14, నవంబర్ 2016, సోమవారం

సమస్య - 2198 (పిల్లినిఁ జంకఁ బెట్టుకొని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"పిల్లినిఁ జంకఁ బెట్టుకొని పెండ్లికిఁ బోయిన మెత్తు రెల్లరున్"లేదా..
"పెండ్లి కేగుము చంకలో పిల్లితోడ"

73 కామెంట్‌లు:



  1. చీని భాయి పెండ్లి జిలేబి, చిన్న దాని
    తోడ, చిందుల సమయము తోసి రాజ
    నకు సరసముగ భళిభళి నప్పు నిజము
    పెండ్లి కేగుము చంకలో పిల్లితోడ!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారు మీకున్న పదసంపద తోడ విద్వాంసులు మెచ్చే పద్యములు వ్రాయ గలరు.

      తొలగించండి


    2. పోచి రాజు వారు పొగిడినారో లేక
      కించుక చురక పలికించెనో య
      ని తెలియక జిలేబి నిమ్మది గోల్పోయె
      కవివరుల పలుకుల కర్థ మేమి :)

      జిలేబి

      తొలగించండి
    3. జిలేబి గారు మీ ప్రాణస్నేహితుడు తన తండ్రి తో గొడవ పడగ వారిరువురు మనస్తాపము జెందగా వారిని నూరడించడానికి మీరు వెళ్లారనుకోండి. మీరేమంటారు?
      స్నేహితునితో : అరె లైట్ తీసుకో అన్నది మీ నాన్నె కదా.
      తండ్రితో: పెద్ద వారు మీరు కూడా యేమిటిలా బాధపడటము! ఎంతైనా కన్న కొడుకే కదా. మర్చిపొండి. క్షమించండి.
      మొదటిది చనువు వ్యావహారిక భాష. రెండవది గౌరవము గ్రాంథిక భాష.
      మీరు వ్రాయు పద్యమును బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకగ భావించండి. ఆ కన్యను ప్రేమతో కోమలమైన పద లాలిత్యముతో పోషించ వలెను కదా.
      అలా పోషించ కలిగిన సామర్థ్యము మీకున్నను దానిని మీరు వాడుకొనుట లేదని నా యనుమానము.

      తొలగించండి
  2. "పెండ్లి కేగుము చంకలో పిల్లితోడ
    కాటి కేగుము ముంతలో కల్లు తోడ
    కాశి కేగుము మనసులో నాశ తోడ
    శివుని జేరుము మరణించి శవము తోడ!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. * అనుచితమైన పనుల జాబితా...
      కార్తిక పూర్ణిమ - సోమవారం తలపులు..

      తొలగించండి
    2. కర్ణి మాతా దేవాలయం (హిందీ: करणी माता मंदिर) రాజస్థాన్ లోని బికనేర్ కు 30 కి.మీ దూరంలో గల దేవాలయం. ఈ ఆలయ ప్రధాన దైవం కర్ణిమాత. ఈ దేవాలయం ఎలుకల దేవాలయంగా ప్రసిద్ధి చెందింది.

      ఈ దేవాలయంలో సుమారు 20,000 నల్ల ఎలుకలు సజీవంగా ఉన్నాయని ప్రసిద్ధి. ఈ ఎలుకలు దేవాలయం అంతా తిరుగుతుంటాయి.



      కర్ణి మాతను దర్శించు కన్నులార
      వేల వేలవి యెలుకలు విందు జేయు
      పిల్లి జూసిన యశుభము వెంట రాదు...
      పెండ్లి కేగుము చంకలో పిల్లితోడ!

      తొలగించండి
    3. శాస్త్రి గారు మీ రెండు పూరణలు మహాద్భుతముగా నున్నవి. మొదటి దానిలో వేదాంతము తొంగిచూచు చున్నది.
      వస్తావు పోతావు నాకోసము! వచ్చీ కూర్చున్నాడు నీ కోసము! యముడు వచ్చీ కూర్చున్నాడు నీ కోసము!!

      కర్ణి మాతా దేవాలయం గూర్చి యిచ్చిన వివరములకు ధన్యవాదములు.

      తొలగించండి
  3. అల్లరి చేయ రాదుగద యార్యులు గూడు సమూహమందున
    న్నెల్లరుఁ జేరి సంబరముల నింపుగఁ జేయుచు నుండు వేళలన్
    జెల్లును తాను జేయనని చేసిన వెంటన నెత్తి మట్టితోఁ
    "బిల్లినిఁ జంకఁ బెట్టుకొని పెండ్లికిఁ బోయిన మెత్తు రెల్లరున్"
    *****్్్్్*****
    మెత్తు : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
    స.క్రి.
    అంటు, అలదు, అలుకు, చరుము, చాదు, నలుపు, పంకించు, పట్టించు, పఱపు, పాము, పులుము, పెట్టు, పొడుచు, ప్రాము, మెత్తు, మెదించు, మెదుగు, మేగు, మేదు, మ్రేగు, రాచు, రుద్దు, హత్తించు.
    *****XXXXXX*****

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారు "మెత్తురు" పదమునకు నన్యార్థమును గైకొనవలెనను మీ యుత్సాహము ప్రశంసనీయము. రెండవ పాదములో గణదోషము కూడ కలదు.
      మెత్తు (అంటు,అలదు,..) క్రియ తద్ధర్మార్థమున ప్రథమ పురుష యేకవచనమున "మెత్తును", బహువచనమున "మెత్తుదురు" సాధువులు. "మెత్తురు" అసాధువు.
      ఇక్కడ మెచ్చుదురు చువర్ణంబుతోడ దుగ్ధకారంబు కాబట్టి మెత్తురు గా నయినది. మెచ్చుకొందురనియే యర్థము.
      తదనుగుణముగా పూరించ గలరు.

      తొలగించండి
  4. పెండ్లి కేగుము చంకలో పిల్లి తోడ
    తరలి వత్తురు తమవారు తగుల ములకు
    విందు సంబర ములయందు మందు గలిపి
    మేళ తాళము లున్నవి వ్యాళ ములకు

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా
    చెల్లునె వేద శాస్త్రములె చీదరబెట్టగ నందు హా గురూ!
    భల్లున గూలు నీ శకున భాగము నెవ్వరు నోప జాలిరీ
    కల్ల జగత్తు భౌతికత కన్నను మిన్నయె లేదు కాదనన్
    పిల్లిని జంక బెట్టుకొని పెండ్లికి బోయిన మెత్తురెల్లరున్!

    చెప్పు లిప్పకు నిలిచి నీ చేతనున్న
    చిప్పలో వేడి మాంసమున్ చేత బట్టి
    కుక్క గంకిన యట్టుల కులుక విందు
    పెండ్లికేగుము చంకలో పిల్లి తోడ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా.పిట్టా వారు మీ రెండు పూరణలు బాగున్నవి. గంకిన: అర్థము కాలేదు.

      తొలగించండి
    2. డాపిట్టానుండి
      ఆర్యా
      కుక్క బొక్కలను గంకుట అంటేTSలో ఆతురతతోlike a hungry dog అనే వాడుక ఉన్నది.తెలుగు పదాలివి అంటూ శిష్ట సమాజమునకు తెలిపే ప్రయత్నమది

      తొలగించండి
    3. ఆర్యా యిప్పు డర్థమైనది. నేనూహించినది సరియయినది. కంకు అంటే నోటిలో పెట్టుకొని పండ్లతో కరచి తిను.

      తొలగించండి
  6. సంతసమ్మైన మదితోడ సంతతమ్ము
    పెండ్లి కేగుము, చంకలో పిల్లితోడ
    శుభకరమ్మైన తలములఁ జూడవలదు
    పిల్లి యశుభ కారకమంద్రు తొల్లినుండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ రెడ్డి గారు మీ పూరణ బాగుంది. తొల్లిటినుండి అనవలసి యుండు నేమో?

      తొలగించండి
    2. కవివర్యులు కామేశ్వర రావు గారి సూచనకు ధన్యవాదములు. "పిల్లి యశుభకారక మందు రెల్లజనులు" - అని మారిస్తే సరిపోతుందనుకుంటాను.

      తొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సాకు చుండెడి పిల్లికి సంతసమున
    పెండ్లి జేయు దయాళువు బిల్చె నటకు
    పెండ్లి కేగుము చంకలో పిల్లి దోడ
    భూత దయను జూపు నతని పొందు గాంచి.

    రిప్లయితొలగించండి
  8. లేదె కళ్యాణమంటప మేది మీకు?
    యిరుకు గదులుండు! పైపెచ్చు నెలుకలుండు!
    శుభము కాకున్న వంటల కభయమీయ
    పెళ్లికేగుము చంకలో పిల్లి తోడ

    రిప్లయితొలగించండి
  9. పిల్ల పాపల తోడుత నుల్ల మలర
    పెండ్లి కేగుము; చంకలో పిల్లి తోడ
    గాదది యశుభ మందురు, గాన, నంద
    రికి ముద మొసంగుటయె నీదు రీతి యగును!

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ప్రేమికులగు వారి మనువు వితము గాదు
    గాదనెడి వాద మెందులకయ్య నీకు?
    పెండ్లి కేగుము చంకలో పిల్లి తోడ
    నిరసన మది నీదు దెలియు నెల్లరకును.

    రిప్లయితొలగించండి
  11. స్నేహితుడొకండు బస్టాండు చేరి గలిసె
    క్యాటు కార్డును నాతోడ గలిగియుండ
    మిత్రుడిట్టుల నవ్వుచున్ మేలమాడె
    పెండ్లి కేగుము చంకలో పిల్లి తోడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమచ్ఛాస్త్రి గారు మీ పూరణ ముత్ప్రేక్షతో చాలా బాగుంది.

      మీ పై గౌరవాభిమానములతో చిన్న మనవి:
      ఆంగ్లము వ్రాసినపుడు స్వచ్చమైన యాంగ్లమును నాంధ్ర కవిత్వమున సద్విమలపుటాంధ్ర పదములను వాడిన యిరు భాషలు సౌందర్యాతిశయములతో భాసిల్ల గలవు.
      నాకు నాంగ్ల భాష యన్న మక్కువ మిక్కుటమే. దానిని సంకరపరచ నిష్టముండదు.

      తెనుగు హృద్య పద్య దివ్య వనమునందు
      శబ్ద పల్లవముల సంకరమ్ము,
      తులసి వనము చెఱచ మొలచిన గంజాయి
      మొక్క వోలె, సేయ మక్కు వేల?

      మీ మనసును కష్ట పెట్టిన క్షంతవ్యుడను.

      తొలగించండి
    2. ఆర్యా మీ సూచనకు ధన్యవాదములు....ఇక్కడ సమస్య పూరించుటకు నాకు "క్యాటు " పదమును తప్పనిసరి కదా...ఇక బస్టాండు కు వెళ్ళక తప్పలేదు.

      తొలగించండి
  12. వేడుకగ జూడ తిరుమల వేంక టేశు
    పెండ్లికేగుము చంకలో పిల్లి దోడ
    ప్రీతి నదియుగాగ పునుగు పిల్లి, స్వామి
    సన్నిధిని కోరి వనమున సంచరించు

    రిప్లయితొలగించండి
  13. ముద్దు లొలికించు చుంటివి ముద్ద రాల !
    పిల్లిని విడిచి యుండగ నొల్ల వేని
    పెండ్లి కేగుము చంకలో పిల్లి తోడ
    నిన్ను జూతురు వింతగ సన్నుతాంగి !

    రిప్లయితొలగించండి
  14. కల్లగ నెంచ వద్దు బహుకాలము క్రిందటిదైన మాట వా
    రెల్ల బిడాలదేశజను లింపుగ జీలిని జాతిచిహ్న మం
    చుల్లము సంతసించ మనుచుండెద రచ్చటి సంఘమందునన్
    పిల్లిని జంక బెట్టుకొని పెండ్లికి బోయిన మెత్తురెల్లరున్!
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారు మీ పూరణ చాలా బాగుంది. "బహుకాలపుఁ గ్రిందటిదైన" అన బాగుండునేమో?

      తొలగించండి
  15. పిల్లిని జంక బెట్టుకొని పెండ్లికి బోయిన మెత్తు రెల్లరు
    న్గల్లలు బల్కగా నిచట కామిని ! న్యాయమె నీకుగా మరిన్
    బిల్లిని జంక బెట్టుకొని పెండ్లికి బోయిన మెచ్చరెవ్వరు
    న్ను ల్లము బాధ నొందగను నొక్కరు నొక్కవి ధంబు బల్కుగా

    రిప్లయితొలగించండి

  16. "పిల్లలతల్లి!వచ్చితివ! పెండ్లికి ,రమ్మని బిల్వ లేదె! మా
    తల్లివి,పొమ్మనంచను,దండిగ చీరల నిత్తు గాని నీ
    పిల్లలు చేయు నల్లరికి వేసరినా"మన, దోచు సిగ్గుతో
    పిల్లిని చంక బెట్టుకొని పెండ్లికి బోయిన మెత్తు రెల్లరున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారు రెండవ పాదములో గణదోషము. సమస్యకు పరిష్కారము సంశయముగా నున్నది.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. శ్రీ కామేశ్వరరావు గారికి గణ దోషమును సవరించితిని. పద్యమును మార్చితిని

      పిల్లలతల్లి!వచ్చితివ! పెండ్లికి ,రమ్మని బిల్వ లేదె! మా
      తల్లివి,పొమ్మనంచనను,దండిగ చీరల నిత్తు గాని నీ
      పిల్లలు చేయు నల్లరికి వేసరినా"మన, తల్లి చింతిలెన్
      పిల్లిని చంక బెట్టుకొని పెండ్లికి బోయిన మెత్తు రెల్లరున్

      సమస్యకు పరిష్కారము లభించునని భావిస్తున్నాను

      తొలగించండి
  17. ఎల్లరు దూఱుచుంద్రు గద యింపుగ విజ్ఞుల సన్నిధానమున్
    పిల్లలు పెద్దలందరును ప్రీతిఁ జరించు ప్రదేశమందునం
    బిల్లినిఁ జంకఁ బెట్టుకొని పెండ్లికిఁ బోయిన, మెత్తు రెల్లరున్
    తెల్లని మానసమ్మునను దీవెనె లందగ జేయు వారలన్

    రిప్లయితొలగించండి
  18. చల్లని వేళ వాహనముఁ జక్కగ నిల్పియు సంభ్రమంబుగ
    న్నుల్లము సంతసిల్లఁ గడు నొప్పగు దుస్తుల నెమ్మిఁ దోడు రాఁ
    దల్లియు దండ్రి భార్యయును దానికఁ బిల్లను, జూడకుండ నే
    పిల్లినిఁ, జంకఁ బెట్టుకొని పెండ్లికిఁ బోయిన మెత్తు రెల్లరున్


    పండ్లు పువ్వులు కొనకుము పర్వ మందు
    గుండ్లు నిండిన భూమిని గొనుము వేగ
    పెండ్లి కేగుము చంకలో పిల్లితోడ
    యిండ్ల నవ్వరె కని పువ్వుబోండ్లు నిన్ను

    రిప్లయితొలగించండి
  19. శకునముల మది తలచక శంక వీడి
    పెండ్లి కేగుము! చంకలో పిల్లి తోడ
    నెదురు బడినది కల యైన నిజమెటులగు?
    పిఱికి తనమొక శకునమౌ పిల్లి వోలె!

    రిప్లయితొలగించండి
  20. కల్ల యటండ్రు దైవమును, కాదు ప్రపంచము వాని సృష్టి మీ
    రెల్లరు మూర్ఖులెంచ, విను డీయిలఫై శకునంబులేల యం
    చల్లరి చేయుచుండు ఘను లారయ నాస్తికవర్యు లక్కటా
    పిల్లిని చంక బెట్టుకొని పెండ్లికి బోయిన మెత్తురెల్లరున్!
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
  21. పెండ్లి కేగుము, చంకలో పిల్లి తోడ
    వెళ్ళు టుచితంబు గాదెందు, కళ్లలోన
    హర్ష మగుపించ బహుళంపు టాదరాన
    నుచిత మైయొప్పు బహుమాన మూని నీవు.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారు మీ రెండు పూరణలు బాగున్నవి. ఇక్కడ ఊను పదము సమంజసమేనా?

      తొలగించండి
    2. ఆర్యా!
      నమస్కారం.
      బహుమాన మొకటి గొనుచు. అని మార్చుచున్నాను.
      ధన్యవాదములు.

      తొలగించండి
  22. ** నిన్నటి సమస్యకు నా పూరణలు **

    సుప్రతిభా విశేషములు సూక్ష్మపథమ్మును గోరువారెగా
    విప్రవరేణ్యులీ భువిని విజ్ఞత గల్గిన భూసురుండెయౌ
    విప్రుఁడు మద్యమాంసముల విందనగాఁ దల యూపి వచ్చెనే?
    యప్రియ మాటలేల? పరిహాసముకైనను పల్కబోకుడీ

    భూసురుండనికొనియాడి భూరిగాను
    మన్ననలనందు కొనునిల మాన్యుడైన ద్విజుడు, మద్యమాంసమ్ముల విందుఁ గోరె
    రాజు,ద్విజుడు క్షేత్రసంరక్ష కుండు

    రిప్లయితొలగించండి
  23. అల్లుని వెంటదీసుకుని ఆస్థిని గోరుచు జ్ఞాతితో నట
    న్నల్లరి జేయపోవుచు సహాయమంచును, పోరు గెల్వగన్
    పిల్లలు గల్గినట్టి నిరు పేదను కట్నము గోరెనాతడున్
    పిల్లిని జంకబెట్టుకుని పెండ్లికి వెళ్ళిన మెత్తురెల్లరున్ ?

    మిత్రులు సకుటుంబసపరి వారులెల్ల
    గూడి పోయినన్ బోవచ్చు కూర్మి తోడ
    పెండ్లి కేగుచు చంకలో పిల్లితోడ
    సిద్ధ మవగలేడవనిలో బుద్ధి జనులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారు నిన్నటి మీ మొదటి పూరణ బాగున్నది. రెండవ పూరణలో నన్వయము కుదిరినట్లు లేదు. నాల్గవ పాదములో గణ దోషము.
      ఈనాటి మొదటి పూరణ కూడా మీ భావమును సరిగ వ్యక్తము చేయ లేక పోవు చున్నది.
      రెండవ పూరణ బాగుంది. ప్రాస యతి త్ర / త అవ్వాలి. లేరవనిలో అనండి.

