5, అక్టోబర్ 2016, బుధవారం

చమత్కార పద్యాలు – 216/14


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

14వ అర్థము సూర్య స్మరణ         
                                                                          
భూరి జఠర గురుఁడు = బ్రహ్మయే తాతగా గలవాఁడును,
నీరజ అంబక భూతి = ఈశ్వరుని వంటి (తరగని కిరణముల) యైశ్వర్యము గలవాఁడును,
మహిత కరుఁడు = అధికతరమైన హస్తములు గలవాఁడును (సహస్రకరుఁడు),
అహీన మణి కలాపుఁడు = ఘనతరమైన శమంతకాది మణిసముదాయము గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = అధికమైన సాధు గణాధీశ్వరుఁడైనవాఁడును,
అగ్ర గోపుఁడు = ముఖ్య నేత్రమైన ప్రభుఁడును,
మహామర్త్యసింహుఁడు = గొప్ప దేవతా శ్రేష్ఠుఁడైనవాఁడును (అగు సూర్య భగవానుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

1 కామెంట్‌:

  1. వేయి కిరణాల జేతను వెలుగు నిచ్చు
    సూర్య భగవాను గొలుతును నార్య !శుభము కొఱకు
    నిచ్చు గావుత గరుణన మెచ్చి సేవ
    సిరులు సంపద లుమనకు శీఘ్ర ముగను

    రిప్లయితొలగించండి