24, ఆగస్టు 2014, ఆదివారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 63

రావిపాటి లక్ష్మీనారాయణ
 
రామాయణము-
సీ.         అంగదు యువరాజు నవనీపు సుగ్రీవు
                                    గిష్కింధకుం జేసె క్షితిజమగఁడు
            (నుతబలుఁడు సుయోధనుఁడు, దాయ లసమాన
                                    చరిత వెలఁది యుండు క్ష్మాతలంబు)
            వెదకింపఁగా గోరి వేచి వర్షర్తు వం
                                    తమగువఱకు మహీధరచరులనుఁ
            (గోవిదస్తుతులను గురు భీష్మముఖులను
                                    రయము గూడఁగను నరసి కనుఁగొని)
గీ.         రండనుచుఁ బంపెఁ; గొని యుంగరంబు దక్షి
            ణమున కంగదాదులతో హనుమ యరిగి మ
            హేంద్రగిరి నుండు సంపాతి హితమున నభ
            మున కెగిరె గరుడునిఁ బోలి వనధి దాఁట. (౭౮)

భారతము-
ఆ.        నుతబలుఁడు సుయోధనుఁడు దాయ లసమాన
            చరిత వెలఁది యుండు క్ష్మాతలంబుఁ
            గోవిదస్తుతులను గురు భీష్మముఖులను
            రయము గూడఁగను నరసి కనుఁగొని. (౭౮)

టీక- సుయోధనుఁడు = (రా) మంచియోధుఁడు, (భా) దుర్యోధనుఁడు; (రా) దాయ = రావణుఁడు; లసమానచరిత = ఒప్పుచున్న చరిత్రగలది (సీత); (భా) దాయలు = పాండవులు; అసమానచరిత = సమానములేని చరిత్రగలది (ద్రౌపది); గురుభీష్మముఖులను = (రా) ఎక్కువ భయంకరములగు ముఖములు గలవారిని, (భా) ద్రోణుఁడు భీష్ముఁడు మొదలగువారిని.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి