23, అక్టోబర్ 2016, ఆదివారం

సమస్య - 2178 (నడిరేయిన్ రవిఁ గాంచి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"నడిరేయిన్ రవిఁ గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్" 
లేదా...
"నడిరేయి రవిఁ గాంచి నవ్వె నుత్పలము"

74 కామెంట్‌లు:

  1. కడు పేదన్ శుభలక్షణాన్వితను సౌఖ్యంబెన్ని పెండ్లాడనె
    న్నడు కాఠిన్యమెరుంగనట్టిరవి, వెన్నల్ చిల్కగా చల్లనౌ
    నడిరేయిన్ రవిఁ గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్
    పడకంజేరిననూత్నకాంత ముఖభాస్వత్ శ్వేతకాసారమున్ ||

    రూపకాలంకారము. ముఖము = శ్వేతకాసారము. నేత్రములు = ఉత్పలములు.

    సద్గుణాఢ్యుడు రవి సౌందర్యవతినెన్ని
    పెండ్లిజేసికొనగ ప్రియముఁ భార్య
    పడకటింటియందునడిరేయి రవిఁ గాంచి
    నవ్వె నుత్పలముల నయన, వధువు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. ముఖ్యంగా ద్విపద పాదాన్ని ఆటవెలదిలో ఇమిడ్చిన మీ నైపుణ్యం ప్రశంసనీయం.

      తొలగించండి
  2. జగతి నేలె డిరవి జంటకోమలి నెంచి
    జేరె ముదము గాను చెలియ చెంత
    నిండు చంద మామ నడిరేయి రవిగాంచి
    నవ్వె నుత్ప లముల నయన వధువు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      ద్విపద సమస్యకు మీ ఆటవెలది పూరణ బాగున్నది.
      కాని... మూడవపాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
    2. జగతి నేలెడి రవి జంటకోమలి నెంచి
      జేరె ముదము గాను చెలియ చెంత
      వెండి వెన్నె లేమొ నడిరేయి రవిగాంచి
      నవ్వె నుత్పల ముల నయన వధువు

      తొలగించండి
    3. అక్కయ్యా,
      యతిదోషం సవరింపబడలేదు. ప్రాసాక్షరం ఒకటి అనుస్వారపూర్వకంగా, మరొకటి అనుస్వారం లేకుండా ఉండకూడదు కదా!

      తొలగించండి
    4. అవును క్షమించాలి ఈమధ్య మరీ మతిపోతోంది .గమనించలేదు

      తొలగించండి


  3. సడిజేయన మనస్సు సఖుని జేరగను
    పడిగాపుల వయస్సు పరితపించనట
    సుడిగాలి వలె పతి సుకుమారినిగన
    నడిరేయి రవిఁ గాంచి నవ్వె నుత్పలము

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ' షట్పది ' లో -

    చల్లని కౌముది
    నిడు శశి గాంచుచు
    తెగబాఱె నోయి కంధి నడిరేయి;
    రవిగాంచి నవ్వె ను
    త్పలము సింధువు నందు
    రేగుచు నుండి నీరెండనోయి.

    (కంధి = సముద్రము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
      షట్పదిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. నాపేరు: "ప్రభాకర" శాస్త్రి. నా భార్య ముద్దుపేరు: "కలువ" రాణి. నాకు తెలుగు వ్యాకరణం రాదు. కానీ శ్రీమాన్ శంకరయ్య గారి ప్రోత్సాహంతో "శంకరాభరణ" గోష్టిలో కలిశాను:



    ప్రౌఢుల సభన 'ప్రభాకరు'డుండి
    పట్టుబట్టి తెలుగు పద్యముల్ వ్రాయ

    పడిపడి నవ్వె నా ప్రియసతి 'కలువ'
    "నడిరేయి రవిఁ గాంచి నవ్వె నుత్పలము!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జి. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణలోని చమత్కారం బాగుంది. అభినందనలు.
      మూడవ పాదంలో యతి తప్పింది. "పడిపడి నవ్వె నా పత్నయౌ 'కలుగ'" అందామా?

      తొలగించండి
    2. ధన్యవాదములు ఆచార్యవర్యా!
      ఈరోజే పరవస్తు గారి బాలవ్యాకరణానికి ఆర్డర్ ఇచ్చాను. రేపు వస్తుంది అమెజాన్లో.
      నమస్తే!

      తొలగించండి
    3. శాస్త్రి గారూ,
      మీకొక వ్యాకరణ పుస్తకం పి.డి.యఫ్. పంపించాను. మీకు ఉపయోగపడుతుందో లేదో ... చూసి చెప్పండి.

      తొలగించండి
  6. నళిని సంతసించె నడి రేయి! రవి గాంచి
    నవ్వె నుత్పలములె నాకమనుచు!
    యట్టి రాత్రి మరియు నట్టి పగలె నిల
    పగల ద్రోలి వైచు! వగల దీర్చు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      ఆటవెలదిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "నాకమనుచు। నట్టి రాత్రి మరియు నట్టి పగలె యిల" అనండి.

      తొలగించండి
  7. డా.పిట్టా
    నడికూపంబని గాంచ నా జగతినిన్ నాకంబుగా గూర్చెదన్
    వడినిందేర్పడునట్టి చిత్రములకే వాసిన్ గనన్నోస్థలిన్
    నడిరేయిన్ రవి గాంచి యుత్పలములానందంబునన్ విచ్చెడిన్
    సడియుం జప్పుడు లేని కాలముననే "సావిత్రి"నిన్ గన్నటుల్
    ఓ స్థలిన్ ఉదా॥ అమెరికా వంటి పడమర భూభాగంలో

    కడుప్రేమ గానదో కాలంబు ననగ
    పడి పడి పరికించు వైనంబు విభుని
    కడనుండు చింతనన్ గదిసిన మదిని;
    నడిరేయి రవి గాంచి నవ్వె ఉత్పలము! డా.పిట్టా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ఒక'ను 'ఓ' అనరాదు.

      తొలగించండి
  8. ఎడబాటున్ సహియించలేక దన రాకేందుప్రభా మానసున్
    సడి లేకన్దరి జేరగన్ గనుచు నాశల్బూయగన్ వేగమే
    యొడిలోనన్ దనియించు లాలనల నుత్సాహంబునం దూగగన్
    నడిరేయిన్ "రవి" గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్!

    రిప్లయితొలగించండి

  9. నా రెండవ పూరణము:

    అలుక వీడిన వేళను పలుక నేర్చి
    కులుకు లొలికెడి దనసతి కోప మడచ
    దువ్వ, "నడిరేయి, రవి గాంచి నవ్వె నుత్ప
    లము"లు, దరిజేరిన మగని లాలనమున!

    దువ్వు=నిమురు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిశ్ట్లా శర్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మూడవ పాదంలో గణదోషం. "యొడిలోనన్ దనియించు లాలనలతో నుత్సాహమం దూగగన్" అందామా?

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారూ సవరిస్తాను.

      తొలగించండి
  10. మ.వడిగా జేరితి యుత్సహింప మది యా వైబోగముంజూడగన్
    నడిరేయైనను వెల్గుచుండు రవి యా నార్వే ప్రదేశమ్మునన్
    కడు మోదమ్మును పొందు గాదె మదియే కాంచంగ నాదృశ్యమే
    నడిరేయిన్ రవి గాంచి యుత్పలము లానందంబున విచ్చెడిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "జేరితి నుత్సాహింప..' అనండి.

      తొలగించండి
  11. పడరాని పాట్లను బడుచున్న గాని
    నడకతొడరుచుండె నాజూకు లేక
    పడకిల్లు జేరిన పట్టదే నిదుర
    వడిగనుత్పలమాల వరదల్లె రాక
    బడలి పోయెనుమది భావంపుజడికి
    పడిపడి పరికించి పరితాపపడెడు
    నడిరేయి రవిగాంచి నవ్వెనుత్పలము
    తడగమ్ము నందుండి తలయూచెనదివొ!!!

    రిప్లయితొలగించండి
  12. సడిలేని వెన్నెల సరసాల నీడ
    పడిలేచి మిగిలిన ప్రణయాల జంట
    నడిరేయి, రవిగాంచి నవ్వె నుత్పలము
    షోదయమున వారి శోభను గనుచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చివరి పాదం సవరణ
      చూడము వారిని చురుకులొద్దనుచు

      తొలగించండి
    2. చేపూరి శ్రీరామారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చురుకు లెందుకని' అనండి.

      తొలగించండి
  13. వడిగా పద్యములెన్నొ వ్రాయ మదిలో భావించగా భావనల్
    సుడిగా ముప్పిరిగొన్నవాయె తుదకున్ చూడంగ ధీశక్తితో
    యొడిలో పుస్తకముంచివ్రాయ 'రవి ' యే ' నో ' యంచు ధారాగతిన్
    నడిరేయిన్ 'రవిఁ' గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శక్తితో నొడిలో...' అనండి.

      తొలగించండి
  14. వేడి గాడ్పు వీచె నడిరేయి, ర విగాంచి
    నవ్వె నుత్పలమన న్యాయ మౌనె ?
    చంద్రు జూడ గ విక సనమునొందు భువిని
    రవిని జూడ గముకు ళ త నునొందు

    రిప్లయితొలగించండి
  15. కడగండ్లు పడి రవి,కాలు జారంగ
    పడమరసంద్రాన,పాతాళమునకు
    పడిపోయె.నడుసులో నడగారుచున్న
    నడిరేయిరవి గాంచి నవ్వె నుత్పలము

    రిప్లయితొలగించండి
  16. చిన్న సవరణతో..

