30, జూన్ 2012, శనివారం

రవీంద్రుని గీతాంజలి - 59

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

59

YES, I know, this is nothing but thy
love, O beloved of my heart this golden
light that dances upon the leaves, these
idle clouds sailing across the sky, this
passing breeze leaving its coolness upon
my forehead.

The morning light has flooded my
eyes this is thy message to my heart.
Thy face is bent from above, thy eyes
look down on my eyes, and my heart
has touched thy feet. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

నిజముగా నే నెరుంగుదు హృదయచోర!
యిద్ది నీ ప్రేమకాని మరేమి కాదు ||

కదలు నాకాకుపైని చొక్కఁపుఁబసిండి
తళుకు లియ్యవి నాట్యము సలుపుటేని,
మధురమాంద్యము గ్రమ్మిన మబ్బు లివ్వి
*మింటిపై నావలై తూగుచుంటయేని,
అమృతకణముల మలయమందానిల మిది
చల్లచల్లఁగ నాపయిఁ జల్లుటేని,
నీదు ప్రేమయె ప్రియతమా! నిశ్చయముగ ||

చూడ్కు లుప్పొంగె నీ యుషశ్శోభలోన,
నిదియె నీప్రేమవార్త నా హృదయమునకు,
నీ ముఖం బది వంగె నా మోమువైపు,
కలిసికొనె మన యిరువురి కన్నుదోయి,
నాదు గుండెలు సోకె నీ పాదయుగళి,
ప్రియతమా! యిది యెల్ల నీ ప్రేమ మోయి! ||

సమస్యాపూరణం - 749 (తులను పట్టునెడల)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

తులను పట్టునెడలఁ గలుగు సుఖము.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

కవిమిత్రుల పూరణలు
౧. లక్ష్మీదేవి

    చక్కజేయు మదిని సత్సంగమనునది
    మంచి వారితోడ మసలుకొమ్ము;
    భక్తి గలిగి మెలగు భక్తుల, భాగవ
    తులను పట్టునెడల గలుగు సుఖము.


    విషయ వాంఛ దలచి వెంట బడెడు దుర్మ
    తులను పట్టునెడల, గలుగు సుఖము
    శాశ్వతమది సుమ్ము; సచ్చిదానందము
    కలిగి చింతలెల్ల తొలగు నిజము.

*     *     *     *     *
౨. గుండు మధుసూదన్
    ఆపదలు తొలంగు, నంతరించును బాధ,
    గొనము లెసఁగు, ధాన్యధనము వృద్ధి
    యగు నెటుల? హరునకు నతిభక్తితోఁ బ్రణ
    తులను పట్టునెడల గలుగు సుఖము.

*     *     *     *     *
౩. చంద్రమౌళి 
    ఏది సుఖమొ జీవి కేయది పథ్యమొ
    తానె తెలియ లేడు తత్త్వదృష్టి
    నాశ్రయించి మ్రొక్కి యార్య వేదాంత శాం
    తులను పట్టునెడల గలుగు సుఖము.

*     *     *     *     *
౪. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
    నిర్మలాత్ములౌచు నిత్యము జగదంబ
    నఖిలభక్తకోటి ననవరతము
    కాచు తల్లి నిలను గాంచి మంగళహార
    తులను పట్టునెడల గలుగు సుఖము.
*     *     *     *     *
౫. సుబ్బారావు
    జ్ఞాన మనగ నెరిగి మానవంతుల పద్ధ
    తులను పట్టు నెడల గలుగు సుఖము
    భక్తి కలిగి యుండి భగవంతు సేవించ
    ముక్తి కలుగు సత్యముగను నిలను .
*     *     *     *     *
౬. ‘మన తెలుగు’ చంద్రశేఖర్
    పట్టు పట్ట నేల పట్టిన విడువంగ
    నేల? మొండిపట్టు లెపుడు వలదు
    మంచి పట్టు పట్టు మనిషికి తగు సుగ
    తులను పట్టునెడలఁ గలుగు సుఖము!

*     *     *     *     *
౭. పండిత నేమాని
భౌతికమగు సిరులు భావ్యముల్ కావంచు
జ్ఞానయోగ సాధనముల నెంచి
యాదరమున శాశ్వతానంద మిడు సద్గ
తులను బట్టు నెడల గలుగు సుఖము 

*     *     *     *     *
౮. మిస్సన్న 
(1) 
మంచి చెడుల మధ్య మంచి మార్గము జూపి 
పాప పుణ్యములను చూపి హితము 
మంచి నడత నీయ మనిషి మనస్సున  
తులను పట్టునెడలఁ గలుగు సుఖము. 
(తుల=త్రాసు, కొలమానము) 
(2) 
వ్యధను క్రుంగ నేల మధుమేహ మంచును 
మందు లేని రోగ మెందు గలదు 
కలత మరచి పోయి కాకరకాయ, మెం- 
తులను పట్టునెడలఁ గలుగు సుఖము.  
(3) 
సిరుల నిచ్చి బ్రోచు శ్రీదేవి చదువుల 
నిచ్చు వాణి శుభము లిచ్చు గౌరి 
జగము లేలు నట్టి ముగురు దేవతల యిం
తులను పట్టునెడలఁ గలుగు సుఖము. 
*     *     *     *     * 
౯. శ్రీపతిశాస్త్రి
మనసునందు కలుగు మంచిభావములను
వ్రాయగల్గినట్టి పండితుండు
లలితమైన భాష, ప్రాస,పద్య, గణ,య 
తులను పట్టునెడలఁ గలుగు సుఖము. 
*     *     *     *     *
౧౦. రాజేశ్వరి నేదునూరి 
ఇంటి దీపము గద యిల్లాలి సుగుణమ్ము,
కంటి వెలుగు గాదె కన్న సంతు;
మంచి ముత్యము వలె మాటను పలుకు హి
తులను పట్టు నెడలఁ గలుగు సుఖము !
*     *     *     *     *
౧౧. గోలి హనుమచ్ఛాస్త్రి
    తులను దూగు సిరులు కలిగియున్నను గాని
    హితుల గతుల నిడు మహిత వరుల
    మతుల జెరచ కుండ మన్నింపుగల స్నేహి
    తులను పట్టు నెడలఁ గలుగు సుఖము.
*     *     *     *     *     *
౧౨. గుండా సహదేవుడు
ధనము గలిగెనేని యనుభవించగవచ్చు
నన్ని రంగములను నదియె పోటి
వృత్తి యందు నేర్పు పెంచి యుత్తమ సంగ
తులను పట్టు నెడల కలుగు సుఖము.

 


  

పద్య రచన - 37


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.
కవిమిత్రుల పద్యములు

౧. సుబ్బారావు
చంటి పిల్లగ కూర్చుని చాపి చేయి
చందమామను బిలిచెను చక్కగాను
చూడ ముచ్చట గొలుపును చూపరులకు
దిష్టి కొట్టక యీయుడు దీవనలను.
*     *     *     *     *
౨. గుండు మధుసూదన్ 

సిరి కలుగు నింతి పుట్టిన,
సిరి రూపము తానె, గిరిజ రూపము తానే,
తరుణియె క్షమాస్వరూపిణి,
మరియాదకు మాఱుపేరు మహిళయె కాదా !

“ఆఁడపిల్ల యేనాఁడును నాడ పిల్ల,
యీడ పిల్లయె కా” దంచు నెగురు వార
‘లాఁడపిల్ల మహాలక్ష్మి’ యనెడు మాట
వినఁగ లేదొక్కొ లోకాన వీను లలర !

కట్న మీయంగ లేమని, కసిని బూని
బాలికను గర్భమునఁ జంపఁ బాప మనెడు
త్రాసమే లేక తెగటార్చ ధర్మ మగునె?
రూపుమాపుఁడు మీరు స్త్రీ భ్రూణ హత్య !

*     *     *     *     *
౩. రవి
     అమ్మా! అదుగో అక్కడ
    కొమ్మల పై నాకసమున కూర్చున్నాడే,
    తమ్మిచెలిమి కాడు,తనని
    రమ్మనవా, నా గవునుకు రంగుల పూసై?
*     *     *     *     *
౪. పండిత నేమాని
    మాయల నెరుగని యీ లే
    బ్రాయపు బసికూన యెదిగి భరతావనిలో
    నే యంతస్తున జేరునొ?
    హాయిగ జీవించు గాక! యబ్ద శతంబుల్.

*     *     *     *     *
౫. హరి వేంకట సత్యనారాయణ మూర్తి


బాల్యదశ యన్న బహుమూల్యఫలము గాదె

పాలు గారెడి బుగ్గలు, పలుకు లెపుడు
దివ్యమాధుర్య భరములై తేజరిల్లు
బ్రహ్మవాక్యంబులో యన భవ్యములయి,
బాల్యదశ యన్న బహుమూల్యఫలము గాదె. (1)

చింత యొకయింత యేనియు సిరులగూర్చి
అంటగాబోదు నిత్యంబు హర్షమొదవు
కష్ట సుఖముల యూసెందు కలుగ బోదు
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (2)

కులము, మతములు, గోత్రాలు కోట్లకొలది
సంప్రదాయంబు లాచారసంతతులును
తెలియవలసిన పనిలేదు భళిర! చూడ
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (3)

కలిమిలేములు సమములై కలుగు తృప్తి
యఘము పుణ్యంబు లవియెందు నంటబోవు
దైవరూపంబు పసిబిడ్డ ధరణిలోన
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (4)

చందమామను గాంచిన క్షణమునందు
చేతులనుఁ జూపి రమ్మని జీరుచుండు
తన్మయత్వంబు నందుచు ధరణి కెపుడు
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (5)

కోపమే భూషణంబయి కోరికలను
దీర్చు చుండును వాత్సల్యదీప్తు లొసగు,
రోదనంబిక బలమౌను మేదినిపయి
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (6)

తల్లిదండ్రులు, బంధువు, లెల్లవార
లరుసమును జెంది రాజశేఖరులు గూడ
సేవలందింతు రెల్లప్పు డేవలేక
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (7)

ఆటపాటలఁ దేలుచు ననవరతము
ఘనత నందుచు కాలంబు గడుపుచుండు
భాగ్యమున కర్హు లిలలోన బాలు రవుర!
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (8)

ఏడ్పు విన్నంత జననితా నెందు నున్న
శీఘ్రముగఁ జేరి ముద్దాడి చెంత నిలిచి
పాటలను బాడి యలరించి పలుకరించు
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (9)

కోరినంతనె జనకుండు కూర్మితోడ
వస్తుజాలంబు నందించ వలయు ననుచు
యత్న మొనరించు బిడ్డకై యహరహమ్ము
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. (10)

*     *     *     *    *
౬ మిస్సన్న 
“అమ్మ- అరటి - ఆవు” అని పల్కవే పాప
తెలుగు లింట నున్న వెలుగు వీవు
సన్ను మూను వద్దు చంద మామే ముద్దు
వమ్ము చేయ బోకు నమ్మకమ్ము. 

*     *     *     *     *
౭. శ్రీపతిశాస్త్రి    
అద్భుతమ్ముగనున్నదీ యాకసంబు
ఆకసంబంత యెతైన ఆశయంబు
పంచభూతమ్ములను జూచి పరవశించి
పట్ట నెంచితివేమమ్మ పగటి విభుని
 

ప్రకృతి లోనున్న వింతలు ప్రతిది మనదె
యనుచు తలబోయు ప్రాయమ్ము హాయి నొసగు
చీకు చింతలు లేనట్టి జీవితమున
నాటలాడుము నాతల్లి హర్ష మెసగ.
*     *     *     *     *
౮. రాజేశ్వరి నేదునూరి
చంద మామను బిలిచెను సంత సమున
చేత జిక్కించు కొనగోరి చేయి జూపి
గగన మందున్న చంద్రుడు కలత పడెను
చిన్ని పాపను తానెట్లు చేర గలడు ?

*     *     *     *     *
౯. గోలి హనుమచ్ఛాస్త్రి 
అమ్మా యీలోకమ్మున
నమ్మాయిగ బుట్టి నావు అమ్మయ్యా మీ
యమ్మకు జేజేలిత్తును
అమ్మాయీ యందుకొనుము, హాయ్ హాయ్ తల్లీ! 



 

29, జూన్ 2012, శుక్రవారం

రవీంద్రుని గీతాంజలి - 58

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు


58

LET all the strains of joy mingle in my
last song the joy that makes the earth
flow over in the riotous excess of the
grass, the joy that sets the twin brothers,
life and death, dancing over the wide
world, the joy that sweeps in with the
tempest, shaking and waking all life
with laughter, the joy that sits still with
its tears on the open red lotus of pain,
and the joy that throws everything it
has upon the dust, and knows not a
word.

చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

అమ్మహానందభరము నిండారి మొరయు
*స్వరములన్ సాగు రాగసంచయ మదెల్ల
సమ్మిళిత మగుగాత నా చరమగీతి ||

పుడమి యెద్దాని కతమునఁ బొంగు లెత్తె
తరులతాతృణతతుల సందడిగ లేచు,
నిరత మెద్దాన జీవనమరణయుగళ
మొక్క తల్లి గర్భమ్మున నుద్భవిల్లు
తోడబుట్టువులై కూడిమాడి సల్పు
నటనము విశాలసంసారనాట్యశాల,
నమ్మహానందభరము నిండారి మొరయు
స్వరములన్ సాగు రాగసంచయ మదెల్ల
సమ్మిళిత మగుగాత నా చరమగీతి ||

ఎద్ది ఝంఝామరుద్రూప మెత్తి వీచి
యట్టహాసాన బ్రాణముల్ తట్టి లేపు
నెద్ది విచ్చెడి దుఃఖఁపు టెఱ్ఱదమ్మి
పైని గూర్చుండుఁ గన్నీళ్ళతోన వచ్చి,
ధూళిలో నెద్ది సర్వము ద్రోసి వేసి
జారిపోనీయ దొక్క నిట్టూరు పేని,
అమ్మహానందభరము నిండారి మొరయు
స్వరములన్ సాగు రాగసంచయ మదెల్ల
సమ్మిళిత మగుగాత నా చరమగీతి ||

సమస్యాపూరణం - 748 (కనులు లేనివాఁడు)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

కనులు  లేనివాఁడు కన్ను గొట్టె.

ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
 

 కవిమిత్రుల పూరణలు

౧. గోలి హనుమచ్ఛాస్త్రి
 
    నడచి వెడలుచుండ నళినాక్షి యొక్కతె
    చాల గాలి వీచి జారె పైట
    బుద్ధియున్న వాడు మూసెను తన రెండు
    కనులు, లేనివాఁడు కన్ను గొట్టె.
*     *     *     *     *
౨. కంది శంకరయ్య
    తల్లి రీతి నక్కసెల్లెండ్రవలె పర
    సతులఁ జూచునట్టి సంప్రదాయ
    మలరు సంస్కృతి మన దనియెడి జ్ఞానంపు
    కనులు లేనివాఁడు కన్ను గొట్టె.
*     *     *     *     *
౩. సుబ్బారావు
    చూడ లేడు సరిగ నాడ లేడు గదమ్మ !
    కనులు లేని వాడు , కన్ను గొట్టె
    పైత్య మెక్కు వయ్యి పడతుల జూచి యం
    చనగ తగునె యంధు డైనవాని.

*     *     *     *     *
౪. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
    తిరుమలేశుమహిమ లరయుడో జనులార!
    మూక మాటలాడె ముదముతోడ
    పంగు వద్భుతముగ పరుగులు దీసెను
    కనులు లేనివాడు కన్ను గొట్టె.

*     *     *     *     * 
౫. పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
    కనులు లేని వాడు కన్నుగొట్టె నటంచు
    మూగ పిల్ల యొకతె బొంకులాడె
    వాదనలను రెండు పక్షాలలో విని
    చెవిటివాడు తీర్పు చెప్పె బళిర!

*     *     *     *     *
౬. ‘మన తెలుగు’ చంద్రశేఖర్
    అన్నకున్న దొక్క కన్నట, కనరెండు
    కనులు లేనివాఁడు, కన్ను గొట్టె
    చెంప పగుల గొట్టె చిరుబురు చతురాక్షి
    ఉన్న ఒక్క కన్ను ఊడి పోయె!

*     *     *     *     * 
౭. చంద్రమౌళి
లోన ఖిన్న మైన తానాడురెప్పలు
కన్ను గొట్టి నట్టు కదలి బెదరి
దారి తప్పి వసతి దరిరాక భయమొంద
కనులు లేనివాఁడు కన్ను గొట్టె.

*     *     *     *     *
౮. గుండు మధుసూదన్
 కలికి కానుపించఁ గామాంధుఁ డయ్యు నా
కనులు లేనివాఁడు కన్ను గొట్టె!
కని, భరించలేక కలికి కాళిక వోలె
వచ్చి, వాని చెంప వాయఁగొట్టె. 

*     *     *     *     *
౯. రాజేశ్వరి నేదునూరి
 మాట పలుకలేడు మదినిండ భావాలు
సొగసు లొలుకు తరుణి సోయగమ్ము
కలలు కనగ మెండు కలవరపడినంత
కనులు లేని వాఁడు కన్ను గొట్టె !
*     *     *     *     *
౧౦.సహదేవుడు

 దృష్టినొసగెఁ జక్రి ధృతరాష్ట్రు డడుగంగ
విశ్వరూప మదియె వింతగొల్ప
దివ్యమైన తేజతీక్షణ ధాటికి
కనులు లేనివాడు కన్నుగొట్టె.

(తీక్షణ మైన వెలుగుచూడలేక కన్నార్పాడన్న అర్థంతో వ్రాసాను)

 
  




 


 

పద్య రచన - 36


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

కవిమిత్రుల పద్యములు

౧. లక్ష్మీదేవి 
    దీనజనులను కాపాడు దేవుని కృప
    నెల్లవారల దుఃఖము లిట్టె సమసి
    పోవుననుచును నమ్మిన పూనికగను
    కర్మఫలముననుభవించు కష్టమేల?


    తనదు పరివారమించుక తరలి వచ్చి
    తనకు చేయూత నీయని తరుణమునను
    సాటి వారి నాదుకొనగ సజ్జనుండు
    సర్వవేళల సిద్ధము సహజమిదియె.
 
*     *     *     *     *
౨. మిస్సన్న 
    తిండికి గుడ్డకున్ కరవు తీరుగ లేదు శరీర భాగ్యము-
    న్నుండగ నిల్లు లేదు కనులున్నవి చుట్టును జాలి లేదహో
    గండము నిత్యమున్ బ్రతుకు కాలునికిన్ కృప లేదు దేవుడా
    దండము వేగ నీ దరికి తాళగ లేనిక జేర్చుకో గదే.

*     *     *     *     *
౩. సుబ్బారావు
    తిండి లేదయ్య ! ముప్పది దినము లయ్యె
    కావరాలే దెవారును గరుణ తోడ
    తీసుకొని పొమ్ము నన్నిక దేవ దేవ!
    యనుచు సాయిని బ్రార్ధించె యాచకుండు .


    తిండి నే దిని ముప్పది దినము లయ్యె
    దేహ మంతయు శుష్కించె దైన్యముగను
    వేడుచుంటిని మిమ్ముల వేయు డింత
    కబళ మో యమ్మ ! దీనుని గనికరించి .

*     *     *     *     *
౪. పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
    బిచ్చమెత్తుకొనెడు వృత్తి నీచము కాదు
    పెద్దవారలేని బిచ్చగాండ్రె
    ఉన్నవారలన్న నుండు చింతలు చాల
    బెంగలేని వాడు బిచ్చగాడె

*     *     *     *     *
౫. హరి వేంకట సత్యనారాయణ .మూర్తి

    కట్ట బట్టలు లేవు కరువయ్యె మెతుకులు
            పలుకాలకించెడి వారు లేరు,
    రోజున కొకటిగా రుగ్మతల్ వ్యాపించె
            బ్రతికియుండుటె నేడు భారమయ్యె,
    దీనబాంధవుడైన దేవాధిదేవుడే
            పాషాణరూపియై పలుకనపుడు
    సాటివారలమంచు జగతిలో నడయాడు
            శ్రీమంతులనుగూర్చి చెప్పనేల?
    జన్మ మంది నాడ జనులంద రేరీతి
    పుట్టి యుండి రట్లె పుడమిమీద
    తిండి బట్ట లేక తిరుగుచు నుండెడి
    పేదవాని నగుట కేది కతము?

    పూర్వజన్మమందు పుణ్యంబు చేయనో?
    సంచరించ లేదొ సవ్యగతిని?
    తెలియకుండె చెప్పవలయును దేవుడే
    పేదవాని నగుట కేది కతము?

    సుఖములేక సతము సూర్యోదయాదిగా
    గుడులు, వీధులందు, బడులవద్ద
    చేరి దాన మింత చేయుడన్ననుగాని
    దుడ్డు కొంచెమైన దొరకదయ్యె.

    భవమునొసగునట్టి భగవానుడే రక్ష
    యందు రెందుఁ బోయె నాఘనుండు
    బాధ లిట్లు గూర్చు, భవబంధ మోచనం
    బీయ రాడదేమి? ఈశ్వరుండు.

    అనుచు మనసులోన నత్యంతవేదన
    నందు పేదవారి ననవరతము
    నిర్మలాత్ములౌచు, నిస్స్వార్థచిత్తులై
    చేరి సాయ మంద జేయ వలయు.

    సాటివారి కింత సాయంబు చేయుటే
    ధరణిలోన గొప్ప ధర్మ మికను
    మంచి మనసుతోడ మానవసేవయే
    మాన్యమైన పూజ మాధవునకు.

*     *     *     *     * 
౬. కళ్యాణ్

    కులమొ యాదిభిక్షువుది నా గోత్రమనిన
    సాయినాధు గోత్రమునాది, జన్మ యెట్టి
    దనిన నాదియు నంతమ్ము గనగరాదు,
    మతము క్షుద్బాధ నెరిగిన మనుజు మతము.

*     *     *     *     * 
౭. గుండు మధుసూదన్
బ్రతికితి మున్ను డబ్బు గలవానిగ; గర్వముతో దరిద్రులన్
మెతుకు విదుల్చకుండ మఱి మిక్కిలి పాఱఁగఁ ద్రోలి, నవ్వితిన్
హితము గనంగలేక మద మెక్కియు నెన్నఁడు దానధర్మముల్
మతిఁ దలఁపన్ సహింపకను మాన్యత వీడితి పుణ్యదూరునై.

బిచ్చగాండ్రను రాకుండ వెడలఁగొట్టి
పిసినితనమున ధనమును విరివిగాను
కూడఁబెట్టితి నేనును గుడువకుండ
దానహీనుఁడ నయ్యును ధనికుఁ డైతి.

ఇటుల రాత్రి పగలు హెచ్చగు మోహాన
తిండి తినక ధనము దీక్షతోడఁ
గాయుచుంటి మిగులఁ గాపలదారుగా
నొక్కనా డలసితి మిక్కుటముగ.

నిదురించ నొక్క చోరుం
డది గమనించియును నచటి నా ధనమంతన్
వెదకి వెదకి మొత్తము తన
మది మెచ్చగ దోచుకొనెను; మట్టియె మిగిలెన్.

నాటినుండియు నేఁ బేదనైతి వినుఁడు
ధనము, గర్వము తొలగించె దైవ మపుడు!
దానధర్మాలు సేయక ధనము నెపుడు
కూడఁబెట్టి, కావలదు భిక్షుకులుగాను!!

*     *     *     *     *
౮. రాజేశ్వరి నేదునూరి చెప్పారు... 
    నడువ లేను బాబు నడిరోడ్డుపై నేను
    దైవ మిటుల వ్రాసె దయను వీడి
    పెద్ద మనసు జేసి బిచ్చ మిడిన చాలు
    నేను బ్రతుకగలను నీదు కృపను.
 

28, జూన్ 2012, గురువారం

రవీంద్రుని గీతాంజలి - 57

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

57

LIGHT, my light, the world-filling light,
the eye-kissing light, heart-sweetening
light !

Ah, the light dances, my darling, at
the centre of my life ; the light strikes,
my darling, the chords of my love ; the
sky opens, the wind runs wild, laughter
passes over the earth.

The butterflies spread their sails on
the sea of light. Lilies and jasmines
surge up on the crest of the waves of
light

The light is shattered into gold on
every cloud, my darling, and it scatters
gems in profusion.

Mirth spreads from leaf to leaf, my
darling, and gladness without measure.
The heaven's river has drowned its
banks and the flood of joy is abroad.


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

వెలుఁగ! నా వెలుఁగా! జగం బలము వెలుఁగ!
కనుల కింపగు హృదయమోహనఁపు వెలుఁగ! ||

ఆడెనోయి వెలుంగు, నా ప్రాణకేంద్ర
మందు ముద్దార నాట్యము లాడెనోయి!
మ్రోగెనోయి వెలుంగు, నా రాగహృదయ
ముగ్ధవీణను ఝనఝన మ్రోగెనోయి!
నభము కన్విప్పె, వనపవనమ్ము విసరె,
హాసభాసురమయ్యె సమస్తపృథ్వి ||

రెక్క తెరచాపలం బ్రసారించి కాంతి
జలధిమీద సీతాకోకచిలుక లీదె,
మల్లియలు విరజాజులు మొల్లమగుచు
వెలుఁగు తరఁగల కొప్పున విప్పువారె ||

వెలుఁగు లివి ముద్దుముద్దుగ విప్పుకొనఁగ
మొగులు మొగులును బంగరు ముక్కలయ్యె,
కొల్లలుగ ముత్తెముల్ వెదఁజల్లఁబడియె,
నలమె సంతోషరేఖ లాకాకు మీద,
పరిమితియె లేని యుల్లాసభరము విరిసె,
తనదరుల్ ముంచె స్వర్గసుధాస్రవంతి,
నలువలంకుల నానందజలధి పొంగె ||

నిషిద్ధాక్షరి - 4


టవర్గ (ట,ఠ,డ,ఢ,ణ) అక్షరాలను ఉపయోగించకుండా
టంగుటూరి ప్రకాశం పంతులు గురించి
మీకు నచ్చిన ఛందంలో
పద్యం వ్రాయండి.

కవిమిత్రుల పద్యములు

౧. ‘మనతెలుగు’ చంద్రశేఖర్
ఆ ధీరాంధ్ర సుకేసరి
మేధాకాశము తెలుగుల మేరు నగంబై
క్రోధించి నిలపె సైమను
యోధుల దుశ్చర్యలెల్ల నోయనఁగ సుధీ!

ఇత నెదిరి తుపాకి కెదురు నిలచె తెల్ల
వారి వైరి తెలుగు వారి కెల్ల
గర్వ కారణము ప్రకాశము పంతులు
ఆంధ్ర కేసరి సరి యాంధ్రులకును! 
*     *     *     *     *

౨. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
సీ.
స్వాతంత్ర్య సిద్ధికై సర్వసంపద లన్ని
            సౌఖ్యముల్ త్యజియించి సంతసమున
నిస్స్వార్థబుద్ధితో నిత్యదీక్షను బూని
            స్వారాజ్య సమరమ్ము జరుపువాని,
ప్రజలక్షేమము గోరి బహుబాధలకునోర్చి
            పత్రికల్ ప్రచురించు భాగ్యశాలి
నాంధ్రకేసరి యౌచు నాంగ్లేయులకు భీతి
            గల్గించి నిలిచిన ఘనుని మరియు
తే.గీ.
ధీరగంభీరవిగ్రహు, దివ్యతేజు
నమల చరితుఁ బ్రకాశము నాంధ్రజనులు
విశ్వసించిన వానిని, విజ్ఞవరుని
ధన్యజీవిని స్మరియింప దగును సతము.
*     *     *     *     *

౩. సుబ్బారావు
    ఆంద్ర కేసరి బిరుదున కర్హతఁ గనుఁ
    గొన్న తేజస్సు గలిగిన గొప్ప ధీర!
    ఆంగ్ల పాలన నీవల్ల నంత మయ్యె
    వందనములు ప్రకాశము పంతులయ్య ! 
*     *     *     *     *

౪. పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
ధీ ప్రకాశ నిధానమా! దివ్య భావ!
ఆంధ్ర కేసరి బిరుదాంచితా! సుధీర!
తెలుగు తేజమ! ముఖ్యమంత్రివర! ధాత్రి
నీదు కీర్తి శాశ్వతముగ నిలుచు గాదె! 
*     *     *     *     *

౫. గుండు మధుసూదన్
పేదరికాన జన్మ, గురువే ఘనదైవము, తల్లి వేదనే
ఖేదము, విద్యలే విజయకేతనముల్, తన దేశభక్తియే
మోదము, దేశసాధనయె ముఖ్యము, దిక్కయె లేనివారి, కే
భేదము లాంధ్రకేసరిగఁ బెద్దను జేసిన వీ ప్రకాశమున్? 

(ఆంధ్రకే - సరిగ, ఆంధ్ర - కేసరిగ) 
*     *     *     *     *

౬. గోలి హనుమచ్ఛాస్త్రి
రొమ్ము జూపుచు చావును రమ్మనుచును
తెలుగు తెగువను తెలిపెను 'వెలుగు యొజ్జ'
కేసరి యను నామ మతనికే సరి యని
ఆంధ్ర మాతయె పలికిన యాప్త మూర్తి.
 
*     *     *     *     * 


౭. సహదేవుడు 
 
సుప్రకాశ భరత దేశ శోభ గోరి
రోషమున తుపాకి నెదరి రొమ్ము జూపి
శ్వేత గజముల స్వప్నాల సింగ మవ్వ
ఆంధ్ర కేసరి బిరుదమ్ము నతికె సుమ్ము!

పద్య రచన - 35


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

 కవిమిత్రుల పూరణలు


 ౧. పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
మోసపోయెను ద్యూతమున మున్ను ధర్మమే
          దౌర్భాగ్యము వరించె ధర్మమతుల
నంత దుష్టాత్ముల కవధులు లేనట్టి
          యధికార మవకాశ మటుల నబ్బె
రారాజునకు ప్రతీకా రాంధకారమే
          యంతరంగమ్మున నావహించె
దుశ్శాసనుండంత ద్రోవది కేశముల్
          బట్టుచు సభలో వివస్త్రజేయు
యత్నమున వలువ నూడ్చెడు నట్టివేళ
కృష్ణ “కృష్ణా!” యటంచు ప్రార్థించినంత
నక్షయమ్ముగ చీరె లయ్యబలకిచ్చి
మానసరంక్షణ మొనర్చె మాధవుండు.
(కృష్ణ = ద్రౌపది, కృష్ణా యటంచు ప్రార్థన మొనరించెను అని అన్వయము) 

౨. సుబ్బారావు
నిండు సభలోన ద్రౌపది నేకవస్త్ర
యనియు జూడక యొక దుష్టు డామె బట్టి
వలువ లూడ్వంగ కృష్ణుడు వలువ లిచ్చి
మానరక్షణ గావించె మానవతికి.

౩. గుండు మధుసూదన్
జూదములోన నోడె యమసూనుఁడు; పందెము గెల్చి తమ్మునిన్
మోదముతోడ ద్రోవదిని మూర్ఖసుయోధనుఁ డీడ్చి తెమ్మనన్;
బైదలి నీడ్చి తెచ్చి, సభవాకిట నిల్పియు వస్త్ర మూడ్చె, దా
మోదరుఁ డంత వస్త్రముల మోదముతో నిడి కాచె ద్రౌపదిన్!


౪. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
వరమున జన్మనందినది, పాండవవీరుల ధర్మపత్నియై

నిరత పతివ్రతాచరణనిష్ఠనుఁ బూనుచు సద్గుణాఢ్యయై
వరలిన యాజ్ఞసేనిని సభాసదులందరుఁ జూచుచుండగా
కరుణ యొకింత చూపక కుకర్ముడు, దుర్మదుడౌచు నప్పుడున్.
 

దుస్ససేనుండు సభకీడ్చి దుష్టుడగుచు
వస్త్రహీననుఁ జేయ ద్రోవదినిఁ బట్టి
యత్నమొనరింప నబలయై యార్తితోడ
“దేవ! లోకైకరక్షక! కావు” మనుచు
 

మొర పెట్టగ వెనువెంటనె
కరుణాత్ముండైన శౌరి క్రమముగ చీరల్
తరగని రీతిగ నొసగుచు
మురహరు డా కృష్ణ మానమును కాపాడెన్.
*     *     *     *     *
౫. రవి
రాలె - సితయశము రారాజమకుటశో
            భాయమానోజ్జ్వలితాప్తవరము,
తునిగె నల విపులఘనభుజావేష్టిత
           
శూరత - మార్తాండసుతుని గుణము,

ఈగె నిశ్శేషము రాగకల్మాషయు
            తాక్షదృష్టి శకునిపక్షశక్తి,
పతనమడిగె నిజభ్రాతప్రబలపరి
            ష్వంగిత్యురుతరదుశ్శాసనురము,
కౌరవాదులకుఁ దొడరె కాలవశము,
దమనమాయెనట ధరణి ధర్మ మెల్ల,
నిదురవోయె కొలువునందు నీతి నియతి,
కలియుగమ్మునకును నాంది కలిగె సుమ్ము.
(గుణము = character, అల్లెత్రాడు; అక్షము = కన్ను, పాచిక; శకుని = గాంధారరాజు, పక్షి; పక్షము = side, రెక్క)

శ్లేష కక్కురితితో కొంచెం సాహసించాను.తప్పులుంటే మన్నించి పెద్దలు సరిదిద్దాలి. 
  

27, జూన్ 2012, బుధవారం

రవీంద్రుని గీతాంజలి - 56

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

56

THUS it is that thy joy in me is so
full. Thus it is that thou hast come
down to me. O thou lord of all
heavens, where would be thy love if I
were not ?

Thou hast taken me as thy partner
of all this wealth. In my heart is the
endless play of thy delight. In my life
thy will is ever taking shape.

And for this, thou who art the King
of kings hast decked thyself in beauty
to captivate my heart. And for this
thy love loses itself in the love of thy
lover, and there art thou seen in the
perfect union of two. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము.....

తావకానందమునకు నాధార మేన,
త్రిభువనేశ్వర! క్రిందికి డిగ్గి యీవ
నన్నుఁ గలియనే యేతెంచినాఁడ వోయి!
యెట నిలుచునోయి నీ ప్రేమ యేను లేక? ||

వెంట నిడుకొను యీ మహావిభవమునకు
నన్ను భాగస్థుఁగాఁ జేసినాఁడ వీవ,
అంతు తెలియని రసమయమైన నీదు
ఖేలన మ్మది నామదిఁ దేలుచుండు,
పెక్కు రూపము లెత్తి జీవితమునిండ
నీతలంపులె *తరఁగలు నెరపుచుండు ||

అధిప! రాజాధిరాజవ యయ్యు, నిట్టి
పొందుకోసమ యందము జించుచుండు
నిద్దపుం గయిసేతల దిద్దుకొనుచు
వలపు గొలిపెదు నాయెద మెలఁగుచీవు,
ఇట్టి పొందునకై కదా! కట్టు వడును
స్వామి నీప్రేమ భక్తుల ప్రేమమునకు,
నాకు నీకైన సమ్మేళనమ్ములోనఁ
గ్రాలు నీ మూర్తి పూర్ణప్రకాశ మగుచు ||

సమస్యాపూరణం - 747 (రణ మది శాంతిసౌఖ్యముల)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

రణ మది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

పూరణలు 

౧.  హరి వేంకట సత్యనారాయణ మూర్తి
(1)
గణుతిని బెంచు సంఘమున, కావ్యములన్ రచియించు శక్తి, స
ద్గుణముల రాశులిచ్చు, కవికోవిద నామము దెచ్చిపెట్టు స
న్మణినిభమైన పద్యకుసుమాలకు నిష్ఠను బూని చేయు పూ
రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.

(2)
క్షణికములైన భోగములు కాంతలు, పుత్రులు గాన ముక్తికై
    గణపతిఁ గన్నతల్లి పదకంజయుగంబున కెల్లవేళలన్
    ప్రణతులు చేసి యంబికను భక్తిఁ స్మరించగ జేయునట్టి ప్రే
    రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.
 

౨. పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
ప్రణతులు దేవదేవ! సురరాజనుతా! గిరిజాతనూజ! వా
రణముఖ! సత్కవి ప్రకర రంజక వాగ్విభవాఢ్య! నీ శుభే
క్షణము శుభంకరంబని జగమ్ముల గాంచె ప్రశస్తి యోగ కా
రణమది శాంతి సౌఖ్యముల రాజిలజేయుచు గూర్చు శ్రేయముల్. 


౩. లక్ష్మీదేవి
(1)
అనుదిన మన్నదమ్ములయి హార్దిక సఖ్యముఁ బెంచుకోవలెన్.
మనమిటు భారతీయతను మానసమందునఁ నిల్పుకోవలెన్.
వినుమిక సింధుదేశమున వీడుము ద్వేషపు ధోరణుల్; నివా
రణ మది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్. 

(2)
ఝణఝణ మంచు నందియలు, ఝంకృతిఁ జేసెడు భృంగ నాదముల్,
గణగణ మ్రోగు గంటలును, గంగ నుఱుంగులు సేయు సవ్వడుల్,
రణనముఁ చిన్న పిల్లలును లౌక్యమెఱుంగక జేయ; తాప వా
రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్. 


౪. రవి
    గణగణ వేదమంత్రములు కర్ణములన్ రసపూరితం బొన
    ర్ప నయనముల్ విధూపముల పట్టున భాష్పములందు వేళలోన్
    మెణకరితండ్రి గూర్చునొక మెండగు పండుగ - జన్నిదంపు ధా
    రణ మది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.
(మెణకరి = బ్రహ్మచారి)

౫. సహదేవుడు
    (శ్రీకృష్ణ భగవానుడు సంధి జేయుటకు సుయోధనునితో పలికిన పలుకులు)
వినుము సుయోధనా! తమరు పెట్టిన బాధల నోర్చి పాండవుల్
నను నిటు దూతగన్ బనుప నాశము గోరక సంధి జేయగన్
కనుగొన వచ్చితిన్ జనుల గావగ యుద్ధము మాన్పగ న్నివా
రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.
    

౬. చంద్రమౌళి
    అణువది కారణం బదియె ఆప్తుల-వైరుల కల్గజేయు మా
    రణమగు- భోగవంత మగు రాజిల పల్కుల భావధాటి తా
    రణమగు- మృత్యుఘోర మగు రంజిల తద్రసనాగ్ర శబ్ద తో
    రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.
 

౭. రాజేశ్వరి నేదునూరి...
    గణనము చేసి చూడగను కారణ మేమియు గాన రాదిలన్
    మణిమయ మైన జీవితపు మారుని బోలిన భర్త చెంతనే
    అణకువ లేక నాగరికతాతిశయంబును వీడి మానుమా
    రణమది శాంతి సౌఖ్యము లరాజిలఁ జెయుచుఁగూర్చు శ్రెయముల్ !
 

౮. గుండు మధుసూదన్
(1)
ప్రణతు లొనర్చి విఘ్నపతిఁ బ్రార్థన సేయఁగ విద్య లిచ్చి, ష
డ్గుణముల డుల్చి సన్మతినిఁ గూర్చి, ముదమ్ములఁ బేర్చి, స
త్ఫణితి నొనర్చి, వేగ ననుఁ బాలన సేసెడి నాదు జన్మతా
రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.
(2)
గణపతి, విఘ్నహారియు, నగాత్మజకున్ తొలి పుత్రకుండు, స
ద్గుణములఁ బెంచు వేలుపునుఁ, గుంజరశీర్షుఁడు, వక్రతుండుఁ డీ
ప్రణతుల స్వీకరించఁగను బ్రార్థన సేయఁగ నన్ను దేర్చు కా
రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.


౯. మిస్సన్న(1) 
పణముగ బెట్టి దేశ హిత భాగ్యములన్ తన బాగుకోసమై
    గనులను, కొండలన్, వనుల, కాల్వల, చెర్వుల, బీడుభూములన్
    తనవిగ నెంచి దోచుకొను త్రాష్టుల శిక్షల జేయ వృద్ధి కా-
    రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్
(2)
ధనములు ధాన్యముల్ సిరులు దారయు బిడ్డలు నన్ని సౌఖ్యముల్
    క్షణికము లన్న సత్యమును చక్కగ నమ్మి మనమ్మునందు ల-
    క్షణముగ సర్వ కర్మముల శంభున కర్పణ జేయ మోక్షతో-
    రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.


౧౦. ‘మన తెలుగు’ చంద్రశేఖర్    
అణుగుచు నాత్మగౌరవము ‘అంతొనియా’కు పణంబుగానిడెన్
    కణకణ మండగా ధరలు కట్టడి జేయక నూరకుండె నా
    ప్రణబుని కాంగ్రెసాత్మజుని రాష్ట్రపతిత్వము క్షేమమా? విచా
    రణ మది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.
(గమనిక: సోనియా అసలు పేరు అంతొనియా. )

౧౧. కమనీయం
గుణనిధి,నాదు మాటలను గూరిమితో విను రాఘవేంద్రుతో
రణమన సర్వ నాశనకరంబగు,లంకకు జేటు దెచ్చు,రా
వణ! తగుసంధి కియ్యకొనవయ్య , మహోద్ధత యుద్ధమున్ నివా
రణమది శాంతి సౌఖ్యముల రాజిల జేయుచు గూర్చు శ్రేయముల్ .

 
 

పద్య రచన - 34


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

కవిమిత్రుల పద్యములు

౧. పండిత నేమాని
వనమయూరము:
ఆకసమునందు జలదాళి విలసిల్లెన్
శ్రీకరముగా ప్రకృతి చిత్ప్రభల నీనెన్
కేకిజత మైమరచి క్రీడలను దేలెన్
ప్రాకటముగా గొలుపు వర్షములు వేడ్కల్.


౨. లక్ష్మీదేవి
నీలపు కన్నుల సోయగ
మేలనొ నన్నిటుల లాగె; నీ విధి నన్నున్
బేలగ జేయుచు నాడెద
వేలనొ? యిరువురము కూడి యిక నాడుదమా!

నీలిమ నాకస మ్మొసఁగ నీ సొబగుల్ మరి యింతలయ్యెనో!
చా లనిపించకున్న దది చక్కని నాట్యముఁ జూచుచుండ; నీ
మ్రోలను వాలితిన్ దయను మ్రొక్కులు చేకొని నన్నుఁ జేరుమా!
మేలము లాడబోకు, నిను మించిన పింఛము లేదటంచు నన్.


౩. సుబ్బారావు

    ఆకసంబున మేఘంబు లావరించి
    వాన కురియంగ సంతోష మూన కేకి
    జంట పింఛము లాడించి జతను గలిసి
    కామ కేళిని విహరించ కాంక్ష నొందె.

౪. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
    అద్భుతంబుగ పురివిప్పి యాడబూని
    వనమయూరంబు భాసిల్లు వైభవముగ
    భావములు పొంగు మదినుండి భవ్యమైన
    కవిత లేర్పడు దానిని గాంతు మేని.

    పింఛమునఁ జూడ కన్నులు విస్తృతముగ
    నమర నందంబు లొలుకుచు నా మయూర
    మెదురుగా నున్న సకియతో నీ విధముగ
    ముచ్చటించుచు నుండె ప్రమోదమునను.

    హృదయ మలరెను, యొడలెల్ల ముదముతోడ
    పులకరించెను, జలదంబు పలుకరించె
    మందమారుత మదివీచె సుందరముగ
    రమ్ము విహరింతు మోసఖి! రమ్యభూమి.


౫. గుండు మధుసూదన్
(శ్రీ పండిత నేమాని వారి స్ఫూర్తితో, వారికి ధన్యవాదాలతో)
వనమయూరము
ఓ కవియఁగా వనమయూరము కలాపిన్
గోక పురివిప్పి జతఁగోరి మనువాడన్
గేకిసలు గొట్టుచును కేకి నిటఁ గూడన్
లోకమున వర్షములు లోలతను జూపెన్.
(ఓ = మేఘము)    


౬. రాజేశ్వరి నేదునూరి
నెమలి పురివిప్పి యాడగ నీటి దొలువు
గగన మందుండి మురియుచు కనుల విందు
పరవశించిన చెలి కేకి పులకరించి
అశ్రు బిందువు గ్రోలగ నాశ పడియె.
(నీటి దొలువు = మేఘము , జలదరము )

26, జూన్ 2012, మంగళవారం

రవీంద్రుని గీతాంజలి - 55

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

55

LANGUOR is upon your heart 
and the slumber is still on your eyes.

Has not the word come to you that the flower is reigning in splendour among thorns ?
Wake, oh awaken ! Let not the time pass in vain !
At the end of the stony path, 
in the country of virgin solitude 
my friend is sitting all alone.
Deceive him not. Wake, oh awaken !

What if the sky pants and trembles 
with the heat of the midday sun -
What if the burning sand spreads its mantle of thirst-
Is there no joy in the deep of your heart ?
At every footfall of yours, 
will not the harp of the road break out 
in sweet music of pain ? 

చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

కాల మింతయు రిత్తగాఁ గడవనీక
మేలుకొనుమోయి! మనుజుఁడా! మేలుకొనుము ||

అలఁపుఁదెర యింక మనసుపై నిలిచె నీకు,
నీ యుషోదయవేళ యింకను దీయలేదు
నీదు కన్‌రెప్పలం గప్పు నిదుర ముసుఁగు,
నీ వెఱుంగవొ పూవులు నిండు ఠీవి
ముండ్లపై రాజ్య మేలెడి ముచ్చటలను?
కాల మింతయు రిత్తగాఁ గడవనీక
మేలుకొను మోయి! మనుజుఁడా! మేలుకొనుము ||

పట్టపగలింటి యెండదెబ్బకు నభంబు
కంప మెత్తుచు బిట్టు వగర్చు టేల?
కప్పుకొన నేల దిక్కులు దప్పిగొంచు
నెల్లవైపుల మండెడి యిసుకకొంగు?
కాని, యచటఁ బ్రమోదము కలదొ? లేడొ?
తొంగిచూడు మెడందలోతులకు డిగ్గి,
వేయు నీ యడుగడుగున విరియదొక్కొ
పథవిపంచిక వేదనా మథురగీతి? ||

సమస్యాపూరణం - 746 (యముఁ గని ముచ్చటంబడి)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

యముఁ గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

పూరణలు....

౧. పండిత నేమాని
 సుమధుర భక్తి భావ రస శోభితమై పరమార్థ తత్వసా
రమయమునై సువర్ణ సమలంకృతమై శుభ లక్షణాఢ్యమై
కమలదళాక్షు లీలలను కమ్రగతిన్ వివరించు పద్యకా
వ్యము గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్. 



౨. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
    సమరమునందు తానచట శస్త్రముఁ బట్టనటంచుఁ దెల్పి న్యా
    యమునిక ధర్మమున్ నిలుప నర్జునసారథియౌచు నెల్లెడన్
    భ్రమలను ద్రుంచి కృష్ణుడు శుభంబులు గూర్చగ గోరి చేయు సా
    యముఁ గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్.


౩. గుండు మధుసూదన్

మమత విరాజిలంగ నసమాన విశేష పునీతమైన ధ్యే
యముఁగని ముచ్చటం బడి మహాకవి మెచ్చెను; శారికా నికా
యముఁగని ముచ్చటం బడి మహాకవి మెచ్చెను; జాహ్నవీయ తో
యముఁగని ముచ్చటం బడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్.


౪. ‘మన తెలుగు’ చంద్రశేఖర్
క్షమి యయి తిక్కనార్యు డిరు కైతల మిత్రుడు ధర్మరూప సా
రమతి విరాటపర్వమున రమ్య విశేష పదార్థ భావనా
దమిత పుమాంస సంవరణ ధారి బృహన్నలఁ పాండుసూన మ
ధ్యముఁ గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్

౬. లక్ష్మీదేవి
అమల గుణాళిచే జగతి నంతట కీర్తినిఁ, బొంది నిల్చుచున్,
సమరస శోభలన్ కలిగి సద్గతి నిచ్చెడు కావ్యసృష్టిలో
నుమ తనయుండు విఘ్నపతి యొద్దిక తోడను జేయు వ్రాత సా
యముఁ గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్.

౭. సంపత్ కుమార్ శాస్త్రి 

 లోకకల్యాణమైన సీతారాముల వివాహముతో, దశరథులకు, జనక మహారాజుకు కలిగినటువంటి వియ్యము గాంచి ఒక మహాకవి సత్కృతి చేసినాడని.........

సుమధుర సుప్రసన్నుడగు సుందరమూర్తి రఘూత్తముండు శ్రీ

కమలదళేక్షణనన్ ముదితఁ గన్నియ సీతను పెండ్లియాడగా
నమరిన సర్వలక్షణ సమంచితమై వెలుగొందుచున్న వి
య్యముగని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్.

౮. రవి
    శ్రమపడి వచ్చెనంచుఁ గడు సమ్మతి తోడ ప్రశస్తభోజ్యశా
    కములును నావఠేవ, పెరుగన్నము, సూపము లుంచఁ బ్రీతిగా -
    తమకము మీరగా మెసవి తన్మయ మందుచు త్రేన్చి, తృప్తితోన్
    గమగమ వాసనల్ చెలగు కమ్మని వంటను, గేస్తు యాతిథే
    యముఁ గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్.



౯. డా. విష్ణు నందన్
    యమ నియమానువర్తులయి , ధ్యాన తపః పరికల్పిత ప్రభా
    వమున జరించు తాపసులు పావన సత్య మహద్వచో విలా
    సములు స్ఫురింప నొక్కెడ ప్రసన్న మనస్స్థితి జేయు వాజపే
    యముఁ గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్ !


౧౦. రాజేశ్వరి నేదునూరి
    తమిగొని సుందరంబగు సుతారపు చంద్రిక నీలి నీడలన్
    యమునను గాంచి నంత హృదయమ్మున పొంగెడు కావ్య కంజముల్
    కమల భవుండు మమ్ము గని కన్నుల విందొనరించు రామణీ
    యముఁగని ముచ్చటం బడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్ ! 


౧౧. సహదేవుడు
(అభిజ్ఞాన శాకుంతలం భూమికగా)

సుమశరు తూపు కౌశికుని, సుందరి మేనకఁ గూడఁ జేయఁగన్
సుమసుకుమార పుత్రిఁగని చూడక గానల వీడ, కణ్వు నా
శ్రమపు శకుంతలాఖ్య యయె,రాజొకఁ డామెను జూచు, నాటకీ
యము గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్ !


౧౨ శ్రీపతిశాస్త్రి
 
    విమలయశోభిభూషణుడు విప్రకుమారుడు తల్లిదండ్రుల
    న్నమలిన భక్తిభావమున యాత్రలు త్రిప్పుచు పుణ్యతీర్థముల్
    క్రమముగ జూపుచుండెనట కావడి మ్రోసెడు లేత ప్రా
    యముఁ గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్. 





౧౩. కమనీయం
అమలమనస్కుడైన సఖు డత్యనురక్తి కళావిశేషతన్
కొమరుగ గద్యపద్యముల గోమలశైలి రచించి చూపగన్
సమమగురీతి దానిని విశాలహృదిన్ సువిమర్శ జేసి కా
వ్యముగని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె ,సత్కృతిన్ .

 

 

పద్య రచన - 33


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

కవిమిత్రుల పద్యములు


 ౧. పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
శరతల్పంబున వ్రాలి భీష్ముడు పిపాసన్ బొందగా క్రీడి చె
 చ్చెర భూగర్భ పవిత్ర నీరముల దెచ్చెన్ దాహమున్ దీర్చగా
కురువంశాగ్రణి కిచ్చె సాదరముగా కూర్మిన్ తదాశీఃపరం
పరలం బొందెను పుణ్యపూరుషుల సేవల్ గూర్చు సద్యోగముల్.

౨. సుబ్బారావు
బాణ నిర్మిత శయ్య పై బవ్వళించు
భీష్ము దరి జేరి కవ్వడి ప్రియము తోడ
గరిమ బాణాన పాతాళ గంగ దెచ్చి
తీర్చి దాహము దీవనల్ దీసికొనెను.


౩. హరి వేంకట సత్యనారాయణ మూర్తి

శరముల శయ్యపై పడిన శంతనుపుత్రుడు దాహపీడతో
నరయగ నీటికోసమపు డర్జునుడాదర మొప్పగా వడిన్
వరమగు బాణయోగమున భవ్యములౌ క్షితిగర్భనీరముల్
ధరణికిఁ దెచ్చె నందరును ధన్యుడటంచుఁ దలంచ ఖేచరుల్.

సవ్యసాచి మరియు సాక్షాత్తు విష్ణువౌ
చక్రధరుని ప్రాణసఖుడె గాక
సత్యదీపితుండు శక్తియుక్తుండౌట
జగతిలో నతని కసాధ్యమేది?

పరవశించి యంత వాత్సల్యపూర్ణుడై
పిలిచి చేరదీసి భీష్ము డెంతొ
తుష్టి చెంది యొసగె నిష్టార్థసిద్ధికై
ఆశిషంబు లప్పు డర్జునునకు.

వృద్ధజనుల సేవ శ్రద్ధతో జేసిన
వారి కబ్బు సకల వైభవములు
విజయసిద్ధి గలిగి విజ్ఞత చేకూరు
సందియంబు లేదికెందుఁ జూడ.

౪. లక్ష్మీదేవి

"విష్ణువంతట వ్యాపించె విశ్వమందు
వాని సన్నిధి పెన్నిధి, భాగ్యమం"చు
దివ్యసందేశమునొసంగె దేవవ్రతుఁడు
నామ మహిమను లోకము నమ్ము రీతి

అంపశయ్యపై శయనించి యాత్మలోన
పరమ పురుషుని ధ్యానించు భాగవతుని
యార్తి దీరంగ నవ్వేళ నర్జునుండు
గంగ నందించె విలువిద్య ఘనతఁ జూపి

౫. గుండు మధుసూదన్

భారతయుద్ధమందుఁ గురువర్యుఁడు భీష్ముఁడు నేలఁగూల, దు
ర్వారనిషంగుఁ డర్జునుఁడు వచ్చి, పితామహుఁ డంపశయ్యనుం
గోరఁగ నేర్పరించి, తన కోరిన గంగ జలమ్ము నిచ్చెఁ గం
సారియు ధర్మజుండు ననిలాత్మజుఁడున్ గవ లెల్ల మెచ్చఁగన్.


౬. ఫణి ప్రసన్న కుమార్

    ఘోర రణంబునన్ బెనగి కోటువమూకల గూల్చి నిల్చి కం
    జారుని భంగి మించి యిక చాలని వాలితివంపశయ్యపై
    వీరుడవయ్య శాంతనవ! వేసట తీరగ గంగ తెచ్చె నీ
    కోరిక మేర ఫల్గునుడు గ్రోలుము జాహ్నవి ప్రేమ ధారలన్


౭. డా. విష్ణు నందన్
    శర సంధాన పరాక్రమాకలన దీక్షా తంత్రమేపార దు
    ర్భర శోకమ్ము నడంచి యర్జునుడు దివ్యాస్త్ర ప్రభావమ్ముతో
    ధరణిన్ జీల్చి సృజించె స్వచ్ఛతర పాతాళాపగా తీర్థమున్
    శర తల్పంబుననున్న భీష్ముని పిపాసన్ దీర్ప బేర్మిన్ ; మహా
    తిరథుల్ కౌరవ పాండవుల్ వగవ నార్తిన్ ; కృష్ణుడీక్షింపగా !!!
   
౮. రాజేశ్వరి నేదునూరి
    బ్రహ్మ చారిగ మిగిలెను ప్రతిన బూని
    వరము పొందెను స్వచ్చంద మరణ మనుచు
    అష్ట వసువుగ ముక్తుడై కష్ట పడగ
    అంప శయ్యను కోరినా డాత్మ విదుడు


 
 



25, జూన్ 2012, సోమవారం

రవీంద్రుని గీతాంజలి - 54

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

54

I ASKED nothing from thee ; I uttered
not my name to thine ear.
When thou took'st thy leave I stood silent.
I was alone by the well where the shadow of the tree fell aslant, 
and the women had gone home with their brown earthen pitchers full to the brim.
They called me and shouted, " Come with us, the morning is wearing on to noon."
But I languidly lingered awhile lost in the midst of vague
musings.

I heard not thy steps as thou earnest.
Thine eyes were sad when they fell on me ; 
thy voice was tired as thou spokest low 
"Ah, I am a thirsty traveller".
 I started up from my day- dreams 
and poured water from my jar on thy joined palms.
The leaves rustled overhead ; the cuckoo sang from the unseen dark, 
and perfume of babla flowers came from the bend of the road.

I stood speechless with shame when my name thou didst ask. 
Indeed, what had I done for thee to keep me
in remembrance ?
But the memory that I could give water to thee to allay thy thirst 
will cling to my heart and enfold it in sweetness. 
The morning hour is late, the bird sings in weary notes, 
neem leaves rustle overhead and I sit and think and
think.

చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము.....

ఎదియు కోరఁగలేదు ని న్నేను, తుదకుఁ
బేరుసైతము నీచెవిన్ వేయలేదు,
వీడుకోలున యేని నీతోడ నొక్క
పలుకు పలుకక ముగుదగ నిలిచిపోతి,
వాపి రేవునకుం దిగు వేపచెట్ల
నీడలో నప్పు డొంటిగ నిల్చియుంటి,
నీళ్ళు గొని చను పడుచులు నిండు కుండ
లెత్తుకొని తాము మఱలిరి యిండ్లవైపు,
చనుచు నన్ బిల్చి పల్కిరి “పందె పొల్పు
వాడి ప్రొద్దెక్కె, రమ్ము మాతోడ, *నిప్పు
డే పరధ్యానమం దుంటి విచట?” నంచు,
కాని నే నప్పు డస్పష్టమైన గీతి
పాడుకొనుచుండి నడుమన వీడలేక
యలసగతి నట్లె యొంటిగ నిలిచి యుంటి ||

వచ్చు తఱి నీదు కాలి సవ్వడిని గూడ
నేను వినలేదు, ఖేదము నిండియున్న
చూపు నాపయి వ్రాల్చి సంతాపదీన
మైన క్షీణస్వరమ్ముతో “నయయొ! దప్పి
గొన్న పథికుఁడ” నంచు నీ వన్న యపుడె
పగటికలనుండి నేఁ ద్రుళ్ళిపడుచు లేచి,
కడవలోపలి విమలోదకములు నీ క
రాంజలిం బోయఁ దొడఁగితి, నపుడు మీదఁ
గదలు వేపాకులుం గలగలని మ్రోసె,
ఏ యిరులు కోనపైనొ కోయిలయు కూసె,
నడవ మలుపున విరిసెడి కడిమిగున్న
పూలతావుల కొంగ్రొత్త పొంగు డాసె ||

అపుడు “పేరే?” మటంచు నీ వడుగ మారు
చెప్పకే నిల్చియుంటిని సిగ్గు పడుచు,
నిజముగా నన్ను జ్ఞప్తిలో నిల్పుకొనఁగ
నే నొనర్చిన ఘనకార్య మేమి కలదు?
కాని “నీ దప్పి చల్లార్ప నే నొకింత
జల మొసంగితి” నన్న యీ తలఁ పొకండె
మధురపాథేయమై సదా మరపురాక
నా మనమ్మునఁ గమ్మఁదనమ్ము నింపు,
గడచె వేకువ, మధ్యాహ్నకాల మయ్యె,
నలఁపు గొంతుల రేవుపైఁ బులుఁగు లరచె,
*నట్లె వేపాకు గలగలలాడుచుండె,
ఏదొ తలఁచుచుఁ దలఁచుచు నింక నట్లె
గూరుచుంటిఁ బరాకునఁ గూరి యేను ||

దత్తపది - 21 (అక్క, అన్న, వదిన, మామ)

కవిమిత్రులారా,

‘అక్క - అన్న - వదిన - మామ’

పై పదాలను ఉపయోగించి

రావణునకు మండోదరి చేసిన హితబోధను తెలుపుతూ

మీకు నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాయండి.

పూరణలు -

౧. హరి వేంకట సత్యనారాయణ మూర్తి 
అక్కట! నాశనకారణ
మిక్కాంతను దెచ్చుటన్న నీయమ నీకున్
దక్కదు నీ వది నమ్మిన
నక్కఱపడు మామకీనమౌ వాక్యంబుల్.


౨. మిస్సన్న 

పర పురుషుని భార్యన్నను
వరుసకు నక్కనియొ లేక వదిననొ యనుచున్
చరియింప నెరుగమా మరి
మరియాదయె సీత గోర మహిత గుణాఢ్యా?


౩. గోలి హనుమచ్ఛాస్త్రి  

అక్కటా రాముని సతి పై యాశ వదలు
మన్న మామాట వినవెట్టి మాయ గ్రమ్మె
క్షేమ మా మనుజ పతి యనిని జేయకున్న
వినవ దినకర కులజుని వేడు శరణు.


౪. లక్ష్మీదేవి 

సతినను యక్కర తో విని,
పతియన్నను దేవుడనెడు పడతిని విడుమా!
పతిసేవ దినదినమ్మది
క్షతి నీకగు, మా మనమ్ము కాంచెను దనలో.
 

(పతిసేవ అనునది పతివ్రతా లక్షణము. అది యాయుధమై నీకు క్షతి కలుగునని చెప్పుట.)

౫. గుండు మధుసూదన్  
నాథ! య క్కపివరు మాట నాలకించి,
య న్నరుని భార్య సీతను మన్నన లిడి
నీవ దినమణి కుల ఘను నికటమునకుఁ
జేరఁగాఁ బంపుమా మనసార నిపుడ!


 
౬. సుబ్బారావు 
మామ మాటను విని నీవు మగఁడ ! యిపుడు 
వదిన సీతను రామన్న వశము జేసి
మమ్ము కాపాడు నిన్ను నే నమ్మినాము
కాని యెడలన నక్కట ! కాలు గతియె .


౭. ‘మన తెలుగు’ చంద్రశేఖర్  
నీ విపు డక్కడ కేగుము
కావుము రామన్న! సీతఁ గైకొను మనుమా!
బ్రోవ దినకర కులోన్నతు
డావం తైనను కొదకొనడన విను మామా!


