11, ఏప్రిల్ 2012, బుధవారం

కళ్యాణ రాఘవము - 10

కళ్యాణ రాఘవము - 10

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు


తే.గీ.
"వినయసుధ లొల్కు కనులతో, వెన్నెల వెదఁ
జల్లు లేనవ్వుతోఁ బూర్ణచంద్రునట్లు
వెలుఁగుమో మర్కబింబమై విల్లువిఱుచు
రాఘవుని మూర్తి హృదయదర్పణము విడదు. (135)


తే.గీ.
రాముఁ డొకఁడె కాఁడు, గుణాభిరాము లతని
తమ్ముఁగుఱ్ఱలు ముగురును దత్సదృశులె
కలిగిరే నిట్టి కొడుకులె కలుగవలయు
నహహ! దశరథుఁ డెట్టి పుణ్యంపుగనియొ. (136)


శా.
ఆ గాధేయుఁ డలంతియే! మును వసిష్ఠారాతియై పంతముం
దాఁ గావించినయట్లు బ్రహ్మఋషియై, తన్మాత్ర నిల్పేది తత్
ప్రాగల్భ్యంబునయందు లోక మెఱుఁగం బాల్ పంచుకొన్నట్లుగా
సాగించెన్ రఘురామలక్ష్మణుల కాచార్యత్వ ముత్సాహియై. (137)


ఉ.
ఆతని నేర్పదెంతయొ స్వయజ్ఞము గాచు నెపమ్ము వెట్టి, తా
నీతెఱఁ గా కుమారకుల నిచ్చటికిం గొనితెచ్చి, విశ్వవి
ఖ్యాతులఁ జేసె; నౌరవుర! కాఁగల లోకహితంబు పొంటె సం
ప్రీతిఁ గృతప్రయత్నులయి పేర్మి వహింత్రు గదా మహాత్మకు. (138)


ఆ.వె.
ప్రమద మలర బంధుపరివారసహితుఁడై
తరలి వచ్చినాఁడు దశరథుండు
నాత్మజులును దాను నర్హసత్క్రియలతో
మసలువున్నవారు మనపురమున." (139)


కం.
అని, వేడ్కచూడ నప్పుడె
చనుదెంచిన తమ్ముఁ డౌ కుశధ్వజుతోడన్
జనకుఁ డనుచుండ దశరథ
జనపాలునిఁ దోడితెచ్చి సచివవరుండున్. (140)


ఉ.
జానగు ముత్తెఁపుం గొడుగుచాయల నిండుగఁ బండువాఱు నె
మ్మే నెలప్రాయమున్ మరల మేకొనినట్టు లెలర్ప వీయపుం
బూనిక నేగుఁదెంచె రఘుపుంగవమౌళుల కన్నతండ్రి స
న్మానము మీఱ మౌనివరమంత్రిహితోన్నతబంధుకోటితోన్. (141)


ఆ.వె.
అల వసిష్ఠగాధిజులు స్నేహమున జగా
దివ్విటీలపోల్కిఁ దేజరిల్లు
సన్నివేశ మద్ది జాతిరత్నమ్ములు
పసిఁడిగూళ్లఁ బొదుగు పలుకులవ్వి. (142)


కం.
తఱి యొక్కింత పరస్పర
పరిచయకుశలానుయోగపరిచారములన్
జరుగ దశరథుఁడుఁ గౌశికుఁ
డరుంధతిపతిం గనుఁగొనునంత నతండున్. (143)


కం.
దరహాసభాసమానా
ధరుఁడై యిటు పల్కు "జనకధాత్రీశ! మహా
పురుషుఁడు వైవస్వతమను
వరసుతుఁ డిక్ష్వాకు వనఁగఁ బ్రథితుఁడు జగతిన్. (144)


తే.గీ.
తద్విభునినాఁడె మాయయోధ్యాపురంబు
రాజధానీసమాఖ్య గౌరవము గాంచెఁ
దన్మహావంశమందు మాంధాత వొడమి
కృతయుగ మలంకరించె మౌక్తికముపోల్కి. (145)


తే.గీ.
ఎవని ధర్మరాజ్యమునఁ గాలిడగరాదొ
చెడునడక గన్న తనకన్నకొడుకునకును
జలధు లెవని పే ర్మోయునో సాగరంబు
లన సగరుఁ డాతఁ డీకులమ్ముననె పుట్టె. (146)


తే.గీ.
అల భగీరథుఁ డీ యన్వయమునఁ బొడమి
కపిలకోపాగ్ని భస్మమైన పితృవర్గ
ముద్ధరించెను జిరతపస్సిద్ధి నతని
కాలిజాడలఁ దత్కీర్తి గాయని యయి
పాఱుచున్నది గంగాకుమారి నేడు. (147)


మ.
వృషభంబైన మహేంద్రు నెక్కి యమరుల్ వేనోళ్ళఁ గీర్తింప మున్
వృషపర్వుం గెడపెన్ గకుత్థ్సుఁ డనఁగా విఖ్యాతుఁడై, వీతకి
ల్బిష మీ వంశమునం బురంజయుఁడు తత్ప్రీతిన్ నిజార్ధాసనా
ధ్యుషితుం జేసెను స్వర్గరా జతని శౌర్యోదంత మగ్గింపుచున్. (148)


ఉ.
ఎవ్వఁడు లీలమై గెలిచె నెల్లదెసల్ చిననాఁడె, యెల్ల సొ
మ్మెవ్వఁ డొసంగె దక్షిణగ నేర్పడ విశ్వజిదధ్వరంబులో
నెవ్వని బొక్కసానఁ గురియించెఁ గుబేరుఁడు పైడివాన ము
న్నవ్విభుఁ డౌ రఘుండు తరళాయితుఁ డీ కులరత్నమాలకున్. (149)


తే.గీ.
అతని సంతాన మజుఁడు దిగ్వ్యాప్తకీర్తి
యీ మహారాజు దశరథుఁ డా మహీశు
నందనుఁడు బృందారకానందనుండు
దైత్యసంహారి బహువిధాధ్వరవిహారి. (150)


తే.గీ.
కలిగి రితనికి రామలక్ష్మణు లనంగ
భరతశత్రుఘ్ను లనఁగ నల్వురు కుమారు
లందు మా రామచంద్రు నర్ధాంగి సీత
యమరుఁగద వీరపత్నినా నది యటుండ. (151)


ఉ.
మారునిఁబోలు లక్ష్మణకుమారునకున్ భవదాత్మజాతయౌ
చారుతరాంగి నూర్మిళ నొసంగుట యెల్లర యిష్ట" మంచుఁ దా
నూరకయుండె; నంతట మహోత్సకుఁడై జనకుండు వల్కె నీ
తీరుగ "మౌనివర్య! వినుతింపఁదగున్ భవదీయవాక్యముల్. (152)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి