శరణ మనెడివాఁడు ఖలుఁడు.
(స్వామియే శరణ మయ్యప్ప! అయ్యప్పల సీజన్ మొదలయింది. ఇప్పటికి పదమూడు సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. దీక్షలో ఉండి అయ్యప్ప పడిపూజలు పురాణోక్తంగా చేయించేవాడిని. ఈ సంవత్సరం మాల వేసుకొనే అవకాశం దొరుకుతుందో, లేదో? స్వామి దయ!)

18 కామెంట్‌లు:

  1. శరణు హరిహరాత్మజాత! శాస్త! యంచు స్వామియే
    శరణమనెడు వాడు ఖలుడు జ్ఞానహీనుడైన నా
    పరము కరుణనొంది మిగుల భాసిలున్ విముక్తుడై
    సరస వాగ్విభూషణుండు సద్గుణుండునై ధరన్

    రిప్లయితొలగించండి
  2. భక్తిపెంపొంద బంధవిముక్తుడౌను
    స్వామియే శరణమనెడి వాడు,ఖలుడు
    స్వామి తత్త్వమ్ము నెఱుగక పతితుడౌచు
    వ్యర్థ పుచ్చును జీవన భ్రాంతిచేత.

    రిప్లయితొలగించండి
  3. శరణ మన్నను చాలును సంపదలను
    భక్త కోటికి నొసగెడు భవ్య మూర్తి
    స్వామియే, శరణమనెడి వాడు ఖలుడు
    ఐననేమిలె బుధ్ధుల నాతడిచ్చు.

    రిప్లయితొలగించండి
  4. చిన్న సవరణ తో..

    శరణ మన్నను చాలును సంపదలను
    భక్త కోటికి నొసగెడు భవ్య మూర్తి
    స్వామియే, శరణమనెడి వాడు ఖలుడు
    చపలుడైనను బుధ్ధి కుశలత నొసగు.

    రిప్లయితొలగించండి
  5. దీనినీ చమత్కారముతో పూరించ వచ్చును:
    మోక్షపధగాము లగువారి పక్షమందు
    స్వామియే శరణ మనెడివాఁడు ఘనుడు
    హేతువాదులు తర్కించు రీతి జూడ
    స్వామియే శరణ మనెడివాఁడు ఖలుఁడు

    రిప్లయితొలగించండి
  6. స్వామిని శరణమును చక్కగా విడదీసి శాస్త్రి గారు చక్కగా చెప్పారు
    స్వామి శరణం

    రిప్లయితొలగించండి
  7. స్వామిని శరణమును చక్కగా విడదీసి శాస్త్రి గారు చక్కగా చెప్పారు
    స్వామి శరణం

    రిప్లయితొలగించండి
  8. లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    ‘శ్యామలీయం’ గారూ,
    మీ పూరణలను చదివి ఆవేదన చెందిన ఒక భక్తుడు వాటిని తొలగించవలసిందిగా కోరుతూ నాకు ఫోన్ చేసాడు. అసలు ఈ సమస్యను ఇవ్వడమే నేను చేసిన పొరపాటు అనిపిస్తున్నది. ఇచ్చిన తర్వాత బాధ పడ్డాను కూడా. అయ్యప్ప భక్తుడనూ, అయ్యప్ప చరిత్ర వ్రాసిన వాడను అయి కూడ నేనిలాంటి సమస్య ఇచ్చానేమిటా అని అపరాధభావం కలిగింది. మొత్తానికే ఈనాటి సమస్యను రద్దు చేద్దామా అనుకున్నాను.
    లక్కాకుల వారి పూరణను, శ్యామలీయం గారి రెండవ, మూడవ పూరణలను తొలగించాను. దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసికొని కోపం తెచ్చుకొనవద్దని మనవి. చర్చించవద్దని కూడ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  9. పలికె సుగ్రీవుఁడిట్టుల, పగతుఁడతఁడు
    మరియు రావణు తమ్ముడు మాయఁబూని
    వచ్చెనేమొ శరణమని వలదు వలదు
    స్వామియే శరణ మనెడివాఁడు ఖలుఁడు!!

    రిప్లయితొలగించండి
  10. శంకరయ్య గారూ, నా పూరణలు తొలగించి నందుకు నాకేమీ విచారం లేదు. ఇందులో కోపతాపాలకేమీ కారణం లేదు. మానావమానాలేమీ లేవిక్కడ. తమరు నా పూరణలు జాగరూకులై పరికించితే వాటియందు అయ్యప్ప భక్తులకు గాని మరి యెవరికిగాని ఆవేదన చెందించే అన్వయం యేదీ స్ఫురించదని అంగీకరించగలరని నా విశ్వాసం. అయినా వాటిని పునఃప్రకటించమని కోరటం లేదు. బహుశః మీరు గమనించినట్లు చిక్కల్లా సమస్యాపాదం మాత్రమే చదివి యెక్కువ సాహిత్యపరిచయం లేని వారెవరైనా అపోహపడే అవకాశం ఉంది. రోజులు మారుతున్నాయి. ప్రజలు భాషకు కొంత దూరమౌతూ ఉండటం చేత ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయేమో.

    మా చిన్నతనంలో ఒక అష్టావధానంలో ఇచ్చిన సమస్య:
    ఖర లింగంబును కౌగలించుకొన దీర్ఘాయుష్య మబ్బుంగదా

    నేటిరోజుల్లో యీ సమస్యను ఇస్తే కొందరు అశ్లీలంగా ఉందని అట్లా యీయరాదని అడ్డు చెప్పవచ్చును.

    ఈ విషయం ఇంతకితో వదలివేద్దాం.

    రిప్లయితొలగించండి
  11. చిన్న సవరణతో:-

    పలికె సుగ్రీవుఁడిట్టుల, పగతుఁడితఁడు
    మరియు రావణు తమ్ముడు మాయఁబూని
    వచ్చెనేమొ శరణమని వలదు వలదు
    స్వామియే శరణ మనెడివాఁడు ఖలుఁడు!!

    రిప్లయితొలగించండి
  12. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ!
    మీరు తీసికొనిన నిర్ణయమునకు మిమ్ము అభినందిస్తున్నాను. ప్రహ్లాదుడి గూర్చి పోతనగారు భాగవతములో: లీల లందును బొంకులు లేనివాడు అని అంటారు. అలాగే వినోదము కొరకయినా ఎన్నడూ దోషమగు అర్థము వచ్చే పదములను/పాదములను కూర్చరాదు కదా. మనలో చాలమంది మంచి జ్ఞానసంపన్నులమే. అందుచేత వీలయినంత వరకు వినోదమును మన సనాతన ధర్మమునకు సంబంధించని విషయాలకే పరిమితము చేద్దాము. మన ధర్మము యొక్క పవిత్రతను తప్పక పాటించడానికి మనవంతు కృషి మనము చేద్దాము.

    రిప్లయితొలగించండి
  13. హరిహరసూనుని తత్త్వము
    గురించి స్పందించిన కవికోకిలముల సా
    దరమున నభినందించెద
    పరి పరి శుభములను గనగ స్వామి కరుణతో

    రిప్లయితొలగించండి
  14. రాజశేఖర శర్మ గారూ!ధన్యవాదములు.
    శ్రీ నేమాని వారు, శ్యామలీయం గారూ చక్కని పూరణలు చేశారు. జిగురు వారి పూరణ అదిరింది.

    రిప్లయితొలగించండి
  15. ఏడుకొండల వేంకటస్వామియే శ
    రణమ నెడివాడు, ఖలుడు దుర్గుణుడు హంత్రి
    యైన నేమి శ్రాంతిగలుగు నంతలోన
    వేంకటేశ సముండు లేడింక నిలను!

    రిప్లయితొలగించండి
  16. కూటికొరకునిమ్మహినందు కోటిగతులు
    కలవని యెరింగియునుసుంత కష్టపడక
    ప్రభువుకొలువుఁజేయుచు ప్రస్తుతులను
    "స్వామి" యే శరణ మనెడివాఁడు ఖలుఁడు!

    రిప్లయితొలగించండి
  17. శ్యామలీయం గారి పూరణ .....

    కుదిరి నంతటి శ్రధ్ధతో కొలుచు నేని
    యొక్క నాటికి హంతయు యోగ్యుడగును
    జ్ఞాను లగువారి దృష్టి కెన్నడును గాడు
    స్వామియే శరణ మనెడివాఁడు ఖలుఁడు

    రిప్లయితొలగించండి
  18. కవిమిత్రు లందరికీ వందనాలు.
    నిన్న ఉదయం ఏ సమస్య ఇవ్వాలా అని ఆలోచిస్తూ కిటికీలోంచి బయటకు చూస్తే సైకిల్ మీద వెళ్తున్న అయ్యప్ప స్వామి కనిపించాడు. వెంటనే పై సమస్యను సృష్టించి పోస్ట్ చేసాను. వాటిపై వచ్చిన కొన్ని పూరణలను చూచి ఒక భక్తుడు ఫోన్ చేసి వాటిని తొలగించమని కోరాడు. కేవలం రెండు పూరణలను తొలగించాను. మిత్రులు అన్యధా భావించవద్దని మనవి.

    రిప్లయితొలగించండి