    వడిగా పద్యములెన్నొ వ్రాయ మదిలో భావించగా భావనల్
    సుడిగా ముప్పిరిగొన్నవాయె తుదకున్ చూడంగ ధీశక్తితో
    నొడిలో పుస్తకముంచివ్రాయ 'రవి 'తా ' నో ' యంచు ధారాగతిన్
    నడిరేయిన్ 'రవిఁ' గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్.


    తాన్ (ఓ) యంచు
    ఉత్పలము = ఉత్పలమాలా వృత్తములు.

    రిప్లయితొలగించండి
  17. పుడమిం జంద్ర సుదర్శనంబు మది సమ్మోదంబు సేకూర్చదే
    కడతేర్చంగ దినాంతరశ్రమను సౌఖ్యంబౌ శరద్రాత్రినిం
    గడు చిత్తద్యుతి కల్గ జేసెడు కురంగాంకుండు చంద్రుండు దా
    నడిరేయిన్ రవిఁ గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్


    బడబాగ్ని మించు తాపము వెదఁజల్లు
    కడగన్ను చూపుల కడతేర్చఁ గాంత
    తడియారఁ గుత్తుకఁ దారాధిపుఁ గను
    నడిరేయి రవిఁ గాంచి నవ్వె నుత్పలము

    [రవి = జీవుడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
    3. అఖండ యతి వలదనుకొని చేసిన సవరణ:

      పుడమిం జంద్ర సుదర్శనంబు మది సమ్మోదంబు సేకూర్చదే
      కడతేర్చంగ దినాంతరశ్రమను సౌఖ్యంబౌ శరద్రాత్రినిం
      గడు చిత్తద్యుతి కల్గ జేయు మణి సంకాశుండు చంద్రుండు దా
      నడిరేయిన్ రవిఁ గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్

      తొలగించండి
    4. కామేశ్వర రావు గారూ,
      అఖండయతి ఎవ్వరు ప్రయోగించినా నేను అభ్యంతరం చెప్పను. దానిని ప్రయోగించరాదని వ్యక్తిగతంగా నేను మడి కట్టుకున్నా ఈమధ్య ఒకటి రెండు సందర్భాలలో తప్పలేదు.
      సవరించిన పూరణ (అఖండయతిని పరిహరించినందుకేమో!) ఉత్తమంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి

  18. శ్రీగురుభ్యోనమః

    మడిచేలన్ తడి పెట్టగా జనెను సామాన్యుండ దేవేళలోన్?
    కడు శోభన్ వికసించె తామరలు తత్కార్యంబు లెట్లబ్బెనో?
    వడిగా జందురు డేగుదెంచ భువిపై భాసింపగా వెన్నెలల్ !
    నడిరేయిన్, రవిఁ గాంచి, యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీపతి శాస్త్రి గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. కడుశక్తి జోడించి ఘనతరంబయిన
    నక్షత్రశాల నా నగరంబులోన
    నిర్మించి యున్నారు నిష్థాత్ము లందు
    నడిరేయి రవిగాంచి నవ్వె నుత్పలము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  20. ముడివేయ రాజుతో మూలమై తాను
    నడిరేయి, రవిగాంచి నవ్వె నుత్పలము
    తడబాటు నెరుగక తానె దినమంత
    వడిజేరి వసియించ పద్మమ్ముతోడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. కదన రంగమునందు కవ్వడిన్ దునుమ
    కర్ణుడు కొలను లో కలువ యై వెలుగ
    కన్న తండ్రిననుచు ఖగుడేగు దెంచ
    నడిరేయి రవిఁ గాంచి నవ్వె నుత్పలము

    రిప్లయితొలగించండి
  22. వడి నక్షత్రపుశాల కేగి తలచెన్ బాలుం డవాక్కై యటన్
    నడిరేయిన్ రవిగాంచి, యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్
    కడిమిన్ రాత్రులలోన గాదె యిచటం గన్పించ దొండైన దా
    ముడుసంతానము లోషధీశుడు ముదం బున్నార లీవేళలోన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  23. అడుగుల్ వేయుచు భార్యజేరెనతడే యానందమొప్పారగన్
    గడియన్ వేసితి చేరరమ్మిటకు సత్కాలమిదే యంచనన్
    బిడియమ్మేవిడె కాంతులూరు కనులన్ ప్రేమించుభర్తన్ గనన్
    నడిరేయిన్ రవిఁ గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్

    బిడియ పడుచున్న భామనే ప్రియుడు చేరి
    సరస సంభాషణము జేయ సంత సించె
    నారి నడిరేయి రవిఁ గాంచి నవ్వె నుత్ప
    లముల వోలెను మెరిసెనా లలన కనులు

    రిప్లయితొలగించండి
  24. వడిగా గాలి ప్రచండవేగమున భీభత్సమ్ము సృష్టింపగా
    జడి వానై కురియన్నిలాతలమె యో సంద్రమ్ము గామారె నా
    నడిరేయిన్ , రవిఁ గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్
    విడిపోవన్ గగనమ్ముమబ్బులిక తా విచ్చేయగా సూర్యుడే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'సత్కాలమ్మిదే' అనండి. లేకుంటే గణదోషం.
      మూడవ పూరణలో 'ఒక'ను 'ఓ' అన్నారు. అక్కడ 'కురియ న్నిలాతల మయో సంద్రమ్ము...' అనండి.

      తొలగించండి
  25. వడిగా సాగదు కాల మీ దినమ మావాస్యన్ కటా లేక మా
    యొడయం డంచు విచారులై విడువ నిట్టూర్పుల్ రవిన్ కేతువే
    సడి లేకన్ కబళించ గ్రమ్మె తిమిరాల్ చంద్రుండయెన్ భానుడున్
    నడిరేయిన్ రవిఁ గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్.

    రిప్లయితొలగించండి
  26. కలువ కన్నుల చిన్నది వలచి రవిని

    పెండ్లి యాడె; పడకటింట వెంటనున్న

    నారి నడిరేయి రవి గాంచి నవ్వె; నుత్ప

    లములు విరిసినవా యంచు రవియు బల్కె.

    రిప్లయితొలగించండి
  27. పడకటింట నెపుడు ప్రమదముకలుగు?
    కడుముద మెప్పుడు కను తమ్మిపూలు?
    యుడుపతి కనుగొని యుప్పొంగె నెద్ది?
    నడిరేయి, రవిఁ గాంచి, నవ్వె నుత్పలము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  28. గగనాన మేఘాలు గ్రమ్మేనో యేమొ
    కమలాల గనలేని కలతయో నేమొ
    అస్తమించుటమాని అలిసెనో యేమొ
    నడిరేయి రవిగాంచి నవ్వెనుత్పలము!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంద పీతాంబర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కలతయో యేమొ... అనండి.

      తొలగించండి
  29. .అడుగకనే జెప్పెనతివాగుడందు
    తడబాటు యందున త్రాగియునొకడు
    నడిరేయి రవిగాంచి నవ్వె నుత్పలము
    జడపువ్వు రవ్వలుజతజేర భార్య? {రవిగాంచి=పేరుగలవ్యక్తీ}
    2,తడబాటందున నవ్యదంపతుల నిత్యానందభాగ్యంబునే
    వడిగా బంచగ నెంచ శోభనము సర్వంబంచు భావించుచున్
    గడుపన్ బూనగ భార్య కళ్ళచట నోకాసారమే| చిత్రముల్
    నడిరేయిన్ రవిగాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్ {భర్తయొక్క ప్రతి బింభముయుత్పలములు,కన్నులకాసారాలు}


    రిప్లయితొలగించండి
  30. రాసలీల సలుప రవిశశి నేత్రుడు
    మురిసి చూసె యమున పరుగులాపి
    నడచె వినయమలర నడిరేయి రవిగాంచి
    నవ్వె నుత్పలములు నర్మముగను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీవల్లి రాధిక గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీరికనుండి సందేహించకుండా నేరుగా బ్లాగులో పూరణలు ప్రకటించండి.

      తొలగించండి
  31. గడియైన నినువీడి కనుమూయలేను
    సుడిగాలి లానీవు చుట్టుకు రాకు
    నడిరేయి రవిగాంచి నవ్వెనుత్పలము
    సడిసేయకోస్వామి సరగున రార

    రిప్లయితొలగించండి
  32. నడిరేయిన్ రవిగాంచి శార్దులము లానందంబునన్ చేరగా
    నడిరేయిన్ రవిగాంచి మత్తెభము లానందంబుగా కూడగా
    నడిరేయిన్ రవిగాంచి చంపకము లానందంబుగా పూయెగా
    నడిరేయిన్ రవిఁ గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్ :)

    (ఇచ్చట "రవి" యనగా అర్ధరాత్రి పద్యములు వ్రాసి ప్రచురించు భవదీయ వృద్ధ "కవి"...పేరు "ప్రభాకరుడు" aka G. P. Sastry)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. నడిరేయిన్ గాంచెను రవి
      వడినేదేదో తెలియదు ప్రస్తుత మీ యం
      శుడు గాంచి నవ్వె భళివి
      చ్చెడు నుత్పలముల జిలేబి జేజే యనవే :)

      జిలేబి

      తొలగించండి