బుధవారం 16 మే 2012

సమస్యాపూరణం - 706 (పెన్నిధులు గల్గి)

కవిమిత్రులారా,


ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

పెన్నిధులు గల్గి సుఖియించుఁ బేదవాఁడె.

ఈ సమస్యను సూచించిన 
గుండా సహదేవుడు గారికి
ధన్యవాదాలు.

10 వ్యాఖ్యలు:

Pandita Nemani చెప్పారు...

విద్య వినయమ్ము విజ్ఞాన విభవ దీప్తి
విమల సంస్కారమను లక్షణములతోడి
పెన్నిధులు గల్గి సుఖియించు బేదవాడె
యనెడు రీతి మెలగుచు నహమ్ము వీడి

లక్ష్మీదేవి చెప్పారు...

తనదు కోర్కెల దీర్చెడు తండ్రి వోలె
దైవమే తోడయి నిలిచి దారిజూప
పరమ భాగవతుడయిన భక్తుడన్ని
పెన్నిధులు గల్గి సుఖియించు పేదవాడె

మంద పీతాంబర్ చెప్పారు...

వంద గదులున్నమేడలు వాహనములు
లక్ష కోట్లైన నిధులున్న లాభమేమి?
నీతి దప్పిన దుఃఖంబు నిజము; సుగుణ
పెన్నిధులు గల్గి సుఖియించు బేదవాడె!!!

హ.వేం.స.నా.మూర్తి చెప్పారు...

సర్వలోకైకమాతయై జనుల కెపుడు
సిరులు పంచెడు జగదంబ చిత్స్వరూప
సన్నిధిని జేరి భక్తితో సన్నుతించ
పెన్నిధులు గల్గి సుఖియించు పేదవాడె.

కమనీయం చెప్పారు...

సాధ్వి,యనుకూలవతి యైన సతియు,చక్క
నైన సంతానమును,విద్య, సజ్జనాప్త
మిత్ర సాంగత్యమును,దృప్తి ,మితము గల్గు
పెన్నిధులు గల్గి సుఖియించు బేదవాడె.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

కలిమి లేములు మనిషికి కొలత కావు
మంచి మనసున్న సతిసుతుల్ మమత చాలు
దైవ చింతన కలిగిన తనివి వంటి
పెన్నిధులు గల్గి సుఖియించు బేద వా డె !

సహదేవుడు చెప్పారు...

నేడు యాకలి దప్పిక నిద్ర లుడిగి
పరుగు లెత్తించు వ్యాజ్యాల బ్రతుకు లీడ్చ
అలుపు యాకలి నిద్రాదు లలర, నట్టి
పెన్నిధులు గల్గి సుఖియించు( బేద వా(డె

కంది శంకరయ్య చెప్పారు...

పండిత నేమాని వారూ,
ఉత్తమమైన పూరణ చెప్పారు. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
చక్కని పూరణ మీది. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సత్యనారాయణ మూర్తి గారూ,
మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
*
కమనీయం గారూ,
నిజమైన నిధులేవో వివరిస్తున్న మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
చాలా మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘అలుపు యాకలి’ని ‘అలుపు నాకలి’ అందాం.

మిస్సన్న చెప్పారు...

ఉన్న దానితో సంతృప్తి నొందు చుండు
రేపటిని గూర్చి చింతన తోపనీడు
రెక్కలను నమ్ముకొను యోగి రీతి తృప్తి
పెన్నిధులు గల్గి సుఖియించుఁ బేదవాఁడె.

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...

శాంతి గలిగిన నొనగూరు సౌఖ్య మెపుడు
సుఖము శాంతిని బొందడు చూడ నొకడు
పెన్నిధులు గల్గి, సుఖియించు బేద వాడె
పెన్నిధులు లేక మనసున శాంతి యున్న.