23, జులై 2016, శనివారం

పద్మావతీ శ్రీనివాసము - 9

పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు
తృతీయాశ్వాసము
(1-20)

శ్రీవేంకటాచలపతీ!
సేవిత సురమునిగణా! విశేష గుణనిధీ!
గోవిం దానం తాచ్యుత!
పావన తమ భక్త కోటి పాలన దక్షా!                        1
           
పన్నుగ కల్పాది భవ్య కార్యమ్ము
లన్నిదలంచి శ్రీహరి శాంతు డయ్యె                         2    

ప్రాణ నాధుని మనోభావ తరంగ
వీణాస్వన సమ నిబిడ ఘోషము విని                     3

మోద మలర మది మురహరి చెంత
వేదవతిఁ దలచి వేంచేసె లక్ష్మి                                4

సామాన్యముగఁ దోచు సర్వ జనులకు
ప్రేమాస్పదమ్ము శ్రీవేంక టాచలము                        5  

పరగు నీ స్థలమున భక్తి భావమ్ము
నరు లెల్లరకును మానసమున నెపుడు                  6

అందంద శ్రీ వేంకటాచల మందు
డెంద మలరగ నుండె పరాత్పరుండు                      7

గోచరా గోచర గుంభనమ్ముగను
దోచు నెల్లరకును దోయజాక్షుండు                          8

మానిత ద్విదశాష్టమ కలి యుగమున
భాను తేజుడు మిత్ర వర్మనా బరగె                          9

తేజంపు తుండీర దివ్య మండలము
రాజధాని యట నారాయణ పురము                    10

చంద్ర వంశోద్భవ సార్వభౌముండు
సాంద్ర యశోనిధి సద్గుణ రాశి                               11

జవరాలు పాండ్యరాజ సుత మనో ర
మ వరనామా ర్ధాంగి మహనీయు నకును              12  

ఆకాశ రాజన నా దంపతులకు
ప్రాకట గుణశీలి బాలుండు కలిగె                            13

రాజ్యా భిషిక్తుడై రమ్యముగ నవి
భాజ్యమై పాలించె పార్థివాత్మజుడు                        14

సంతాన రహితుం డశాంతుడు విభుడు
నింతి ధరణి వారి కెట్టి శాపమ్మొ                           15

యజ్ఞార్థి  కాంచన హలమూని చేత
ప్రజ్ఞానిధి కృషి యారణి తటిఁ జేయ                       16  

బీజములు భువిని వెదజల్లు చుండ
యాజన స్థలమున నాధరణి పతి                         17

పద్మదళ నివహ భాసిత శయన
పద్మ సన్నిభ మార్దవ శిశువుఁ గాంచె                  18  

విస్మయానంద వివృత హృదయుండు
విస్మరించి హలముఁ బ్రియ బాలఁ గొనియె           19

పసిపాపఁ గొనిపోయి భార్య కొసంగె
వసుమ తీశుం డంత పరి తోషణమున               20

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి