9, జనవరి 2012, సోమవారం

సమస్యాపూరణం - 586 (విగ్రహములతో నిండెను)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
విగ్రహములతో నిండెను వీధు లెల్ల.

ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

23 కామెంట్‌లు:

  1. శ్రీపతిశాస్త్రిసోమవారం, జనవరి 09, 2012 7:42:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    గణచతుర్థి పండుగ శుభ గడియ నందు
    విగ్రహములతో నిండెను వీధు లెల్ల
    శక్తి కొలది పూజించిరి శరణువేడి
    దేశ క్షేమంబు గోరుచు నీశసుతుని

    రిప్లయితొలగించండి
  2. శ్రీపతి శాస్త్రి గారు,
    వేగంగా స్పందించి చక్కని పూరణ నిచ్చారు. బాగుంది. అభినందనలు.
    ‘గడియ + అందు’ అన్నప్పుడు యడాగమం వచ్చి ‘గడియయందు’ అవుతుంది. ‘దేశక్షేమంబు’ అన్నప్పుడు ‘శ’ గురువై గణదోషం. అక్కడ ‘దేశహితమును’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  3. మాయ కాలము గాకేమి మాన హీన
    విగ్రహములతో నిండెను వీధు లెల్ల
    పూజ లవమానముల్ పెక్కు పొందుచుండి
    కోరి కలహింప నభిమాన కోటి తతులు.

    రిప్లయితొలగించండి
  4. మిస్సన్న గారూ,
    ‘పూజలు, అవమానాలు’ పొందే విగ్రహాలు! ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
    *
    గణేశ, రాజకీయ నాయకుల విగ్రహాల ప్రస్తావన వచ్చింది. మిత్రులకు పూరణలకోసం ఇంక ఏం మిగిలినట్టు? :-)

    రిప్లయితొలగించండి
  5. జాతి పితనేని మరచెను జాతి నేడు
    నీతి బాహ్యులౌ నేతలనే భజించి
    గొర్రెలను బోలు వారలు కొలుచుచుండు
    విగ్రహములతో నిండెను వీధులెల్ల

    రిప్లయితొలగించండి
  6. దేశమందునయవినీతి నాశమొంద
    సాహసోపేతుడన్నాహజారె దీక్ష
    నందు గాంధేయవాదుల, గాంధి, నెహ్రు,
    విగ్రహములతో నిండెను వీధులెల్ల.

    రిప్లయితొలగించండి
  7. ప్రజల దుర్మార్గ చేష్టలు ప్రబలి పోగ
    వాటి నణగించ పుట్టెను వర గణేశు
    చవితి పండుగ రోజున జరుప పూజ
    విగ్రహము లతో నిండెను వీ ధు లెల్ల

    రిప్లయితొలగించండి
  8. నీతిబాహ్యులు జాతికిన్ నేత లయ్యి
    మితము లేకను సంపదల్ మ్రింగు కతన
    పేరు వడ్డది చాలక వీరి నీచ
    విగ్రహములతో నిండెను వీధు లెల్ల !

    రిప్లయితొలగించండి
  9. భుక్తి హెచ్చిన ప్రజ కేలొ శక్తి వోయె
    యంత్ర శకటము లిచ్చెనో మంత్ర ఫలము
    చూడ దేశమ్ము లన్నిట స్థూల కాయ
    విగ్రహములతో నిండెను వీధు లెల్ల !

    రిప్లయితొలగించండి
  10. కొన్ని రాజకీయక్రీడ కొలువుదీరె
    కొన్ని రాజకీయజ్వాల కూలిపడియె
    ప్రజలు మసలుట కష్టమై వచ్చి పోవు
    విగ్రహములతో నిండెను వీధు లెల్ల.

    రిప్లయితొలగించండి
  11. దేశ సేవను జేయుచు దేవలోక
    మేగు నమరుల ప్రతిమలు మెండు గలవె?
    బ్రతికి యున్న తనకొరకె ప్రాకులాడ
    విగ్రహములతో నిండెను వీధులెల్ల.

    రిప్లయితొలగించండి
  12. మస్త కమ్మును మిం చు నే పుస్త కమ్ము
    ----------------
    సకల శాస్త్ర సమన్విత సం యు తంబు
    అఖిల బుధ గణ సేవిత యాది శక్తి
    ధారణా శక్తి గలిగించు దైవ రూపి
    మస్త కమ్మును మించునే పుస్త కమ్ము ?

