5, జనవరి 2012, గురువారం

సమస్యాపూరణం - 581 (మారుఁ బూజింతు)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
మారుఁ బూజింతు దైత్య సంహారు ధీరు.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

40 కామెంట్‌లు:

  1. వీరు దేవసేనాపతి విక్రమాఢ్యు
    శూరు వల్లీ హృదీశ్వరు సుందరాంగు
    నారు మొగముల వేలుపు నంబికాకు
    మారు బూజింతు దైత్య సంహారు ధీరు

    రిప్లయితొలగించండి
  2. సకలలోకంబులకు సుఖ శాంతులమర
    చోద్యముగ తాను మూషికాసురుని జంపి,
    గజముఖుండయివెలుగునంగజహరునికు
    మారు, బూజింతు దైత్యసంహారు ధీరు.

    రిప్లయితొలగించండి
  3. మనుజ రూపమెత్తిన వాడు మాధవుండు
    దనుజ సంహార మొనరించు ధర్మపరుడు
    తండ్రి మాటను పాలించు దశరథుని కు
    మారుఁ బూజింతు దైత్యసంహారు ధీరు

    రిప్లయితొలగించండి
  4. చారు కౌస్తుభమణిహారు క్షీరచోరు
    పాపహారు గోనగధారు వనవిహారు
    దీనమందారు సుందరు దేవకీకు
    మారుఁ బూజింతు దైత్య సంహారు ధీరు

    రిప్లయితొలగించండి
  5. ఈ రోజు సమస్యకు మంచి పూరణలు వస్తున్నాయి. అందరికి అభినందనలు. శ్రీ మిస్సన్న గారు మంచి అనుప్రాసలు వేసేరు. శ్రీమతి మందాకిని గారు శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు కూడా చాలా మంచి భావములతో పూరించేరు.

    రిప్లయితొలగించండి
  6. నేమాని పండితార్యా ధన్యవాదములు.
    మీ పూరణ స్ఫూర్తితోనే పై పూరణ చేయగలిగేను

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    శ్రీకృష్ణుడు :
    01)
    ______________________________________

    మధురలో పుట్టి, గట్టెక్కు - మహితవరుని
    మదన మోహను , గోపికా - మాన చోరు
    మహిని బ్రోచిన పుణ్యాత్ము! - మనసున , పలు
    మారుఁ బూజింతు దైత్య సం - హారు ధీరు !
    ______________________________________

    రిప్లయితొలగించండి
  8. శంకరార్యా !

    శబరిమలై వెళ్ళుచుంటిని గాన
    వచ్చే వరకూ శలవు !

    రిప్లయితొలగించండి
  9. వెంకట రాజారావు . లక్కాకులగురువారం, జనవరి 05, 2012 11:19:00 AM

    దేవ సేనాధి పతి మారె 'దేవ సేన '
    పతిగ , కుండలినీ వళీ పతికి భార్య
    'వల్లి 'యయ్యె - విశాఖు,నపర్ణ మృడు కు
    మారు బూజింతు దైత్య సంహారు ధీరు

    రిప్లయితొలగించండి
  10. శ్రీరాముడు :

    02)
    ______________________________________

    మాత కౌసల్యా పుత్రుని ! - మాన ధనుని !
    మాయ తాటకి నణచిన - మనుజ రూపు
    మాన్య సీతా మనోహరు ! - మాన్య చరితు !
    మారి మారీచ సంహారు ! - మధుర వదను !
    మత్త రావణ మర్థను !- మామమాము !
    మార సుకుమార సుందరు ! - మారుతాత్ము
    మదిని సంచార మొనరించు - మంచి వాని !
    మహిని నరులకు సన్మార్గ - మార్గ దర్శు !
    మగడు ! సౌరి ! విజయ విక్ర - మ దశరథ కు
    మారుఁ బూజింతు దైత్య సం - హారు ధీరు !
    ______________________________________

    రిప్లయితొలగించండి
  11. శంకరార్యా ! మీ శబరిమల యాత్ర యేమైనది?
    ఒక వేళటు వస్తే
    నా cell కు( 94 92 94 76 84 )contact చెయ్యండి !

    రిప్లయితొలగించండి
  12. శ్రీ మిస్సన్న గారూ!
    నా బోటి పాపాత్ములకి అని మీరు ఆత్మ నిందను చేసుకొనవద్దు. మన సంప్రదాయములో "నేను పాపిని" అనము. నేను ఆత్మ స్వరూపుడను" (అహం బ్రహ్మాస్మి) అనుట మన సంప్రదాయము. మనస్సు, వాక్కు, తనువు అనే 3 కరణములు శుద్ధిగా ఉండాలని అని భగవద్గీత ఉద్ఘోషిస్తోంది కదా. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. పండితుల వారు లెస్స బలికారు. మిస్సన్న గారు, అది బ్రౌజర్ ఫాల్ట్ అయి వుంటుంది.

