మంగళవారం 10 ఎప్రిల్ 2012

సమస్యాపూరణం - 673 (పాపములకు మూలము లగు)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

పాపములకు మూలములగుఁ బశుపతి పూజల్.

ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

30 వ్యాఖ్యలు:

Pandita Nemani చెప్పారు...

కోపమ్ములు, తాపమ్ములు
పాపములకు మూలములగు, బశుపతి పూజల్
పాపహరములున్ భవ పరి
తాపఘ్నములగుచు మోక్షధామము జేర్చున్

Pandita Nemani చెప్పారు...

కుమతుల దుర్బోధనలే
భ్రమలకు దావిచ్చు నవియె పాపములకు మూ
లములగు, బశుపతి పూజల్
శమించు పాపములనెల్ల, సత్ఫలములిడున్

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...

పండిత నేమాని వారికి నమస్కారములు.రెందు కందములను అందముగా చెప్పినారు.

లక్ష్మీదేవి చెప్పారు...

పాపపు చింతనలెల్లెడ
పాపములకు మూలములగుఁ; బశుపతి పూజల్
బాపునటయట్టి చింతన;
దీపము వలె జ్ఞానమునిడు; దిక్కై నిలుచున్.

హ.వేం.స.నా.మూర్తి చెప్పారు...

ప్రాపంచిక విషయములే
పాపములకు మూలములగు, పశుపతి పూజల్,
శ్రీపతి సంస్మరణంబులు
పాపంబులదొలగ జేసి భక్తుల గాచున్.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

శ్రీపతి! కోపము విడుచుము,
పాపములకు మూలములగుఁ, బశుపతి పూజల్
జేపట్టుము చేకూరును
ఆ పావనమూర్తి దయయు నానందములున్

Pandita Nemani చెప్పారు...

శ్రీ హనుమఛ్ఛాస్త్రిగారి ప్రశంసలకు ధన్యవాదములు.

subbarao చెప్పారు...

కోపము ,గర్వము లీ ర్ష్యలు
పాపములకు మూలము లగు ,బశుపతి పూజల్
బాపముల బార ద్రోలును
బాపములను జేయకునికి ప్రధమము మనకున్ .

Pandita Nemani చెప్పారు...

పశుపతి పూజలు పాపహరము లవి
యేల పాపములకు మూలములగు?
పశుపతి పూజల్ కృపావర్షమును గూర్చు
పరమార్థ ముఖ్య సంపదల నిచ్చు
పశుపతి పూజలు భవభయహరములు
వాంఛితాఖిల వైభవప్రదములు
పశుపతి పూజలు భక్తివర్ధకములు
నమరతతులకు జయప్రదములు
బ్రహ్మ విష్ణ్వింద్ర ముఖ్యులు, భక్త తతులు
మునివరులు జేయు పశుపతి పూజ లఖిల
భువన రక్షాకరము లాపూజలెపుడు
సలుపుచుందును మానస సారసమున

Pandita Nemani చెప్పారు...

మా పద్యములోని తేటగీతి 3వ పాదములో టైపు తప్పు దొరలినది ఆ పాదమును ఇలా చదువుకొందాము:

భువన రక్షాకరమ్ము లాపూజలెపుడు

వరప్రసాదు చెప్పారు...

గురువర్యులందరికి నమస్కారములతో వరప్రసాదు
(పశుపతి = రాజశేఖరుడను అర్థములో)
నేలను దున్నుట రైతుకు
పాపములకు మూలములగుఁ, బశుపతి పూజల్
మేలగు ముముక్షువులకున్
పాపపు చింతనలు లేని పాడు "జగతి"నన్|

వరప్రసాదు చెప్పారు...

శ్రీ శ్రీ పండిత నేమానివారికి నమస్కారములతో
మీ సీసపద్యము బహుచక్కగనున్నది. మీరు సెలవిచ్చినట్లు "పశుపతి పూజలు భవభయహరములు"
కానీ నేడు రైతులకు పంటలు పండించుటకంటే, రాజకీయనాయకులకు ప్రదక్షిణలు జేయుట మంచిదని నా పూరణ.
భవదీయుడు
వరప్రసాదు

Pandita Nemani చెప్పారు...

శ్రీ సరస్వత్యై నమః:
మిత్రులారా!
(1) పశుపతి అనే శబ్దమునకు అర్థమును వివరించుచున్నాను. పాశములచే బంధింపబడునది పశువు. ఆవు మొదలైనవే కాదు, బ్రహ్మ నుండి చీమ వరకు గల జంతువులన్నియు (మానవులుకూడా) అనేక బంధములచే బంధింపబడేవే -- అందుఛే జీవులన్నియు పశువులే. పశువులన్నిటికి నాథుడైనవాడు పశుపతి (ఈశ్వరుడు).

(2)రాజశేఖరుడు అనే పదమునకు అర్థమును విచారిస్తే - 2 విధములుగ చెప్పుకొనవచ్చును. (1) రాజులలో శిరోభూషణమైన వాడు (గొప్ప రాజు); (2) రాజు అనగా చంద్రుడు శిరస్సున గలవాడు - అనగా ఈశ్వరుడు.

స్వస్తి.

శ్యామలీయం చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
శ్యామలీయం చెప్పారు...

కం. తాపఘ్నంబులు నానా
శాపోపశమనము లాత్మ సంతోషణముల్
రూపారగ జన్మాంతర
పాపములకు మూలములగుఁ బశుపతి పూజల్.

వరప్రసాదు చెప్పారు...

శ్రీ శ్రీ పండిత నేమానివారికి నమస్కారములతో
గురువు గారు మీ వివరణలకు ధన్యవాదములు. నా పూరణ డా| రాజశేఖర రెడ్డి భజనపరులపై మరియు రైతుల కష్టములపైన సార్, మఱియొక పద్యమును వ్రాయుటకు ప్రయత్నము జేసెదను.
భవదీయుడు
వరప్రసాదు

హ.వేం.స.నా.మూర్తి చెప్పారు...

సీతను అపహరించి తెచ్చిన రావణునితో విభీషణుడు ఇలా అంటున్నాడు-
భూపా! స్త్రీహరణంబులు
పాపములకు మూలములగు, పశుపతిపూజల్
నీపరమనైష్టికత్వము
లేపాటివి, నిన్నుగూల్చు టిది సత్యమనెన్.

Pandita Nemani చెప్పారు...

శ్రీ సరస్వత్యై నమః:
మిత్రులారా!
శ్రీ శంకరాచార్య విరచితమైన లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రమునకు నీ మధ్యనే నేను సరళమైన తెలుగులో స్వేఛ్ఛానువాదమును చేసినాను. దానిని మన మిత్రులు శ్రీ చింతా రామకృష్ణారావు గారు "ఆంధ్రామృతము" అనే బ్లాగులో ప్రచురించేరు. మీరందరు చూచి ఆనందించ గలరని నమ్ముచున్నాను. స్వస్తి.

కంది శంకరయ్య చెప్పారు...

గుండా సహదేవుడు గారి పూరణ....

హేపరమేశా! కావగ
చూపుము మాపై కరుణను స్తోత్రముఁ జేయన్
తూపులఁసంధించగనే
పాపములకు, మూలము లగుఁ బశుపతి పూజల్.

వరప్రసాదు చెప్పారు...

గురువు గారు నన్ను క్షమించగలరు. ప్రాసను పాటించకుంటిని.
వ్యస్తుడనైతిని, త్వరగా పూరణ జేయుటయందు ప్రాసను మరచితిని.
--------
పాపపు చింతన విడచిన
పాపములకు మూలములగుఁ, బశుపతి పూజల్
కాపురమందున బాపును
తాపమ్ము, తొలకరి వాన దాకినరీతిన్|

హ.వేం.స.నా.మూర్తి చెప్పారు...

ఆర్యా!
నా రెండవపద్యం మూడవ పాదంలో పొరపాటుగా టైపుచేయబడిన "నైష్టికత్వము" ను "నైష్ఠికత్వము" గా సవరించ ప్రార్థన.
3.
రేపైనా మాపైనా
పాపములకు మూలములగు, పశుపతి పూజల్
చేపట్టని దుష్కర్ముల
కాపురములు, సుఖమయంబు కాబోవెపుడున్.

శ్యామలీయం చెప్పారు...

కం. కోపములకు తాపములకు
పాపములకు మూలములగుఁ బశుపతి పూజల్
చేపట్టక సంసారపు
కూపంబున సుఖము వెదకు కూళల బ్రతుకుల్

Pandita Nemani చెప్పారు...

శ్రీ సరస్వత్యై నమః:
మిత్రులారా! ఈనాటి పూరణలను తిలకించుదాము:

1. శ్రీమతి లక్ష్మీదేవి గారు జ్ఞానదీపపు కాంతులతో వెలుగులు నింపేరు. చాల బాగున్నది.

2. శ్రీ ఎచ్.వి.ఎస్.ఎన్.మూర్తి గారు: 3 విధాలుగా పూరించేరు.
(1) పాపమ్ముల తొలగ జేసి భక్తుల గాచున్; అని
(2) విభీషణుడు రావణునికి చేసిన హితబోధ; మరియు
(3) పశుపతి పూజల్ చేపట్టని దుష్కర్ముల దుష్ఫలితము గురించి
వర్ణించేరు. బాగున్నవి,

3. శ్రీ శ్రీపతి శాస్త్రి గారు: ఆత్మ సంబోధన చేసికొన్నారు. బాగున్నది.

4. శ్రీ సుబ్బా రావుగారు: 2 విధాలుగా పూరించేరు.
1. పాపపు జింతనలు లేని పాడు జగతిని అని వ్యంగ్యముగా;
2. తొలకరి వానలతో ఉపమించేరు.
పద్యములు భావములు బాగున్నవి.

5. శ్రీ శ్యామలరావు గారు: 2 విధాలుగా పూరించేరు.
1. రూపారగ జన్మాంతర పాపములకు మూలము అని మరియు
2. పశుపతి పూజల్ చేపట్టక సంసారపు కూపమ్మున .. అని
చాల బాగున్నవి.

6. శ్రీ సహదేవుడు గారు: పాపములపై తూపులు సంధించుటను వర్ణించేరు. బాగున్నది.

అందరకీ అభినందనలు. స్వస్తి.

Pandita Nemani చెప్పారు...

నా వ్యాఖ్యలలో చిన్న సవరణ:

శ్రీ సుబ్బారావు గారు చేసిన పూరణ: పాపములను చేయకునికి ప్రథమము మనకున్ ..అని చేసేరు. అంటే ప్రథమ కర్తవ్యము అని అన్వయించుకొనవలెను. బాగున్నది. స్వస్తి.

శ్రీ వర ప్రసాద్ గారు 2 విధాలుగా పూరించేరు.
1. వ్యంగ్యంగా పాపపు జింతనలు లేని పాడు జగతి అని వర్ణించేరు.
2. తొలకరి వానలతో ఉపమించేరు. బాగున్నవి.

పొరపాటులకు చింతించు చున్నాము. స్వస్తి.

లక్ష్మీదేవి చెప్పారు...

పండితుల వారికి అనేకానేక ధన్యవాదాలు.
విద్యుత్సమస్యల వల్ల ఇప్పుడు స్పందించాను గురువు గారు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

గోపాలుడు గోకులమున
గోపికలతొ కలసి మెలసి గోవుల నడుమన్ !
శా పమ్ములు తొలగిం చగ
పాపములకు మూలము లగు పశుపతి పూజల్ !
-------------------------------------------------------
లోపముల నెంచి చూడక
కోపమున శపియించు మునులు కోవిదు నైనన్ !
తాపము తొలగిన పిమ్మట
పాపములకు మూలము లగు పశుపతి పూజల్ !

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

గురువుగారికి నమస్సులు. మీరు ఆంధ్రీకరించిన లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రము లోని శైలి రమ్యముగా నున్నది. మూలములోని భావము అనువాదములో ప్రతిబింబించినది. నిత్యపఠనీయములగు పద్యములను మాకందిచినందులకు ధన్యవాదములు.

సహదేవుడు చెప్పారు...

గురువర్యులకు వందనములు,
ఆర్యా! "తప్పు లెన్నగ గొప్పగా జెప్ప నేర్తు"

Pandita Nemani చెప్పారు...

శ్రీ శంకరయ్య గారూ! నమస్కారములు.
మన బ్లాగు సభ్యులు రచనలలో ఆరితేరిన వారే. వారంతట వారుగా ఏదో ఒక మంచి విషయమును ఎంచుకొని చిన్న చిన్న ఖండికలను రచించి అప్పుడప్పుడు మన బ్లాగులో ప్రచురణ కొరకు పంపుట మొదలిడితే బాగుండునని నా ఉద్దేశము. ఆలోచించండి. ఇది ఉభయ తారకము అవుతుంది కదా! స్వస్తి.

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...

కోపపు తాపము నరునికి
పాపములకు మూలములగు, పశుపతి పూజల్
ఆపక రేపులు మాపులు
చేపట్టిన శాంతి గలుగు చెడుగును మాపున్.