19, అక్టోబర్ 2016, బుధవారం

చమత్కార పద్యాలు – 216/28


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

28వ అర్థము దత్తాత్రేయ స్మరణ
                                                                          
భూరి జఠర గురుఁడు = బ్రహ్మయే తాతగా గలవాఁడును (బ్రహ్మ సంతానమగు అత్రి కుమారుఁడైనందున),
నీరజాంబక భూతి = విష్ణువు యొక్క పుట్టుక గలవాఁడును (అనసూయ కోర్కె ప్రకారము విష్ణువు దత్తాత్రేయుఁడుగా గల్గినందున),
మహిత కరుఁడు = అధికమైన (త్రిముఖుఁ డైనందున ఆరు) చేతులు గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = ఘనమగు రత్నభూషలు గలవాఁడును (తన జాతకర్మోత్సవమున దేవతలు కానుకగా ఇచ్చిన రత్నభూషలు ధరించినందున),
అలఘు సద్గణేశుఁడు = అలఘుతరమగు సాధు గణముల కధ్యక్షుఁడైనవాఁడును,
అగ్ర గోపుఁడు = వేదవాక్య పరిపాలకుడైనవాఁడును,
మహామర్త్యసింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్ఠుడైనవాఁడును (అగు దత్తాత్రేయుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

6 కామెంట్‌లు:



  1. ఔరా ! నేటి సమస్యా పూరణ గానరాలె !


    తెలవారె నుపాహార మ
    సలు గనరాలెను సమస్య సమరము జేయన్
    పలువిధ పూరణలను గా
    న లచ్చిమి జిలేబి వేచె ననఘా నిచటన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. అలసితివేమొ ఘంటమున కారడి తగ్గెనొ నేటి భాస్కరోచ్ఛలిత బ్రకాశమేది దిశలన్నిట క్షాళన జేసి చూడగాకల యిది యందునా గనను గాసినిజెందితి మిత్రమండలిన్ మలచవె బ్రొద్దు బోయె యికమా కెపుడయ్య సమస్య శంకరా!
    డా.పిట్టా

    రిప్లయితొలగించండి
  3. దిశ క్షాళనజేసితి గా చదవండి tab పైననే వ్రాసినదిది. డా.పి

    రిప్లయితొలగించండి
  4. జిలేబిగారూ! నేను సైతం!

    నిశిరాత్రి నుండి వేచితి
    పసిపాపను బోలి నేను పాలాకలితో
    ముసిలోడను! దయ దాల్చుడు!
    శశిధర! గురుదేవ కంది శంకర వర్యా!

    గుఱ్ఱం ప్రభాకర శాస్త్రి

    రిప్లయితొలగించండి
  5. జిలేబీ గారూ, పిట్టా వారూ, గుఱ్ఱం వారూ,
    బ్లాగు టపాకోసం ఇంతగా నిరీక్షిస్తున్నామని తెలియజేసినందుకు మహదానందంగా ఉంది. మొన్న కర్నూలుకు వెళ్ళే ముందు నాలుగు రోజుల టపాలను షెడ్యూల్ చేశాను. ఈనాటి సమస్య కూడా షెడ్యూల్ చేశాననుకొన్నాను. అస్వస్థత కారణంగా ఆలస్యంగా ఇప్పుడే లేచాను. తీరా చూస్తే ఈనాటి సమస్య లేదు. ఇప్పటికిప్పుడు ఏ సమస్య నివ్వాలో తోచక 'న్యస్తాక్షరి' ఇచ్చాను.
    ఆలస్యానికి మన్నించండి.

    రిప్లయితొలగించండి
  6. నీరజాం బక భూతుడ !నిర్మలుండ
    బ్రహ్మ మనుమడ యతివర్య మహిత కరుడ
    మమ్ము కావుము సదయను నిమ్ము గాను
    వందనంబులు సేతును వంద లాది

    రిప్లయితొలగించండి