బుధవారం 11 ఎప్రిల్ 2012

సమస్యాపూరణం - 674 (కనరాని విశేషములను)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

కనరాని విశేషములను కవి కాంచుగదా!

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

23 వ్యాఖ్యలు:

హ.వేం.స.నా.మూర్తి చెప్పారు...

వనచరులకు, ఖేచరులకు
ఘనులౌ సన్ములకింక ఖద్యోతునకా
యనిలున కమరులకైనను
కనరాని విశేషములను కవి కాంచు గదా!

లక్ష్మీదేవి చెప్పారు...

సత్యనారాయణ మూర్తిగారు,
రెండవ పాదంలో ఒక అక్షరం మాయమయినట్టుంది.

దినకరునకు, దివిటీలకు,
మనసెఱిగిన వానికైన, మానినికైనన్,
మనమున విరియు మరులలో
కనరాని విశేషములను కవి కాంచు గదా!

మరులు గొన్న మనసులు తెలియలేని విషయాలను కూడా కవి అయితే అందంగా వర్ణించగలడు.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

వినిపించును మనసారా
ఘనమగు యీ సృష్టిలోని కమ్మదనంబుల్
మనసది చక్షువుకాగా
కనరాని విశేషములను కవి కాంచుగదా!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

మనమున పొంగిన భావము
దనుజులు , దివిజులు , గగనము , తారాపధమున్ !
కనులకు విందొన రించగ
కనరాని విశేష ములను కవి గాంచు కదా !

లక్ష్మీదేవి చెప్పారు...

వనముల సౌందర్యములను,
కనదగు కాంతామణులను, కాంచనశిలలన్
ఘనమగు బాహుబలమ్ముల,
కనరాని విశేషములను కవి కాంచుగదా!

హ.వేం.స.నా.మూర్తి చెప్పారు...

ధన్యవాదాలు లక్ష్మీదేవి గారూ,
టైపు చేయటంలో ఒక అక్షరం మాయమైంది. సవరిస్తున్నాను.

వనచరులకు ఖేచరులకు
ఘనులౌ సన్మునులకింక ఖద్యోతునకా
యనిలునకమరులకైనను
కనరాని విశేషములను కవి గాంచు గదా!

Pandita Nemani చెప్పారు...

శ్రీ సరస్వత్యై నమః :
మిత్రులందరికి శుభాభినందనలు. ఈ నాటి పూరణలన్నీ బాగున్నాయి. స్వస్తి.

Pandita Nemani చెప్పారు...

విమలాంతఃకరణుడు లో
కముల హితుడు క్రాంతదర్శి కనరాని విశే
షములను కవి కాంచుగదా!
సుమనోవందితుడు సర్వ శుభ వీక్షణుడున్

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

మనముననూహలు చెలగన్,
జనులవలోకనము చేయజాలని కథలన్,
యినుడైనను యీ జగతిన
కనరాని విశేషములను కవిగాంచుకదా.

subbarao చెప్పారు...

మనుజుల ,పండిత వర్యుల
దనుజుల , మఱి మునుల కెల్ల , దల్లుల కైనన్
వినుమది , తలపుల యందున
కన రాని విశేషము లను కవి కాంచు గదా !

Pandita Nemani చెప్పారు...

వనజభవుడు, గణపతియును,
వనజాప్తుడు, శుక్రుడు కవి వరులనగ యశం
బును గనిరిక సామాన్యులు
కనరాని విశేషములను కవి కాంచు గదా

(వివరణ: పురాణ కవులలో ప్రసిద్ధి కెక్కినవారు
(1) బ్రహ్మ; (2) గణపతి; (3) సూర్యుడు; (4) శుక్రుడు మొదలగువారు,)

వరప్రసాదు చెప్పారు...

శ్రీ శ్రీ పండిత నేమానివారికి నమస్కారములతో
మీ సున్నితమైన హెచ్చరికలకు శతకోటివందనములు.
కొండల మాటున గాంచెను కనకపురాశులు, ఇది ఇప్పటివరకు ఎవ్వరు కనుగొనలేక పోయినారు.అధికారమందున తాను జేసిన పాపపు పనులను(సంపాదనను) అందరికిపంచి, ఇంతటి మహానుబావుడు లేడు కదా యను రీతిన పరిపాలించిన రాజుపై
--------
జనులకు బంచెను ఘనతను
కనరాని విశేషములను కవికాంచుగదా?
యనురీతిన, రాజసమున
కనకపు రాశులను గాంచె కరిశిఖరములన్

అజ్ఞాత చెప్పారు...

అనుమానపునడుము,ఫణికి
మణి, వెన్నెలదినెడుపక్షి, మరియు సుతునిగాం
చినతల్లియవస్థలనుచు
కనరాని విశేషములను కవికాంచుగదా!

శ్యామలీయం చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
శ్యామలీయం చెప్పారు...

కం. కను నింద్రుని వైభవమును
కను కర్ణుని యీవి క్రీడి ఘనవిక్రమమున్
కను నొడయని యందెవ్వరు
కనరాని విశేషములను కవి గాంచు కదా.

హ.వేం.స.నా.మూర్తి చెప్పారు...

ధనరాశులు వెచ్చించియు,
ఘనయశములు పొందియైన కాలత్రయమున్
కనగల శక్తిని గలిగియు
కనరాని విశేషములను కవి కాంచు గదా!

వసంత కిశోర్ చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
వసంత కిశోర్ చెప్పారు...

అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

మహాకవి వాల్మీకి :

01)
_____________________________________________


కనలే డిను డైనను మరి
కనలే డింద్రుడు సురలును - కనలే రెవరూ !
కనుగొన నేరికి శక్యము
కనరాని విశేషములను? - కవి కాంచు గదా!
_____________________________________________

Pandita Nemani చెప్పారు...

శ్రీ సరస్వత్యై నమః:
మిత్రులారా!
ఈనాటి సమస్య కవులకు ప్రోత్సాహకరముగా నున్నది. అన్ని పూరణలు చాలా బాగుగనున్నవి. పాల్గొనిన వారందరికీ శుభాభినందనలు.
1. శ్రీ ఎచ్.వి.ఎస్.ఎన్.మూర్తి గారికి
2. శ్రీమతి లక్ష్మీదేవి గారికి
3. శ్రీ శ్రీపతి రావు గారికి
4. శ్రీమతి రాజేశ్వరి గారికి
5. శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారికి
6. శ్రీ సుబ్బారావు గారికి
7. శ్రీ వరప్రసాదు గారికి
8. శ్రీ శ్యామలరావు గరికి
9. శ్రీ వసంత కిశోర్ గారికి

సర్వే జనాః సుఖినోభవంతి.
స్వస్తి.

వామన కుమార్ చెప్పారు...

వినదగునెవ్వరు చెప్పిన
వినదగు సత్కవుల వాణి విషయవిశేషం
గనదగు నెవ్వరు చూపిన
కనరాని విశేషములను కవి గాంచుగదా!

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...

ఘన వరగజ గమనుడు గజ
మును మును బ్రోవంగ వచ్చు ముచ్చట వ్రాసెన్
గని నట్టుగ మన పోతన
కనరాని విశేషములను కవి కాంచు గదా!

హ.వేం.స.నా.మూర్తి చెప్పారు...

గోలి హనుమచ్ఛాస్త్రిగారూ,
మీ పూరణ సందర్భోచితంగా చాలా బాగున్నది.