    రిప్లయితొలగించండి
  13. వెంకట రాజారావు . లక్కాకులసోమవారం, జనవరి 09, 2012 12:23:00 PM

    గ్రహము లాగ్రహించెను, దుష్ట గ్రహము లోలి
    కదలి వచ్చెను,జనుల నిగ్రహము సడలె,
    నాగ్రహము మీరి కలహించె నఖిల జగతి
    విగ్రహములతో నిండెను వీధు లెల్ల

    రిప్లయితొలగించండి
  14. లక్ష్మణ హనుమ సీతా సలక్షణముగ
    రాముడలరె చప్పరమందు రమ్యమైన
    విగ్రహములతో;; నిండెను వీధు లెల్ల
    భక్తజనములతోడను భవ్య నవమి
    నాడు శ్రీరామ కళ్యాణ వేడుకఁగన!

    రిప్లయితొలగించండి
  15. పండి తోత్తమ సంపద పగుల గొట్టి
    కోట్లు మ్రింగిన గ్రహముల కంచు ప్రతిమ
    నీతి బోధలు చేయుచు ప్రీతి మాలి
    విగ్రహములతో నిండెను వీధు లెల్ల

    రిప్లయితొలగించండి
  16. సత్య పథమున నడిచిన సాదుముర్తి
    ధర్మ సూక్ష్మమ్ము నెఱిగిన కర్మజీవి
    భరత జాతికి ప్రియమైన భవుడు గాంధి
    విగ్రహములతో నిండెను వీధు లెల్ల!!!

    రిప్లయితొలగించండి
  17. ఉత్తర ప్రదేశమ్మున నొక్క బిగిని,
    హెచ్చు మీరిన స్వోత్కర్ష నచ్చెరువుగ,
    'మాయవతి 'తనరూపున మలచి యుండు
    విగ్రహములతో నిండెను వీధులెల్ల.
    -------------

    రిప్లయితొలగించండి
  18. శ్రీపతిశాస్త్రిసోమవారం, జనవరి 09, 2012 9:51:00 PM

    గురువుగారూ ధన్యవాదములు. యిటీవల నాకు పద్యముపై పట్టు తప్పినది. వాగ్దేవి అనుగ్రహముతో అప్పుడప్పుడూ వ్రాయగలుగుతున్నాను. సరస్వతీ స్వరూపులైన మీవంటి గురువర్యుల సూచనలు సర్వదా శిరోదార్యములు.

    రిప్లయితొలగించండి
  19. పండిత నేమాని వారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘దీక్ష నందు’ అన్నది ‘దీక్ష యందు’ అని ఉండాలనుకుంటాను.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ మొదటి పూరణ ప్రశస్తంగా ఉంది.
    రెండవ పూరణ చమత్కారభరితమై అలరించింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. విగ్రహంబుల పుష్టియు వినగ కనగ
    నష్టి నైవేద్య మనియన్న నానుడి వలె
    పరమ సోమరి పోతులు పరగ తిరుగు
    విగ్రహములతో నిండెను వీధు లెల్ల.

    రిప్లయితొలగించండి
  21. శ్యామల రావు గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    పుస్తకప్రాశస్త్యాన్ని తెలిపిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మీరు పాత సమస్యలకు పూరణలను అక్కడే పోస్ట్ చేయండి. అది తప్పకుండా నా మెయిల్ కు కూడా వస్తుంది. నేను తప్పక స్పందిస్తాను. ఈ సమస్యాపూరణలను పిడియఫ్ లో ఇబుక్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు ఇక్కడి పూరణలు నా దృష్టికి రాక అందులో చోటు దక్కకపోయే అవకాశం ఉంది.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    రామకళ్యాణవిభోగాన్ని చక్కగా చిత్రించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    నాకైతే ఏ ఊరు, ఏ వీథికి వెళ్ళినా అంబేద్కర్, వైయస్సార్ విగ్రహాలే తప్ప గాంధీ విగ్రహాలు కన్పించడం లేదు.
    *
    కమనీయం గారూ,
    మాయావతీ విగ్రహాల ప్రస్తావన ఎవరు తెస్తారా అని ఎదురుచూసాను. మీనుండి చక్కని పూరణ రూపంలో వచ్చింది. బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చమత్కారభరితంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. వరప్రసాద్ గారి పూరణ ....

    కత్తితో గడగేరిన గట్టు, కులపు
    నేత కుళ్ళి చచ్చిన బెట్టు, నేడు విలువ
    లేని లెక్కకు మిక్కిలి లిఖిత శిలల
    విగ్రహములతో నిండెను వీధు లెల్ల.
    ( రౌడీలు చచ్చిన, కులపు నేతలు చచ్చిన విగ్రహములను పెట్టుటపై వ్రాసితిని,
    వాటికి విలువ లేకుండెను యన్నది నా భావము)

    రిప్లయితొలగించండి