14, జనవరి 2015, బుధవారం

నిషిద్ధాక్షరి - 28

కవిమిత్రులారా,
అంశం- భోగిమంటలు.


నిషిద్ధాక్షరములు -
మొదటి పాదంలో కవర్గాక్షరములు (కఖగఘఙ)
రెండవ పాదంలో చవర్గాక్షరములు (చఛజఝఞ)
మూడవ పాదంలో టవర్గాక్షరములు (టఠడఢణ)
నాల్గవ పాదంలో పవర్గాక్షరములు (పఫబభమ)
ఛందస్సు - తేటగీతి.

19 కామెంట్‌లు:

  1. పల్లె టూరుల యందున పల్లె ప్రజలు
    భోగి మంటలు వేయుట భోగి నాడు
    వచ్చు చున్నది యాచార మచ్చువలెను
    కీట కాదుల సంహార క్రియను దెలియ

    రిప్లయితొలగించండి
  2. పిల్ల పెద్దల ముచ్చట్లు పెందరాల

    ప్రోగు బెట్టగ నిలువెత్తు భోగి మంట

    సంకు రాతిరి ముందస్తు సంబరాలు

    తెలుగు గడ్డకు వెచ్చని వెలుగు లంట

    రిప్లయితొలగించండి
  3. పూజ్య గురుదేవులకు, కవిమిత్రులందరికీ ...భోగి శుభాకాంక్షలు...

    పిల్ల లందరు పెద్దలు పేర్మి తోడ
    భోగి మంటకు కట్టెలు ప్రోగు బెట్టి
    భోగి రోజున వేయుచు ముదముగాను
    సంకు రాత్రిని వేడ్కతో స్వాగతించు

    రిప్లయితొలగించండి
  4. పల్లెల పండు పంటలను భవ్యపు సంతసమెల్ల పొందుచున్,
    కొల్లగ భోగి మంటలనుఁ గూడిరి యెల్లరు పాడిరెల్లరున్;
    పిల్లల సంబరమ్ములనుఁ బెద్దలు చేరగ నింతనింతలై
    యెల్లలు లేని యుత్సవ సుహృద్య విశేషత నిండెనచ్చటన్.

    రిప్లయితొలగించండి
  5. ఎండు పుల్లల నచ్చోట మండ జేయ
    వేగ వాతావరణములో వేడి బుట్టి
    హాని కారక మగు జీవు లంత మయ్యి
    రోగములు దరి చేరవు రూఢి గాను

    శుద్ధి జేయ ప్రదేశమున్ బుద్ధ జనులు
    పాత వస్తువుల దహనం బనుచు తెల్ప
    పాత రబ్బరు వస్తువుల్ పావకునకు
    నాహుతి యొనర్చి కడు దోషు లగుచు నుండ్రి

    రిప్లయితొలగించండి
  6. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పెందరాల’ గ్రామ్యం. ‘పెందలకడ’ అనండి.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘స్వాగతించు’ అన్నచోట ‘స్వాగతింత్రు’ అనండి.
    *****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    రెండవ పూరణ రెండవ పాదంలో నిషిద్ధాక్షరం ‘చ’ వేశారు. ‘దహనంబ యని తెల్ప’ అనండి.

    రిప్లయితొలగించండి
  7. పసలేని వని యెంచు పాత సామానులు
    .......మంటలలో బడి మాడి పోయె
    కర్రలు కంపలు కట్టెలు దూలాలు
    .......కణకణ మని మండి కాలిపోయె
    నీలాల నింగిని నిలువునా తాకునో
    .......యనురీతి నాల్కల నగ్ని వెలిగె
    ముసిముసి నవ్వుల మూగిన జనములు
    .......వెచ్చగా చలికాగు వేడుకాయె

    పాత బాధలు వేదనల్ పాసిబోయి
    క్రొత్త వెల్గుల సాంత్వన కోరు రీతి
    భోగి కాంతులు చెలరేగె భోగమలర
    వీధి వీధిన సంక్రాంతి వేళ గనుడు.


    రిప్లయితొలగించండి
  8. మిస్సన్న గారూ,
    మీ సీసపద్యం మనోరంజకంగా ఉంది. అభినందనలు.
    ‘నిలువునా’ అని దీర్ఘాంత మెందుకు? ‘నిలువున తాకునో’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  9. రావణాసురు రాజ్యపాలనము నందు
    పాపభూయిష్ట కలుషిత భావములను
    భోగి జ్వాలల గాలగ బూదిజేసి
    గాంచ వలయును నూత్నసంక్రాంతి వెలుగు

    రిప్లయితొలగించండి
  10. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. మల్లెల వారి పూరణలు

    పాత లెల్ల మంటల బెట్టి వరలు జ్వాల
    శీతువది తొల్గ నీళ్ళను సెగల మండ
    తాన మేపారగా భోగి ధాత్రి జనులు
    వీధి కూడళ్ళ మంటలు విరివి లేచె
    2.సంబరాలకు ముందటి సమయ మిదియె
    పాత దుంగలు గొబ్బిళ్ళు భగ్గు మనగ
    వీదు లందున వెలిగించి వేగవేడి
    జలము తానాలు సేయంగ చక్క నగును

    రిప్లయితొలగించండి
  12. తెల్లవారు జామున లేచి యెల్ల జనులు
    భోగి మంటలఁ దమయింటి ముందు వేసె
    నవనిలోని పాపంబుల నగ్గిఁ గలిపి
    సర్వ జనులకునొనగూరు శాంతి యనుచు

    రిప్లయితొలగించండి
  13. పేర్చి కట్టెల జ్వలియించి బేర్మి తోడ
    భోగి మంటల వలయము మూగి తిర్గు
    పిల్ల లెల్లరు పాడుతు నుల్ల మలర
    చేయు వేడ్కను గన మది చెలగు గాదె.

    రిప్లయితొలగించండి
  14. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణ చివరి పాదంలో పవర్గాక్షరం(మ) ప్రయోగించారు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. అవును గురువుగారూ! నిలువున అంటే సరిపోతుంది. ధన్యవాదాలండీ.

    రిప్లయితొలగించండి
  16. నాటిసాంప్రదాయమునంత-నాటిచాటు
    భోగ,భాగ్యాలునొసగెడి-భోగిమంట
    సంకురాత్రికి?సంతోషమింకనీక
    వెలుగునిల్వలురాత్రికివేడుకొసగు|

    రిప్లయితొలగించండి
  17. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘వేడుక + ఒసఁగు’ అన్నప్పుడు సంధి లేదు. ‘వేడుక నిడు’ అనండి.

    రిప్లయితొలగించండి
  18. వెతలు వెతలంచు మీరలు బెదర నేల?
    భోగి మంటల వాటిని వేగ నీడు
    కీలల వెలుగులో గన గెలుపు దారి
    విజయ వాటికఁ జేరగ విధిగఁ దోచు!

    రిప్లయితొలగించండి