28, జులై 2016, గురువారం

సమస్య - 2100 (పోరు వలన శాంతి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

పోరు వలన శాంతిఁ బొందగలము.

105 కామెంట్‌లు:



  1. ఏరు వాక పోరు నెంత గుండ్రాయైన
    కరుగు మీదు నున్న గయగు నట్లు
    కావ్య మధురిమ గన గట్టిపట్టుగజేయు
    పోరు వలన శాంతిఁ బొందగలము

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నున్నగ నగునట్లు..' అనండి.

      తొలగించండి
  2. శాంతి సౌఖ్యములకు స్థానమెద్దియటంచు
    మాయ దాటునట్టి మార్గమెంచు
    మనసు యొక్కమూలమందు జరుగునట్టి
    పోరు వలన శాంతిఁ బొందగలము

    రిప్లయితొలగించండి
  3. పొరుగు గొడవ విందు భోజనము మరగు
    మనుజులిట్లు తలచు మదిన నమ్మి
    పరుల మత్సరములు పరము మనకు వారి
    పోరు వలన శాంతిఁ బొందగలము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కళ్యాణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మదిని నమ్మి...' అనండి.

      తొలగించండి
  4. సమత మమత బంచ సౌఖ్యమ్ము నందించ
    తీరు నెరుగు చుండి ధీరు లగుచు
    సంఘ మందు నెపుడు సాపేక్షతన్ సల్పు
    పోరు వలన శాంతి బొంద గలము!

    రిప్లయితొలగించండి
  5. దేశ రక్షణ తమ ధ్యేయమని తెలిపి
    నిల్లు విడచి చేయు నిత్య సేవ,
    దుష్ట శక్తి నెదురు కష్ట జీవై నెట్ట
    పోరు వలన శాంతిఁ బొందగలము
    ఎట్టపోరు = సైన్యము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తెలిపి+ఇల్లు=తెలిపి యిల్లు' అవుతుంది. దానివల్ల రెండవపాదంలో యతి తప్పుతుంది. 'ధ్యేయమని యనుచు। నిల్లు విడచి..' అనండి. అలాగే 'కష్టజీవిగ నెట్ట...' అనండి.

      తొలగించండి
    2. గురువు గారు వేరొక చోట "నిల్లు" "నిత్య" యతి కుదరదని అంటున్నారు. వివరించగలరు.

      తొలగించండి
    3. అది అఖండయతి. క్రింది లింకులో అఖండయతి గురించి చదవండి. ఆ తరువాత కూడ సందేహం ఉంటే అడగండి...
      అఖండయతి

      తొలగించండి
  6. మోద ముడిగిపోవు,సోదరావళితోడి
    పోరు వలన, శాంతి బొందగలము
    కలిసి యొక్కటైన కలహంబులను మాని
    సత్య మిందికేల సందియంబు.

    రాజుతోడ బలికె రమ్యంబుగా మంత్రి
    దేవ! మనకువైరి తిరముగాను
    పొరుగువాని కహితు డరయంగ వీరల
    పోరువలన శాంతి బొందగలము
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'సత్య మిందుకేల'లో టైపాటు.

      తొలగించండి
    2. ఆర్యా
      ఇందు ఇక ఏల అనే భావనతో వ్రాయటం జరిగింది, ధన్యవాదములు

      తొలగించండి
    3. అలాగా? నేను మరోలా భావించాను. మన్నించండి. మీ భావం బాగున్నది.

      తొలగించండి
    4. "ఇందు ఇక ఏల" సంధి జరిగిన "ఇందికయేల" అవుతుందనుకుంటాను. పరిశీలించండి.

      తొలగించండి
    5. 'ఇఁక' అన్నది ద్రుతాంతం, అవ్యయం. ఇంక దీని రూపాంతరం. దీనికి ఏల పరమైనపుడు ఇఁక నేల (ఇఁక+ఐన=ఇఁకనైన), ఇౕఁకేల (ఇంక+ఏటికిన్=ఇంకేటికిన్.. ఏమేమీ కలహాశనుం డచటికై - పారిజాతాపహరణ పద్యం) అని తప్ప యడాగమం రాదని నా అభిప్రాయం.

      తొలగించండి
    6. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. దృతాంతమని మర్చిపోయానండి. మన్నించండి.ఇఁకనేల యవుతుంది. ఇంకేల సాధువే కానీ "ఇకేల" అనుమానము. సందేహ నివృత్తి చేయ గోర్తాను.

      తొలగించండి
    7. బా.వ్యా. సంధి. సూ.9 "ఇఁకాదులకుఁ దప్ప ద్రుతప్రకృతికములకు సంధిలేదు"
      ఇఁక, ఇఁగ, ఎట్టకేలకు, ఎట్టకేని: ఈ‌యవి ఇఁకాదులని యెఋరుంగునది. వీనికి సంధి వైకల్పికము.

      ఉదాహరణ. వచ్చున్ + ఇపుడు --> వచ్చునిపుడు. ఇక్కడ సంధిలేదు. పూర్వపదంలోని నకారం పొల్లు, పరపదారంభంలోని అచ్చుతో కలిసిపోయి వచ్చునిపుడు అవుతున్నది.

      సరే, ఇంక ఇకాదుల సంగతి చూదాం. కాబట్టి ఇఁకన్ + ఏల --> ఇఁకేల, ఇఁకనేల. ఈ‌రెండు రూపాలూ‌ సాధువులే. సంధి చేస్తే ఇఁకేల అవుతుంది. సంధిచేయకపోతే ఇకనేల అవుతుంది. ఇలా ఇఁకాదులు నాలుగింటికీ మాత్రం వైకల్పికం.

      తొలగించండి
    8. ధన్యవాదములండి శ్యామలరావు గారు.బాలవ్యాకరణములోయిప్పుడే చూశాను.

      తొలగించండి
  7. దూరి లోన నుండు వైరిషట్కము చేయు
    కుటిల తంత్రములకు కుదురుకొనక
    జ్ఞాన దివ్యఖడ్గ మూని నిత్యము జేయు
    పోరు వలన శాంతి బొందగలము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      అంతశ్శత్రువులతో పోరును గురించిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  8. కాపురములు గూలు కార్చిచ్చు జెలరేగు
    పోరువలన, శాంతి బొందగలము
    కలసిమెలసి యున్న గలుగును సౌఖ్యమ్ము
    జయము గలుగు గాదె జగతిలోన!!!

    రిప్లయితొలగించండి
  9. ఇరువురికి నెపుడును చెరుపె కలుగుచుండు
    పోరు వలన! శాంతి బొంద గలము
    మనము, మానవతను మరువకుండిన యంత!
    కలసి నడచుటందె కలదు సుఖము!

    రిప్లయితొలగించండి
  10. కోప మందు బలికె కోడలి తోనత్త
    వేరు కాపు రమ్ము వెలగ బెట్టు
    రోష బడిన స్నుష రుసరుస లాడుచు
    పోరు వలన శాంతిఁ బొంద గలము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'స్నుష' అన్నచోట గణదోషం.

      తొలగించండి
    2. కోప మందు బలికె కోడలి తోనత్త
      వేరు కాపు రమ్ము వెలగ బెట్టు
      రోష బడిన జామి రుసరుస లాడుచు
      పోరు వలన శాంతిఁ బొంద గలము

      తొలగించండి
    3. అక్కయ్యా,
      సవరించిన పూరణ బాగున్నది. 'రోష పడిన' అనండి.

      తొలగించండి
  11. క్రొత్త జంటకింక కుదురెట్లు కలిగేను
    మరులు నిండి వారు మత్తునుండు
    సఖ్యమేర్పడంగ సాగించు నా మరు
    పోరు వలన శాంతిఁ బొందగలము||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘురామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కలిగేను' అనడం గ్రామ్యం. 'కలుగును' అనండి. అలాగే 'మత్తు నుంద్రు' అనండి.

      తొలగించండి
  12. మంచిఁ దొలఁగఁ ద్రోచి మానవత్వము వీడి
    ప్రజల దోఁచుకొనెడి పథము నడచు
    నట్టివారికిఁ గల యవినీతిపైఁ జేయు
    పోరు వలన శాంతిఁ బొంద గలము!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అట్టివార లెప్పు డవినీతిపైఁ జేయు' అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. శంకరయ్య గారూ!

      మంచిని వీడి, మానవత్వాన్ని వీడి, ప్రజలను దోచుకొనే దారిలో నడిచేవారి కున్నట్టి "అవినీతి"పై మనం చేసే పోరువల్ల శాంతిని పొందగలుగుతాం...అని నా పద్య భావం. మరొకసారి పరిశీలించగలరు.

      తొలగించండి
    3. పై పద్యాన్నే చిన్న సవరణతో...

      మంచిఁ దొలఁగఁ ద్రోచి మానవత్వము వీడి
      ప్రజల దోఁచుకొనెడి పథమునఁ జను
      నట్టివారికిఁ గల యవినీతిపైఁ జేయు
      పోరు వలన శాంతిఁ బొందఁ గలము!

      తొలగించండి
    4. మధుసూదన్ గారూ,
      నేనే పొరబడ్డాను. మీ అభిప్రాయమే సరైనది. క్షంతవ్యుణ్ణి!

      తొలగించండి
  13. తనువు నందు నిండి తమకమ్ము గూర్చుచు
    చెరుపు చేయు నట్టి శత్రువులగు
    కామ క్రోద లోభమదమత్సరాలపై
    పోరువలన శాంతిబొందగలము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీనివాస్ చారి గారూ,
      అంతశ్శత్రువులపై మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవపాదంలో యతి తప్పింది. 'కామ లోభములను ఘన శత్రువులపైన' అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు గారి పూరణ....

    " రాక్షసులను జంప రాముడు జేసెడి
    పోరువలన శాంతి పొంద గలము
    గనుక రాము నంపి కావుము దశరధ!
    యనుచు గాధిజుండు యాస్థఁ జెప్పె "

    రిప్లయితొలగించండి
  15. అంజయ్య గౌడ్ గారి పూరణ.....
    ఆ.వె
    కలమి లేము లెపుడు కలకాలముండవు
    కలసి మెలసి యుండి క్ష్మాతలమున
    చదువు సంధ్య నేర్చి సాగించుడి చెడుపై
    పోరు వలన శాంతి బొందగలము!!

    రిప్లయితొలగించండి
  16. మద్దా సత్యనారాయణ గారి పూరణ....

    నీరు, నిప్పు నంట నారాటపడు నాడు
    "యంబవాడ్క" రొక్క డవని బొడమి
    నిమ్నులకు విముక్తి నిజముగా గలిగించె
    "పోరు వలన శాంతి బొంద గలము!"

    రిప్లయితొలగించండి
  17. గురువుగారు మన్నించండి పాఠశాలకు వెల్లాలనె తొందరపాటులొ
    యతిగమనించలేదు మీసూచనయే బాగున్నది కృతఙ్ఞాతాంజలి

    రిప్లయితొలగించండి
  18. పోరు వలన గాంధి పుణ్యభారతికిల
    శృంఖలాల ద్రెంపి సిరులుబంచె
    పోరులేనినాడు పురుషార్థములులేవు
    పోరువలన శాంతిబొందగలము.

    రిప్లయితొలగించండి
  19. దారుణముగ పెరుగు దౌర్జన్యముల పైన

    హేయమై చెలంగు హింస పైన

    ఉరిమి చూచుచున్న ఉగ్రవాదము పైన

    పోరు వలన శాంతి బొందగలము.

    రిప్లయితొలగించండి
  20. డా. పిట్టా సత్యనారాయణ గారి పూరణ...

    నెహ్రు పంచశీల నెఱుగని దేశాధి
    పతికి బూది మందు పారకున్న
    కీలు నెఱుగు వాతకే లొంగునట్టుల
    పోరు వలన శాంతిఁ బొందగలము.

    రిప్లయితొలగించండి

  21. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { అద్దె యి౦టి కష్టాలు భరి౦చ లేని యిల్లాలు

    యిల్లు మారి పోద మని మగనితో ననుట }
    ………………………………………………………

    వసతు లున్న వనుచు వచ్చి చేరితి మి౦దు

    నీటి కొరకు మిగుల పోటి పెరిగె ;

    పొసగ గలమె యిట్టి పోరు వలన ? శా౦తి

    బొ౦ద గలము , మారి పోగ నిల్లు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      విలక్షణమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  22. పరఢ వించు తీవ్ర వాద చర్య దుడిచి
    వేయ వలెను నేడు విశ్వమెల్ల
    వలసి చేయు తీవ్ర వాద నిర్మూలన
    పోరు వలన శాంతిఁ బొందగలము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆయుధముల ననిశ మాపత్తులె కలుగు
      ఘన సమస్యలకు విఘాతమె సుమి
      చక్కగ నొనరించు చర్చల సమసిన
      పోరు వలన శాంతిఁ బొందగలము.

      తొలగించండి
    2. లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిర్మూలన పోరు' అనడం దుష్టసమాసం. 'తీవ్రవాదమున్ దొలగించు। పోరు...' అంటే ఎలా ఉంటుంది?
      *******
      కామేశ్వర రావు గారూ,
      పోరు సమసిపోతే శాంతియే కదా! చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. పొరపాటున లక్ష్మీనారాయణ గారి కోటలో ప్రచురించాను. మన్నించండి.

      తొలగించండి
  23. శాంతి యుండ దార్య !సంయ మీంద్రునకును
    పోరు వలన, శాంతి పొంద గలము
    నొకరి కొకర మండ యుండుచు బ్రదుకుచో
    జీవి తాంతము మరి సేమ యుతపు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగుంది.
      '...గలము+ఒకరి=గలరొకరి' అవుతుంది. అక్కడ నుగాగమం రాదు. 'సేమ యుతపు' అనడం దోషమే. సవరించండి.

      తొలగించండి
  24. ఉర్వి లోప్రభలిన యుగ్రవాదము తోడ
    తల్లడిల్లు చుండ్రి ధరణి లోన
    ఉద్యమించి చేసెడుగ్రవాదము పైన
    పోరు వలన శాంతి బొందగలము

    ప్రాణములు హరించు ప్రగతి కాటంకమ్ము
    పోరు వలన, శాంతి బొంద గలము
    సఖ్యత విడకుండ సౌహార్ద్రత గలిగి
    మనిన జాలు నదియె మనకు సుఖము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ప్రభలిన'... టైపాటు.

      తొలగించండి
    2. గురువు గారికీ ధన్యవాదములు టైపాటు సరి చేస్తానండి

      తొలగించండి
  25. ఆంగ్లపాలనందు నటమటించిన హిందు
    మాత ముక్తి గోరి మహిత గాంధి
    ఇచ్చెపిలుపు ప్రజల హింసా పథమ్మున
    పోరు వలన శాంతిఁ బొందగలము.

    రిప్లయితొలగించండి
  26. పావురమ్ము, పెంటి పక్షితో పల్కెను,
    'పాము,డేగ, మనకు వైరులుగద,
    వార లిరువురకును పట్టుగా ఘటియించు
    పోరు వలన శాంతిఁ బొందగలము'.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ప్రజ లహింసాపథమ్మున' అని పద విభాగం చేయండి.

      తొలగించండి
  27. ఐన వారి మధ్య నాత్మీయత చెడును
    పోరు వలన,శాంతిబొందగలము
    కలసి మెలసి యున్న కన్నవారికి కూడ
    హర్షముకలిగేను నరయు డయ్య

    2.దుష్టబుద్ధితోడ దుష్టులు కొందరు
    ప్రాణమానములను భంగ పరుప
    వారణమొనరించి వసుధలో చెడుపై
    పోరు వలన శాంతి పొందగలము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'కలిగేను' అనడం గ్రామ్యం. 'హర్షము కలుగునని యరయుడయ్య' అనండి.
      రెండవపూరణ మూడవపాదం చివర గణదోషం. 'చెడుపైన' అనండి.

      తొలగించండి
  28. తెల్లజాతివారి తీరును మాన్పగ
    భారతీయ తత్వ వారసులకు
    గాంధి హితము బంచె|” నాందిపలుకు
    పోరువలన శాంతిబొందగలము “.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది.
      మూడవపాదం చివర గణదోషం. సవరించండి.

      తొలగించండి
  29. కడుపు కాలుచున్న కన్నడు జోరుగా
    పోరు పెట్టి యేడ్వ, నూరి వారు
    పోరు నాప నోట పోసిరి పాలను
    పోరు వలన శాంతిఁ బొందగలము.

    పెండ్లి వారి యింట పేకాట గోలకు
    దారి బోవు వారు దూరి, పోరి
    మత్తు వదల దూర , మెత్తల జేరిరి
    పోరు వలన శాంతిఁ బొందగలము.

    రిప్లయితొలగించండి
  30. గురువుగారూ! శ్రీ విరించిగారు వ్రాసిన పద్యములో 'ప్రభలిన' అనే పదం 'టైపాటు'
    అని తమరు చెప్పారు. టైపాటు అంటే ఏమిటో నాకు తెలియదు. దయచేసి తెలుపగలరని ప్రార్థన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మనం అక్షరాలు టైప్ చేసేటప్పుడు దొర్లే పొరపాటు 'టైపాటు'

      తొలగించండి
    2. Typing mistake కు తెలుగులో 'టైపాటు' అన్న పదం అంతర్జాలంలో బాగా ప్రచారమై ఉంది.

      తొలగించండి
    3. టైపాటు ను వివరించినందులకు ధన్యవాదములు

      తొలగించండి
  31. ధన్యవాదములు. ప్రత్యుత్తరం ఎందుకో పనిచేయుటలేదండీ. నా పద్యములో "తెలిపిన + ఇల్లు = తెలిపి నిల్లు" అనుకొంటిని , అది సరికాదు అంటారా? వివరింప ప్రార్ధన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దేశ రక్షణ తమ ధ్యేయమని తెలిపి
      నిల్లు విడచి చేయు నిత్య సేవ

      ఇక్కడ మీరు అనుకొన్న విధంగా వ్యాకరణకార్యం ఉందా అని చూదాం. తెలిపిన + ఇల్లు --> తెలిపిన యిల్లు అనే యడాగమం సాధువు. అలాగే తెలిపినిల్లు కూడ సాధువే. బాల.వ్యా. సంధి.సూ.4 "అత్తునకు సంధి బహుళంబుగా నగు." అని. బహుళం అంటే సంధి జరగటమూ జరక్కపోవటమూ కూడా భాషలో విరివిగా కనిపిస్తుంది అని అర్థం. సంధిజరిగిన పక్షంలో తెలిపినిల్లు అవుతుంది. జరగని పక్షంలో, అదే‌ పరిఛ్చేదంలోను 3వ సూత్రం "సంధిలేని చోట స్వరంబు కంటే బరంబయిన స్వరంబునకు యడాగమంబగు." అన్న సూత్రం ప్రకారంగా యడాగమం జరిగి తెలిపిన యిల్లు అవుతుంది. వ్యాకర్త చిన్నయసూరి గారు ఈ‌ 4వ సూత్రానికి ఇచ్చిన ఉదాహరణల్లో పుట్టిన + ఇల్లు అన్నది ఉంది. సంధి బహుళం‌కాబట్టి పుట్టినిల్లు, పుట్టినయిల్లు అన్న రెండు ప్రయోగాలూ సాధువులే. మీరు పుట్టిన తీసి తెలిపిన అని వేరు క్రియారూపంతో ఈ సూత్రానికి అన్వయించే‌ ప్రయోగం చేసారు. ఇబ్బంది లేదు.

      ఇప్పుడు తెలిపిన+ఇల్లు-->తెలిపినిల్లు వాడటం సరే, ఆ 'నిల్లు' లోని ని యందున్న నకారం పూర్వపదానికే చెందుతుంది. కాబట్టి ఆ నకారం యతిమైత్రిస్థానంలో మరొక నకారంతో‌ మైత్రిచేయదు. ఆ అచ్చు ఇ-కారం వరకే యతిమైత్రి చేయవలసి ఉంటుంది.

      తొలగించండి
    2. శ్యామల రావు గారూ,
      వివరణాత్మకమైన మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!
      అఖండయతి పేర అటువంటి యతిమైత్రిని కొందరు పాటిస్తున్నారు (నేను కాదండోయ్!).

      తొలగించండి
    3. మిత్రులు శంకరయ్యగారూ,
      అఖండయతి విషయం వివాదగ్రస్తమైనదే ఎప్పుడూ. పెద్దకవులూ‌ అఖండయతిని వాడారు అని చెప్పటం వింటుంటాము అటువంటి వాదనల్లో. కాని అఖండయతిని ఎవరూ విరివిగా వాడరు. దాన్ని నిరసించే వారు ఎలాగూ వాడకపోయినా సమర్థించే వారు కూడా పూర్వకవులు అరుదుగానే వాడారు. అదీ హెచ్చుమంది అది అందగిస్తున్నదని అనిపించిన సందర్భాల్లో మాత్రమే వాడారు కాని పొరపడో‌ అలవాటుగానో కానేకాదని నా అభిప్రాయం.

      అఖండయతిని బాగా సమర్థించిన ఆంధ్రవాల్మీకి కూడా అంత తరచుగా దానిని వాడలేదని నా ఉద్దేశం. ముద్దుపళని రాధికాస్వాంతనంలో 'చంద్రసూర్యాదిభూషాళి తోడ' వంటి ప్రయోగాలతో అఖండయతిని ఇంచుమించు స్వేఛ్చగా వాడిందంటే, అది వేరే సంగతి - ఆవిడ కవిత్వం మరీ‌ అంత లాక్షణికం అని చెప్పలేము.

      అందుచేత వర్థమానకవిచంద్రులు అఖండయతికి దూరంగానే ఉండటం‌ అవసరం. ఛందస్సుపైనా, భాషపైనా అధికారం సిధ్ధించిన స్థాయి వచ్చిన పిదప ఎవరైనా అరుదుగా వాడినా పెద్దగా అక్షేపణ ఉండకపోవచ్చును. అభ్యాసదశలో మాత్రం దాన్ని దాదాపు నిషేధించుకొనటమే మేలు.

      తొలగించండి
    4. శ్యామల రావు గారూ,
      అఖండయతి విషయంలో నాకు కచ్చితమైన అభిప్రాయం ఉంది. నేనెప్పుడూ నా పద్యాలలో అఖండయతిని ప్రయోగించను. అయితే ఇతరు లెవరైనా (ముఖ్యంగా బ్లాగులో పద్యాలు వ్రాసే ఔత్సాహికులు) ప్రయోగిస్తే అభ్యంతరం చెప్పను. ఈ విషయాన్ని బ్లాగులో చాలాసార్లు ప్రస్తావించాను. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

      తొలగించండి
  32. చేటు గలుగు సుమ్మ చెడ్డ మదిని జేయు
    పోరువలన, శాంతి బొందగలము
    మంచి నెంచి జేయు మానవ సేవల
    తెలిసి మసలు కొనిన కలుగు సుఖము

    రిప్లయితొలగించండి
  33. శ్రీ కంది శంకరయ్య గురువుగారికి వందనములు
    మీరన్నట్టు దుష్ట సమాసమే నేను గమనించ లేదు
    సరిదిద్దినాను
    పరఢ వించు తీవ్ర వాద చర్య దుడిచి
    వేయ వలెను నేడు విశ్వమెల్ల
    వలసి చేయు తీవ్ర వాదమున్ దొలఁగించి
    పోరు వలన శాంతిఁ బొందగలము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా సూచనను మన్నించి సవరించినందుకు సంతోషం!
      కాని '..దొలగించి పోరు..' కంటె '..దొలగించు పోరు' అంటే అన్వయం కుదురుతుందని నా అభిప్రాయం.

      తొలగించండి
  34. శ్యామలీయం గారు చాలా బాగా వివరించారండి. అర్ధమయ్యింది యతిమైత్రి ఎందుకు సరిపోలేదో. అంతర్జాలములో మీలాంటి గురువులను పొందడం మా అదృష్టము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వ్యాకర్త చిన్నయ్య గారికి బ్రిటిషు ప్రభుత్వం వారు మొదట్లో శాస్త్రి అని బిరుదు నిద్దా మనుకున్నారు. ఐతే అయన మాత్రం అయ్యా నేను పుట్టుశాస్త్రినీ కాదు పెట్టుశాస్త్రినీ‌ కాదు కదా, ఇప్పుడు బిరుదుశాస్త్రిని కావటమా అదేమన్నా బాగుంటుందా అని సందేహించారు. చివరకు పదిమంది పెద్దలతోనూ‌ సంప్రదించి దొరతనం వారు ఆయనకు సూరి అని బిరుదును ఇచ్చి చిన్నయసూరిని చేసారు.

      నాది పండితాహంకారం అని కొందరు అడపాదడపా అపోహపడుతున్నా , నేను పరీక్ష లిచ్చిన తెలుగుపండితుడినీ కాదు, సహజపాండిత్యం కలవాడినీ‌ కాదు. పోనీ బాగా అంధ్రసాహిత్యావలోఢనం చేసిన వాడినా అంటే అలాంటిదేమీ‌ లేదు. మీరు తొందరపడి గురువును చేసేస్తున్నారు. గురుపదానికి తగినంత స్థాయి లేదు నాకు.

      ఏదో తెలిసినంత వరకూ నా కుతూహలం కొద్దీ చెప్పుతున్నా నంతే. మీకు నచ్చినందుకు చాలా సంతోషం.

      తొలగించండి
    2. శ్యామల రావు గారూ,
      మీ వ్యాఖ్య చదవడం మొదలు పెట్టగానే నా గుండెలు గుబగుబలాడాయి సుమా! మళ్ళీ ఎవరైనా ఏదైనా విషయాన్ని 'కెలికి' మీకు మనస్తాపం కలిగించారా అనుకున్నాను. చివరి మూడు వాక్యాలు చదివాక 'హమ్మయ్య!' అనుకున్నాను.
      ఆసక్తి, అభ్యాసం ఉన్న వారెవరైనా వారెన్నుకున్న రంగంలో నిష్ణాతులై గురుస్థానాన్ని పొందవచ్చు. అందుకు డిగ్రీలు కొలమానం కాదు.
      నేను తెలుగు పండితుడిగా పని చేసాను. నిజమే! కాని 28 సంవత్సరాలు ఉర్దూ మీడియం పాఠశాలలో పనిచేయడం వల్ల నేను వాళ్ళ స్థాయికి దిగివచ్చి అంతకు ముందున్న భాషా సాహిత్య పురాణ జ్ఞానమంతా అక్కడ పనికి రానిదై, అభ్యాసం కొరవడి దాదాపు అన్నీ మరిచిపోయాను. తెలుగులో ఎం.ఏ., ఎం.ఫిల్ చేసినా మీకున్న భాషా పరిజ్ఞానంలో పదవ వంతు కూడా లేదని నిస్సందేహంగా చెప్తున్నాను.

      తొలగించండి
  35. భరతదేశ శాంతి మంటగలుపనెంచు
    ఉగ్రవాదులెల్ల ఉలికిపడగ
    వీరసేనలెల్ల విరుచుకుపడినంత
    పోరువలన శాంతి పొందగలము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇంద్రగంటి మధు గారూ,
      'శంకరాభరణం' బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. 'భరతదేశ శాంతి భగ్నము సేయంగ। నుగ్రవాదు...' అనండి.

      తొలగించండి
    2. గురువుగారికి నా నమస్కారాలు.నా పద్యాన్ని సరిదిద్ది తగు సూచన చేసినందులకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

      తొలగించండి
  36. ఆరుమందియరులు తీరుగా కలిసుండి
    పోరు వీడి మనము పోరకుండ
    మనము నుండి వాటి మళ్ళించ జరిపెడు
    పోరువలన, శాంతి బొందగలము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విభజనమ్ముఁ జేయ నభయమ్ము నిచ్చియు
      ప్రభుత చేతి కంద ప్రక్క జూడ
      నమ్మి మోసపోయి నగుబాటు పాలైన
      పోరు వలన శాంతిఁ బొందగలము

      తొలగించండి
    2. గోలి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *****
      సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  37. అయ్యా.అంతర్జాలంలో అంతరాయం వచ్చుటవలన fbద్వారా పూరణ పంపాను.. మీరు చూసారో లేదో అని ఇక్కడ మరల వ్రాస్తున్నాను. పరిశీలించగలరు.

    సత్యమరసిఁ జూడ, నిత్యమీ సంసార
    సాగరములోని జగడమెల్ల,
    ఆటు పోటులన్ని నాటగా దలప నా
    పోరు వలన శాంతిఁ బొంద గలము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమంత రావు గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సాగరము' అన్నచోట గణభంగం. 'సాగరమ్ములోని...' అనండి. (బహుశా మీ ఉద్ధేశం అదే అయి ఉండి అక్కడ టైపాటు కావచ్చు). అలాగే 'ఆటుపోటులన్ని యాటగా..' అనండి.

      తొలగించండి
    2. మీరు చెప్పినట్టు సాగరమ్ము..టైపాటే., యాటగా పొరపాటే దిద్దుకున్నాను

      తొలగించండి
  38. విభజనమ్ముఁ జేయ నభయమ్ము నిచ్చియు
    ప్రభుత చేతి కంద ప్రక్క జూడ
    నమ్మి మోసపోయి నగుబాటు పాలైన
    పోరు వలన శాంతిఁ బొందగలము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీరు పైన గోలి వారి ప్రాంగణంలో మీ పూరణను పోస్ట్ చేశారు కూడా!

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.పొరబాటున అలా పోస్ట్ చేయడం జరిగింది.

      తొలగించండి
  39. గానమందు రుచిని కనలేని తడవున
    గంటసేపు వినగ గాయకుడను
    కడకు రక్తి కట్టు ఘటము మృదంగమ్ము
    పోరు వలన శాంతిఁ బొందగలము

    రిప్లయితొలగించండి