5, అక్టోబర్ 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 842 (రమణీ రమ్మనెను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
రమణీ రమ్మనెను సీత రామునిఁ గనుచున్.

26 కామెంట్‌లు:

  1. ద్యుమణి కులాభరణమణీ!
    రమణీయ గుణాంచితమణి! రణభువి ఘనవీ
    రమణీ! దశరథ సుకుమా
    రమణీ! రమ్మనెను సీత రాముని గనుచున్

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని వారూ,
    అనుప్రాసాలంకార శోభితమైన మీ పూరణ అద్భుతంగా ఉంది. చదవగానే నా జ్వరవేదన సగం తగ్గినట్టయింది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. జ్వరవేదన పూర్తిగ స
    త్వరమే వైదొలగు మీకు త్వరగా నో శం
    కర శంకర గురు కృపచే
    పరగెదవిక స్వాస్థ్యమంది భద్రగుణాఢ్యా!

    రిప్లయితొలగించండి
  4. శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
    గురువుగారికి జ్వరము త్వరగా తగ్గాలని దేవుని ప్రార్థిస్తూ
    ---------
    కమలాప్తుని గన త్వరగా
    రమణీ, రమ్మనెను సీత రాముని గనుచున్
    తమతమ కార్యములను దెలు
    పమని బలికె వేచి యున్న భక్తజనులకున్|

    రిప్లయితొలగించండి
  5. రమణుని యలంకరించెడు
    సమయమిదియె, వేగిరముగ సఖియా! మణులన్,
    సుమహారములను చేకొని
    రమణీ! రమ్మనెను సీత రామునిఁ గనుచున్.

    రిప్లయితొలగించండి
  6. samasyalo ramanii yuanuchota
    sambodhania gurtu ledukadaa ! manamu puurana sambodhana paramugaa purincha vachchaa? teliya jeyagalaru.

    రిప్లయితొలగించండి
  7. అయ్యా! శ్రీ సుబ్బారావు గారూ! శుభాశీస్సులు.
    సమస్య పాదములో సంబోదార్థక సంజ్ఞ ఉన్నా లేకున్నా సమస్యను తమకు దోచిన రీతిగా పూరించ వచ్చును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. రమణుని జూ డను ద్రిజటా
    రమణీ రమ్మనెను సీ త, రాముని గనుచు
    న్నమితమగు సంత సమ్మును
    విమలముగా బొందె నపుడు విల్లును విఱు వన్ .

    రిప్లయితొలగించండి
  9. కరుణా సాగరు డనిశము
    పర పీడను బారద్రోలు బాపుల నడచున్
    వరదుడు కలడిట నెరుగవ
    రమణీ! రమ్మనెను సీత, రాముని గనుచున్

    రిప్లయితొలగించండి
  10. రమణీయగుణాభరణా!
    కమలాయతనేత్ర! నాథ! ఘనతరకీర్తీ!
    మమతాపూర్ణా! రఘువీ
    రమణీ! రమ్మనెను సీత రాముని గనుచున్.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా! శుభాశీస్సులు.
    అందరికీ అభినందనలు.

    శ్రీమతి లక్ష్మీ దేవి గారి పూరణ - రాముని అలంకరణ కొరకు చెలియను మణులను తెమ్మని చెప్పుట - చాల బాగుగ నున్నది.

    శ్రీ గండూరి లక్ష్మీనారయణ గారు: పర పీడనలు పారద్రోలు వాడు వరదుడు అగు రాముని గూర్చి తెలిపేరు - చాల బాగుగ నున్నది.

    శ్రీ ఎచ్. వి. ఎస్. ఎన్. మూర్తి గారు: రఘువీరమణీ అని ఉత్తమమైన పూరణ - మంచి పదజాలముతో రాణించుచున్నది.

    అన్వయము స్పష్టముగా లేదు కావున మిగిలిన వారి పూరణల గూర్చి వ్యాఖ్య చేయుట లేదు.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. రమణీయ మైన ప్రకృతి
    కమలాప్తుడు కదలి వచ్చె కన్నుల విందౌ !
    హిమముల సుమములు విరిసెను
    రమణీ రమ్మనెను సీత రామునిఁ గనగన్ !

    రిప్లయితొలగించండి
  13. సీతాదేవి తన చెలికత్తె రమణితో మాటలాడిన సందర్భం :

    రమణుడు రాముడు భోజన
    సమయము దాటినను రాడు ! సభలో గలడా ?
    ప్రమదావనమున గలడా ?
    రమణీ ! రమ్మనెను సీత రాముని గనుచున్ !

    రిప్లయితొలగించండి
  14. కమనీయబ్లాగు రథమును
    రమణీయతఁనడుపు శంకరార్యులకారో
    గ్యమీయ వెడలఁ దయాసా
    ర మణీ! రమ్మనెను సీత రాముని గనుచున్!

    రిప్లయితొలగించండి
  15. రమణీయ పసిడి లేడిట
    దుముకుచు తిరుగాడు చుండె దూరము గా నా
    సముఖమునకు చేకొని వీ
    రమణీ ! రమ్మనెను సీత రాముని గనుచున్.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ సరస్వత్యై నమః:

    అమ్మా రాజేశ్వరి గారూ! మీ పద్యమును ఇలాగ దిద్దుదాము:

    రమణీయమైన ప్రకృతిన్
    గమలాప్తుడు కదలివచ్చె కన్నుల విందౌ
    సుమములు విరిసెను శృంగా
    రమణీ! రమ్మనెను సీత రాముని గనుచున్

    శ్రీ నాగరాజు రవీందర్ గారు:
    చెలికత్తె రమణితో సీతాదేవి సంభాషణ పరముగా కూర్చిన పద్యము ఉత్తమముగా నున్నది.

    శ్రీ సహదేవుడు గారూ! మీ పద్యమును ఇలాగ సరిచేద్దాము:

    కమనీయ బ్లాగు రథమును
    రమణీయత నడపు శంకరార్యుల కారో
    గ్యము నీయగా దయాసా
    రమణీ రమ్మనెను సీత రాముని గనుచున్

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
    మీ పద్యములో మొదటి పాదములో దుష్ట సమాసమును తొలగించి ఆ పాదముని ఇలాగ మార్చుదాము:
    రమణీయ కనక మృగమిట
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. ఆర్యా! ధన్యవాదములు. మీరు చూపిన సవరణతో..

    రమణీయ కనక మృగమిట
    దుముకుచు తిరుగాడు చుండె దూరము గా నా
    సముఖమునకు చేకొని వీ
    రమణీ ! రమ్మనెను సీత రాముని గనుచున్.

    రిప్లయితొలగించండి

  18. "విమల శ్యామల వర గా
    త్ర మణీ! కోదండ పాణి! దనుజోత్క్రమణీ!
    ద్యుమణీ కుల నరవర ముకు
    ర మణీ! ర"మ్మనెను సీత, రామునిఁ గనుచున్!

    రిప్లయితొలగించండి
  19. గురువుగారికిశతాధికవందనములు.తమరి సముచిత సవరణకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  20. శ్రీ గుండు మధుసూదన్ గారు: శుభాశీస్సులు.
    మీరు చేసిన పూరణ శబ్దాలంకారముతో శోభిల్లుతూ అత్యుత్తమముగా నున్నది. అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. కవిమిత్రులకు నమస్కృతులు.
    జ్వరము తగ్గినది కాని నడుము నొప్పి తీవ్రంగా ఉంది. కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం కూర్చొనలేక పోతున్నాను. అందువలన పూరణలను, పద్యాలను సమీక్షించలేకపోతున్నాను.
    వైవిధ్యంగా, సమర్థవంతంగా పూరణలు చెప్పిన...
    పండిత నేమాని వారికి,
    వరప్రసాద్ గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సుబ్బారావు గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    సహదేవుడు గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    గుండు మధుసూదన్ గారికి
    అభినందనలు, ధన్యవాదములు.
    నా సెల్ ఫోన్ పోయింది. ఇప్పటికి నేను పోగొట్టుకున్న సెల్ ఫోన్‌లు మూడు. మిత్రులు ఎవరైనా ఫోన్ చేయాలనుకుంటే నా లాండ్ ఫోన్‌కు చేయండి (0870 2423773).

    రిప్లయితొలగించండి
  22. పండిత నేమాని వారూ,
    నా అనారోగ్యాన్ని గమనించి దయతో మిత్రుల పూరణల గుణదోషాలను విశ్లేషించి సవరణలను, సూచనలను చేసినందుకు కృతజ్ఞుడను.

    రిప్లయితొలగించండి