19, జులై 2016, మంగళవారం

పద్మావతీ శ్రీనివాసము - 5

పద్మావతీ శ్రీనివాసము (ద్విపదకావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు

ద్వితీయాశ్వాసము (1-20)

శ్రీలక్ష్మీ ప్రాణాధిప!
కాళీయ ఫణాగ్ర నర్తక! గరుడ గమనా!
లీలా మానుష వేషా!
వేలాక్రాంత కరుణాబ్ధి విశ్వాధారా!                   1

శ్రీసతి యంత నిశ్చేష్టిత యయ్యె
నీ సంఘటనఁ గాంచి హీనాంగ రుచుల          2

హరి లోకనాథుని నసుర సంహారు
ధరణి సురుండు దాదన్నుట యేమి               3

శంఖ సుదర్శన చక్రాయుధుండు
శృంఖలాబద్ధు జేసిన రీతి నుండె                  4

సుప్రభాత నుతుల శోభిల్లు హరిని
విప్రార్భకుడు నేడు వేధించె నకట                 5

కౌస్తుభాభరణంపు కాంతుల వెలుగు
విస్తీర్ణ వక్షము వెలవెల బాఱె                      6

బ్రహ్మాది వేల్పుల ప్రణతుల నందు
బ్రహ్మనాభుఁడు గాంచె పాద తాడనము         7

రోషము వీడి విరోధిఁ గాచెఁ బతి
దూషిత మయ్యె నాదు నిలయ మింక         8

కించ పరుప నేల కినుక వహింప
వించుక ప్రశ్నించె నివ్విధి లక్ష్మి                9

దుఃఖ పూరిత యైన తోయజనేత్రి
దుఃఖ మణచగ మృదువుగఁ బల్కె హరి     10

పరమేష్ఠి పుత్రుండు పరమ పావనుడు
గురు తపోధనుడు సుగుణ భాసితుండు    11

భక్తుడు సంయమి భాగవతుండు
శక్తి నరయ వచ్చె సత్కార్య రతుడు         12

ధూర్తు డనగ రాదు దురితుండు గాడు
వర్తించె నల్ప గర్వంబున నతడు            13

దర్ప మడచితి పాదాక్షిఁ బీడించి
దర్పహీను కరుణఁ దనుప నేరంబ?        14

మన్నన కర్హుండు మాననీయుండు
పన్నుగ క్షమియింపు పద్మదళాక్షి         15

మృదువైన శ్రీహరి మినుకుల సుంత
సుదతికి యుపశాంతి చొప్పడ లేదు      16

నావిని శ్రీలక్ష్మి నాధున కనియె
కావలుండు ఘనాపకారీ ద్విజుండు        17

ఘనుడైన మునియైన ఖదిరుండు నైన
వినయంబు లేకున్న బెద్ద యెట్లౌను      18

దైత్యారి దూషింప దండ నార్హుండు
కృత్యాపరాధంబు గీర్తింప నేల              19

శ్రీపత్యురమ్ము లక్ష్మీ నివాసమ్ము

పాపకర్ముని వామ పాదంబు తాకె        20

3 కామెంట్‌లు:

  1. నీదు పద్యాల యొ రవడి నిజము గాను
    జదువు కొలదిని ముదమును సంత రించె
    గధ నడకయున లలను గలిగి యుండి
    తూగు టుయ్యాల వోలెనునూగు చుండె

    రిప్లయితొలగించండి
  2. నీదు పద్యాల యొ రవడి నిజము గాను
    జదువు కొలదిని ముదమును సంత రించె
    గధ నడకయున లలను గలిగి యుండి
    తూగు టుయ్యాల వోలెనునూగు చుండె

    రిప్లయితొలగించండి