18, ఫిబ్రవరి 2017, శనివారం

సమస్య - 2286 (ఆలు లేని మగఁడు...)

కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"ఆలు లేని మగఁడు హాయినందు"లేదా...
"ఆలిన్ వీడిన పూరుషుం డెపుడు బ్రహ్మానందముం బొందురా"

73 కామెంట్‌లు:

  1. విల్లు ద్రుంచ వచ్చె వెంబడించె నడవి
    మాయ లేడి గోరి మాయమయ్యె
    కోతిమూక బట్టి కొట్లాడ వచ్చెరా!
    ఆలు లేని మగఁడు హాయినందు...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      అబ్బో... మొత్తం రామాయణాన్నంతా చిన్నపద్యంలో ఇమిడ్చి అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  2. రమ్ము త్రాగ వచ్చు రమ్మియాడు కొనుచు
    వమ్ము జేయ కుండ దమ్ము గొట్టి
    బారు లందు మిగుల భక్తిగా దిరుగుచు
    ఆలు లేని మగఁడు హాయి నందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      బాధ్యలెరుగని తిరుగుబోతు భర్తల గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  3. మే లౌ రీతిగ యింతి సేవ గనుటన్ మెల్లంగ కాల్నొత్తులన్
    చాలీచాలనిజీవనమ్ము న సదా చారంబు పాటింపులన్
    కాలాకాలములన్‌ జిలేబి లలనా గానమ్ము లాస్వాదము
    న్నాలిన్ వీడిన పూరుషుం డెపుడు బ్రహ్మానందముం బొందురా ?

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణలో పురుషుడు ద్వంద్వ ప్రవృత్తిని కలిగినట్టున్నాడు. ఇంతి సేవలు పొందుతూ, ఆమె కాళ్ళొత్తుతాడు. జీతం చాలకున్నా అవినీతికి తావివ్వక సదాచారం పాటిస్తాడు. లలనాగానం (స్వీయ లలనయా? 'కోఠీ' లలనలా?) ఆస్వాదిస్తాడు. కొంత గందరగోళం ఉంది.
      'రీతిగ నింతి.. కాలొత్తుటల్...పాటింపులున్' అనండి.

      తొలగించండి

    2. కంది వారికి,


      శార్దూల పతి మరీ "గండర" గోళము గా ఉన్నట్టున్నాడు ! నెనర్లు సవరణ లకు !

      చీర్స్
      జిలేబి

      తొలగించండి
  4. శ్రీలాలిత్యము, సర్వసౌఖ్యములికన్ క్షేమంబు లీనేలపై
    మేలైనట్టి సుదీర్ఘ జీవనగతుల్ మిన్నంటు ప్రాశస్త్యముల్
    చాలం గావలె నాకటన్న ఫణితిన్ స్వార్ధంబుతోనిండు వాం
    ఛాలిన్ వీడిన పూరుషుం డెపుడు బ్రహ్మానందముం బొందురా.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      వాంఛాపంక్తిని వీడిన పురుషుని గురించిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. సుప్రభాతవేళ ప్రాబంధికశైలిలో రచితమైన ఈ పూరణను చూడగలగటం ఎంతో సంతోషాన్ని కలిగించింది. శ్రీ మూర్తిగారికి హృదయపూర్వకాభినందనలు!

      తొలగించండి
    3. ఆర్యా!
      ధన్యవాదములు, నమస్కారం.

      తొలగించండి
  5. తోటి వారి జూచి మాటిమాటికి వింత
    కోర్కె లెగయ కలఁచి కోపగించి
    డాబు కొరకు భర్త 'జేబు' గుల్లగజేయు
    ఆలు లేని మగడు హాయినందు!

    రిప్లయితొలగించండి
  6. కోరి పెండ్లియాడి గృహమేధియై ధర్మ
    పత్ని యెడల నిత్య నూత్నమైన
    ప్రీతిఁ గొనుచు నెల్ల వేళల నే ఱంకు
    టాలు లేని మగఁడు హాయి నందు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమే.. నేను గమనించలేదు. యతి చెల్లదు. సవరిస్తాను. ధన్యవాదాలు.

      తొలగించండి
    2. (మొదటి పాదం యతిదోషాన్ని సవరించిన పూరణ...)

      కోరి పెండ్లియాడి కోమలి నా ధర్మ
      పత్ని యెడల నిత్య నూత్నమైన
      ప్రీతిఁ గొనుచు నెల్ల వేళల నే ఱంకు
      టాలు లేని మగఁడు హాయి నందు.

      తొలగించండి
    3. పూర్వాక్షరం గురువైన చాలునా లేక దీర్ఘంగా నుండవలెనా వివరించ గోరెదను..

      తొలగించండి
    4. శాస్త్రి గారూ,
      ఈ ప్రశ్న వస్తుందని ఊహించాను. ప్రాసకు ముందున్న అక్షరం దీర్ఘమైతే మిగిలిన చోటుల్లోను దీర్ఘమే ఉండాలన్న తప్పుడు అభిప్రాయం చాలామందికి ఉంది.
      ప్రాసకు ముందున్న అక్షరం గురువైతే చాలు. దీర్ఘమే కానక్కరలేదు. సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువవుతుంది. అది చాలు.
      గతంలోను ఇటువంటి సందేహాలకు నేను నన్నయ, తిక్కన, పోతన పద్యాలను ఉదాహరిస్తూ సమాధానమిచ్చాను. మీకోసం కొన్ని...
      1)
      శా. కల్పాంతాగ్నియు...।యల్పా చావు...।బోల్పం గోటి...।వేల్పుల్పొందగ... (భాగ.౬ స్కం. ౪౦౪)
      (సమయం లేదు. మా చెల్లెలి ఇంటికి వెళ్ళాలి. సాయంత్రం వివరంగా తెల్పుతాను)

      తొలగించండి
  7. సతము కోరు నట్టి సరదాలఁ దీర్చుచు
    నామె మనసు లోన నంది చోటు
    మహిననవరతమ్ముమగనాలితోడ తం
    టాలు లేని మగడు హాయినందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని తంటాలులో 'ఆలు' లేదు. తంటకు రూపాంతరం తంటా. దాని బహువచన రూపం తంటాలు. కనుక ఇక్కడ పూరణ సమర్థనీయం కాదు. మరో ప్రయత్నం చేయండి.

      తొలగించండి
  8. డా.పిట్టా సత్యనారాయణ
    అర్థసంగ్రహత్వ మావులబెంచ గో
    సేవలనొనగూర్చ సిద్ధము(ఒక గ్రహ యోగము.శ.ర)సుమి
    ఓర్పులేని భార్య యుసురస్సురురు బాధ
    ఆలులేని మగడె హాయినందు!

    గాలిన్ గాయము జేరియున్నవరకున్ గాఢానురాగంబులే!
    ఆలిన్ బిల్లల పుత్రి పుత్ర తతినిన్నాలింగనంబొప్పగా
    కాలిన్ బల్పము గట్టుకొంచు దిరుగన్ గాంచంగ రాదిట్టి బం
    ధాలిన్ వీడిన పూరుషుండెపుడు బ్రహ్మానందముం బొందురా!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. వంటజేయకుండ వాదనలకుదిగి
    చిక్కులందజేయు చెలియ కంటె
    గృహమునందున నిజ గేహినిగ నలసు
    రాలు లేని మగడు హాయినందు
    అలసురాలుః బద్ధ కస్తురాలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      అలసురాలును గురించిన ఈ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. రంగు రంగు బెండ్ల రతనాలు సేసలన్
    కలుపు చర్యలెన్న కావుగ సరి
    చేరి ఫోటో లకై చేసెడు నాతలం
    బ్రాలు లేని మగడు హాయినందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని తలంబ్రాలులో 'ఆలు' లేదు. మూడవ పాదంలో గణదోషం. 'చిత్ర గ్రహణమునకు జేసెడు..' అనవచ్చు.

      తొలగించండి
  11. ఆలుగడ్డ కూర, యాల్గడ్డ భక్ష్యంబు
    లాలుగడ్డ పులుసు లాలు సేయ
    కలికి! చూడు మంచు పలికె నాథుం డిట్టు
    లాలు లేని మగడు హాయి నందు.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      ఆలుగడ్డ మీద అలుకతో చేసిన మీ పూరణ చాల బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. ఆలు లేని మగడు హాయి నందనునది
    యక్ష రా ల నిజము హర్ష !యదియ
    చీకు చింత లేని జీవనంబు గడుప
    వచ్చు మనము దైవ ప్రార్ధన మున

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. 'హాయి నందను మాట' అనండి. బాగుంటుంది.

      తొలగించండి
  13. జీత మెంత నీకు?చెంత కారున్నదా,
    అత్తమామలేల?అడ్డు మనకు.
    పొత్తు కుదర దయ్య.పోమ్మనవలెనను
    యాలు లేని మగడు హాయి నందు

    రిప్లయితొలగించండి
  14. మొదటి రాత్రి నాడె ముద్దిడరానీదు
    కాపురమున రాదు కారు లేక
    బాధ పెట్టె మగడు భరణ మిమ్మనియెడు
    ఆలు లేని మగడు హాయి నందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  15. నిజ మనోధిపతిని నెరిలేక మన్నింప
    మనసు రాని తనదు మాట లెల్ల
    చెల్ల నోపు ననెడు చేడియ బలపు టి
    ల్లాలు లేని మగఁడు హాయినందు


    లీలామానుష వేషధారి హరి సల్లీలా విశేషమ్ములే
    కాలానుక్రమ దుష్ట కర్మచయ సంఘా తోత్థితమ్ముల్ మనో
    మాలిన్యాకలితాపకారమగు నీమాత్సర్యముం గ్రోధ మో
    హాలిన్ వీడిన పూరుషుం డెపుడు బ్రహ్మానందముం బొందురా

    [మోహ +ఆలి = మోహాలి ; ఆలి = సమూహము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      ప్రతిరోజూ మీరేవిధమైన వైవిధ్యాన్ని చూపిస్తూ పూరణలు చెప్తారో అని ఎదురుచూడడం అలవాటయిపోయింది. కాని వాటిని ప్రశంసించడానికి తగిన శబ్ద భావ సంపదా దారిద్ర్యంతో ఒకింత సిగ్గు పడుతూ ఉంటాను. ఒక పద్యంయొక్క సౌందర్యాన్ని, వైశిష్ట్యాన్ని వివరించడానికి కూడా అర్హత, ప్రతిభ కావాలి.
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. (ఇంతకంటే వివరంగా, సముచితంగా ప్రశంసించే శక్తి సామర్థ్యాలు నాకు లేవు).

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. గురుదేవుల ప్రశంసల నందు కున్నందులకు ధన్యుడ నైతిని.

      తొలగించండి
  16. నా రెండవ పూరణము:

    మేలున్ జేయగ కేలునూనె గద సా
    మీ! ప్రేమగా జూడుమా!
    యాలిన్; వీడిన, పూరుషుండెపుడు, బ్ర
    హ్మానందమున్ బొందురా,
    కాలంబందున నీకు ధ్వంసమిడి శో
    కంబందునన్ ద్రోసి నిన్
    'డీలా' జేసెడి మద్యపానమును, రూ
    ఢిన్ జెప్పగా విజ్ఞులున్!









    రిప్లయితొలగించండి
  17. కలిసి మెలిసి యున్న కలతలుండవెపుడు
    సాగు గాపురంబు చక్కగాను
    కల్లలాడు వనిత గయ్యాళి యైనట్టి
    ఆలు లేని మగఁడు హాయినందు.

    రిప్లయితొలగించండి
  18. భర్తయనెడువాన్ని బానిసగానెంచి
    అనవరతము తగవులాడునట్టి
    నారి భార్య యైన నరకమే, మరియట్టి
    యాలు లేని మగడు హాయినందు


    ఈ లోకమ్మిక మెచ్చబోదు కనగన్ హీనుండుగానిల్చునే
    యాలిన్ వీడిన పూరుషుం, డెపుడు బ్రహ్మానందముంబొందురా
    మేలున్ గూర్చెడు భార్యతో సతతమాత్మీయుండుగా యున్నచో
    కాలమ్మెంతగ మారినన్ భువిని సంస్కారమ్మె ప్రాధాన్యమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'వాన్ని' అనడం వ్యావహారికం. "భర్త యను నతనిని" అనండి.
      రెండవ పూరణలో "సతత మాత్మీయుండుగా నున్నచో" అనండి.

      తొలగించండి
  19. క్రొవ్విడి వెంకట రాజారావు:
    గురువు గారికి నమస్కారములు. నిన్నటి పూరణను గూడా పరిశీలించగలరు.

    చందంబగు నిస్తారము
    పొందు బఱచి దా మెకమును పోకడ జేయ
    న్నందముతో సొంపారెడి
    కుందేటికి కొమ్ము మొలచి కులుకుచు నడచెన్

    సతము నింట నతిగ సంతబెట్టుచు నుండి
    అనువు నన్వయమ్ము యదుపు లేక
    చిర్రులాడు చుండి చెంగలించెడి నగు
    ఆలు లేని మగఁడు హాయి నందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  20. కాలంబున్ తను స్వీయ లాభము సదా కాంచంగ వెచ్చించుచున్
    చేలంమ్ముల్ గొన సంతతమ్ము ధన లచ్చిన్ ఖర్చు చేయించుచున్
    జాలమ్ముల్ ప్రసరింపజేసి పతికిన్ సంతాపమందించు ప్రో
    యాలిన్ వీడిన పూరుషుం డెపుడు బ్రహ్మానందముం బొందురా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధనలచ్చి' దుష్టసమాసం. 'ధనలక్ష్మిన్' అనండి.

      తొలగించండి
    2. గురువర్యులకు నమస్సులు. విరాటపర్వంలో " రా ల చ్చి కి నై పెనంగిన " అని వాడారు. అదిదృష్టిలో పెట్టుకుని ప్రయోగించాను . సవరణకు ధన్యవాదములు.

      తొలగించండి
  21. ఆలిన్ వీడిన పూరుషు౦ డెపుడు బ్రహ్మానందముం బొందురా?,
    భోలా శంకర!తెల్పవే యన నాభూతేశు డీరీతనెన్
    నాలో భాగముగా తనర్చితిని కాంత న్నొక్కతెన్,శీర్షమున్
    వాలాయమ్ముగ నెక్కెవేరొకతె యిదే వాల్లభ్య సమ్మోదమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "తెల్పవే యనగ..." అనండి. 'రీతి+అనెన్' అన్నపుడు సంధి లేదు. "భూతేశు డిట్లాడెగా" అనండి. నాల్గవ పాదంలో గణదోషం. "వేరొకతె మా వాల్లభ్యమే మోదమౌ" అనండి.

      తొలగించండి
    2. గురుదేవులసూ చనతో తప్పులు సవరించిన పద్యము
      ఆలిన్ వీడిన పూరుషు౦ డెపుడు బ్రహ్మానందముం బొందురా?,
      భోలా శంకర!తెల్పవే యనగ నాభూతేశు డిట్లాడెగా
      నాలో భాగముగా తనర్చితిని కాంత న్నొక్కతెన్,శీర్షమున్
      వాలాయమ్ముగ నెక్కెవేరొకతె మా వాల్లభ్యమే మోదమౌ.

      తొలగించండి
  22. అర్ధ రాత్రి బారె నాలుబిడ్డనువీడి
    బోధి చెట్టు నీడ బుధ్ధు డాయె
    ముద్దుబిడ్డ రాహ్లు బుధ్ధిహీనుండాయె...
    ఆలు లేని మగఁడు హాయినందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "బుధ్ధు" అనగా హిందీలో "బుధ్ధిహీనుడు"

      తొలగించండి
    2. శాస్త్రి గారూ,
      మంచి అంశాన్ని ఎత్తుకున్నారు పూరణకు. అభినందనలు.
      'ఆలు బిడ్డల వీడి' అనండి. రాహులును రాహ్లు అన్నారు. "బుద్ధిహీను డాయె ముద్దుల రాహులు। డాలు లేని..." అనండి.

      తొలగించండి
  23. స్వామి దీక్ష బూని సకలమ్ము నయ్యప్ప
    సేవలో తరింప చిత్తమందు
    భక్తి నింపుకొనుచు పరవశించెడి వేళ
    ఆలు లేని మగడు హాయి నందు!

    గురువు గారికి నమస్కారములు. సవరించిన మొన్నటి నా పూరణ కూడా చూడ గోరుతాను. ధన్యవాదములు.
    మిగుల బ్రేమ జూపించుచు మిత్రుడొకడు
    రాధ నుద్వాహమాడెను! రామ విభుడు
    యనుచు బఱగెడు నాతని యసలు పేరు
    రామ రాజన, యిపుడాయె రాధ మగడు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణలో 'విభుడు+అనుచు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "విభు డ।టంచు..' అనండి. 'రాజన నిపుడాయె' అనండి.

      తొలగించండి
  24. ఆలు లేని మగడు హాయి యందుండునా?
    వెంకటేశు నడుగ ?వివర ణిచ్చు
    అర్ధనారినొదలెనా?శివు డుండునా?
    బ్రహ్మ కైన వాణి బ్రతుకునేర్పు|
    2.మేలౌ సౌఖ్యము సంపదల్ ననుటయా?మేలెంచి యూహించుమా
    కాలంబంతయు కాంతముఖ్యమనిసంకల్పాన జీవించకన్
    ఆలిన్ వీడిన పూరుషుండెపుడు బ్రహ్మానందముంబొందురా
    వేళా కోళము జేయుటే యగును|నిర్వేదంపు మోదంబగున్|
    3.మూలం బెవ్వరు?పుట్టు కేట్లగును?సన్మూలంబు స్త్రీలేగదా?
    కాలంబందున జాతి వృద్ధియగునా?కార్యంబులే సాగునా?
    జాలిన్ వీడియు కట్న కానుకలలంచం బందు ప్రేమించెడిన్
    ఆలిన్ వీడిన పూరుషుండెపుడు బ్రహ్మా నందముంబొందురా|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'వివరణ నిడు' అనండి. వదలె.. ఒదలె అన్నారు. 'అర్ధనారిని విడెనా' అనండి.
      రెండవ పూరణలో 'సంపదల్+అనుటయా' అన్నపుడు నుగాగమం రాదు. 'సంపదల్ గనుటయా' అనండి. 'జీవించక' కళ. ద్రుతాంతం కాదు. 'జీవింపకే' అనండి.
      మూడవ పూరణలో 'ప్రేమించు నా। యాలిన్..."అనండి.

      తొలగించండి
  25. డా.పిట్టా సత్యనారాయణ
    "మనో మాలిన్య*ఆకలిత॥మనోమాలిన్యమును అవగాహన చేసికొనినట్టి
    అపకారమగు* తెలిసికొన్న అనుక్రియ అపకారము ఔతుంది అన్న అర్థం వస్తుంది(మనోమాలిన్యాకలితాపకారమగు నీ మాత్సర్యముం..వీడుము.అని ప్రబోధము .ఇదే నీ మాత్సర్యము.ఇదియును కోపమును వీడుము అని బోధ.కావున "కలితాపకారమగు"అన్న సంధి లోని"తా"త*అ యొక్కమేళనమునకు వివరణ ఆసక్తి కొద్ది అడుగడమైనద ఆర్యా,వివరించమనవి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా వారూ,
      మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. దీనికి పూర్వపరాలు తెలియజేస్తే అవగాహనకు వస్తానేమో?

      తొలగించండి
  26. మనసు మాట తీరు మహిలోన నొక్కటై
    మసలు చున్న యట్టి మగువ యున్న
    కనగ రావు నిజము కాపురమున,వెల
    యాలు లేని మగడు హాయి నందు.

    మగడు నాకె సొంత మనుచు నితరులను
    చిన్నచూపు చూచు చేడి కన్న
    గడుపు సంతసాన కాలమెల్లను,జగ
    డాలు లేని మగడు హాయి నందు.

    కోపభరము చేత కువలయాన నొకడు
    నాలు లేని మగడు హాయి నందు
    ననెడి మాట కల్ల:యవని యందు గనుము
    వంశవృక్షము పెంచు వనిత యాలు.

    ముగ్ధ తనము చేత ముదిత పల్కగ విని
    కోపగించు కొనక కూర్మితోడ
    చక్కదిద్దు కొనుచు సంసారమిలను కో
    పాలు లేని మగడు హాయి నందు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
      కాని జగడాలు, కోపాలు శబ్దాలలో ఆలు లేదని గమనించండి.

      తొలగించండి
  27. మాటలాడరాదు మాటాడ బోకుడు
    చేత కాదు మీకు చెల్లరనుచు
    తగవు లాడి నోరు బిగబట్టు గొనజేయు
    యాలు లేని మగడు హాయినందు

    రిప్లయితొలగించండి
  28. డా.పిట్టా
    మనోమాలిన్యాకలితాపకారమగు నీ మాత్సర్యముం దీని అర్థము మనోమాలిన్యమును ఆకళింపు జేసికొనడమన్న అపకారము, ఇదే నీ అపరాధము.అదియే నీ మాత్సర్యము,ఇంకను క్రోధము,మోహము,ఈఆలిన్ అంటే సమూహమును పురుషుడు వీడవలెను.ఇది సందేశం.మనోమాలిన్యాకలితాపరాధమునకు నేనిచ్చిన భావం సరైనదేనా ?ఆర్యాఅని అడుగ బోయితిని.

    రిప్లయితొలగించండి
  29. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*


    హాయి యనుచు పలుక నర్ధాంగి తో--" నింట
    ఆలు లేని మగఁడు హాయినందు
    నెట్లుచెప్పు"మంచు నింటిలో పతిపల్కె
    ఫోనునెత్తి బోరు భోరుమనుచు
    (భార్య ఊరుకెళ్ళి చాలారోజుల తరువాత భర్తకు ఫోన్ చేసి హాయ్ అనగానే భర్తగారి జవాబు)
    లేదా...

    *"ఆలిన్ వీడిన పూరుషుం డెపుడు బ్రహ్మానందముం బొందు! రా*
    వాలన్నా మరి బారుకంచుపలికెన్ బ్రహ్మాండమౌవిందుకై
    చాలాప్రేమగ పిల్చె స్నేహితుడు పిచ్చయ్యన్ సతిన్ కాన్పుకై
    మైలాపూరుకుపంపుటన్ తెలివిగామైకంబులన్ దూలగన్

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
  30. బాలానందపు ప్రీతి ప్రాయముననున్ బంధించుచున్ జేయగా
    కోలాహల్మున మోడికిన్ దెలియకే కొండాడి కల్యాణమున్
    వీలున్ జూచుచు దేశసేవ కొరకై వీడ్కోలుతా జెప్పకే
    యాలిన్ వీడిన పూరుషుం డెపుడు బ్రహ్మానందముం బొందురా!

    రిప్లయితొలగించండి