    రిప్లయితొలగించండి
  14. నేమాని పండితార్యా సదుపదేశమునకు ధన్యవాదములు.
    మందాకిని గారూ ధన్యవాదములమ్మా.

    రిప్లయితొలగించండి
  15. "పాపోహం పాప కర్మాణాం పాపాత్మా పాపసంభవః
    త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల
    అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
    తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర "

    రిప్లయితొలగించండి
  16. శ్రీ వసంత కిశోర్ గారు తమ కవితా కన్యకను మా లతో అలంకరించేరు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. వెంకట రాజారావు . లక్కాకులగురువారం, జనవరి 05, 2012 7:10:00 PM

    హరిని శంకరాభరణ విహారి జేసి
    కట్టెదుట నిల్పె మిస్సన్న ఘనత బొగడ
    బండితుడ గాను కవిగాను బరవశించె
    మిత్రుడా !మేను దెలుగున మేటి వీవు

    రిప్లయితొలగించండి
  18. రమ్యగుణసాంద్రు రాజేంద్రు రామచంద్రు,
    భద్రగిరివాసు దరహాసు భక్తపోషు ,
    రుచిత మణిహారు వీరు శూరు దశరథకు
    మారు పూజింతు దైత్య సంహారు ధీరు!!!

    రిప్లయితొలగించండి
  19. శ్రీరమాకాంతు, నఘహరు, సారసాక్షు,
    సజ్జనావనదక్షు, సహస్రదృక్కు,
    భక్తజనవంద్యు, మధుకైటభద్విషుఁ బలు
    మారు పూజింతు దైత్యసంహారు, దీరు.

    రిప్లయితొలగించండి
  20. శ్రీ చంద్రశేఖర్ గారి పద్యములో 1వ పాదములో ఒక లఘువు తక్కువ ఉన్నది.
    శ్రీ శంకరయ్య గారి పద్యము 2వ పాదములో యతి మైత్రి లేదు.
    సరిజేసుకొనండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. శ్రీనేమాని వారికి ధన్యవాదాలతో, సవరించిన నా పూరణ:
    అమ్మనవనిజ నరసినట్లాగక నికఁ
    వట్టి చేతుల నవలీలఁ వనమడచిన
    యమితబలశాలి యపురూపుడంజనా కు
    మారుఁ బూజింతు దైత్య సంహారు ధీరు

    రిప్లయితొలగించండి
  22. మిత్రమా రాజరావు మీ మెచ్చుకోలు
    మదికి ముదమాయె పల్కెద మాటికేను
    మిమ్ముబోలు సహృదయుల నెమ్మి కలిగె
    పూర్వపుణ్య ఫలమిది కాబోలు నాకు.

    రిప్లయితొలగించండి
  23. ' సజ్జనావన దక్షు సౌజన్య దృక్కు '
    శంకరార్యుల పూరణ! వంక లేదు
    మంద పీతాంబరుని పద్య మందగించె
    మిత్రు లందరి పూరణల్ మేలు మేలు.

    రిప్లయితొలగించండి
  24. చూచినంతనె జనులకు శుభము లిచ్చి
    చేరి కోరిన వారికి సిరులనొసగి
    దీన జనులను గాచెడి దేవి చెలి కు
    మారు పూజింతు దైత్య సంహారు ధీరు.

    ఆ దేవి లక్ష్మి, లక్ష్మి చెలి గౌరి.

    రిప్లయితొలగించండి
  25. నేమాని వారికి ధన్యవాదములు !
    మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    శంకరార్యా ! నా శబరిమల ప్రయాణం రద్దైనది !
    నేను ప్రస్తుతం తణుకు లోనే ఉన్నాను !

    రిప్లయితొలగించండి
  26. ఆది వరాహమై నిలిపె నవని నతడు
    కైట భాసురు జంపిన ఘనుడు కాదె ?
    మూడడుగు లాక్ర మించిన ముంజి యనగ
    మారు బూజింతు దైత్య సంహారు దీరు

    రిప్లయితొలగించండి
  27. పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు. తొందరలో యతిదోషాన్ని గమనించలేదు.
    ‘సజ్జనావనదక్షు, శాశ్వతుని, హరిని’ అందాం.

    రిప్లయితొలగించండి
  28. మిత్రుల పూరణలు బ్రహ్మాండముగా ఉన్నాయి. మిస్సన్న గారికి ప్రత్యేక అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. నేను కనుగొంటి మందాకినీ! పవిత్ర
    హరిహరుల చిత్రపటము బ్రౌజరును మార్చి
    యంత్ర మందున కలదిట్టి తంత్ర మనుచు
    తెలియ జేసిన మీకగు దివ్య శుభము.

    రిప్లయితొలగించండి
  30. పండిత నేమాని వారూ,
    షణ్ముఖుని ప్రస్తావించిన మీ పూరణ కడుంగడు సుందరం. ధన్యవాదాలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ‘అంగజహరుని కుమారు’ని పై మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    మీ పూరణలో రామరసాయనాన్ని ఒలికించి, ఆనందాన్ని కలిగించారు. ధన్యవాదాలు.
    లచ్చి చెలి కుమారుని పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    శ్రీకృష్ణ ప్రస్తావనతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    రాజారావు గారినీ, నన్ను, మంద వారిని, మిత్రులను ప్రశంసించిన పద్యాలకు ధన్యవాదాలు.
    మీకు ‘శంకరనారాయణ’ దర్శనమైనందుకు సంతోషం!
    *
    వసంత కిశోర్ గారూ,
    అద్భుతమైన పూరణ. అభినందనలు.
    మీ పూరణను ముందు చూసి ఉంటే నా పూరణను పోస్ట్ చేయకుండా ఉండేవాణ్ణి.
    రామప్రభువు మీద మీ పూరణ మనోహరంగా ఉంది. ధన్యవాదాలు.
    ‘శౌరి’ని ‘సౌరి’ అన్నారు. సౌరి అంటే యముడు లేదా శని.
    శబరిమల వెళ్తున్నా నన్నారు. అంతలోనే ప్రయాణం రద్దు అన్నారు. తన దగ్గరికి రప్పించుకోవాలన్నా, వద్దనుకున్నా స్వామి కరుణ.
    జనవరి 16న మిత్రులు వెళ్తున్నారు. రమ్మంటున్నారు కాని ఇంకా నిర్ణయంచుకోలేదు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    మిస్సన్న గారిని ప్రశంసించిన పద్యం సుందరంగా ఉంది. ధన్యవాదాలు.
    ‘మేను దెలుగు’ ...?
    *
    అజ్ఞాత గారూ,
    ధన్యవాదాలు. ‘యానికానిచ పాపాని ...’ కూడా చేరిస్తే ‘ఓ పనై పోయేది’ కదా! :-)
    *
    మంద పీతాంబర్ గారూ,
    శబ్దాలంకార శోభితమైన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మంచి పూరణ. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం. ‘ఆది సూకరమై నిల్పె నవని నతడు’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  31. ఖమ్మం వెళ్ళిరావడం, పనుల ఒత్తిడి కారణంగా నిన్నటి పూరణలపై ఆలస్యంగా స్పందించినందులు మిత్రులు మన్నించాలి.

    రిప్లయితొలగించండి
  32. గురువుగారూ ధన్యవాదాలు.
    రాజారావు గారి పూరణలో ' పరవశించె మేను, తెలుగున మేటి '

    రిప్లయితొలగించండి
  33. లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    నిజమే. నేను పొరబడ్డాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  34. శంకరార్యా ! ధన్యవాదములు !

    సౌరి = శని , యముడు , విష్ణువు
    విష్ణువు = శౌరి , సౌరి
    (జి ఎన్ రెడ్డి గారి ప్రకారం)
    చిత్తగించుడు !

    రిప్లయితొలగించండి
  35. వసంత కిశోర్ గారూ,
    నాదే పొరపాటు.
    సూర్యరాయాంధ్ర నిఘంటువులో చూస్తే ‘కాలం’ చివర
    ‘సౌరి |సం. వి. ఇ. పుం.| ౧.శని. ౨. యముఁడు’ అని ఉంది.
    దాని కొనసాగింపు రెండవకాలంలో ఉంది. నేను అది చూడలేదు.
    ‘౩. విష్ణువు. ౪. సుగ్రీవుఁడు, ౫. వేఁగిసచెట్టు.
    సౌరి |సం. వి. ఈ. స్త్రీ.| ౧. సూర్యుని భార్య. ౨. ఆవు’
    పై భాగం నేను చూడలేదు.
    మన్నించండి.

    రిప్లయితొలగించండి
  36. మీరు జూపిన మార్గమే మిస్సనార్య!
    ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  37. తాటకాంతకు సరియేడు తాటి చెట్లు
    వ్రేల్చి యొక్కట శరమున గూల్చి వాలి
    దశముఖాసురు జంపిన దశరథుని కు
    మారు బూజింతు దైత్య సంహారు దీరు

    రిప్లయితొలగించండి