13, మార్చి 2017, సోమవారం

సమస్య - 2307 (కౌముది లేనట్టి రాత్రి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"కౌముది లేనట్టి రాత్రిఁ గనెఁ బున్నమికిన్"
లేదా...
"కౌముది లేని రాతిరినిఁ గాంచెను పున్నమినాడు వింతగా"
(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో...)

32 కామెంట్‌లు:

  1. ఏమిది చెప్పుము నాధా!
    కౌముది లేనట్టి రాత్రిఁ గనెఁ బున్నమికిన్?
    భామా! మరచితి వేమో
    ఝామిది పున్నమిన పూర్ణ చంద్రగ్రహణం!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తామర లేనట్టి కొలను
      రాముడు లేనట్టి తులసి రామాయణమున్
      వేమన లేనట్టి తెలుగు
      కౌముది లేనట్టి రాత్రిఁ గనెఁ బున్నమికిన్

      తొలగించండి
    2. సోముడు లేనట్టి భువియు
      స్వామియు లేనట్టి గుడియు శంకర వర్యా!
      హోమము లేనట్టి క్రతువు
      కౌముది లేనట్టి రాత్రిఁ గనెఁ బున్నమికిన్

      తొలగించండి
  2. ఏమది వింతగ నున్నది
    తామస మునయలుక చెందె తారక లెల్లన్
    సోముని విరహము నందున
    కౌముది లేనట్టి రాత్రిఁ గనెఁ బున్న మికిన్

    రిప్లయితొలగించండి
  3. కోమలి కోరిన జింకను
    రాముడు వేటాడఁ బోయి, రావణు చెరలో
    శ్రీమతి చిక్కఁగ, జీవన
    కౌముది లేనట్టి రాత్రిఁగనెఁ బున్నమికిన్

    రిప్లయితొలగించండి
  4. డా.పిట్టా సత్యనారాయణ
    ప్రేమము గ్రుడ్డిది యనరే
    కామించిన వాడురాక గడిపిన రేయిన్
    సోముడు పూర్ణుడునైనన్
    కౌముది లేనట్టి రాత్రి గనె బున్నమికిన్!

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా సత్యనారాయణ
    (స్వదేశీ భావనతో పంజాబులో వోట్ల నడిగి భంగ పడిన భాజపా!పంజాబ్ నుండి సైనికులు పెక్కురు.వోట్ల గణన ఆ పార్టీకి పూర్ణిమ,ఉ.భా.లో)
    ఏమనిజెప్ప బంచనద మేర్పడు పంచయు నాబు(పంచ.ఆబ్॥పంజాబు)గూడ నా
    భూమిని దేశరక్షణకు బోరెడి సైనికులుంద్రు ప్రేముడిన్
    క్షేమము గోరు నాప్రజల శ్రేయముగానదు భాజపా యటన్
    సామముతోడ వోట్ల గను సౌఖ్యము కల్ల స్వ దేశి భావనన్
    నీమపు బూర్ణసద్గణన -నింగిన మాయము చందమామ పో
    కౌముది లేని రాతిరిని గాంచెను పున్నమినాడు వింతగా!

    రిప్లయితొలగించండి
  6. సోముడు రానియమాసయె
    కౌముది లేనట్టి రాత్రి, గనె పున్నమికిన్
    భామయె యందాలొలికెడు
    మామను తావిరియు పండు మాలతి కాంతిన్

    రిప్లయితొలగించండి
  7. ప్రేమంబున విహరించగ
    భామా సహితుండు రాజు వనమున కేగన్
    సోముని రాహువు మ్రింగగ
    కౌముది లేనట్టి రాత్రిఁ గనెఁ బున్నమికిన్.

    భామకు బ్రేమపూరితకు వాస్తవహర్షము బంచు కాంక్షతో
    నామెను వెంట బెట్టుకొని యచ్చటి రమ్యవనంబు చేరగా
    రాముడు చంద్రబింబమును రాహువు మ్రింగిన వేళ గావునన్
    గౌముది లేని రాతిరినిఁ గాంచెను పున్నమినాడు వింతగా.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  8. ఇటీవల దివంగతులైన శతావధాని డా.సీ.వీ. సుబ్బన్న గారిపై 1996 లో నేను వ్రాసిన అభినందన పద్యాలు.
    కం. అలవోకగ నవధానము
    చెలరేగుచు సుబ్బన వలె చేసెడి నేర్పున్
    గలవారలు పలుతావుల
    గలరా ఈ లోకమందు కలియుగ మందున్ ?
    ****)()()(****
    కం.సుబ్బన వలెనవధానము
    నిబ్బరముగ జేయగలుగు నేర్పును మఱియున్
    గబ్బము లల్లెడి రీతియు
    నబ్బవుగా యెన్నడైన నన్యుల కిలలో !
    ****))))((((****
    కం. పెద్దన కవితా ప్రౌఢియు
    బద్దెన శైలియు గలసిన పదముల బిగిచే
    నొద్దికగా సుబ్బనవలె
    పద్దెము నుడువంగ నేర్చు పండితులేరీ ?
    *****%%%%%*****

    రిప్లయితొలగించండి
  9. ఏమని తెల్పెద ఘటనలు
    కౌముది లేనట్టి రాత్రి,గనె పున్నమికిన్
    కామోపహతులు జంటలు
    తామసిలో ప్రియుల జేర తబ్బిబ్బవగన్

    రిప్లయితొలగించండి
  10. తామిశ్ర మావరించును
    కౌముది లేనట్టి రాత్రి ,గనె బున్నమికిన్
    మామనుమని మా కోడలు
    బాములు దా బడుచునెన్నొ బ్రసవము నందున్

    రిప్లయితొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  12. ప్రేమము కలుగదు జంటకు
    కౌముది లేనట్టి రాత్రి, గనె పున్నమికిన్
    కోమలియగు ప్రియసఖి యా
    రామమునందునమనస్సు రంజిల జేయన్

    రిప్లయితొలగించండి
  13. ఆ మనుజ షండ మఁట వి
    శ్రామ విలాసముల నిచ్చు శశి శీతకరో
    ద్దాముఁడు రాహు దళితుఁ డవఁ
    గౌముది లేనట్టి రాత్రిఁ గనెఁ బున్నమికిన్


    నీమము తప్ప నెవ్వరికి నిక్కము శక్యము కాదు విశ్వ మం
    దా మధుకైటభారి పరమాద్భుత లీలలు సుమ్మి లోకమే
    సోముఁడు వెల్గు చుండ పరి శుద్ధపుఁ గాంతుల సైంహి కాపహృ
    త్కౌముది లేని రాతిరినిఁ గాంచెను పున్నమి నాఁడు వింతగా

    రిప్లయితొలగించండి
  14. భామయె కాని యత్యధిక భాగ్యముతో విలసిల్లు నట్టి యా
    కామిని రాజకీయ పద కాంక్షిత యై కడు జిత్తు లల్లినన్
    నేమము తప్పకుండ కడు నేర్పున పంపిరి బొక్కలోనికిన్
    కౌముది లేని రాతిరినిఁ గాంచెను పున్నమినాడు వింతగా

    రిప్లయితొలగించండి
  15. ఆమని యైననున్నపుడు రాహువు మ్రింగగ చంద్రునిన్భళా
    కౌముది లేని రాతిరిని గాంచెను ,బున్నమి నాడు వింతగా
    నామది యేలకో దిగులు నాయని పించెను గారణంబహో
    యేమయి యుండునో దెలియ దిప్పటి కార్యుడ!యేమొభా వినిన్

    రిప్లయితొలగించండి
  16. నీమము దప్పగ పవనుడు
    సేమము నెంచక జలనిధి సీమను దాటన్
    సోముని గప్పగ మేఘము
    కౌముది లేనట్టి రాత్రి గనె బున్నమికిన్!

    తుఫాను సందర్భంలో!

    రిప్లయితొలగించండి
  17. రాముని గానక సీతయు
    నామెను గనుగొన దశరధ నందను డకటా
    వేమారు విరహ మొప్పగ
    కౌముది లేనట్టి రాత్రి గనె బున్నమికిన్!

    రిప్లయితొలగించండి
  18. ఏమని నుడివెద ప్రళయము
    గా మారిన నాటి పవన ఘాతుక చర్యల్!
    ఆ మాఘ మాస మందున
    కౌముది లేనట్టి రాత్రి గనె బున్నమికిన్!

    రిప్లయితొలగించండి
  19. ఆమని గ్రీష్మముల్ వెడలి హర్షము గూర్చెడు వర్షకాలమే
    సోముని మ్రింగెమేఘములు చోద్యమదేమియు గాదుచూడగన్
    నేమము దప్పక ప్రభలనీనెడు చంద్రుడదృశ్యమయ్యనే
    మామను జేరితా సరస మాడెడు వేళన యాపడంతియే
    కౌముదిలేని రాతిరిని గాంచెను పున్నమినాడు వింతగా

    రిప్లయితొలగించండి
  20. సామాన్యమ?హోళీయే
    గ్రామోత్సవమయ్యు పగలు ఘనముగ సాగన్
    ప్రేమౌ యింద్రధనస్సను
    కౌముది”|లేనట్టి రాత్రిగనె పున్నమికిన్.
    2.గ్రామమునందు హోళియని గర్వమునందున రంగులాటతో
    క్షేమమొసంగువేడుకలచే పగలంతయు జేయుటన్నదే
    కౌముది|”లేని రాతిరిని గాంచెను పున్నమి నాడు వింతగా
    కాముని పున్నమయ్యు తనకంటవ?యింద్రధనుస్సు రంగులే”| {కౌముది=పండుగ}


    రిప్లయితొలగించండి
  21. కవిమిత్రులారా,
    నమస్కృతులు.
    మా తీర్థయాత్రలో ఇప్పటికి తిరువనంతపురం, శచీంద్రం, కన్యాకుమారి, తిరుచెందూర్, రామేశ్వరం దర్శించుకొని ఇప్పుడే మధురై చేరుకున్నాము. ప్రయాణంలో ఉండి మీ పూరణలను సమీక్షించలేకున్నాను. మన్నించండి.
    క్రమం తప్పకుండా సమస్యలను పూరిస్తూ పరస్పర గుణ దోష విచారణ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. కోమలి తా ప్రేమించిన
    మామను కనుమీటి పిలువ మనసే మురియన్
    భామను చేరిన వాడికి
    కౌముది లేనట్టి రాత్రి గనె బున్నమికిన్

    రిప్లయితొలగించండి
  23. సోముడు కనరాడయ్యెను
    కాముని పున్నమి దినమున గగనము నందున్
    నేమో నింగియు జూడగ
    కౌముది లేనట్టి రాత్రి గనె బున్నమికిన్.

    రిప్లయితొలగించండి
  24. ప్రేమగ కామినీజనుల వేడుక తీర్చగ సాధ్యమే, దివిన్
    కౌముది లేని రాతిరిని, గాంచెను పున్నమినాడు వింతగా
    కోమలియైనచంద్రముఖి కూడి స్వభర్తను, చంద్రికా ద్యుతుల్
    ధామము నందునన్ కలిగె తద్దయు ప్రీతి లతాంగి కప్పుడున్

    రిప్లయితొలగించండి
  25. "కౌముది లేని రాతిరినిఁ గాంచెను పున్నమినాడు వింతగా"
    గోముగ నీ సమస్య గని గొప్పగ జేసిరి పూరణమ్ములన్
    ధీమతు లెల్లరీ సభను తీరున పూరణ కానరాకిటుల్:
    "కౌముది లేని రాతిరిది కప్పగ చంద్రుని మబ్బులెన్నియో"

    రిప్లయితొలగించండి