4, ఏప్రిల్ 2017, మంగళవారం

సమస్య - 2328 (నీచదశ నంది సజ్జనుల్...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"నీచదశ నంది సజ్జనుల్ నీల్గుచుంద్రు"
లేదా...
"నీచదశస్థులై సతము నీల్గుచునుందురు సజ్జనుల్ భువిన్"

82 కామెంట్‌లు:

  1. తాము నమ్మిన దర్మము తప్పరెపుడు
    నీచ దశనంది సజ్జనుల్, నీల్గుచుంద్రు
    అడ్డ దారిన గడ్డిమేయంగ పొందు
    ధనమదంబున మత్తులధములు జూడ.

    రిప్లయితొలగించండి
  2. సత్య ధర్మములను గూడి శాంతి నొంది
    ధనము రాజ్యము గోల్పోయి దాన మొసగ
    శాప మొందిన యాహరిశ్చంద్రు వోలె
    నీచదశ నంది సజ్జనుల్ నీల్గుచుంద్రు


    నీలుగు = గర్వించు
    ఆంధ్ర భారతి

    రిప్లయితొలగించండి
  3. నీచపు వృత్తులన్ సలుపు నేరము లెన్నియొ చేయు నీచుల
    న్నీచ దశస్థులై సతము నీల్గుచు నుందురు, సజ్జనుల్ భువిన్
    యోచన తోడుతన్ జనుల యోగ్యపు కార్యము లెన్నొ సల్పుచున్
    వీచియు నైన ధైర్యమును వీడరు లోకహితంబు గోరుచున్.
    (వీచియు = కొంచము)

    రిప్లయితొలగించండి
  4. రాచకులోద్భవుండయిన రాముడు కష్టము లందె నెన్నియో!
    మోచన కల్గె నిక్కటుల ప్రోవుకు పాండవకోటి కెన్నడున్?
    యోచనలేల మిత్రవర! యూహకు మించిన వీ సమస్తమున్
    నీచదశస్థులై సతము నీల్గుచుచుందురు సజ్జనుల్ భువిన్

    రిప్లయితొలగించండి
  5. పాండవులు పడెనానాడు బాధలన్ని
    రాముడు పడెను ఇక్కట్లు భామ కూడి
    జగము లోన పుణ్యపురుఘుల్భంగపడక
    నీచదశ నంది సజ్జనుల్ నీల్గుచుంద్రు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీపద్యం బాగున్నది నాగమణి గారు. అభినందనలు. 2 చోట్ల సరిజూడాలి.
      1. “పడెను+ఇక్కట్లు”= పడెనిక్కట్లు అనాలి. ఉత్వసంధి తప్పక చెయ్యాలి. గణం దెబ్బతింది గనుక “పడెనిక్కట్లను” అంటే సరిపోతుంది.
      2. “జగము…… భంగ” ప్రాస యతి తప్పినది. ప్రాసాక్షరం “గ” కనుక “గ” గుణింతమ్లోని ఏ అక్షరాన్నైనా వాడవచ్చు. బిందుపూర్వక గకారం ప్రాసలో లేదు గనుక యతి తప్పినది. కాబట్టి “వసుధ యందు” అంటే సరిపోతుంది. నాదు సూచన మాత్రమే. అన్యథా భావించవద్దు.

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పడి రానాడు... పడె నిక్కట్లను (శర్మ గారి సవరణ)... 'వసుధలో పుణ్యపురుషులు భంగపడగ' అనండి.

      తొలగించండి
    3. గురు తుల్యులిరువురికి వందనములు. పద్యాలలో ఇప్పుడే అ ఆ లు నేర్చుకునుచున్నాను. నేను వ్రాసిన పద్యాలలో తప్పులు చూపించిన అవి సరి దిద్దుకొని పునరావృతము గాకుండా చూచుకుంటాను.
      తప్పక మీ యొక్క ఆశీస్సులు అంద చేయండి. ధన్యవాదములతో

      తొలగించండి
    4. గురువు గారికి నమస్కారము. ఈ సమస్య ఐదు పాదాలలో పూరించ వచ్చా?? నాలుగు పాదములలోనే పూరించాలా?? సలహా ఇవ్వండి

      తొలగించండి
    5. సమలక్షణాలు కలిగిన పాదాలైతే వ్రాయవచ్చు. తేతగీతి, ఉత్పలమాల మొదలైన వృత్తాలు, ద్విపద ఈవిధంగా వ్రాయడానికి అనుకూలమైనవి.
      ఆటవెలది, కందం ఇందుకు తగవు.

      తొలగించండి
    6. ధన్యవాదములు ఇవాళ మంచి విషయము నేర్చుకున్నాను.

      తొలగించండి
  6. డా.పిట్టా
    సజ్జనుల్ గవియు పండిత సాధు పురుషు
    లెన్న నార్థిక స్థాయి లేకున్నవారె
    యైన నుత్తమ దశయది యరయ ధనిక-
    నీచ దశ నంది సజ్జనుల్ నీల్గుచుంద్రు

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా
    వాచక, కర్మ,మానసపు వాసిని నొక్కటగూర్చి పేదయై
    గాచుకొనంగ దత్తనువు కాదది జీవన లౌక్యమందురే
    యోచన విత్త సంగ్రహణ నున్ననె చాలు నటన్న బృందముల్
    నీచ దశస్థులై సతము నీల్గుచు నుందురు;సజ్జనుల్ భువిన్?

    రిప్లయితొలగించండి
  8. దుర్మదాంధులు రాజులై ధర్మమునకు
    దెబ్బ తగులగ సౌజన్య దీప్తి యణగ
    నిజము బలుకుట భువిలోన నేర మయిన
    నీచదశనంది సజ్జనుల్ నీల్గుచుంద్రు.

    దోచుచునుండి దేశమును, దూరుచు ధర్మము, దైవకర్మలన్
    నోచెడివారి నెల్లెడల నొవ్వగ జేయుచు దండనంబులన్,
    బూచులవోలె పాలకులు భూజనులన్ గెరలించుచుండగా
    నీచదశస్థులై సతము నీల్గుచునుందురు సజ్జనుల్ భువిన్.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి

  9. యోచన సారమైవెలుగ యోగముగానక నమ్ము మయ్యరో
    నీచదశస్థులై సతము నీల్గుచునుందురు సజ్జనుల్ భువిన్,
    మాచనవర్యుడా వినుము మానినిపల్కుల, విద్య యొక్కటే
    సాచివిలోకితంబవదు ! సాధనజేయవలెన్ జిగేల్మనన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  10. వాక్కున గుణము లేకున్న వాదు లాడి
    తమ పరపతి వీడుచు సామ్యతను విడుచుచు
    పరిపరి విధముల తమకింపగ, జిలేబి,
    నీచదశ నంది సజ్జనుల్ నీల్గుచుంద్రు

    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. క్లిష్టజీవన దుర్భర క్లేశమెంతొ
    ననుభవించియు దుష్కర్మ నంట బోరు
    నీచదశనంది సజ్జనుల్,నీల్గుచుంద్రు
    నీచులు ధనమునార్జించి నీతిలేక

    రిప్లయితొలగించండి
  12. సహనమన్నది వీడరు శాపమునను
    నీచ దశ నంది సజ్జనుల్, నీల్గుచుంద్ర
    నియెడు మాట యసత్యము నిబ్బరమ్ము
    చూపెదరు వారు సౌఖ్యమ్ము చుట్టమైన

    రిప్లయితొలగించండి
  13. ప్రధమ శ్రేణినుండి దొరలు పార ద్రోల
    సూటు బూటు హ్యాటులనెల్ల మూట గట్టి
    కరము నందు కర్ర గొనిన గాంధి వోలె
    నీచదశ నంది సజ్జనుల్ నీల్గుచుంద్రు

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు​.

    వనము లన్ వసియించిన పాండవులును

    భార్యనమ్మి హరిశ్చంద్ర పాలకుడును

    మాట కోసము నిలిచిన మాన్యులైరి

    నీచ దశ నంది సజ్జనుల్ నీల్గుచుంద్రు.

    *********************************

    రిప్లయితొలగించండి
  15. శాప వశమున నా హరిశ్చంద్రు డడగె
    శకుని మాయను ధర్మజు శక్తి యుడిగె
    నీచదశ నంది సజ్జనుల్ ;నీల్గుచుంద్రు
    దుష్టు లీభువి నిక్కుచు తునియలవగ

    నిన్నటి సమస్యకు నా పూరణ

    భూమిఁ దున్నెడి జనకుని పుత్రికయయి
    రావణుని జంప నెంచిన రామచంద్రు
    చేయి బట్టగ నే తెంచె సీత ; చిట్టి
    తల్లిఁ బెండ్లాడి రాముఁ డుదాత్తుఁ డయ్యె

    రిప్లయితొలగించండి
  16. ధర్మ మార్గము దప్పరు దాము గాను
    నీచ దశనంది సజ్జనుల్, నీల్గు చుంద్రు
    బువ్వ దినుటకు రమ్మని పూర్ణ పిలువ
    రాను రానని మారాము శ్రీను జేసె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరుపుతో మీ పూరణ బాగున్నది. కాని 'నీల్గుచుంద్రు' అన్నదానికి అన్వయం?

      తొలగించండి
  17. జంకరు మనమం దిసుమంత జాతకమున
    నీచదశ నంది సజ్జనుల్, నీల్గుచుంద్ర
    సహనులై నీచులెల్ల భృశ మది చూచి
    భేద మదియ యిరువురకు వింత యేల


    తోచక యేమియున్ మదిని దుఃఖము నాపఁగ లేక దుర్జనుల్
    నీచదశస్థులై సతము నీల్గుచునుందురు, సజ్జనుల్ భువిం
    జూచిన ధైర్యవంతులు నశోక మనస్కులు దాల్తు రింపుగన్
    వీచిన గాలి మిక్కుటము వీగునె శైలము మ్రాను భంగినిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
      మీ ఉత్పలమాల చివరిపాదాన్ని కొద్దిగా మార్చితే క్రొత్త సమస్య సిద్ధమౌతున్నది. "వీచిన మందవాతమున వీగెను శైలము దూది భంగినిన్" ఎలా ఉంటుందంటారు?

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. సమస్య బాగుంటుందండి.

      తొలగించండి
  18. గతపుజన్మ పాపఫలము కాంచగాను
    నీచదశనంది సజ్జనుల్ నీల్గుచుంద్రు
    పాత భవదుష్కృతమ్ములు పట్టికుడుప
    శౌరిసఖుడు కుచేలుడు ఘోరమైన
    పేద జీవితమునఁ బొందె వేదనలను

    రిప్లయితొలగించండి
  19. ఓర్పు గోల్పోక నెంతయు నేర్పుతోను
    ధర్మమార్గంబు వీడరు ధరణి పైన
    నీచదశనంది సజ్జనుల్; నీల్గుచుంద్రు
    నధములు యధికారధన ఘనాంధులగుచు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుదేవులకు, కవి వర్యులకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలతో...
      శ్రీ సీతా దేవి గారు మీ పద్యము బాగున్నది.

      నేర్పుతోను= నేర్పుతోడ, ధరణి పైన= ధరణి యందు,
      గా మార్చిన ఎటు లుండును ?

      తొలగించండి
    2. వర ప్రసాద్ గారూ మీ సహృదయతకు ధన్యవాదములు! మీరు నుడివినట్లు తోను , పైన యనేపదాలు వ్యావహారికమైనవి! తోడ, యందు గా మారిస్తే గ్రాంధికంగా ఉంటాయి!
      ధన్యవాదాలు!

      తొలగించండి
    3. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *****
      వరప్రసాద్ గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం. మీరు సవరణలను సూచించే స్థాయికి ఎదిగారంటే ఆనందంగా ఉంది.

      తొలగించండి
    4. చుంద్రు / చుందురు కళ గదా “నధము” లనడము సాధువేనా యని నా యనుమానము. చుందు / రధములు అంటే సమస్యను మార్చి నట్లగును. గురువు గారిని పరిశీలించ గోర్తాను.

      తొలగించండి
    5. పూజ్యులు కామేశ్వరరావుగారికి వందన శతములు! ఇప్పుడే మా చిన్నాయన భట్టారం రాధాకృష్ణయ్యగారు సూచించారు!ఉత్వ సంధి యని ! నీల్గుచుందు రధములని!
      ధన్యవాదములు!

      తొలగించండి
    6. నేనును సమస్యమార్చినట్లగునేమో ! పరిష్కరింపుమని యడిగితిని! సమాధానము కొరకు వేచియున్నాను!

      తొలగించండి
    7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    8. ఓర్పు గోల్పోక నెంతయు నేర్పుతోను
      ధర్మమార్గంబు వీడరు ధరణి పైన
      నీచదశనంది సజ్జనుల్; నీల్గుచుంద్రు
      నీచులధికార ధనముల నెల్లనెడల!

      అందరికీ ధన్యవాదములు!

      తొలగించండి
    9. డా. సీత గారు బాగుందండి సవరణ. “ ..నెల్లయెడల” అనండి. ఎల్లయెడల సమాసము.
      బా. వ్యా. సంధి. 24. సమాసంబునందు ద్రుతంబునకు లోపంబగు.
      ఎల్లయర్థములు, ఎల్లకలుషములు. సర్వపర్యాయంబయిన యెల్ల శబ్దంబు ద్రుతాంతంబయిన యవ్యయంబు. దీని కసమాసంబున విశేష్యంబునకు ముందు ప్రయోగంబు లేదు.

      తొలగించండి
    10. పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు! వ్రాశేశానుగాని నాకే సందేహం వచ్చింది ! ఎల్లయెడల యని తెలుసు! మా పినతండ్రిగారిని అడిగితే స్పందించలేదు!
      మీ రింత శ్రద్ధ తీసుకుని సవరించినందుకు
      బహుదా కృతజ్ఞతలు! ధన్యురాలను!!

      తొలగించండి
  20. వక్రమార్గము బట్టరు వసుధలోన
    నీచదశనందిసజ్జనుల్,నీల్గుచుంద్రు
    అక్రమార్జన చేయుచు అధికముగను
    కూడబెట్టుచు సంపదల్ కూళులంత!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ శైలజ గారు మీ పద్యము బాగున్నది.
      కూడబెట్టుచు సంపదల్ కూళులంత ను
      కూడబెట్టుచు సంపదల్ గోడలందు !!
      అని మార్చిన పద్యపు సొగసు పెరుగునని నా మనవి.

      తొలగించండి
    2. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కూళ..కూళడు... కూళలంత' అనవలసి ఉంది.

      తొలగించండి
  21. దైత్య వంశపు రాజుగ ధరణి నేలి
    విష్ణు హస్తము క్రిందవ విర్ర వీగి
    వామనుని కొసగిన చక్ర వర్తి వోలె
    నీచదశ నంది సజ్జనుల్ నీల్గుచుంద్రు

    రిప్లయితొలగించండి
  22. మందమతి యెట్టి దశ నంది మసక బాఱె
    కోరి విదులను సేవించు వారలెవరు?
    సిరులు గూడ నెల్లిదు లేమి సేయు చుంద్రు?
    నీచ దశ నంది! సజ్జనుల్! నీల్గుచుంద్రు!
    చిన్న మార్పుతో మరలా వ్రాశాను, తప్పొప్పుల సూచింప ప్రార్థన.
    మందమతి యెత్తెఱంగున మసక బాఱె
    కోరి విదులను సేవించు వారలెవరు?
    సిరులు గూడ నెల్లిదు లేమి సేయు చుంద్రు?
    నీచ దశ నంది! సజ్జనుల్! నీల్గుచుంద్రు!

    గురువు గారికి వందనములు. నిన్నటి, మొన్నటి నా పూరణలు పరిశీలించ గోరుతాను. ధన్యవాదములు.
    అని వలదని గీత నందింప గోరగ
    పార్థు డర్జునునకు బావ మఱది
    సారధిగనె బ్రతుకు సారము నంతయు
    బోధ పఱచి నరుని బాధ దీర్చె!

    శివ ధనుర్భంగ మొనరించి సిరులు గొలుప
    చైత్ర శుద్ధ నవమి నాడు చారు శీల,
    జగతి మెచ్చిన ధరణిజ, జానకమ్మ
    తల్లి బెండ్లాడి రాము డుదాత్తు డయ్యె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మా బావమరది అకస్మాత్తుగా మరణించడంతో రోజంతా ఎక్కువగా అక్కడే గడపవలసి వస్తున్నది. అందువల్ల అందరి పూరణలను సమీక్షించలేక పోతున్నాను. దాదాపు 12వ తేదీ వరకు ఇదే పరిస్థితి.

      తొలగించండి
    2. గురువు గారికి వందనములు. విషయం తెలిసి చాలా బాధ పడ్డాము. మీ పరిస్థితిని గ్రహించాము.మిమ్ముల నిబ్బంది పెట్టినందుకు మన్నించండి. మరోలా అనుకోకండి. ధన్యవాదములు.

      తొలగించండి
  23. యాచకులట్లు సంతతము నర్థనచేయుచు నోట్లకోసమై
    చాచి కరమ్ములన్ పిదపఁ జక్కగ పొంది యధిక్రియల్,వెసన్
    దోచి ప్రజాధనమ్ము నిజ దొంగలవోలె. చెలంగ నాయకుల్
    నీచ దశస్థులై సతము నీల్గుచు నుందురు సజ్జనుల్ భువిన్
    అధిక్రియః అధికారము

    రిప్లయితొలగించండి
  24. పాండవులు మంచివారని ప్రస్తుతించి
    మమ్ము పాలీయ మననేల మాధవ!సరి
    మేము దుష్టులమే రాజ్యమీముసుమ్ము
    నీచదశనంది సజ్జను ల్నీల్గుచుంద్రు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈమధ్య మీ పూరణల క్రమం తప్పినట్టుంది. మీ పూరణ చూడడం సంతోషదాయకం.
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. నిజం గురువుగారూ. ఏమిటో ఖాళీ లేదు, పని లేదు. ధన్యవాదాలు.

      తొలగించండి
  25. ఆశలాంతర్యభావంబు లవదిదాట?
    నీతి,నిర్మల చిత్తంబునెగడనీక
    నీచ దశనంది సజ్జనుల్ నీల్గుచుంద్రు
    యనుట పొరపాటు యనుభవాల్ యడ్డుబడును|
    2.నీచమ? యాశ దోషములె నేర్పుగ బంచగ గుర్తెరుంగకన్
    నీచ దశస్థులై సతము నీల్గుచునుందురు “సజ్జనుల్ భువిన్
    దాచిన ధర్మమార్గమును దక్షత చేతను సాకనెంచియే
    పూచిన పువ్వులైహృదయ పూజకునర్హత లందురందుకే|”

    రిప్లయితొలగించండి
  26. తాత ముత్తాత యశములు తనవె యనుచు
    తల్లి చాటున పెరిగిన తాపసుండు
    వోటరులు మూర్ఖులని యెంచి లోటు లేక
    నీచదశ నంది సజ్జనుల్ నీల్గుచుంద్రు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారూ,
      మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.
      'తాపసుండు'... అది 'తామసుండు' అనుకుంటాను.

      తొలగించండి
    2. తాపసుడే సార్...45 ఏళ్ళు దాటినా ఇంకా బ్రహ్మచారే!

      తొలగించండి
  27. పాచిక లాడ నేల సతి బందెము నొడ్డ నదేల భ్రష్టులై
    యాచన జేయ నేల వని యాతన లొందగ నేల మాధవా
    నీచుల మైన మమ్ము గని నేలను బా లడుగంగ నేలనో
    నీచ దశస్థులై సతము నీల్గుచునుందురు సజ్జనుల్ భువిన్.

    రిప్లయితొలగించండి
  28. పుట్టి నట్టి రోజు భూరిశుభములొంది
    వెలగ వలయు నీవు విశ్వమందు
    అష్ట సిరుల తోడ ఆయురా రోగ్యముల్
    సిద్ధి గలిగి జెందు వృద్ధి నీవు


    యోచన లేక జాగృతపు యుక్తిని వీడిచరించు మూఢచిత్తులౌ
    నీచులు పొంగిపోవుటయె నిక్కము సంపదలున్నవేళలో
    నీచదశస్తులై సతము నీల్గుచునుందురు, సజ్జనుల్
    కాచిన పొంగుపొంగులవె గా సుఖదుఃఖములంచు నెంచరే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      పుట్టిన రోజు శుభాకాంక్ష లెవరికి?
      మీ ఉత్పలమాల పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  29. రేపటి సమస్య:

    జనకుండని పెండ్లియాడె జానకి రామున్
    (లేదా)
    జనకుడటంచు మోదమున జానకి పెండిలి యాడెరామువిన్

    పంపిన వారు :వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. వనితా రమణీ! పితరుడు
      జనకుండని, పెండ్లియాడె జానకి రాము
      న్ననితెలు సుకొనగ సుమతీ,
      ఘనమై పూరణ కుదిరెను గదవె జిలేబీ !



      జిలేబి

      తొలగించండి
    2. భాస్కరమ్మ గారూ,
      మంచి సమస్యను పంపారు. ధన్యవాదాలు.
      కాని నేను అప్పటికే ఈనాటి సమస్యను షెడ్యూల్ చేసి పడుకున్నాను. ఇప్పుడు లేచి చూస్తే మీ సమస్య కనిపించింది. దీనిని త్వరలోనే ప్రకటిస్తాను.

      తొలగించండి


    3. ఘనమగు విల్లు నాతడటు కంకవలెన్గని కైగొనంగనౌ
      క్షణమున కూలగన్, రమణి కన్నులనవ్వుల గాన నయ్యరో,
      యినకుల తేజుడా విభుని యీగడ లారగ జూచి నౌర! స
      జ్జనకుడటంచు మోదమున జానకి పెండిలి యాడె రామునిన్

      జిలేబి

      తొలగించండి
  30. కాచుచు నున్నవారలకు కమ్మని బీరును వ్హిస్కి పోయుచున్
    వేచుచునున్నవారలకు వేగమె చేర్చు విమాన మిచ్చుచున్
    దోచుచు బ్యాంకులన్నిటిని దూరపు దేశములుద్ధరించుచున్
    నీచదశస్థులై సతము నీల్గుచునుందురు సజ్జనుల్ భువిన్

    రిప్లయితొలగించండి