౮. రవి 
అక్కరకు రాని మోహము
నిక్కటులన్ దెచ్చు యొలియు నింద్యము, విడుమా,
క్కువ యన్నది లేదా?
ఇక్కువ దినకరకులజుడు నెఱుగడె నాథా!
 
 ౯. నేదునురి రాజేశ్వరి
మిక్కుటముగ జేయుటన్న మిన్నతి గాదే ! 
చక్కగ వదినగ నెంచుచు 
మ్రొక్కెదను శపించకుమా మము దేవుడవై !
 
౧౦. సహదేవుడు
 
అక్కడి పతియే మదిలో
నిక్కడ కలడన్న సీతనిక నీవిడక
న్నిక్కిన చావది నక్కును
జక్కగ వినుమా! మముగని జాతిని నిలుపన్!
 
౧౧. చింతా రామకృష్ణారావు

అక్కమలాయతాక్షిఁ గని హద్దులు మీరుచు తెచ్చినాడవే!
నిక్కము,దోషమిద్ది!ధరణీపతి తప్పక వచ్చు, నన్నతో
నిక్కము వచ్చు లక్ష్మణుఁడు నేర్పున తా వదినమ్మ రక్షకై.
మక్కువ వీడు మింక. విడుమా మహితాత్మను రావణ ప్రభూ!

౧౨. కమనీయం

అక్కటా, నా పలుకు చెవి కెక్క కుండ ,
సీత విడుమన్న విడువవు చెరుపు చాల
దెచ్చు మనకెల్లరకు నీవ దినకులవరు
నకుసమర్పించు మామనవి నమ్ము నిజము.
13. గరికిపాటి నరసింహ రావు 
అక్కట భార్య లిందరు మహాసుగుణాఢ్యలు సుందరీమణుల్
జక్కఁగ నిన్ను గొల్వఁగ విచారణ మన్నది లేక జానకిన్
గ్రక్కున దెచ్చి కొంపలను గాలిచి మామక బోధ నెట్లు నే
దిక్కునఁ ద్రోసినా వది నదిన్ జలధిన్ బడఁద్రోసినావొకో!   

పద్య రచన - 32


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

స్పందించిన కవిమిత్రులు

౧. లక్ష్మీదేవి

చిన్నికృష్ణ! నీ యల్లరి చేష్టలింక
మానుమయ్య, వినుము నాదు మాటలిపుడు
నల్లనయ్య! కోపమ్మేలనయ్య ! ముద్దు
లొలుకు తండ్రి! నిన్నుగనగ నూరిలోని
గొల్లభామలెల్లరు వచ్చి గొప్పపనులు
తమరు చేసినారంచును, తగవు బెట్టి
చోద్యమంచు నిలిచి యుండి చూసినట్టు
చెప్పిన కథల నమ్ముటె? చిన్నవానిఁ
జూచి యోర్వలేక పలుకుచుంద్రు వారు.
పాలు వెన్నలింట నదులు పాఱుచుండు
నీకు కొఱత వచ్చునొ? యింపు నీకు కలుగ!

నెల్లవేళల దొఱకునవెల్ల నీకు.

౨. సుబ్బారావు

మన్ను తిం టివి లోటు రా వెన్న నీ కు
ఏమి యీ పని ? తిం దు రె యె వ్వ రైన
నెందు బోకుము కద లకు మిచట నుండి
ననుచు నా యశో దమ్మ నె దనయు తోడ

కుండ నిండుగ నుండెను గృష్ణ ! వెన్న
తనివి తీరను భుజియించు తప్పు పట్ట
నంతె కాకయ పొరుగింటి చెంత కేగ
చెంప వాయింతు లాగుదు చెవులు నీవి .

౩. హరి వేంకట సత్యనారాయణ మూర్తి

చిట్టికన్న! నీవు చేయకల్లరి నాన్న!
దౌష్ట్యమింతయేని తగదు నీకు,
ఇరుగు పొరుగువారి నీరీతి బాధించి
గోల చేయుటెల్ల మేలు గాదు.

చిన్ని కృష్ణ నిన్ను మన్నించగాబోను
మన్ను తింటివంచు మాకు దెలిసె
పాలు పెరుగు వెన్న చాలక పోయెనా?
చెప్పరోరి బిడ్డ! తప్పులేల?

కల్లలాడవద్దు కన్నయ్య! నీవింక
మన్ను తినుట నిజమ? నన్నుఁ జూచి
చెప్పుమయ్య తండ్రి! చేరలు నిండంగ
వెన్నఁ బెట్టు దాన వినుము కృష్ణ!

వాదులాట లేల వారింటి పడతితో?
వీరిబిడ్డతోడ భేదమేల?
వెక్కిరింతలేల పెద్దవారలతోడ?
చిన్ని కృష్ణ! నీకు చెప్పుమయ్య!

బుద్ధి గలిగి యుండు, పోవల దటునిటు
కోప మింత నాకుఁ గూర్చబోకు
మని యశోద పలికె, నామోహనాంగుడే
పరమపురుషుడంచు నెరుగలేక.

౪. పండిత నేమాని

కన్నయ్యా! కన్నయ్యా!
విన్నావా యిరుగు పొరుగు వెలదుల పలుకుల్
తిన్నావా వారిండ్లను
వెన్నలు మీగడ లనుచు చెవిని నులుపంగా

అమ్మా! అసత్యములనే
అమ్మానిను లాడుచుందు రవి వినకమ్మా!
అమ్మాయావులు నన్నెపు
డమ్మో వేధించు చుందు రవహేళనతో

అనుచున్ దల్లికి విన్నవించుకొను ప్రేమానంద శోభామయున్
వనజాతాయత లోచనున్ వరగుణస్వాంతున్ ప్రశాంతున్ ఘనా
ఘన నీలాంగుని గోపికాప్రియు శుభాకారున్ యశోదాసుతున్
మనమారన్ వినుతించి మ్రొక్కులిడుదున్ మా తప్పులన్ గావగా





వందే గోకుల బాలం
వందే శ్రీకృష్ణ మఖిల భక్త శరణ్యం
వందే నందకుమారం
వందే సురబృంద వినుత భవ్య గుణాఢ్యం

౫. ‘మనతెలుగు’ చంద్రశేఖర్

వెన్నడు దొంగిలి జేసిన
దెన్నడు? కన్నడు యశోద కెన్నడు చిక్కెన్?
మన్ననగ వెన్న రూపము
నున్న తెలిప్రేమ కోలగ చిక్కెన్!


౬. నేదునూరి రాజేశ్వరి 
మన్ను తింటివ మనకింత వెన్న కఱువ
చెవి మెలేసియు బెదిరించె చిన్ని కృష్ణుఁ 
దెఱఛి చూపిన యానోట వెఱగు పడుచు
భువన భాండము నిండిన బొజ్జ కనగ ! 


౭. సహదేవుడు

వెన్న గిన్నె నేల వీధుల దేచ్చేవు
నాడి పోసు కొనగ నాడ వారు
దొంగ వాడవనుచు తోటి వారాలు దిట్ట
నింద లన్ని స్తుతుల? నీకు కృష్ణ?

౮. మిస్సన్న

నల్ల పిల్లి వోలె మెల్ల మెల్లన జేరి
వెన్న పాలు పెరుగు కన్నమేయు
గొల్ల పడుచులంత గోలెత్తి రా తల్లి
కొంగు చాటు జేరు దొంగ బుడుత.

అమ్మ యెంతగాను రమ్మని పిలిచినా
పాల బువ్వ తినక పరుగు వెట్టు
పరుల యిండ్ల దూరి పాల్వెన్న కాజేయు
ఏమి చోద్యమమ్మ యింతులార.

నల్ల కలువ మోము పిల్లన గ్రోవియున్
ఘల్లు ఘల్లు మంచు కాలి గజ్జె
చిట్టి పొట్టి యడుగు లిట్టిట్టు వేయుచు
అందు నిందు తిరుగు నందు పట్టి.

చేత కొంత వెన్న మూతిని మరి కొంత
మెడను గోరు పులిది మెరయుచుండి
బెట్టు సేయు ముద్దు పెట్టవేరా యన్న
చుట్టు బుంగ మూతి సున్న వోలె.

* వందే కృష్ణం భజామ్యహం *


౯. కమనీయం

చిన్ని కృష్ణ నీవేలరా ,మన్ను దింటి
వన్నయున్,సఖులు చెప్పుచునున్నవారు
నేవి వలసిన కల మన యింటియందు
నేమి లోటని యిటు జేసితీవు ,తప్పు.

నిన్ను దండింతు కదలక నిలువుమంచు
తల్లి యనగ నమాయకత్వము నటించి
అమ్మ,మన్నుదినంగ నేనంత యల్ప
బుద్ధిగాను ,నన్ శిక్షింప బోకు మమ్మ.

తనపై కొండెము లాడుచుండ్రి బలభద్రాదుల్ వినంబోకుమా
జననీ వారల మాట కల్ల నిజమున్ జాటించి నే బల్కెదన్
కనుమా యంచును నొరు విప్పగను లోకాలన్ని కన్ పించగా
దన లీలన్ భ్రమియింప జేసెడి హరిన్ దైత్యారి నే గొల్చెదన్ .