10, ఆగస్టు 2012, శుక్రవారం

పద్య రచన - 77

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

6 కామెంట్‌లు:

  1. సిరులం జిల్కెడు శిల్పవైభవముతో జిత్తంబులం దోచు సుం
    దర నిర్మాణము గాలిగోపురము తత్ప్రాశస్త్య మూహింప మా
    తరమా పావనమైన యా వసతిలో బ్రహ్మాదులౌ దేవతల్
    పరమానందముతో జెలంగెదరు నే భక్త్యంజలిన్ గూర్చెదన్

    రిప్లయితొలగించండి
  2. గాలి గోపుర మయ్యది కనబడునది
    శిల్ప సౌందర్య మహిమను జెప్ప దగునె?
    ఆలయంబున వసియించు నంబ కిపుడె
    పూజ సేతును మనసార పూల తోడ

    రిప్లయితొలగించండి
  3. శిల్పకళలనే రాజుల
    నల్పముగ దలచి,యభిరుచి యౌదార్యములన్
    కల్పన జేసి గుడుల నెల
    కొల్పి యమూల్యమగు చరిత గొప్పగ నిడిరే!

    రిప్లయితొలగించండి
  4. గుండు మధుసూదన్ గారి పద్యములు......

    (నేఁటి శ్రీకృష్ణజన్మాష్టమి వేకువ జామున నా హృదయ దర్పణమున నేనొక కలఁ గాంచితిని)
    తే.గీ.
    అదియ వేణుగోపాలుని యాలయమ్ము;
    గోపురము పైన శంఖచక్రోదయమయె!
    గాలిగోపురమునఁ జేరఁ గళలఁ దేల్చి,
    సకల దేవతలును గొల్వ స్వాగతింతు!(1)
    శా.
    సర్వైశ్వర్య వదాన్యుఁ డీతఁడు; సహస్రాక్షాదు లీ కృష్ణునిన్
    సర్వేశుండని గొల్తు రీ దినము; సత్సంగీత హర్షాన, దుః
    ఖోర్వీభార విదూరుఁ డంచును సదా కుడ్యమ్ములన్ నిల్చియున్,
    గర్వమ్మింతయు లేకఁ గీర్తనలచేఁ గంసారిఁ గీర్తింపఁగన్.(2)
    కం.
    నాదు మనోనేత్రమ్మున
    నీ దినమీ యాలయమ్ము నిక్కువముగ, స
    మ్మోద మ్మొనఁ గూర్చుచు, దా
    మోదరు లీలల వెలార్చి ముగ్ధునిఁ జేసెన్.(3)
    సీ.
    ఒకచోట శ్రీకృష్ణుఁ బ్రకటాపగా యము
    నను దాఁటు వసుదేవు నాప్త కృత్య;
    మొక్కచోఁ బూతన మక్కువ నిడు స్తన్య
    మునుఁ ద్రావి, ప్రాణాలఁ గొను విధమ్ము;
    నొకచోన శాకటు న్నుగ్గుసేయఁగ నాక
    సమ్మున కెగయు నసంపు వితము;
    నొక్కెడఁ గాళియు నుక్కడఁగించియు
    ఫణముల నర్తించు భంగిమమ్ము;
    గీ.
    నొక దెసను వెన్న మీఁగడ లోలిఁ ద్రాగు;
    నొక యెడను గోపికల నృత్య వికసనమ్ము;
    నొకటఁ జాణూర ముష్టికుల కపజయము;
    నొక్క దిక్కునఁ గంసుని నుఱుము సేఁత!(4)
    ఆ.వె.
    ఎంత సుదిన మిద్ది! వింతలఁ జూపించి,
    నన్నుఁ బ్రోచునట్టి వెన్నదొంగ!
    మాయఁ బన్ని నన్ను మన్నింప, ధన్యుండ!
    పరమపురుష, మోక్ష వరము నిడుము!!
    (అనుచుఁ బ్రార్థించుచుండ, పక్షుల కిలకిలారావాలచే మెలకువ రాఁగ, నది కలయని తెలిసి, యా దేవదేవునకు మనస్సున మ్రొక్కి,లేచితిని.)

    రిప్లయితొలగించండి
  5. శ్రీ సరస్వత్యై నమః:

    మిత్రులారా!
    ఈనాడు చాల తక్కువ సంఖ్యలో పద్య రచనలు ఉన్నాయి. అంతా శ్రీ కృష్ణమాయ.

    1. శ్రీ సుబ్బారావు గారు మంచి తేటగీతిలో సరళముగా వర్ణించేరు. బాగున్నది.

    2. శ్రీమతి లక్ష్మీదేవి గారు అందమైన కందపద్యమును "ల్ప" ప్రాసతో చక్కగా నడిపించేరు. చాలా బాగున్నది.

    3. శ్రీ గుండు మధుసూదన్ గారిలో భక్త్యావేశము, కవితానందము పొంగి పొర్లేయి. పవిత్రమైన కల - అందమైన ఖండిక - అంతా అద్భుతము. వేణు గోపాలుని ఆలయము అంద చందాలను, శ్రీ కృష్ణ లీలలను కళ్ళకు కట్టినట్టిగా వర్ణించేరు. పర్వదినమును చక్కగా గడిపేరు - అందరినీ అలరింపజేసేరు.
    అందరికీ పేరు పేరునా అభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి