26, జనవరి 2012, గురువారం

చమత్కార పద్యాలు - 183

ఆంధ్రసంస్కృత భాషాశ్లేష

కం.
మా యమ్మాన సు నీవే
రాయలవై కావ దేవరా జేజేజే
మా యాతుమ లానిన యది
పాయక సంతోస మున్న పల మిల సామీ.

                                               (కళాపూర్ణోదయము - పింగళి సూరన)

తెలుగు పరమైన అర్థతాత్పర్యాలు
పదవిభాగం
మాయమ్మ, ఆన, చు, నీవు, ఏ, రాయలవు, ఐ, కావనే, దేవరా, జేజేజే, మాయాతుములు, ఆనినయది, పాయక, సంతోసము, ఉన్నపలము, ఇలసామీ.

అన్వయం
దేవరా, జేజేజే, సామీ, రాయలవై, కావనే, సంతోసము, పాయక, మాయాతుములు, ఆనినయది, ఉన్నపలము, మాయమ్మ, ఆన సు.


ప్రతిపదార్థాలు
దేవరా = ఓ ప్రభువా!
జేజేజే = మీకు ముమ్మాటికీ జయము.
సామీ = ఓ అధిపా!
రాయలవై = రాజువై
కావనే = రక్షించడం వల్లనే
సంతోసము = ఆనందం
పాయక = విడువకుండా
మాయాతుములు = మా ఆత్మలను
ఆనినయది = అంటిపెట్టుకొని ఉంది.
ఉన్నపలము = ఇది మాకు సిద్ధించిన ఫలం.
మా +అమ్మ+ఆన సు = మా తల్లి తోడు సుమా!

తాత్పర్యం
ఓ ప్రభువా! ముమ్మాటికీ నీకు జయం.ఓ అధిపతీ! నీవు రాజువై రక్షించడం వల్లనే ఆనందం విడువకుండా మా ఆత్మలను అంటిపెట్టుకొని ఉంది. ఇది మాకు సిద్ధించిన ఫలం.మా తల్లి తోడు సుమా!


సంస్కృతపరమైన అర్థతాత్పర్యాలు
పదవిభాగం
మా, ఆయం, మాన, సునీవే, రాః, అలవా, ఏకా, అవత్, ఏవ, రాజే, ఆజేజే, మా, ఆయాతు, మలాని, న, యది, పాయక, సంతః, అసముత్, న, పల, మిల, సా, అమీ.
అన్వయం
హే సునీవే, ఆయం, మామాన, అలవా, రాః, ఏకైవ, అవత్, అజేజే, రాజే, మా, ఆయాతు, మలాని, న, హేపాయక, సంతః, యది, అసముత్, నపల, మిల, అమీ, సా.


ప్రతి పదార్థాలు
హే సునీవే = శుభప్రదమైన మూలధనం కలిగిన ఓ రాజా!
ఆయం = రాబడిని
మామాన = లెక్క చేయవద్దు.
అలవా = ఛిన్నాభిన్నం కాని
రాః = ధనం
ఏక +ఏవ = ఒక్కటే
అవత్ = కష్టసమయంలో రక్షించే దవుతుంది.
అజేజే = మేకపోతుతో యజ్ఞం చేసే
రాజే = రాజుకోసం
మా = లక్ష్మి
ఆయాతు = వస్తుంది.
మలాని = పాపాలు
న = పొందవు.
హేపాయక = ఓ రక్షకా!
సంతః = సత్పురుషులు
యది = ఒకవేళ వస్తే,
అసముత్ = సంతోషం లేనివాడివై
నపల = దర్శనమివ్వకుండా పోవద్దు.
మిల = వారితో కలుసుకో.
అమీ = వీరు
సా = ఆ లక్ష్మి (అని నమ్ము).

భావం
శుభ ప్రదమైన మూలధనం గల ఓ రాజా! రాబడిని లెక్క చేయకు. ఛిన్నాభిన్నం కానట్టి ధన మొక్కటే కష్ట సమయంలో రక్షిస్తుంది. మేకపోతుతో యజ్ఞం చేసే రాజుకు లక్ష్మి వస్తుంది.  పాపాలు పొందవు. ఓ రక్షకా! సత్పురుషులు వస్తే సంతోషం లేనివాడివై దర్శనమివ్వ కుండ పోవద్దు. వారిని కలుసుకో. వీళ్ళే ఆ లక్ష్మి అని నమ్ము. 

‘ఆంధ్రామృతం’ శ్రీ చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదాలతో ...

4 కామెంట్‌లు:

  1. ద్విభాషా చమత్కారం బాగుంది.రెండు వైపులా పదునున్న కత్తి లాంటి పద్యం ... పింగళి గారికి శిరసాభివందనం.

    రిప్లయితొలగించండి
  2. పింగళి సూరన గారి " కళా పూ ర్ణో దయము నుండి " సంస్కృతాం ద్రీ కరణ జేసి , అర్ధ తాత్పర్య ములతో మన కందించిన చింతా వారు శ్లాఘ నీయులు

    రిప్లయితొలగించండి
  3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    రాజేశ్వరి అక్కయ్యా,
    ధన్యవాదాలు. ఈనాటి చమత్కార పద్యాల ‘క్రెడిట్’ అంతా చింతా రామకృష్ణారావు గారికే!

    రిప్లయితొలగించండి
  4. ఎప్పుడు మీ ఒక్కరికే గాకుండా అప్పుడప్పుడు ఈ క్రెడిట్ ను అందరికి పంచ గలగడం మీ ఔన్నత్యం.

    రిప్లయితొలగించండి