31, అక్టోబర్ 2016, సోమవారం

వేంకటేశ్వర శతకము - 10



వేంకటేశ్వర శతకము
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)
 (౧౦)
తరుగని సంపదౌఘమని ధారుణి వెల్గెను వేంకటాద్రిగం
బరగగ నీల నామ కపి పన్నుగ నొప్పెను నీల శృంగిగన్
నరహరి రూపుడై వెలుగ నామము కల్గెను సింహశృంగిగన్
హరి వర మాత సేయ తప మంజన శైలమ వేంకటేశ్వరా!                     86.

దివ్యము ధారుణిం గపిల తీర్థము ధామము చంద్ర మౌలికిన్
భవ్యము పాప నాశకము భక్త వరేప్సిత దాయకమ్మును
న్నవ్యయ కీర్తితమ్ము సక లాంచిత తీర్థనిమజ్జ నాభమున్
నవ్య జలప్రకాశము ననంత సుకీర్తిత! వేంకటేశ్వరా!                             87.

సనక సనంద నాది ముని సంఘము వేడగ వేంకటాద్రి దు
ర్జన కృత సంకటమ్ములను సర్వము ఖర్వము సేసి యంత భూ
జనులకుఁ బూర్వ కాలమున సంతత దర్శన భాగ్యమిచ్చుచుం
దనరితి వయ్య నేడు మము ధన్యులఁ జేయవె వేంకటేశ్వరా!                  88.

జగతి వరాహ మంత్రము నచంచల భక్తిఁ బఠించి నిత్యమున్
సుగతినిఁ బొందె ధర్ముడు ప్రచోదితు డయ్యజ వాచ్య బోధలన్
నగరిపు విప్ర శాపము వినాశము సెందగ నేలె నాకము
న్నగ వరు డాయనంతు డిల నంత ధరించెను వేంకటేశ్వరా!                  89.
[ధర్ముడను మనువు, నగరిపువు=ఇంద్రుడు, అగవరుడు= సర్పరాజము]  

అనుదిన మెవ్వ డేని నిల నంచిత భక్తినిఁ బూజ సేసినన్
ఘనముగ నీదు భక్తులను గారవ మొప్పగ సన్నుతించినన్
వినినను నీదు గాథలను వీనుల కింపుగఁ దన్మయమ్మునం
గనికర మొప్పఁ గాచెదవు కానల నున్నను వేంకటేశ్వరా!                        90.

బ్రహ్మ మహోత్సవమ్ము ధ్వజ భాసిత మాశ్వయుజమ్మునన్ ఘనా
జిహ్మ సుమంత్ర పూజితము శ్రీయుత కేశవ సమ్మతమ్మునున్
బ్రాహ్మణ రాజ వైశ్య వృషలవ్రజ సేవిత పర్వమున్ సదా
జహ్మము ముక్తి దాయకము సర్వ జనాళికి వేంకటేశ్వరా!
[అజిహ్మము= సరియైన, ఋజువైన; అజహ్మము= హృద్యము]                91.

భిదురము లౌన ఘమ్ములకు వేంకట నాథ సుకీర్తనావళుల్
వెదుక విభూతి మూలములు వేంకట నాథ సుకీర్తనావళుల్
విదితపు మోక్ష మార్గములు వేంకట నాథ సుకీర్తనావళుల్
వదలక చిత్త మందు నిడి ప్రార్థన సేసిన వేంకటేశ్వరా!                          92.
[భిదురము=వజ్రాయుధము

సలుపగ నన్న దానమును సప్త కులావధి నిత్తు వన్నమున్
సలిలపు శాల లేర్పరుచ చక్కగ శీతల చిత్తు డౌదువే
ఫలిత మహీన సంపద కృపన్నరయన్ వికలాంగు లెల్లరం
జెలువపు టుత్సవాహములఁ జిత్రము సూడగ వేంకటేశ్వరా!                   93.

అనయము కోపతాపముల నన్యుల కెంతయుఁ గీడు సేయుచుం
దనువుల యందు మోహమున దారుణ కర్మల నాచరించుచుం
గనులకు గోచరించగనె కాంతల నెల్లరఁ గోరునట్టి దు
ర్జనులకు విందు దండధరు సమ్మెట పోటులు వేంకటేశ్వరా!                  94.

జన్మల యందు దుర్లభము చక్కటి మానవ జన్మ మిద్ధరన్
సన్మతి ధర్మసంయుతము శార్ఙ్గధ రాంచిత పాద చింతనా
తన్మయ పారవశ్యమునఁ దామర సాక్ష సుపూజలం బున
ర్జన్మ నివృత్తి సేకురు నసత్యము గాదిల వేంకటేశ్వరా!                            95.

సమస్య - 2186 (రణమేగా సుఖశాంతు లిచ్చి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"రణమేగా సుఖశాంతు లిచ్చి మనకున్ రంజిల్లఁ జేయున్ మదిన్"
లేదా...
"రణమే సుఖశాంతు లిచ్చి రంజిలఁ జేయున్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

30, అక్టోబర్ 2016, ఆదివారం

వేంకటేశ్వర శతకము - 9



వేంకటేశ్వర శతకము
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)
 (౯)
ఆయత మాననీయ వృషభాచల మంచిత వేంకటాద్రి నా
రాయణ శైల రాజము విరాజిత శేష మహీ ధరమ్మును
న్నాయత మంజనాద్రి గరుడాద్రి వృషాగము లందు నిత్యముం
బాయక యుందు విమ్ముగను భక్త జనాశ్రయ వేంకటేశ్వరా!                   76.

సుమసమ కోమలాంగమున సుందర బాలుని లీల దాను దో
చ మసలు వేంకటాధిపతి సమ్మతి బాపడు వృద్ధుడంత స్నా
నము దగ సేయ యౌవనము నన్విల సిల్లగ నా తటాకమే
విమల కుమార ధార యన విశ్రుత మయ్యెను వేంకటేశ్వరా!                  77.

ఉరుతర మోద చిత్తమున నుత్తర పూర్వ దిశాధినేత శం
కరుడట వేంకటాచల వికాసిత దక్షిణ పూర్వ దిక్కునన్
గిరిధర సమ్మతమ్మునను గేశవ మిత్రుడు వాసముండగన్
వరముల కేమి తక్కువట భక్త జనాళికి వేంకటేశ్వరా!                            78.

వేంకట నాధ తుల్యుడు నభీప్సిత దాయక దైవ ముండునే
సంకట షండ భంజనుడు సచ్ఛరణాగత రక్షకుండు స
త్కింకర వత్సలుండు ఘన తీర్థ విలాసిత నాధు డుండునే
పంకజ ఫుల్ల నేత్ర! భవ వారిధి తారక! వేంకటేశ్వరా!                              79.

గుంభన భర్మ సానువులఁ గూడియు వైభవ వేంకటాద్రి సం
రంభ మొకింత లేక కడుఁ బ్రాకృత శైలపు రీతిఁ దోచు నీ
కుంభిని సర్వ మానవులకుం బరమాంచిత శైలమైననున్
స్తంభిత ఘోరదైత్యగణ! సన్నుత నిర్జర! వేంకటేశ్వరా!                             80.

ధనముల నిత్తు రెక్కువ మతాంతర భక్తులు వత్తు రిద్ధరన్
వనితలు బాలవృద్ధులును వారక వత్తురు దర్శనార్థమై
ఘనతర పుణ్యశైలము సుఖప్రద పాపవినాశకాద్రికిన్
మనమున నిన్ను నిల్పియు సమంచిత భక్తిని వేంకటేశ్వరా!                    81.

కీర్తినిఁ గోరి చేయ నది కించి దవాంఛిత కార్యమే సుమీ
కర్తకు దాన వస్తువుల గ్రాహకు లింపుగఁ గల్గ నేర్తురే
యార్తుల కాదరమ్ముగ సహాయత నిచ్చిన దైవకార్యమే 
ధూర్తుల కబ్బదట్టి కడుఁ దోరపు భాగ్యము వేంకటేశ్వరా!                        82.

ఇంచుక దాన మిచ్చిన నహీన దయార్ద్ర హృదంబుజమ్మునం
గొంచెము పూజ చేసిన నకుంఠిత భక్తి నిరంతరమ్ము నే
తెంచిన నంత మాత్రమున దివ్యపు వేంకట శైల రాజముం
బంచెద వెల్ల సంపదలు భక్తుల కిమ్ముగ వేంకటేశ్వరా!                           83.

కలిఁ బ్రతిమావతారమునఁ గాయజ సన్నిభ సుందరాంగుడై
యలరుచు మౌన మూని సక లావని వాసుల కిష్ట దైవమై
చెలగి విమాన రత్నమతి చిత్రము దివ్య మగోచరమ్మునై
వెలుగగఁ బ్రోతు వెల్లరను వేడిన యంతనె వేంకటేశ్వరా!                       84.

సురవర యక్ష కిన్నరులు చోద్యము మీరగ వేంకటాద్రినిన్
సురుచిర పుణ్య తీర్థముల శుద్ధ జలమ్ములఁ దోగి భక్తినిన్
సిరి విభు పాద పద్మ యుగ సేవ వసింప నదృశ్య రూపులై
నిరతము వేడు కొందు రట నిశ్చల చిత్తులు వేంకటేశ్వరా!                     85.

సమస్య - 2185 (ఫాల్గుణమున దీపావళి...)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"దేవా ఫాల్గుణమందు వచ్చును గదా దీపావళీ పర్వమే"
లేదా...
"ఫాల్గుణమున దీపావళి పండుగ కద"

29, అక్టోబర్ 2016, శనివారం

వేంకటేశ్వర శతకము - 8



వేంకటేశ్వర శతకము
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)
 (౮)
వినవలె నీదు కీర్తనలు వీనుల విందుగ నాట్య మాడుచుం
గనవలె దివ్య రూపమును గన్నుల కింపుగ సంతసమ్మునన్
మునుకలు వేయగావలెను బుష్కరిణీ జల మందు భక్తినిన్
మనమున నిల్పగా వలెను మంగళ రూపము వేంకటేశ్వరా!                   66.

శ్లోక చతుష్టయమ్ములను సూర్య కులోద్భవ చక్రవర్తి సు
శ్లోకుడు ప్రస్తుతింప ఘన శోక పరీత మనస్కుడై తదీ
యాకుల చిత్తు నా దశరథాఖ్యుని పుత్ర చతుష్ట యమ్మునన్
వే కరుణించితే విమల వేంకట శృంగిని వేంకటేశ్వరా!                           67.

కుందన మంత శుద్దము వికుంఠపు టయ్యయిరంమదమ్ము నే
యందరు స్వామి పుష్కరిణి యందురు భాసిల వేంకటాద్రి లో
నెందు మునంగఁ బాపములు హీనము లౌనిల నద్భుతమ్ముగన్
సందియ మల్పముం గనము సన్నుత శంకర వేంకటేశ్వరా!                   68.
[(అయిరంమదము) ఐరంమదము= వైకుంఠములోని తటాకపుపేరు]

వరముల నిచ్చి నిత్యమును బన్నుగఁ బ్రోచెడు దైవముండగా
నరబలు లిచ్చి క్షుద్రసుర నైరృత పూజలు సల్పనేర్తురే
గరళముఁ గ్రోలఁ జూచెదరు కమ్మని పాలను విస్మరించియున్
గిరివర వేంకటాద్రి ఘన కీర్తితు వేడక వేంకటేశ్వరా!                              69.

ముదముగ బ్రహ్మ కల్పిత మపూర్వ మహోత్సవ మందు నొక్క రో
జు దరల నశ్వరాజమున శోభిల దంతిని నొక్క రోజునన్
సృదర విహార మొక్కపరి చెన్నుగ తార్క్ష్యు రథంబు నందునం
బదపడి యొక్క రోజునను వర్తిలు చుందువు వేంకటేశ్వరా!                   70.
[సృదరము=సర్పము(అనంతుడు); అశ్వవాహనము (ఉచ్చైశ్రవము), గజవాహనము (ఐరావతము), గరుడ వాహనము]

అల నలమేలు మంగపుర మందున చందన చర్చితాంగియై
మిలమిల కాంతులన్ మెఱయు మేలిమి భూషణ వస్త్రధారణం
గలవర మందు భక్తజన కామిత దాయి యనంగ భాసిలం
జెలువముఁ జూపు నా సతినిఁ జేరగ వత్తువు వేంకటేశ్వరా!                   71.
[మేలిమి = అపరంజి; చెలువము = మహత్త్వము]

రాముడు దైత్యఛేదనకు రమ్యపు టంజన శైల మందు నా
రామము నందు నంజన కరమ్ములఁ బూజల నంది విప్రు ని
ర్లోముని వేంకటాద్రిని విలోకన ముక్తుని జేసి భక్తినిం
దా మునుగంగఁ బుష్కరిణిఁ దత్ఫల మందెను వేంకటేశ్వరా!                  72.

అంతము సేసి దైత్యుని బలాన్విత మూర్ఖు హిరణ్య నేత్రుఁ గ
ల్పాంతము వేంకటాద్రిని మహామహి మాన్విత శైల మందునన్
శాంత దయా గుణప్రతతి సాగర నందన భూసతీ యుతం
బెంతయుఁ బ్రీతి నుందు నని యేర్పడ నంటివి వేంకటేశ్వరా!                 73.

మేదిని వేంకటాచలము మిక్కిలి మక్కువ సత్యలోకమున్
మోదపు నాకలోకము నపూర్వపు సూర్య జగమ్ము కన్ననున్
శ్రీదయితుండు నా హరికి శ్రీయుత ముండును శ్రీనివాసుడీ
వేద మయోర్వి భక్తుల కభీప్సిత దాతగ వేంకటేశ్వరా!                            74.

కందర నిర్ఝ రావృతము క్ష్మాజ మృగద్విజ సంకులమ్మునున్
సుందర నంద నోపమ విశుద్ధ జలాశయ వాటికా తటీం
దిందిర నాద మోదితము దివ్యము నబ్జజ సేవితమ్మునున్
సుందర వేంకటాచలము సూక్ష్మమె యిద్ధర వేంకటేశ్వరా!                      75.

సమస్య - 2184 (నాగేంద్రాభరణుండు చంపె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"నాగేంద్రాభరణుండు చంపె నరకున్ నాకౌకసుల్ మెచ్చఁగన్"
లేదా...
"నాగాభరణుండు కినిసి నరకునిఁ జంపెన్"

28, అక్టోబర్ 2016, శుక్రవారం

వేంకటేశ్వర శతకము - 7



వేంకటేశ్వర శతకము
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)
 (౭)
నగముల నేడు నొక్క త్రుటి నర్తన లీలగ నెక్క వచ్చునే
జగములఁ గల్గు వేదనలు సన్నుతి సేయగఁ దీర కుండునే
విగతము లన్ని పాపములు వేడిన నిశ్చల భక్తి నెమ్మదిన్
నగవులు చిందు నీముఖమె నాకగు దిక్కిల వేంకటేశ్వరా!                      56.

సంతస మంద నేరవు యశస్కర వైభవ పూజ నాదులం
బంతము లన్ని వీడి కడు భక్తినిఁ బత్రము తోయమో తమిన్
సుంతయు నిచ్చి నంత పరిశుద్ధ మనంబున సంతసింతువే      
వింతలు నీ మహాత్మ్యము లవేద్యము లిద్ధర వేంకటేశ్వరా!                       57.

సంపద కాలవాలమగు సాగర నందన నీ యురమ్మునన్
సొంపున నుండ కుక్షి ఘన శుంభ దజాండము నిండి యుండగం
బెంపున నప్పు నీయగఁ గుబేరుని వైభవ మెంత? వింతయే!
యింపిఁడి వడ్డి కాసులన నేమని చెప్పుదు! వేంకటేశ్వరా!                      58.
[ఇంపిఁడి = ఇష్టము లేక]

ఆపద నుత్తరించుమని యార్తిని మ్రొక్కుల నిత్తు మందురే
కోపము కల్గు నేమొ యని కుందుదు రెల్లరు తీర్చ కుండినం
బాప మెరుంగ నేరరు కృపారస చిత్తున కేల మ్రొక్కులున్
నీ పద యుగ్మమింక మది నిల్పిన చాలదె వేంకటేశ్వరా!                        59.

సుందర మైన రూపమది చూచిన నిత్యము తన్వి తీరునే
విందులు సేయు కీర్తనలు వీనుల కెప్పుడు మోహనమ్ముగన్
డెందము నందు విగ్రహము ఠీవిగ నిల్చు నిరంతరమ్ము నే
మందుము నిత్య నూతన మహాద్భుత లీలల వేంకటేశ్వరా!                     60.

బాల్యము నందు నేరకను బ్రాయము నందున విద్యలందు మాం
గల్యపు మోహ మందు నిఁకఁ గాపురపుం బటు బాధ లందునన్
శల్యము లౌను గాయములు సాగగ నీవిధి వారలింక కై
వల్యము గోరి నింగొలువ వచ్చెద రెన్నడు వేంకటేశ్వరా!             61.

చిత్ర విచిత్ర నామముల సేవలు సల్పుదు రెల్ల వేళలన్
గోత్ర సమేత నామములఁ గొల్తురు నిత్యము పారవశ్యతం
బాత్రము వేద ధర్మ పరిపాలన కర్మకు వేంకటాద్రి స
ద్గోత్రము నిత్య మంగళ వికుంఠము ధాత్రిని వేంకటేశ్వరా!                     62.

లంచమ యంచు నెంచక విలాసముగా వచియింత్రు మ్రొక్కులే
యంచును జెంత జేరి మది నార్తిని మ్రొక్కిన దేవ దేవునిం
గాంచరె సర్వ దుఃఖముల ఖండన సందియ మేల నేరికిన్
వంచన లేల చిత్తమున భక్తియ చాలదె వేంకటేశ్వరా!                           63.

కానుక లేమి యిచ్చెనట కానల శంఖణు డొందె రాజ్యమున్
మానుగ కుంభ కారుడల మాడల నిచ్చెనె భీము డెన్నడున్
దేనికి తింటి వా చెఱకు దీటగు సొమ్ములు బాబ యిచ్చెనే
కానము నేడు సన్మతులఁ గాంచము వింతల వేంకటేశ్వరా!                    64.

కరుణయె తప్ప నన్యమును గానము దీన జనమ్ము లందునన్
వరముల నిచ్చి కాచెదవు భక్తుల నింపుగ వేడి నంతనే
తరణము నామ కీర్తనము తామరసాక్ష భవాబ్ధి కిద్ధరన్
మరువను నీదు పూజలను మానస మందున వేంకటేశ్వరా!                  65.