21, సెప్టెంబర్ 2016, బుధవారం

చమత్కార పద్యాలు - 216

త్రింశదర్థ పద్యరత్నము

          దాదాపు పది సంవత్సరాల క్రితం ఒక ఆదివారం హైదరాబాదు ఆబిడ్స్‌లోని పాతపుస్తకాల దుకాణంలో ఒక పుస్తకం కొన్నాను. ఇంటికి వచ్చి దానిని తిరగేస్తుంటే అందులో ఒక చిన్న కాగితం ముక్క ఉంది. ఆ కాగితంలో ఒక ఆటవెలది పద్యం ఉంది. దాని క్రింద "ఈ పద్యమునకు ముప్పై అర్థములు ఉన్నవి" అని వ్రాసి ఉంది. ఆ పద్యం ఇది....

భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.
 

          ఈ పద్యం గురించిన వివరాలకోసం కొందరిని అడిగాను. చెప్పలేకపోయారు. చివరికి డా. ఏల్చూరి మురళీధర రావు గారిని అడిగాను. వారు ఇది పోకూరి కాశీపతి గారి పద్యమని, దీని వ్యాఖ్యానం తమ వద్ద ఉన్నదని, వెదకి తెలియజేస్తామని చెప్పారు. తరువాత మరచిపోయారేమో? దీని విషయం నేనూ మరచిపోయాను.
          మొన్న ఫేసుబుక్కులో శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్య గారు దీని ప్రసక్తి తెచ్చి, ప్రతిపదార్థాలతో దీని ముద్రిత ప్రతి తమ వద్ద ఉన్నదనీ, ఎవరైనా కోరితే జిరాక్స్ ప్రతి పంపుతామనీ వ్రాశారు. నేను వెంటనే నాకు పంపించమని విజ్ఞప్తి చేశాను. వారు వెంటనే స్పందించి దయతో దాని జిరాక్స్ ప్రతి పంపించారు. దానితో పాటు బంధకవిత్వ సంబంధమైన మరో రెండు పుస్తకాలు కూడా పంపించారు. వారి సౌహార్దానికి కృతజ్ఞుడను.

పోకూరి కాశీపతి (1893-1974)
          గుంటూరు జిల్లా పల్నాడు తాలూకాలోని బోదిలవీడు గ్రామంలో జన్మించిన ఈ కవి చిన్ననాటనే ఛందోవ్యాకరణాది శాస్త్రాలను, పురాణాలను, కావ్యాలను అభ్యసించి 16 ఏటనే 'ధూర్జటి శతకము' రచించాడు. 1916లో నరసారావుపేటలో మొదటి అష్టావధానం చేశాడు. గద్వాల ఆస్థానకవిగా నియమింపబడ్డాడు. పెక్కు అష్టావధానాలు, శతావధానాలు చేశాడు. 
          కవిసింహ, కవిజటిలాఖ్య, కవిశిరోమణి, కవితాప్రవీణ, కవిశిఖామణి, ఆశుకవిపుంగవ, ఆశుకవికోకిల మొదలైన బిరుదులు పొందారు. 
         శివనిందాస్తుతి, నిరోష్ఠ్య నిర్వచన శుద్ధాంధ్ర హరిశ్చంద్రోపాఖ్యానము, సారంగధరీయము (త్ర్యర్థికావ్యము), సునీతి శతకము, కేశవేంద్ర శతకము, సిద్ధయోగి చరిత్ర, అలమేలు మంగ వేంకటేశ్వర సంవాదము, వీర తిమ్మమాంబా చరిత్రము, మన్నెముకొండ వేంకటేశ్వర శతకము, నారసింహప్రభు శతకము (ఏకప్రాస), నరసింహ నిరసన స్తుతి, త్రింశదర్థ పద్యరత్నము, శౌరి శైశవలీల, సత్యనారాయణ వ్రతకల్పము, సుజ్ఞాన ప్రబోధిని, హనుమత్ప్రభు శతకము, శ్రీశైల మల్లేశ శతకము, చమత్కృతి మొదలైన గ్రంథాలను రచించాడు.
          రేపటి నుండి రోజుకొక అర్థం తెలుసుకుందాము....

17 కామెంట్‌లు:

  1. సుకవి మిత్రులు కంది శంకరయ్య గారికి నమస్సులు! మీ రీ విధంగా పోకూరి కాశీపత్యవధానులు గారి పద్యమునకు వ్యాఖ్యను ప్రతిదినము ప్రకటింపఁ బూనుట మా బోంట్లకుఁ బూర్వజన్మ సుకృత విశేష లభ్యాదృష్టము! ఈ పనికిఁ బూనుకొన్న మీకు హార్దికాభినందనలు!

    రిప్లయితొలగించండి
  2. చక్కని సమాచారం.ఈ శుభవార్త మాకానందం కల్గిస్తున్నది.శంకరయ్య గారూ! ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. చక్కని సమాచారం.ఈ శుభవార్త మాకానందం కల్గిస్తున్నది.శంకరయ్య గారూ! ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

  4. మన తెనుగు సాహిత్య సాగరం లో ఇంకా ఎన్ని రత్నాలు ఉన్నాయో...ఈత రాని ఈతరానికి వాటిని వెలికితీసి చూపటానికి మీలాటి వారే దిక్కు.మాస్టరుగారూ! ధన్యవాదములు.








    రిప్లయితొలగించండి
  5. భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
    మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
    డలఘు సద్గుణేశుఁ డగ్రగోపుఁడు మహా
    మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.
    ----------
    ఒక్క పద్యము నకుమరి చక్క నైన
    నర్ధ ములుముప్ప దిగలుగ నద్భు తంబు
    నట్టి పద్యమ్ము శోధించి నట్టి మీకు
    వంద నంబులు శంకర !యందు కొనుము

    రిప్లయితొలగించండి
  6. కందిశంకరయ్యగారికి,
    నమస్కారాలు, ఆ పుస్తకంకోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాను.
    అది మీవల్ల దౌరుకుతున్నందుకు చాల ధన్యవాదాలు. కొందరు
    పుస్తకం ఉండి కూడ దాన్ని ఇవ్వటానికి దాటవేశారు. మీరు దాన్ని
    అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో ఉన్న పద్యానికి 30 అర్థాలున్నాయి.
    కాని సోమప్రభాచార్యులు వ్రాసిన శతార్థ శ్లోకంలో ఒక శ్లోకానికి వంద అర్థాలున్నాయి.
    అయితే ఆ అర్థాలు సంస్కృతంలో ఉన్నాయి. వాటిని తెలుగులోకి అనువదించేవారు
    ఏవరైనా ఉంటే తెలుపగలరు.

    రిప్లయితొలగించండి
  7. శంకరార్యా!ధన్యవాదాలు!అద్భుతాలనందిస్తున్నారు!
    కాశీపతి కవివర్యులకు వందనములు!

    రిప్లయితొలగించండి
  8. శంకరార్యా!ధన్యవాదాలు!అద్భుతాలనందిస్తున్నారు!
    కాశీపతి కవివర్యులకు వందనములు!

    రిప్లయితొలగించండి