14, జనవరి 2012, శనివారం

మకర సంక్రమణ లక్ష్మి!

కదలి రావమ్మ! మకర సంక్రమణ లక్ష్మి!

వచ్చె’ మకర సంక్రాంతి ‘ నీవంతు వచ్చె
చూడ రావమ్మ పుట్టింటి వాడ వాడ
నేల తల్లి నోదార్చి కన్నీరు తుడువ
కదలి రావమ్మ మకర సంక్రమణ లక్ష్మి !


ఋతువు లేమాయె? యే ‘మాయ’ గతులు మార్చె ?
వర్ష ఋతువున వానలు పడుట లేదు
నేలలో నీరు మృగ్యమై చేలు , ప్రాణు
లెండి యగచాట్ల పాల్బడు చుండె గనుము


పల్లె వీడి ప్రజలు బ్రతుకు భారము మ్రోయ
పట్టణాల బాట పట్టిరి, మరి
పల్లె పట్లు వీడి బయలెల్లె సంక్రాంతి
వచ్చి చూడు నీదు వైభవమ్ము


పిలిచి పిలిచి పెట్టు పిండి వంటల యూసు
లేవి? యెటకు బోయె నీవి గుణము ?
ఆకసమ్ము నెక్కె నవనికి నందవు
ధరలు, తమకు లేని ధర్మ మేల ?


పిలుపు లేకనె పెద్దలు, పేరటాండ్రు
అదిగొ వచ్చిరీ యవనికి, ‘ నిదిగొ! మీకు
ఆశ దీరదు, మీబిడ్డ లరువు లంది
కరవు దీర బెట్టంగ లేరరుగు డింక ‘

రచన
 లక్కాకుల వెంకట రాజారావు

3 కామెంట్‌లు:

  1. సగటు మనుషుల సంక్రాంతి నగవు లేమి
    నెదలు బరువెక్కు రీతిని పదపదమున
    నింపి పల్కిరి పద్యముల్ నేస్తమ మన
    నీతి మాలిన నేతల పాతకమిది.

    రిప్లయితొలగించండి
  2. పూజ్యనీయులైన పెద్దలకు గురువులకు మిత్రులందఱికీ సంక్రాంతి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  3. కాల గతులవి మారెను గాయ మాయె
    పండుగన్నది లేవక పండు కొనెను
    చదువ మీ పద్య ముల ఒళ్ళు జలదరించి
    లాగు చున్నది గుండియ రావు గారు.

    రిప్లయితొలగించండి