      తొలగించండి
  24. పెద్దలు కవివరేణ్యులు పోచిరాజు గారి సద్వివేచనకు సహృదయతకు వందనములు.
    మీ మార్గదర్శనం నాలాంటి పామర పండితునికి సదా అనుసరణీయం.మీరిలాగే అమూల్యమైన మీ సేవలు అందించగలరని ఆశిస్తూ అభిలశిస్తూ
    ఒక తెలుగు పద్యాభిమాని

    రిప్లయితొలగించండి
  25. సతియు పిల్లల దోడ్కొని సంతసముగ

    పెండ్లి కేగుము; చంకలో పిల్లి తోడ

    నెట్టి శుభకార్యమునకైన నేగ వలద

    నుచు మన గురువు లెప్పుడో నుడివినారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగేశ్వరరావు గారు మీ పూరణ చాలా బాగుంది."సతినిఁ బిల్లల" అంటే బాగుంటుంది.

      తొలగించండి
  26. పిల్లినిజంకబెట్టుకొని పెండ్లికి బోయిన మెత్తురెల్లరున్|
    “కల్లలు నింపుటీ జగముకాంక్షల తోడను మూఢనమ్మకాల్
    నల్లుచు యంతరంగమున హాయినొసంగని యాశ దోషముల్
    చెల్లగ జేయు రీతిగన?జేకొన రెవ్వరు నమ్మరీ జనుల్”. {అనుకొనుటకుకొంతవీలుగలదు}
    2.మానసంబున మంచిని మలచు నట్లు
    పెండ్లి కేగుము|”చంకలో పిల్లితోడ
    చిన్నియాడుట గమనించి చిన్ని నవ్వు
    వెలువ రించగ?మ్యావనిపిల్లిబలికె.”




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారు మీ రెండు పూరణలు బాగున్నాయి. మూఢనమ్మకాల్ అల్లుచు లో నుగాగమము ఉండదు కదా.

      తొలగించండి
  27. నూత్న దంపతులను జూడ నోపు దెటుల?
    బ్రహ్మ పంచాంగ మెచ్చట పదిల పరచు ?
    నెలుక బాధను వదిలింప నెట్లు జరుగు?
    పెండ్లి కేగుము| చంకలో| పిల్లితోడ

    ముక్కునిండుగ పొడుమును కుక్కి కుక్కి,
    పెండ్లియింట పెడాకులు పెట్టిజూడ ,
    పెండ్లి కేగుము చంకలో పిల్లితోడ
    నాత్మహత్యకు గురి కాక నసువులిడగ !

    నిన్నటి నా పూరణమున మొదట పాదమును
    "మాంస మాహారముగ గోరు మనుజులిపుడు "
    గా సవరించితిని .

    రిప్లయితొలగించండి
  28. నూత్న దంపతులను జూడ నోపు దెటుల?
    బ్రహ్మ పంచాంగ మెచ్చట పదిల పరచు ?
    నెలుక బాధను వదిలింప నెట్లు జరుగు?
    పెండ్లి కేగుము| చంకలో| పిల్లితోడ

    ముక్కునిండుగ పొడుమును కుక్కి కుక్కి,
    పెండ్లియింట పెడాకులు పెట్టిజూడ ,
    పెండ్లి కేగుము చంకలో పిల్లితోడ
    నాత్మహత్యకు గురి కాక నసువులిడగ !

    నిన్నటి నా పూరణమున మొదట పాదమును
    "మాంస మాహారముగ గోరు మనుజులిపుడు "
    గా సవరించితిని .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారు మీ రెండు పూరణలు బాగున్నాయి. కాక యసువులు అనండి.
      నిన్నటి పూరణకు సవరణ బాగుంది.

      తొలగించండి
  29. ఇల్లును గుల్లజేయుచును నెల్లరి సూటులు పట్టుచీరలన్
    చిల్లులు కొట్టుచుండెడివి చిల్లరి వల్లరి మూషికమ్ములన్
    కొల్లలు కొల్లలన్ తరిమి కొట్టుచు ముద్దుగ మ్యావుమ్యావుమన్
    పిల్లినిఁ జంకఁ బెట్టుకొని పెండ్లికిఁ బోయిన మెత్తు రెల్లరున్!

    రిప్లయితొలగించండి