28, జనవరి 2012, శనివారం

సమస్యాపూరణం - 605 (వాణిని తిరస్కరించెడివాఁడె)


కవిమిత్రులారా,
అందరికీ ‘శ్రీపంచమి’ పర్వదిన శుభాకాంక్షలు!
ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది
వాణిని తిరస్కరించెడివాఁడె బుధుఁడు.

28 కామెంట్‌లు:

  1. కావ్య వాణిని కర్నాట కీచకులకు
    అమ్మ బోననె పోతన్న యాకటికిని
    పొట్ట నిండుట కొరకిటు పొరుగు కీయ
    వాణిని, తిరస్కరించెడివాఁడె బుధుఁడు.

    రిప్లయితొలగించండి
  2. హనుమచ్చాస్త్రి గారూ అద్భుతమైన విరుపు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. శకుని పల్కె సుయోధన చాలు చాలు
    రాయ బారము నెపమున రచ్చ జేయు
    పాండ వులకు మేల్జేయు గో పాలు మాయ
    వాణిని తిరస్కరించెడివాఁడె బుధుఁడు

    రిప్లయితొలగించండి
  4. కళలకుందల్లి బుధలోక కల్పవల్లి
    వాణి గీర్వాణి జ్ఞానసంపద్ప్రదాయి
    యనుచు భక్తితో గొలుచుచు నటులె నశుభ
    వాణిని దిరస్కరించెడివాడు బుధుడు

    రిప్లయితొలగించండి
  5. "దైవమే లేఁడు, నాస్తికత్వమ్మె మేలు,
    వైదికాచారాములు వద్దు, పాపపుణ్య
    చింతనలు వీడు" మనుచును చెప్పు మూర్ఖ
    వాణిని తిరస్కరించెడివాఁడె బుధుఁడు.

    రిప్లయితొలగించండి
  6. పండితుడ నంచు పలు ప్రగల్బాలు బలికి
    కడు నహంకారమున సాటి కవుల బుధుల
    తూల నాడక తనలోని 'దుష్ట చిత్త
    వాణిని' తిరస్కరించెడి వాడె బుధుడు

    రిప్లయితొలగించండి
  7. మిస్సన్న గారూ! ధన్యవాదములు.
    మాయ, అశుభ, మూర్ఖ వాణి (వాక్కు) లను తిరస్క రించ వలెనని చెప్పిన మీకు, శ్రీ నేమాని వారికీ శంకరార్యులకు.. దుష్ట చిత్త వాణిని తిరస్క రించమనిన లక్కకుల వారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. నా పూరణ లోని మొదటి పాదమును సరి చేస్తూ ...

    కావ్య వాణిని కర్నాట కాధములకు
    అమ్మ బోననె పోతన్న యాకటికిని
    పొట్ట నిండుట కొరకిటు పొరుగు కీయ
    వాణిని, తిరస్కరించెడివాఁడె బుధుఁడు.

    రిప్లయితొలగించండి
  9. పెళ్లిచూపులకొచ్చిన మళ్ళసూరి
    నన్నడగ పుసుక్కున నంటిఁ తిన్నగాను
    టెక్కులాఁడియా జగడగంటి పొరుగింటి
    వాణిని తిరస్కరించెడివాఁడె బుధుఁడు!

    రిప్లయితొలగించండి
  10. వెలుగు బాటలో నడిపించు తెలుగు వాణి
    మధుర రసముల నొలికించు మధుర వాణి
    ముదముఁ గొలుచుచు పరభాష వదలి, కపట
    వాణిని దిరస్కరించెడి వాఁడె బుధుడు

    రిప్లయితొలగించండి
  11. గురువులు శ్రీ కందిశంకరయ్య గారికి, శ్రీ పండిత నేమాని గారికి, శ్రీ చింతారామకృష్ణరావుగారికి, శ్రీ లక్కకుల రాజారావుగారికి, శ్రీ శ్యామలీయం గారికి మరియు యితర కవిమిత్రులకు "శ్రీపంచమి" పర్వదిన శుభాకాంక్షలు. వేదమాతయైన శ్రీశారదాంబ కరుణాకటాక్షవీక్షణములు ఎల్లవేళలా మనకందరికి లభించాలని ప్రార్థిస్తున్నాను.

    సర్వభౌతిక బంధముల్ జారవిడచి
    ముక్తికాంతను చేబట్ట బోవునపుడు
    తిరిగి ప్రాపంచికములసంధించెడు"శుక
    వాణి"ని తిరస్కరించెడివాడె బుధుడు.

    శుకవాణి = స్త్రీ

    రిప్లయితొలగించండి
  12. అల్లనల్లన మెల్లగ పిల్లగాలి
    మరిగి మాపున పోవ నత్తరలదుకొని
    పెల్లుకొను వయసుడిగిన పిదప మేజు
    వాణిని తిరస్కరించెడివాఁడె బుధుఁడు!

    రిప్లయితొలగించండి
  13. "తమ్ముడా! బుధుడా! నిన్ను తమ్మి చూలి
    బావ పిలిచె రమ్మని" యని వాణి పిలువ
    తండ్రి పైగల ద్వేషము తలచి అక్క
    వాణిని తిరస్కరించెడివాఁడె బుధుఁడు!!


    (వాణి భర్త > బ్రహ్మ; బ్రహ్మ తండ్రి > విష్ణువు; విష్ణువు భార్య > లక్ష్మి; లక్ష్మి సోదరుడు > చంద్రుడు; చంద్రుని సుతుడు > బుధుడు)

    రిప్లయితొలగించండి
  14. అధమ లోకంబు పాలగు నవని యందు
    వాణిని తిరస్క రించె డి వాడె , బుధుడు
    శిష్ట జన సేవితుండయి సేద దేరు
    మంచి చెడ్డల ఫల మిదె మహిని యందు .

    రిప్లయితొలగించండి
  15. వరప్రసాద్ గారి పూరణ ....

    బాలుని బలి యివ్వగ జిక్కు భావియందు
    గుప్తనిధులు, కోడిని కోయ కురియు సిరులు
    రాణిని ధనము సుఖమిచ్చు రత్నమన్న (?)
    వాణిని తిరస్కరించెడివాఁడె బుధుఁడు.

    రిప్లయితొలగించండి
  16. తీయ తీయని పల్కుల మాయజేసి
    దుష్ట మగు నలవాటుల నిష్టపరచి
    సంపదను దోచుకొనెడి యసత్య మిత్ర
    వాణిని తిరస్కరించెడి వాడె బుధుడు.

    రిప్లయితొలగించండి
  17. బడుగు బతుకుల నిక బాగు పరతు మనుచు
    నొకడు లక్షనె,కోటియంచొకడు పలికె
    కొలువు లిప్పింతుమను నాయకుల ప్రచార
    వాణి ని తిరస్కరించెడి వాడె బుధుడు

    పల్కుల తల్లి దృష్టి పయిబడ్డ యదృష్టము దక్కి బ్లాగులో
    కుల్కుల తెల్గుపద్యములగూర్చుచుతెల్గులలో వినోదముల్
    చిల్కుచు శంకరాభరణ చిద్వనమందు రచించు మిత్రులం
    బల్కి వసంతపంచమి శుభమ్ములు గోరెద నెమ్మనమ్మునన్

    రిప్లయితొలగించండి
  18. వామ లోచని పలుకులు వినగ నెంచి
    దారి తప్పుట తధ్యము గరిత మఱచి
    మోహ మందున ముంచెడి ముదిత మాయ
    వాణిని తిరస్క రించెడి వాడె బుధుడు . !
    ---------------------------------------------------
    భగిని బంధించె కంసుడు పగను రగిలి
    దైవ సంకల్ప మేరీతి తప్పు ననుచు
    విధిని తప్పించ నేరికి సాధి తమ్ము
    వాణిని తిరస్క రించెడి వాడు బుధుడు !

    రిప్లయితొలగించండి
  19. సిరికి కోడలమ్మ విరించి విరుల రెమ్మ
    బుద్ధి జీవుల పెద్దమ్మ విద్దెలమ్మ
    పాద యుగ్మమ్ము వీడని వాడె,పరుష
    వాణిని తిరస్కరించెడివాఁడె బుధుఁడు.

    రిప్లయితొలగించండి
  20. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మిస్సన్న గారు ప్రశంసించినట్లు ‘అద్భుతమైన విరుపు’తో చక్కని పూరణ. చెప్పారు. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మాయ మాటలను తిరస్కరింపమన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    అశుభవాణిని తిరస్కరింపమన్న మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ పూరణ లోని దుష్టవాణిని తిరస్కరించే భావం చక్కగా ఉంది. అభినందనలు.
    మీ రెండవ పూరణ ఇంకా బాగుంది.
    మీ వసంతపంచమి శుభాకాంక్షల పద్యం బాగుంది. ‘చిద్వనమందు రచించు’ కంటే ‘చరించు’ అంటే బాగుంటుందేమో?
    ధన్యవాదాలు.
    *
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    జగడాల పొరుగింటి వాణిని తిరస్కరించడం, ‘వృద్ధనారీ పతివ్రతా’ అన్నట్టు వయసుడిగాక మేజువాణిని నిరాసక్తత చూపడం మంచి పనులే. చమత్కారమైన పూరణలు. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    ‘శుకవాణి’ని వినిపించిన మీ పూరణ ఆధ్యాత్మిక భావంతో అలరించింది. బాగుంది. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    ఏం చుట్టఱికం కలిపారండీ! చక్కని చమత్కారం శోభిల్లే పూరణ. బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీరు నా సెల్లుకు ఇంగ్లీషులో మెసేజ్ గా పంపిన దానిని తెలుగులో నేను తప్పుగా వ్రాసానా? మూడవ పాదం అర్థం కావడం లేదు.
    *
    ‘కమనీయం’ గారూ,
    దుష్టమిత్రుని మాటను కాదన్న మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పద్యాలు బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పద్యం రెండు పాదాల్లోను యతి తప్పింది. నా సవరణ ...
    వనజ లోచని పలుకులు వినగ నెంచి
    దారి తప్పుట తధ్యము దార మఱచి.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. గీతా వాణి కర్మ బోధనలు గైకొని
    హృదయ వాణి వాక్కుల మదిని నెంచి
    గురు వాణి భక్తి మార్గమును బట్టి, గత
    వాణి ని తిరస్కరించెడి వాడె బుధుడు !!


    జిలేబి.

    రిప్లయితొలగించండి
  22. మిత్రుల పూరణ లన్నీ మధురముగా నున్నాయి. శ్రీ మంద పీతాంబర్ గారి పూరణ ఎందుకో చెప్పలేను గాని ఆకర్షణీయముగా నుంది. మిత్రులు చంద్రశేఖరుల వారు ఓ పెళ్ళి చెడగొట్టారు. భార్యా భర్తలిద్దఱూ అమాయకంగా ఉంటే వాళ్ళెలా బ్రతక గలరు ? ఒకరికైనా జగడ మాడటము రావాలి కదా ?

    రిప్లయితొలగించండి
  23. ఐపోయింది .రెండు మెట్లెక్కి మూడు మెట్లు దిగుతున్నాను.
    " వనజ , దార " వ్రాయ బోయి కొత్త పదాలు రాస్తే బాగుం టుం దనుకొని తప్పులు రాసాను. మొన్న కుడా ఒకసారి రైటు రాసి కొట్టేసి తప్పు రాసాను.
    " ఎక్కడా , బాగు పడే లక్షణాలు ప్చ్ ! " ? ? ? ?

    రిప్లయితొలగించండి
  24. ఏం చేయమంటారు మూర్తి మిత్రమా!
    బొడ్డులోన కత్తి నడ్డుపెట్టి గదిమె
    సూరి “కక్కు నిజము!” చూడ ముందు
    నుయ్యివెనుక పెద్ద గొయ్యి, నిజముగనా
    వాణిని వలదనెడి వాఁడె బుధుఁడు!

    రిప్లయితొలగించండి
  25. గురువు గారికి ధన్యవాధములు
    గురువుగారు మీరు తప్పుగా వ్రాయలేదు, నా భావము మూఢాచారములను తిరస్కరించెడివాఁడె బుధుఁడు
    బాలుని బలి యివ్వగ జిక్కు భావియందు
    గుప్తనిధులు, కోడిని కోయ కురియు సిరులు
    రాణిని, ధనము, సుఖమిచ్చు రత్నమన్న
    వాణిని తిరస్కరించెడివాఁడె బుధుఁడు.
    మరియొక పద్యము టి వీ లో ప్రతినిత్యము ఈ జాతిరత్నమును ధరించినా మీకు సకల శుభములు కలుగును యని ప్రకటించును
    రాయికాదిది యీజాతిరత్నమిచ్చె
    మాకు ధనశాంతి సుఖములు, మీకు దొరకు
    కనకపు సిరులు దప్పక గొనుము యనెడి
    వాణిని తిరస్కరించెడి వాడె బుధుడు

    రిప్లయితొలగించండి