24, ఆగస్టు 2012, శుక్రవారం

ఇట్టి సృష్టి యేల -౨

ఇట్టి సృష్టి యేల?
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

సీ.
నిండారు సత్యంపు బండారమునయందె
          కల్ల దొంతరలున్న కర్మమేమొ? 
నెఱజాలికడలి పెందరఁగల పొరలందె
          హింసా ప్రళయవహ్ను లెరియుటేమొ?
పుణ్య గణ్య క్షేత్ర భూభాగములయందె
          పలు పాపరాసుల పంటలేమొ?
శాంతి రాకాసుధా చంక్రమమ్ములయందె
          క్రోధహలాలోద్బోధమేమొ?
ఆ.వె.
బహుమిథోవిరుద్ధ భావసమ్మేళన
చతురిమంబు సుప్రసన్నమైన
నీ యెడంద నెట్లు నివ్వటిల్లె? నిదేమి
లీల? యిట్టి సృష్టి యేల దేవ?
సీ.
క్షారాబ్ధి శీకరాసారార్ద్రతటమందె
          తీయని నీరూరు నూయి యేమి?
గాంఢాంధకార దిక్కబళనాభీలరా
          త్రులనె చుక్కల మిలమిల లవేమి?
శాఖిశాఖాశిఖా చంచలాగ్రములందె
          పల్లవ సుమ ఫలోద్భవ మదేమి?
గ్రీష్మ దుస్సహ మహోగ్రోష్మకీలలయందె
          వర్షాభిషేక ప్రహర్షమేమి?
తే.గీ.
తెలిసినట్లుండి వెండియు తెలియకుండు
భావసన్నిగూహనముల తావలమగు
నీ కృతికిఁ బతివై యీవు సేకరించు
నెలమి యదియేమి? యీ సృష్టి యేల దేవ!
సీ.
ఎచట మండు టడవులే, తేట చన్నీటి
          కొలని కెలనిత్రోవ మలక లేవొ?
యెచట ముండ్లడొంకలే, నీటు విరిదోట
          సూటి జూపెడు పాటి బాట లేవొ?
యెచటఁ గన నెడారులే, శీతలచ్ఛాయ
          లొలయు మేటి యేటి యొడ్డు లేవొ?
యెచటఁ గూళమెకనులే, యూరి పొలిమేర
          జేరఁ బారు దారి తీరులేవొ?
ఆ.వె.
యెవరు తెలుపువార, లీ హోరమ్రోతలో
మాట చెవికిఁ బట్టు మార్గమేది?
మంచి చెడ్డ గలిపి మాయతో వంచింతు
వేమి? యిట్టి సృష్టి యేల? దేవ!
ఆ.వె.
ఎటకుఁ గదల వలలె, యెటనున్న నురలె, యే
యెడకుఁ జూడ నుచ్చులే, యిఁకెందొ
తగులు ప్రాణిఁ జూచి నగుచుందు వింతెకాఁ
బోలు, నిట్టి సృష్టి యేల? దేవ!
* సంపూర్ణము *

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి