8, జనవరి 2012, ఆదివారం

సమస్యాపూరణం - 585 (తాపసులకు రక్ష)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
తాపసులకు రక్ష దైత్యతతులు
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

34 కామెంట్‌లు:

  1. ఉత్సాహ:
    తాపసులకు రక్ష దైత్యతతులు గూర్చు చుండుటే
    వైపరీత్యమయ్యు నట్టి భవ్య లక్షణాలతో
    పాప రహితమై జగద్వ్యవస్థ తనరు నట్లుగా
    శ్రీపతి యొనరించు గాక! చిద్విలాసు డొప్పుగా

    రిప్లయితొలగించండి
  2. శ్రీగురుభ్యోనమ:

    పాలకడలిలోని పన్నగ శయనుడే
    తాపసులకు రక్ష, దైత్యతతులు
    ధాత్రి జనుల మునుల దండించుచుండగా
    మదము నణచినాడు మాధవుండు

    రిప్లయితొలగించండి
  3. దండకారణ్యమున జరిగిన ఒక సంభాషణ.

    దండక వనమందు దాశరథి యొసగెను
    తాపసులకు రక్ష, దైత్యతతులు
    నాశమొందిరయ్య నారాయణునిచేత.
    మంచి రోజులివియె మాననీయ!

    చంద్రశేఖర్ గారు, మొదటి పాదమున యతి సవరించవలసి ఉంటుందేమో.

    రిప్లయితొలగించండి
  4. దండక వనమందు దాశరథి యొసగె
    తాపసులకు రక్ష, దైత్యతతులు
    నాశమొందిరయ్య నారాయణునిచేత.
    మంచి రోజులివియె మాననీయ!

    రిప్లయితొలగించండి
  5. వెంకట రాజారావు . లక్కాకులఆదివారం, జనవరి 08, 2012 1:31:00 PM

    ఆ 'పశుధర్మాచరణ' స
    దా పసయని మదిదలంచి తామస గుణులై
    పాపము బోధించు నసుర
    తాపసులకు రక్ష దైత్యతతులు దలంపన్

    రిప్లయితొలగించండి
  6. ఆదిలోనే 'ఉత్సాహము' నింపిన నేమానివారికి,
    పన్నగ శయను దలచిన శ్రీపతి గారికి,
    మిండతాపసుల పరిచయం చేసిన చంద్ర శేఖర్ గారికి '
    దండక వనమందు దాశరథిని చూపిన మందాకిని గారికి,
    అసుర తాపసులను ఆటవెలది లో కాకుండా కందములో బంధించిన రాజారావు గారికి - అందరికి అభినందనలు.
    నా పూరణ..

    వ్రాయదలచి నేను చేయగా 'టైపింగు '
    "తాపసులకు రక్ష దైవ తతులు"
    మారె నిటుల జరుగ ఘోరమౌ 'టైపాటు'
    "తాపసులకు రక్ష దైత్యతతులు"

    రిప్లయితొలగించండి
  7. హనుమచ్ఛాస్త్రి గారు,
    ధన్యవాదాలండి. కానీ మీరసలు తప్పులేమీ టైపు చేయరే, మరి ఎలా టైపాటని ఒప్పుకోమంటారు? (సరదాకి)

    రిప్లయితొలగించండి
  8. కాలనేమి హిమనగము చెంతను కపట
    తాపసునిగ రూపు దాల్చె నకట!
    అటుల కల్పితమగు నాశ్రమ వాసులౌ
    తాపసులకు రక్ష దైత్యతతులు

    రిప్లయితొలగించండి
  9. వెంకట రాజారావు . లక్కాకులఆదివారం, జనవరి 08, 2012 4:49:00 PM

    దైవ తతిని మార్చి దైత్య తతుల జేయ
    దైత్య తతిని దైవ తతిగ మార్చ
    చేవ గలుగు వారు శ్రీ గోలి హనుమయ్య !
    ధన్యవాదములిడ తగుదు రయ్య

    (సరదాగా.......)

    రిప్లయితొలగించండి
  10. మందాకినిగారికి ధన్యవాదాలు. సవరణతో>
    కొంగ జపముఁ జేయు దొంగసాములకును
    శ్రేష్ట తాపసులను చెరచుచు నెటు
    బెట్టి యహము విడువ నట్టి రక్కసి మిండ
    తాపసులకు రక్ష దైత్య తతులు!

    రిప్లయితొలగించండి
  11. శ్రోత్రియ హనుమ! నిజతాపసులకు రక్ష
    దైవ తతులు, ధర్మద్రోహ తాపసులకు
    రక్ష దైత్యతతులు, నీవె రక్ష మాకు
    నిజముమారుతీ! మరువము నిన్నెపుడును!

    రిప్లయితొలగించండి
  12. మిత్రుల పూరణలు అలరిస్తున్నాయి. నాకు చంద్రభాసురమే గతి.

    రామభద్రు డొకఁడె రక్ష గూర్చు ననుచు
    విమల మతులు సెప్ప వింటి మునుపు
    తప్పత్రాగి గూడ నొప్పనీ పలుకులు
    తాపసులకు రక్ష దైత్య తతులు.

    రిప్లయితొలగించండి
  13. మందాకిని గారూ మంచి పూరణ చేసారు. రోజు అన్నది అన్యభాష్యము. దినము తత్సమము. తప్పు కాదు గానీ తెలుస్తే ' దినము ' అని వ్రాయడమే మీ కిష్ట మని నాకు తెలుసు.

    రిప్లయితొలగించండి
  14. పండితుల వాక్కు రిక్త వోదని శ్రీ పండిత నేమాని వారు చెప్పారు. ' శ్రీపతి యొనరించు 'అని ఆయన చెప్పగానే శ్రీపతి శాస్త్రి గారు పూరణ ముదావహముగా నొనరించారు. శ్రీ లక్కాకుల వెంకట రాజారావు గారు శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారి పద్య నైపుణ్యమును చక్కగా వర్ణించారు.

    రిప్లయితొలగించండి
  15. మూర్తిగారు,
    మీకు అనేక ధన్యవాదాలు. నిజమే ,అన్య భాషల పదాలనుపయోగించి వ్రాయవలసి వచ్చినపుడు నేను వ్రాయటమే మానివేస్తాను. మాట్లాడటంలో కుదరక పోయిన ఈ విషయం పట్ల వ్రాతలలో అదీ,పూరణలలో తప్పకుండా శ్రద్ధ వహిస్తాను.
    దినము సరి అయిన పదమే అయినా వాడుకలో అది కొంచెం యిబ్బందిగా ఉంటుంది.తరుణమంటాను.

    దండక వనమందు దాశరథి యొసగె
    తాపసులకు రక్ష, దైత్యతతులు
    నాశమొందిరయ్య నారాయణునిచేత.
    మంచి తరుణమిద్ది మాననీయ!

    ధన్యవాదములు మూర్తిగారూ!

    రిప్లయితొలగించండి
  16. మందాకిని గారికి,రాజా రావు గారికి,మూర్తి గారికి,చంద్ర శేఖర్ గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  17. ఇల విభీషణ విభుడేలుచునుండగ
    మనుచునుండి రమల మానసులయి
    యసుర తతులునేని నా కాలమున గన
    తాపసులకు రక్ష దైత్య తతులు

    రిప్లయితొలగించండి
  18. అందరికీ అభినందనలు.
    ఈనాటి సమస్య కనుపించినంత సుసాధ్యము కాదు.
    శ్రీ శ్రీపతి గారిని తలచుకొనగానే ప్రసన్నులయ్యేరు.
    శ్రీమతి మందాకిని గారు రామ నారాయణుల శరణు పొందేరు.
    శ్రీ రాజా రావు గారు అందమైన కందమును అందించేరు.
    అలాగే టైపాటు అస్త్రమును ప్రయోగించేరు.
    శ్రీ చంద్రశేఖర్ గారు కొంగకి దొంగకి యతి మైత్రిని కలిపేరు.
    అలాగే మారుతిని నుతించేరు.
    తమ్ముడు చి. డా. నరసింహమూర్తి ఎవడో యొక త్రాగుబోతు యొక్క పోకడలో కూడా నిజాయితీని చూపించేరు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. అత్యవసరంగా గ్రామాంతరం వెళ్ళి ఇప్పుడే తిరిగి రావడం వల్ల ఈనాటి మీ పూరణలపై వెంటనే స్పందించలేక పోయాను. మన్నించండి! అయినా నా లోటును నేమాని వారూ, మిత్రులు తీరుస్తున్నారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
    *
    పండిత నేమాని వారూ,
    ఉత్సాహంతో ఉరకలెత్తించే ఛందంలో మీ మొదటి పూరణ శోభాయమానంగా ఉంది.
    కంసుని పూర్వజన్మయైన మారీచసుతుడు కాలనేమి కపటయతియై సంజీవిని తెస్తున్న హనుమంతునికి ఆటంకం కల్గించే ప్రయత్నాన్ని ప్రస్తావించిన మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉంది.
    ‘యథా రాజా తథా ప్రజ’ అన్నట్టు దైత్యప్రభువు, సత్త్వగుణుడు అయిన విభీషణుని పాలనలో అతని అనుచరులు తాపసులకు రక్షగా నిలిచారన్న మీ మూడవ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    కవిమిత్రుల పూరణల గుణదోష విచారణ చేసినందుకు ధన్యవాదాలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మనోజ్ఞమైన పూరణ మీది. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    ‘మంచి’ పూరణ నిచ్చారు. అభినందనలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    నిజమే సుమా! అసుర తాపసులూ ఉన్నారు. ఆటవెలది పాదాన్ని కందంలో ఇమిడ్చిన చేసిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
    గోలివారిపై సరదాగా వ్రాసినా ఆ పద్యం ప్రశస్తంగా ఉంది. ధన్యవాదాలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ముందుగా మిత్రుల పూరణలను ప్రశంసించినందుకు ధన్యవాదాలు.
    మీ ‘టైపాటు’ పూరణ చమత్కారంగా ఉండి మిత్రులకు ఒక క్రొత్తదారి చూపించింది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    రెండవపూరణలో పద్యపాదాన్ని అమర్చిన తీరు ప్రశంసనీయం.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ‘తాగినోడి నోట నిజం తన్నుకొని వస్తుందట!’... చమత్కారభరితమైన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    మిత్రుల పూరణలను పరామర్శించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. గురువు గారూ ,అన్నయ్య గారూ ధన్యవాదములు. అన్నయ్య గారు శ్రీ పండిత నేమాని వారు చెప్పి నట్లు యీ సమస్య పూరించడానికి కష్ట పడ్డాను. ముందు రెండు పాదములు సుళువుగా దొర్లి పోయాయి.విభీషణుడిని,ప్రహ్లాదుడిని,బలి చక్రవర్తిని తలుచు కొన్నాను,కాని రామభద్రుడే రక్ష అనుకొన్నాను. మిత్రులు చంద్రశేఖరుల వారు నిజంగానే సారాయి లేని ద్రాక్ష పానీయము రెండు సీసాలు పట్టుకొని అభిమాన పూర్వకముగా తెచ్చి యిచ్చారు. ఆ పానీయము ఒక గళాసు సేవించిన మాట నిజమే.తప్ప త్రాగడానికి నా కది సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  21. అబ్బే ! లాభం లేదు. పొద్దుట్నుం ఛీ కుస్తీ పట్టి కిట్టిం చినా గిట్టు బాటు కావడం లేదు.

