23, జులై 2012, సోమవారం

పద్య రచన - 59


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

  1. నా కృతి శ్రీమదధ్యాత్మరామాయణము నుండి:

    వేనవేలుగ పర్వతమ్ములు పెద్ద కొండలు బండలున్
    వానరుల్ గొని తెచ్చుచుండగ వానినెల్లను వార్ధికిన్
    బైని తేల్చుచు గట్టె చక్కని వారధిన్ నలు డొప్పుగా
    ధీనిధానుడు రామచంద్రుని దీవెనల్ గొని వేడ్కతో

    రిప్లయితొలగించండి
  2. నలునుని గూడి వానరులు నైపుణి జూపుచు వారధిన్, సదా
    దలచుచు రామ నామమును, దామదె గట్టగ రాముడప్పుడా
    జలధిని దాటె రావణునిఁ జంపగ యుద్ధము జేసె గొప్పగా
    బలమునుఁ జూపి దానవులఁ బాఱగ జేయుచు సీతఁ గాచెనే.

    రిప్లయితొలగించండి
  3. రామ నామంబు జెక్కిన రాళ్ళు పేర్చి
    సేతు గట్టెను వానర సైన్య మచట
    రామ లక్ష్మణు లిరువురు రణము సేసి
    సంహ రించిరి రావణు సఖుల తోడ

    రిప్లయితొలగించండి
  4. రామ బాణమ్ముసంద్రుని రౌద్ర మణచ
    రామ నామమ్ముసోకంగ రాళ్ళుదేలె
    ఉడుత వారధిఁ గట్టగ నూతమీయ
    కొట్టి రావణుఁ రాముఁడు బట్టెఁసీతఁ!

    రిప్లయితొలగించండి
  5. రావణ సంహారమునకు
    కావలె వారధియొకటని కపులందరుసం
    భావించి కట్ట నెంచిరి
    పావనశ్రీరామనామ పదపలకలతో!!!

    రిప్లయితొలగించండి
  6. కట్టినది వానరములట,కడలి పైన,
    తేలియాడు సేతువట,యిదేదొ కవుల
    కల్పనయని నమ్మరుకాని,గగన చారి
    చిత్రముల బయల్పడె గాదె సేతువిపుడు.

    వైరిదుర్భేద్యము ,నసుర వీర రక్షి
    తమ్ము ,లంకాపురమ్మబ్ధి దాటి చేర
    సేతుబంధనమును జేసి ,చెలగి ముట్ట
    డించి ,రాముడు జయము సాధించె గాదె.

    (గగనచారి చిత్రములు =satellite pictures )

    రిప్లయితొలగించండి
  7. పండిత నేమాని వారూ,
    మీ రామాయణ కావ్యం నుండి ఉద్ధరించిన సేతుబంధన పద్యం సుందరంగా ఉంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ వృత్త రచనా నైపుణ్యం రోజురోజుకు మెరుగులు దిద్దుకుంటున్నది. అభినందనలు.
    ఇక్కడకూడా నలుని, నలునిన్ అనవలసింది నలునుని అన్నారు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో యతి తప్పింది. ‘సేతు గట్టుట’ కూడా తగనిదే. ఆ పాదాన్ని ఇలా మారుద్దాం ‘సేతువును గట్ట వానరసేన యచట’
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    కాని చిత్రంలో కనిపించే వానరులను ఉపేక్షించి, కనిపించని ఉడుతను ప్రస్తావించారు... :-)
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పద్యం చక్కని నడకతో మనోహరంగా ఉంది. అభినందనలు.
    ‘పదపలకలు’ దుష్ట సమాసం కదా! ‘పదముల శిలలన్’ అందాం.
    *
    కమనీయం గారూ,
    మీ పద్యాలు ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. గురువు గారు,
    ధన్యవాదాలండి.
    నలుడు, ననేక వానరులు/సమస్త వానరులు అంటే సరిపోతుంది. అనవచ్చునా?

    రిప్లయితొలగించండి
  9. రామ నామము తో కోతి రాటు దేలు
    రామ నామము తో నీట రాళ్ళు దేలు
    రామ నామము భూజకు రక్ష గూర్చు
    రామ నామము భూజన రక్ష గూర్చు

    రిప్లయితొలగించండి
  10. హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించండి.
    మీ పద్యం శబ్దాలంకారభూయిష్టమై అలరిస్తున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి