28, మార్చి 2017, మంగళవారం

సమస్య - 2321 (విషముఁ ద్రాగె హరి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"విషముఁ ద్రాగె హరియె విందటంచు"
లేదా...
"విషమును ద్రాగె మాధవుఁడు విందనుచున్ పరమానురక్తితోన్"
ఈ సమస్యను పంపిన అంబటి భానుప్రకాశ్ గారికి ధన్యవాదాలు.

68 కామెంట్‌లు:

  1. పాలసంద్ర మిచ్చె హాలాహల విషము
    హరుడు ద్రాగె విషము హాయి గాను
    హరియె హరుడు, హృదిని తరచి తెరిచి చూడ;
    విషముఁ ద్రాగె హరియె విందటంచు...




    కంది శంకరయ్యడిసెంబర్ 19, 2015 10:08 AM

    శివాయ విష్ణురూపాయ 
    శివరూపాయ విష్ణవే| 
    శివస్య హృదయం విష్ణుః 
    విష్ణోశ్చ హృదయం శివః||

    రిప్లయితొలగించండి
  2. తృషఁ గొని దేవదానవులు దివ్యపయోధి మథించుచుండగా
    వృషభము వాహనమ్మయిన వేలుపు సాంబశివుండు వేగమున్
    విషమునుఁ ద్రాగె, మాధవుడు విందనుచున్ పరమానురక్తితో
    సుషిమము కల్గినట్టి సుధ, సుందరిమంగళదేవి గైకొనెన్ ||
    (తృష=ఇచ్ఛ, సుషిమము=చల్లదనము, మంగళదేవి=లక్ష్మి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సోమయాజులు గారూ,
      విరుపుతో మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి


  3. హరుడు బేసి కంటి హాటకేశ్వరుడట
    విషముఁ ద్రాగె హరియె విందటంచు
    సురయ సురుల కెల్ల చోఱబుడుతగాను
    యమృతము నట పంచి యాస దీర్చె !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చోఱబుడుత'...?

      తొలగించండి


    2. చోఱబుడుత - స్త్రీ ; మోహిని స్త్రీ కదండి అందుకని
      అట్లా రాసాను సరియేనా ?

      జిలేబి

      తొలగించండి
  4. తే: జగము బ్రోచంగ ఆనాడు శంకరుండు
    విషము త్రాగె, హరియె విందటంచు
    మోహినీ రూపము నుదాల్చి ముదము తోడ
    అమృతమును అదితేయుల కందజేసె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరుపుతో పూరణ భావం బాగుంది.
      కాని ఇచ్చిన సమస్య ఆటవెలది పాదం.. మీరు తేటగీతిని వ్రాశారు. నా సవరణ....

      జగము బ్రోచుటకును శంకరుం డానాడు
      విషము ద్రాగె; హరియె విందటంచు
      ముదముతోడ దాల్చి మోహినీ రూపము
      నమృతమును సురలకు నందజేసె.

      తొలగించండి
    2. పొరబాటు మన్నించండి తేట గీతలో మునిగి అట వెలదిని మరచినాను

      తొలగించండి
  5. తనను జంప బూను దైత్యాంతరంగంబు
    నెరిగి దాని యముని పురికి బంప
    సర్వభారకుండు చనుబాలలోనున్న
    విషము ద్రాగె హరియె విందటంచు.

    తృషగొని యుండె బాలకుడు తెమ్మిదె క్షీరము నిత్తునంచు దా
    మిషగొని వచ్చు పూతనను మేలిక బంపుట యంతకాంతికం
    బషయని చన్నుబాలుతనివారగ త్రాగెడి రీతినందులో
    విషమును ద్రాగె మాధవుడు విందనుచున్ పరమానురక్తితోన్.

    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      'అష'... విజయనగర బ్రాహ్మణ కుటుంబాలలో ముఖ్యంగా వృద్ధులు టకారాన్ని షకారంగా పలికే సంప్రదాయాన్ని కన్యాశుల్కం నాటకంలో చూస్తాం. మీరు దాన్ని అనుసరించినట్టున్నారు.

      తొలగించండి
  6. డా.పిట్టా
    ఇచ్చువారిదైన యీహను మన్నింప
    గొప్పకార్యమనిరి కోవిదుండ్రు
    తల్లిపాలు జే(చే)ప తా పూతనయె గోర
    విషము ద్రాగె హరియె విందటంచు!

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా
    "మృషయది దైవమెచ్చటను మేదినిలో ?గన కావ్య సృష్టియే!
    మిష!" యని కాలకూటమును మ్రింగగ బంపెను భర్త వేసటన్
    విషయము గన్న కన్నయ సువీక్షణతోడుత గాచె మీరనున్
    విషమును ద్రాగె మాధవుడు విందనుచున్ పరమానురక్తితోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. శిశువనుచుఁ దలఁచక పశువువలె విషము
    సుతున కొసఁగ మన నసురుఁడుఁ, జెలఁగి
    భక్తునందు నిలచి ప్రహ్లాదవరదుడై
    విషముఁ గొనియె హరియె విందటంచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. పాలసంద్ర మిచ్చె హాలాహల విషము
    శేషనాగు గ్రోలె దోషమెంచి
    శేషశాయి నిదుర చెరచ నిచ్ఛయులేక
    విషముఁ ద్రాగె హరియె విందటంచు

    (కల్పితము)
    హరి = సర్పము
    "తలనుండు విషము ఫణికిని" 

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      క్రొత్త ఊహలతో పూరణలు చేయడంలో మీకు మీరే సాటి! బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి

  10. బాధవెట్ట నాడు బాల ప్రహ్లాదునే
    వానిలోనదూరి వరుసగాచె
    పాముకాటు దినెను పదఘట్టనలనల్గె
    విషముఁ ద్రాగె హరియె విందటంచు.

    రిప్లయితొలగించండి

  11. పిన్నక నాగేశ్వరరావు.

    హరుడు కడలి మథనమందు వెలువడిన

    విషము ద్రాగె ; హరియె విందటంచు

    పిన్ననాటి హితుడు ప్రేమతో దెచ్చిన

    యటుకు లారగించె నాత్రముగను.

    *********************************

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. హరి యనగను కప్ప హరియు పాము గదర
    హరిని కాటు వేసి హరియె మ్రింగె
    నమరకోశ మిటుల నరమరికల దీర్చు
    విషముఁ ద్రాగె హరియె విందటంచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విజయ కుమార్ సీ. గారి స్పందన:

      భళి! విషముకమృతము పర్యాయ పదమౌగ
      నమృతమె యటుల విషమగునటంచు
      భ్రాంతి పొంది యొకడు పద్యమందున వ్రాసె
      "విషము త్రావె హరియె విందటంచు"

      - సరదాగా. మీ పద్యం బాగుంది.

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      చిటితోటి వారు చెప్పినట్లు మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. గిరిజ కోర గాను హరుడుదా నీలపు
    విషము ద్రా గె .,హరియె విందటంచు
    దేవత లకు వరుస దీ యనైనట్టి యా
    యమృత మిడగ దృప్తు లైరి వారు

    రిప్లయితొలగించండి
  14. సకల లోక హితము నకు శంకరుండు తా
    విషము త్రాగె,హరియె విందటంచు,
    తాను గూడ త్రాగె తత్కంఠ హారమై
    తనరు కతన, దాస ధర్మ మనుచు.
    హరి= పాము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. రామ జన్మ దినము రమ్యమ్ముగ జరిపి
    బీద సాద లట ప్రసాదములును
    బానకమ్ము నీయ భక్త వరు లపు డా
    విషముఁ ద్రాగె హరియె విందటంచు

    [విషము = జలము]


    ఇషువుల కన్న మిన్న తపియించును దేహము నెల్ల వేగ వై
    దుషుల పథమ్ము దల్పకయె దుర్వ్యస నమ్మది వీడ లేక శే
    ముషి యొక యింత లేక విష పూరిత వారుణి యంచు నేర కా
    విషమును ద్రాగె మా ధవుఁడు విందనుచుం బరమాను రక్తితోన్

    [మా ధవుడు = మా యొక్క పతి]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజనీయ గురువులు శంకరయ్య గారికి కవి వరులందరికి హేమళంబి యుగాది శుభాకాక్షలు!

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      భక్తులచేత పానకాన్ని, త్రాగుబోతు భర్త చేత విషతుల్యమైన మద్యాన్ని త్రాగించిన మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  16. పూజ్యనీయులైన గురుదేవులు శ్రీ శంకరయ్య గారికి మరియు కవి వరులందరికి హేమళంబి యుగాది శుభాకాక్షలు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరప్రసాద్ గారూ,
      ఎంతకాలానికి బ్లాగులో మీ పలకరింపు? సంతోషం! ధన్యవాదాలు.
      మీకు కూడ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

      తొలగించండి


  17. అందరికీ హేవిళంబి ఉగాది శుభాకాంక్షలతో


    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. దుష్ట రక్కసి యిచ్చిన దుగ్దమునను
    విషము త్రాగె హరియె విందటంచు
    పాలతోడ తా గొనె దాని ప్రాణములను
    శౌరి మేనుతాకి పలాశి స్వర్గము జనె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      సమస్య పాదం ఆటవెలది అయితే మీరు తేటగీతి వ్రాశారు. 'దుష్ట రక్కసి' దుష్టసమాసం. నా సవరణ....

      దుష్ట రాక్షసి యిడు దుగ్ధరూపంబైన
      విషము ద్రాగె హరియె విందటంచు
      పాలతోడ దాని ప్రాణమ్ముల గొనెను
      శౌరి తాకగ నది స్వర్గము జనె.

      తొలగించండి
  19. హరి యనెడు మిత్రుడొకడు మద్యమనే విషము త్రాగాడనే యూహతో.....


    పుట్టినట్టిరోజు భూరిగా వేడుకల్
    జరుప దలచి పిలిచె సఖులనొకడు
    మద్యపానమచట మక్కువంచు దలచి
    విషము ద్రాగె హరియె విందటంచు



    తనని సంహరింప దనుజురాలైనట్టి
    కొమ్మ దాచె శ్రీని గుబ్బలందు
    తరుణి జేరి యామె స్తనము గుడుచుచు దా
    విషమూ ద్రాగె హరియె విందటంచు



    కసిగల కంసుడంపగ సుగాత్రిగ మారిన రాక్షసొక్కతిన్
    ముసిముసి నవ్వుతోడ గనె ముద్దుల కృష్ణుడు దొంగ ప్రేమతో
    శిశువుగ నామె జేరుచును చిత్రముగా స్తనమందు దాచినన్
    విషమును ద్రాగె మాధవుడు విందనుచున్ పరమాను రక్తితోన్

    రిప్లయితొలగించండి
  20. విషము పొరపాటుగా విషమూ గా టైపైంది క్షమించ మనవి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      స-శ లకు, స-ష లకు ప్రాస ఉంది. కాని శ-ష లకు ప్రాసమైత్రి లేదు. గమనించండి.

      తొలగించండి
  21. పరమ శివుడు నాడు పాల్కడలిజనించు
    విషము ద్రాగె,హరియె విందటంచు
    బాల్య నేస్తకాడు బట్టుకు వచ్చిన
    అటుకులనుభుజించె హాయిగాను!!!

    రిప్లయితొలగించండి
  22. హర హర యను మంచు హరి భక్తు ప్రహ్లాదు
    జాల బాధ పెట్టి చంపి వేయ
    విషము నిచ్చె దండ్రి, విషధర మిత్రుడు
    విషము ద్రాగె హరియె విందటంచు

    రిప్లయితొలగించండి
  23. హర హర యను మంచు హరి భక్తు ప్రహ్లాదు
    జాల బాధ పెట్టి చంపి వేయ
    విషము నిచ్చె దండ్రి, విషధర మిత్రుడు
    విషము ద్రాగె హరియె విందటంచు

    రిప్లయితొలగించండి
  24. హర హర యను మంచు హరి భక్తు ప్రహ్లాదు
    జాల బాధ పెట్టి చంపి వేయ
    విషము నిచ్చె దండ్రి, విషధర మిత్రుడు
    విషము ద్రాగె హరియె విందటంచు

    రిప్లయితొలగించండి
  25. విషకుచ చనుబాలు విశ్వేశ్వరునకిడ
    పూతనరిగి వెదకి పుడమి నంత
    పాలనిచ్చు చుండ బాలతో ప్రాణమున్
    విషము ద్రాగె హరియె విందటంచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'కుచ, చను' పునరుక్తి... 'కుచ చనుబాలు' అన్న సమసమూ దుష్టమే. "విషమగు చనుబాలు" అనండి. అలాగే "పూతన చని" అనండి. పూతన+అరిగి = పూతన యరిగి అవుతుంది.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. విషకుచ (పూతన) యొక్క చనుబాలు లో పునరుక్తి లేదు గదా.
      విష తో కుచ సమసించింది, చనుబాలు తో కాకుండా యని భావించ వచ్చును కదా.

      తొలగించండి
    3. లక్ష్మినారాయణ గారూ,
      'విషకుచ చనుబాలు' ప్రయోగం విషయంలో తొందరపడి వ్యాఖ్యానించాను. మీరే సరి! మన్నించండి.
      *****
      కామేశ్వర రావు గారూ,
      ధన్యవాదాలు!

      తొలగించండి
  26. పూజ్యులు గురువుగారికి, కవివర్యులందరికి "హేవిళంబి" ఉగాది శుభాకాంక్షలు

    కావగాను జనుల కందర్ప దమనుడు
    విషము ద్రాగె; హరియె విందటంచు
    చేగొనె చిననాటి చెలికాని కానుక
    నాదుకొనగ హరుడు హరియు వాడే!

    రిప్లయితొలగించండి
  27. ఉషను నడుంగగా బలికె సూ సభయంతయు దేరిజూడగన్
    విషమును ద్రాగె మాధవుడు విందనుచున్పరమాను రక్తితోన్
    విషయమ యియ్యదే యిక వివేకము తోడ నజెప్పితిన్సుమా
    విషమును ద్రాగె మాధవుడు వేగముగా గను దప్పిగొనంగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసార్హం. మొదటి పాదంలో యతి తప్పింది. పద్యం చివర 'దప్పి గొనంగన్' అన్నచోట గణదోషం.

      తొలగించండి
  28. .విషము ద్రాగె హరియు విందటంచునునెంచి
    పూతనెత్తుగడను పూర్తి మార్చె|
    దైవమున్న చెంత దానవ చేష్టలు
    సాగగలవ?ముసురు చావుకొరకె|
    2.విషయము గుర్తెరింగి తగువేదనమాన్పగ సాంద్రమందునన్
    విషమును ద్రాగె|”మా-ధవుడువిందనుచున్ పరమానురక్తితోన్
    ఋషులును మెచ్చు రీతిగను రేపటి దుర్భరమెంచి ధైర్యమున్
    కృషియను మార్గ మెంచె తగు కీడును మాన్పెను”పార్వతమ్మనెన్”|

    రిప్లయితొలగించండి
  29. కంది శంకరయ్యగారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

    పోతన భాగవతములోన పద్య పాద మిది గమనించండి
    "విషకుచ చను విషముఁ గొనుట విషమే తలపఁన్?"

    రిప్లయితొలగించండి
  30. గురువుగారికి ధన్యవాదములు...మీ సూచన ప్రకారము సవరించిన పద్యము


    కసిగల కంసుడంపగ సుగాత్రిగ మారిన రాక్షసొక్కతిన్
    ముసిముసి నవ్వుతోడ గనె ముద్దుల కృష్ణుడు వామలోచనిన్
    విషయమెఱంగి బాలకుడు భీరువు గుబ్బల లోన దాచినన్
    విషమును ద్రాగె మాధవుడు విందనుచున్ పరమాను రక్తితోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని... రాక్షసి+ఒక్కతి అన్నపుడు యడాగమం వస్తుంది. సంధి లేదు. "రాక్షసాంగనన్" అనండి.

      తొలగించండి
  31. కవిమిత్రులారా!
    ఎందుకో నిన్నటి నుండి నా సిస్టమ్ చాలా మెల్లగా స్పందిస్తున్నది. ఫైళ్ళు తెరవడానికి, టైపు చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నది. మా అబ్బాయి ఉదయం బాగుచేసే ప్రయత్నం చేసాడు. కాని ఫలితం శూన్యం. బ్లాగును తెరవడం, వ్యాఖ్యలను టైప్ చేయడం ఇబ్బంది అవుతున్నది. రేపు ఓ.యస్. మార్చుతానన్నాడు. చూడాలి... తరువాతైనా బాగు పడుతుందేమో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ సిస్టమ్ బాగా క్లీన్ చేయాలేమో నండీ.అలాగే డీఫ్రాగ్మెంటేషన్ కూడా అత్యవసరం కావచ్చును. అలాగే మాల్‌వేర్ మరియు వైరస్ వంటివి కూడా వెదకి తీసెయ్యాలి. అప్పుడూ బాగా నెమ్మదే ఐతే ఓయస్ రీలోడ్ చేయండి.

      తొలగించండి
  32. శషభిషలన్ని మానుచును శాస్త్రి ప్రభాకరుడెంచి కూర్చుచున్
    విషయములన్ని వ్రాయుచును వెన్నుని గాధలు మొండి జేయుచున్
    కషయము వోలు కావ్యమును కైటభ వైరికి నంకితమ్మిడన్
    విషమును ద్రాగె మాధవుఁడు విందనుచున్ పరమానురక్తితోన్

    రిప్లయితొలగించండి