శరణం పండిత మానసాపహరణం శశ్వద్యశఃకారణం సరసానందద వాగ్విలాస చరణం, శబ్దార్థ సంపూరణమ్ | చరదత్యద్భుత సత్కవీశ్వరగణం సాలంబనం ‘శంకరా భరణం’ నిత్యమహం స్మరామి విలసద్ వాగ్దివ్య సింహాసనమ్ ||

గురువారం 26 జనవరి 2012

సమస్యాపూరణం - 603 (గణతంత్ర మ్మనెడు మాట)

24 వ్యాఖ్యలు
కవిమిత్రులారా,

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
గణతంత్ర మ్మనెడు మాట కల్లగ మిగిలెన్.

24 వ్యాఖ్యలు:

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...

రణమున దెచ్చిన స్వేచ్చయె
గణ నాయకులకు మిగులగ కలుముల నిచ్చెన్
గుణవంతులు తిన శూన్యము
గణతంత్ర మ్మనెడు మాట కల్లగ మిగిలెన్.

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

రణ తంత్రమ్ములు పెరిగెను -
గణనీయముగ నవినీతి, ’స్కాము’లు పెరిగెన్ -
ఋణ తంత్రమ్ములె మిగిలెను -
గణతంత్ర మ్మనెడు మాట కల్లగ మిగిలెన్!

Pandita Nemani చెప్పారు...

తృణభుక్కులు, స్వార్ధపరులు,
గుణహీనులు నేతలగుట గుండియలోనే
వ్రణమయ్యె భరతమాతకు
గణతంత్రమ్మనెడు మాట కల్లగ మిగిలెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

గణ నాయకు లంత కలసి
రణ రంగమ్ము లనడుమ రగులుచు నుండన్ !
గణ నీయముగ మ్రింగుచు
గణ తం త్రమ్మనెడి మాట కల్లగ మిగిలెన్ !

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

ప్రణతి ప్రణతి శ్రీ భారత
గణ తంత్రమ! నీకు నేడు కరములు మోడ్తున్
ఘనమెరుగని యల్పులకీ
గణతంత్రమ్మనెడు మాట కల్లగ మిగిలెన్

గన్నవరపు నరసింహ మూర్తి చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
గన్నవరపు నరసింహ మూర్తి చెప్పారు...

గణనీయుల త్యాగములన్
గుణహీనులు ప్రభువు లయ్యి కొల్లగొనంగన్
సణుగులె దక్కెను జనులకు
గణతంత్రమ్మనెడు మాట కల్లగ మిగిలెన్

గన్నవరపు నరసింహ మూర్తి చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
మందాకిని చెప్పారు...

మణిపూసలయిన భారతి
గుణపూర్ణులగు కొమరుండ్రు గొప్పగ నాడా
రణమున గెల్చియును నదే
గణతంత్రమ్మనెడు మాట కల్లగ మిగిలెన్.

కొమరుడు కు బహువచనము కొమరుండ్రు అవుతుందని అనుకుంటున్నాను.
తప్పైతే తెలుపగలరు.
మూర్తిగారు, మీ రెండవ పూరణ రెండవపాదము కొంచెము పరిశీలించగలరు.

subbarao చెప్పారు...

రణములు సేసిరి పెద్దలు
గణ తంత్రము దెచ్చు కొఱకు గణ నీ యముగా
గుణ హీన నేత లుండుట
గణ తంత్రమ్మ నెడు మాట కల్లగ నిలిచెన్ .

గన్నవరపు నరసింహ మూర్తి చెప్పారు...

మందాకిని గారూ ధన్యవాదములు. మీ పూరణ చాలా బాగుంది. పద్యము వ్రాసి మార్పు చేయడములో యతి దెబ్బ తింది పాపం. సవరించాను

గుణ కర్మ విభాగమ్ముల
గణించెదరు కులము మతము గడుసరు లిపుడున్
పణముల నిడి కొన పదవులు !
గణ తంత్రమ్మనెడు మాట కల్లగ మిగిలెన్ !!

డి.నిరంజన్ కుమార్ చెప్పారు...

గుణహీనుల నేతృత్వం
బణగార్చగ దేశప్రజల ఆశలసౌధం
బణువణువున దోపిడియై
గణతంత్రమ్మనెడి మాట కల్లగ మిగిలెన్

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

ఫణముగజేసిరి ప్రాణము
లణగారినధైర్యసాహసావేశంబుల్
ఝణఝణమని పొంగగ "ని
ర్గణతంత్ర"మ్మనెడుమాట కల్లగ మిగిలెన్.

హరి చెప్పారు...

అణగారు ప్రజలు వోట్లను
గుణహీనుల కమ్ముదు రిట కూటికి బరువై
గణపతు లయ్యిరి ఖలులే
గణతంత్ర మ్మనెడు మాట కల్లగ మిగిలెన్.

మిస్సన్న చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
డి.నిరంజన్ కుమార్ చెప్పారు...

గణతంత్ర శుభాకాంక్షలు
వ్రణముననిడు కారమువలె బాధను బెంచెన్
గుణహీన నేతల వలన
గణతంత్రమ్మనుమాట కల్లగ మిగిలెన్

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

గుణవంతుల పోరాటము
గణతంత్రపు ఫలము కూర్చి గౌరవమొసగెన్
గుణహీనుల యవినీతితొ
గణతంత్ర మ్మనెడు మాట కల్లగ మిగిలెన్

శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ చెప్పారు...

గణముల నేతగ గజముఖు
ప్రణవాకారుండు గిరిజ ప్రకటింపంగన్
సణుగుతు షణ్ముఖుడనుకొనె
గణతంత్రం బనెడుమాట కల్లగ మిగిలెన్

Pandita Nemani చెప్పారు...

అయ్యా! శ్రీ మిస్సన్న గారూ!
మీ పద్యములో 2వ పాదములో ర్గుణ కి కృత తో యతి వేసారు. ఇది మైత్రి కుదురదు. సవరించండి.

మిస్సన్న చెప్పారు...

నేమాని పండితార్యా సూచనకు ధన్యవాదాలు.
ఋ, రు లకు యతి వేయవచ్చుననుకొని పొరబడ్డాను.
ఇలా సవరించాను.

రణ తంత్రము కౌరవ దు-
ర్గుణయంత్రము దుష్ట కర్ణ కుటిలాంగమ్ము-
న్నణచును కౌంతేయుల కురు-
గణతంత్ర మ్మనెడు మాట కల్లగ మిగిలెన్.

కంది శంకరయ్య చెప్పారు...

సరసమైన పూరణ లిచ్చిన
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
డా. ఆచార్య ఫణీంద్ర గారికి,
పండిత నేమాని వారికి,
రాజేశ్వరి అక్కయ్యకు (‘నడుమను, గణనీయమ్ముగ’ అంటే గణదోషం తొలగుతుంది).
లక్కాకుల వెంకట రాజారావు గారికి,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
మందాకిని గారికి,
సుబ్బారావు గారికి,
డి. నిరంజన్ కుమార్ గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
హరి గారికి (బహుకాల దర్శనం!),
శ్రీపతి శాస్త్రి గారికి,
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారికి,
మిస్సన్న గారికి,
అభినందనలు. ధన్యవాదాలు.

వసంత కిశోర్ చెప్పారు...

అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

ఎముకల కాశ పడి , శునకాల నెన్నుకుంటే జరిగేదదే గదా !

01)
____________________________

కనకపు సింహాసనమున
శునకము నెక్కించ దగునె ? - శుభములు గలుగున్ ?
తన తప్పు గాదు , గావున
గణతంత్ర మ్మనెడు మాట - కల్లగ మిగిలెన్ !
____________________________

కంది శంకరయ్య చెప్పారు...

వసంత కిశోర్ గారూ,
పేరడీ వంటి చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.

కమనీయం చెప్పారు...

గుణహీనులు నాయకులై
గణనమె లక్ష్యముగ దేశ కళ్యాణమ్మున్
బణముగ బెట్టిరి ,అకటా!
గణతంత్రమ్మనెడిమాట కల్లగ మిగిలెన్ .
------------

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి