భారతమాత ముద్దుబిడ్డ సచిన్ టెండూల్కర్‍కు
భారతరత్న బిరుదు లభించిన సందర్భంలో
అక్షరాక్షతలు.
బ్యాటు ఝళిపింప నరులకు భయము గల్గు
పరుగు దీసిన శతకము బాది వదలు
బంతి విసరిన నావలి యంతు జూచు
సచిను భారత మాతకు సత్సుతుండు.
విరులు మెల్లగా చల్లగా విరిసినట్లు
వెండి వెన్నెల హాయిగా పండినట్లు
సచిను నవ్విన మనసుకు సంతసమగు
నతడు భారతరత్నమే యది నిజమ్ము.
వీరుడవై క్రికెట్టునకు విస్తృత భాష్యము జెప్పి, బ్యాట్టుతో
పోరుచు, వాడి బంతులను పూనిక వేయుచు, వైరి సోదరుల్
'లే రితనిన్ జయింప నొరు లీభువి' నంచు వచించి మెచ్చుచున్
పారగ భీరులై, భరత పావన ధాత్రికి వన్నె తెచ్చుచో
లేరిక సాటి నీ కెవరు! లీలగ నైనను కాన రారులే!
చేరియు నాటలో నెవరు చేరగ రాని మహోజ్జ్వల స్థితిన్
నేరవు సుంత లౌక్యమును! నిర్మల మైన మనస్సు నెన్నడున్
జారగ నీవు కీర్తి బల సంజనితంబగు పొంగు లోయలో!
మీరిన బ్యాటు ఘంటమున మేలుగ దేశ క్రికెట్టు గాధ నిం
పారగ నొంటిగా తిరగ వ్రాసిన లేఖకు డంచు మెచ్చెదన్!
చోరుడ వంచు పల్కెదను సోదర మానసముల్ హరించుచో!
భారత రత్నమా! సచిను! భారత కీర్తి మహత్పతాకమా!
రచన :
దువ్వూరి సుబ్బారావు (మిస్సన్న)
అభినందన
గౌరవనీయమౌ బిరుదు గాంచితి భారత రత్న భూషవై
వీరుల కెల్ల వీరునిగ వెల్గి క్రికెట్టను క్రీడలోన నా
పోరున బేటు పట్టునెడ భూరి పరాక్రమశాలి వౌచు నె
వ్వారును బంతి వేయునెడ బాగుగ బాదుచు పంపుచుండగా
నారులు నాల్గులౌ పరుగులై హడలందుచు నుండ బౌలరుల్
చేరితి వెన్నొ లక్ష్యముల ఛేదన చేయుచు క్రొత్త సీమలన్
లేరట నీకు సాటి యిల క్రీడకు ప్రాణము పోసితీవు నీ
తీరును గాంచి స్ఫూర్తి గొని తేజముతో వెలుగొందుచుండిరీ
ధారుణి నీ సమాశ్రితులు దైవముగా నిను గొల్చుచుండి నీ
పేరిదె మారుమ్రోగునట విశ్వమునందు క్రికెట్టు సీమలో
ధీరవరా! యశోధన నిధీ! చిరజీవితమందు గాంచుమా
భూరి జయోన్నతుల్ సచిను పుణ్యగుణాకర! విశ్వవందితా!
రచన :
పండిత నేమాని సన్యాసి రావు