    రిప్లయితొలగించండి
  22. చండామార్కుల బోధ

    వినుము హరిని గోరు మునులకు ప్రహ్లాద
    తామసులు కనుకను దండనమ్ము
    కనక కశిపు దైవ మని నమ్ము మనబోటి
    తాపసులకు రక్ష దైత్యతతులు

    రిప్లయితొలగించండి
  23. మూర్తి మిత్రమా మీ ' రోజు ' మీద మరింత వివరణ కావాలి నాకు.

    రిప్లయితొలగించండి
  24. మిస్సన్న గారూ,
    మీ చండామార్కుల వారి హితబోధ బాగుంది. అభినందనలు.
    నాకు తెలిసినంత వరకు ‘రోజ్’ ఉర్దూ/హిందీ పదం. మనది అజంత భాష కనుక ‘రోజు’ అయింది.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాధ పడకండి. నా పరిస్థితీ ‘డిటో’!

    రిప్లయితొలగించండి
  25. శ్రీపతిశాస్త్రిసోమవారం, జనవరి 09, 2012 7:48:00 AM

    గురువర్యులు శ్రీ పండిత నేమానిగారికి, శ్రీ శంకరయ్యగారికి, శ్రీహనుమచ్ఛాస్త్రిగారికి,శ్రీ నరసింహమూర్తి గారికి,కవిమిత్రులందరికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  26. మిస్సన్న గారూ రోజు కు గురువుగారు వివరణ యిచ్చారు కదా. రోజుచు అంటే నిట్టూరుస్తూ మీకు తెలిసినదే !

    రిప్లయితొలగించండి
  27. గురువుగారూ రోజు తెలుగు పదం కాదని ఈ రోజే తెలిసింది. ధన్యవాదాలు.
    మూర్తి మిత్రమా రోజుచూ అంటే తెలుసును. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  28. సుబ్బారావు గారి పూరణ ....
    పుడమి పాలించు ప్రభువులె నడవి నుండు
    తాపసులకు రక్ష , దైత్య తతులు
    రామ రావణ సంగ్రామ రంగ మందు
    నిహతు లయ్యిరి రావణ సహితు గాను

    రిప్లయితొలగించండి
  29. సుబ్బారావ్ గారూ,
    చక్కని భావంతో పూరణ చేసారు. అభినందనలు.
    కాని సమస్య పాదం ఆటవెలదిలో ఉంది. మీరు మిగిలిన పాదాలను తేటగీతిలో వ్రాసారు. నా సవరణ ....

    పుడమి నేలు నృపులె యడవిలో నుండెడి
    తాపసులకు రక్ష , దైత్య తతులు
    రామ రావణులకు రణమైన నందులో
    నిహతు లైరి రాజ సహితు లగుచు.

    రిప్లయితొలగించండి