22, జులై 2013, సోమవారం

గురుస్తుతి




గురుస్తుతి

 ఎవఁడు ప్రణవ స్వరూపుఁడై భువన భవన
సృష్టి సంస్థితి లయ కార్య శీలి యగునొ
యతని సత్కృపా వీక్షా మహత్త్వ ఫలమె
శిష్య రేణువు ననుఁ దరిఁ జేర్చు గాత !

ఆది మధ్యాంత రహితుడై వ్యాప్తిఁ జెంది
పంచ భూతాత్ముడై కాచుఁ బ్రకృతి నెవ్వఁ
డతని సత్కృపా వీక్షా మహత్త్వ ఫలమె
శిష్య రేణువు ననుఁ దరిఁ జేర్చు గాత !

ఎవడు వాచామగోచరుండెవఁడు నిఖిల
తత్త్వ విజ్ఞాన సార నిధాన చిత్తుఁ
డతని సత్కృపా వీక్షా మహత్త్వ ఫలమె
శిష్య రేణువు ననుఁ దరిఁ జేర్చు గాత !

నిర్గుణుండు నిరాకార నిర్వికల్ప
నియమి యెవ్వఁడు నిగమాంత నిత్య పూజ్యుఁ
డతని సత్కృపా వీక్షా మహత్త్వ ఫలమె
శిష్య రేణువు ననుఁ దరిఁ జేర్చు గాత !

చిన్మయానందుఁడెవఁడు విశేష బుద్ధి
కుశలుడెవ్వఁడు శ్రీ జగద్గురువరేణ్యుఁ
డతని సత్కృపా వీక్షా మహత్త్వ ఫలమె
శిష్య రేణువు ననుఁ దరిఁ జేర్చు గాత !

డా. విష్ణు నందన్

6 కామెంట్‌లు:

  1. వినయ విజ్ఞానమయమైన విమల వినతి
    విష్ణునందను సత్కృతి విందు గొలిపె
    స్వాంతమునకు బళాయని సహృదయముగ
    నా కవీశ్వరు నెంతయు నభినుతింతు

    రిప్లయితొలగించండి
  2. శిష్య రేణువు నను దరి జేర్చి గాత !
    అనెడు మకుటాన నుండెను నార్య! యవియ
    విష్ణు నందుని గృ తములు విలువ గలవి
    వందనంబులు మఱివిష్ణు నందను నకు .

    రిప్లయితొలగించండి
  3. పండితుండు; వైయాకరణుండు; సుమతి ;
    యుత్తమ కవీంద్ర సంతతి కొజ్జ బంతి ;
    శంకరాభరణ ద్రుమ శాఖఁ గూయు
    పరభృతము శంకరయ్యకుఁ బ్రణతి శతము !

    పలుకులమ్మ పదమ్ములఁ గులుకు మువ్వ
    సవ్వడెవ్వాని మవ్వంపు సరస కవితఁ
    నివ్వటిల్లు నాతని మహాంధ్రీ మహత్త్వ
    విదునిఁ బండిత నేమానిఁ మదిఁ నుతింతు !

    నిబ్బరమ్మైన ప్రేమతో నబ్బురముగ
    నుబ్బి తబ్బిబ్బుగా పొంగి యుత్సహించి
    మంచి పలుకుల సుధలొలికించినాడు
    సుబ్బరావును నుతియింతుఁ సుకవి వరుని !

    రిప్లయితొలగించండి
  4. గురు పూర్ణిమ సందర్భముగా మంచి గురుస్తుతిని అందించిన శ్రీ విష్ణు నందన్ గారికి అభినందన మందారములు

    రిప్లయితొలగించండి
  5. శ్రీమతి నేదునూరి రాజేశ్వరమ్మ గారికి ధన్యవాద పరశ్శతం !

    రిప్లయితొలగించండి
  6. డా. విష్ణు నందన్ గారూ,
    నిన్న స్థానిక దేవాలయంలో సాయిబాబా, దత్తాత్రేయ, దక్షిణామూర్తుల సన్నిధానంలో నాకు జరిగిన సన్మానం కంటే మీ పద్యం ఎన్నో రెట్లు ఆనందాన్ని కలిగించింది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి