18, ఫిబ్రవరి 2014, మంగళవారం

సమస్యాపూరణం - 1327 (చంద్రబింబమ్ములోన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
చంద్రబింబమ్ములోన భాస్కరుఁడు వెలిగె.

25 కామెంట్‌లు:

  1. అఖిల జగదంబ! నీదు రమ్యానన మను
    చంద్ర బింబమ్ములోన భాస్కరుడు వెలిగె
    దక్షి ణేక్షణమై జగత్సాక్షి యగుచు
    నతడు చైతన్య మొసగు జీవాళి కెల్ల

    రిప్లయితొలగించండి
  2. శాంతమూర్తియౌ శ్రీరామచంద్ర విభుడు
    భార్గవుం డెదురుగ నిల్చి పరుష వాక్య
    ములను బల్కగ భయదుడై చెలగుట గన
    చంద్ర బింబమ్మునందు భాస్కరుడు వెలిగె

    రిప్లయితొలగించండి
  3. వెలుగు వెన్నెల విరజిమ్మి యలసి పోతి
    మగత నిద్రను మునిగిన మత్తు వీడి
    వేగ రమ్మనె తూరుపు వేట గాని
    చంద్ర బింబమ్ము లోన భాస్కరుడు వెలిగె

    రిప్లయితొలగించండి
  4. కాంచుఁ డదిగొ మోముఁ గడిగి యెఱ్ఱని కుంకు
    మను ధరించినటుల మానినీ ము
    ఖం బనియెడు చంద్రబింబమ్ములోన భా
    స్కరుఁడు వెలిగె బొట్టుగా ముదమున.

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని వారూ,
    మీ రెండు పూరణలూ మనోహరంగా ఉన్నాయి. అభినందనలు. ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. ఒక్కబడిలోన విద్యార్థు లుంచినట్టి
    సౌరపరివార చిత్రాల శాలయందు
    దీపములమధ్య నెంతేని దీప్తి బయట
    చంద్రబింబమ్ము, లోన భాస్కరుడు వెలిగె.

    రిప్లయితొలగించండి
  7. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    ప్లానిటోరియం విషయంగా మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ కంది శంకరయ్య గారు: శుభాశీస్సులు.
    మీరు సమస్యను ఆటవెలదిలో మలచి ఉపమాలంకారమును తొడిగి చంద్రముఖి మోములో సూర్యునిగా కుంకుమ బొట్టును తీర్చి దిద్దుట ప్రశంసనీయము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారి పూరణ....

    మున్ను మిత్రుండు ముంచె రామన్న నటులె
    యల్లుడైనను మామనే యదను జూచి
    పదవి నందుండి కూల్చిన పగిది జూడ
    చంద్ర బింబమ్ము లోన భాస్కరుడు వెలిగె!

    రిప్లయితొలగించండి

  10. అదిగో రామజోగీ వారు అమెరికా నందున
    భారత ప్రచండం రేతిరి అమెరికా అంబుజుడు !
    తెలుగు తేజం నవ్య 'జెర్రసేపు',మా చెంత చంద్రబింబమ్ములోన భాస్కరుఁడు వెలిగె.!!


    రామజోగి వారికి
    శుభాకాంక్షల తో
    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. సహదేవుడు గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. కుంతికెంతయు ననుమానమింత గలుగ
    మహిమజూడగ మంత్రమ్ము మదిని దలచె
    గదికి బయటను వెలసెను గగనమందు
    చంద్ర బింబమ్ము, లోన భాస్కరుడు వెలిగె

    రిప్లయితొలగించండి
  13. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    అద్భుతమైన విరుపుతో మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
    ‘ఎంతయు - ఇంత’ ఈ రెండింట ఏదో ఒకటి ఉండడమే సబబు అనిపిస్తున్నైది.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. గురువుగారూ, చంద్రునికాంతి సూర్యునిదే అని కదా ఆర్యోక్తి.

    అరయఁ జూడంగ సూర్యుండునఖిలతేజ
    యుతుఁడు నఖిలాండలోక సన్నుతుఁడు తనదు
    కిరణ సంపత్తి నొసఁగె చందురిని కపుడు
    చంద్రబింబములోన భాస్కరుఁడు వెలిగె.

    రిప్లయితొలగించండి
  15. కానబడుచుండు జిరు మచ్చ కంటి కెపుడు
    చంద్ర బింబమ్ము లోన, భాస్కరుడు వెలిగె
    చంద్ర కిరణాలు సోకగ సాగరమును
    దినకరుండును జంద్రుండు దిరుగు చుండి
    యొకరి తదుపరి మఱి యొక రుందు రిలను

    రిప్లయితొలగించండి
  16. శ్రీ శంకరయ్యగారికి నమస్సులు

    లేత చిరునవ్వులే పంచు లేమ తోడ
    నాట లాడుచు శృతి మించి పాట పాడ
    చంద్రబింబమ్ములోన భాస్కరుఁడు వెలిగె
    బ్రతిమ లాడంగ కౌముది పంచె రవియె

    రిప్లయితొలగించండి
  17. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు


    చిలిపి జాబిలి వలె పతి నలర జేసి
    రూక్ష వీక్షణ బరపుచు శిక్ష జేయ
    ప్రణయ కోపమీ రీతిని వరలు ననగ
    చంద్ర బింబము లోన భాస్కరుడు వెలిగె

    రిప్లయితొలగించండి
  18. అందరి పూరణలూ బాగున్నవి.

    పిట్టలొక రెండు కలహము పెంచుకొనగ
    పిల్లి దాని లాభముకయి వృద్ధి చేసె;
    కరుణ కరిగెడు మనములు కఠినమవగ
    చంద్రబింబమ్ములోన భాస్కరుఁడు వెలిగె.

    రిప్లయితొలగించండి
  19. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    శాస్త్రీయకారణంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘చందురునకు’ అనండి.
    *
    సుబ్బారావు గారూ,
    విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    ‘పగలే వెన్నెల’ పాట గుర్తుకొచ్చిందా? మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘లాభముకయి’ అన్నదానిని ‘లాభమునకు’ అనండి.

    రిప్లయితొలగించండి
  20. శుభాకాంక్షలను తెలియజేసిన
    శ్రీమతి జిలేబి గారికి
    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి
    శ్రీ అన్నపురెడ్డి సత్యనారయాణ రెడ్డి గారికి, మరియు
    శ్రీ సుబ్బా రావు గారికి
    మా కృతజ్ఞతాపూర్వక అభినందనలు - సంతోషము.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. కలువ ఱేనికి ప్రతిరోజు కాంతి నొసగి
    వేయి కిరణాల భానుండు వెలుగు చుండు
    తమ్మి దొరతోడ శోభిల్లు ధాత్రి గాదె
    చంద్ర బింబమ్మునందు భాస్కరుడు వెలిగె

    రిప్లయితొలగించండి
  22. వజ్రహారమ్ము దెచ్చిన పతిని జూచి
    ఆలి వదనమ్ము కాంతితో వెలిగిపోగ
    అనియె పెనిమిటి సతితోడ, నలరుబోడి!
    చంద్ర బింబమ్ము లోన భాస్కరుడు వెలిగె


    రిప్లయితొలగించండి
  23. మాస్టరుగారూ ! ధన్యవాదములు.
    సవరణతో నా పూరణ ...

    కుంతి కన్నియ కనుమానమింత గలుగ
    మహిమజూడగ మంత్రమ్ము మదిని దలచె
    గదికి బయటను వెలసెను గగనమందు
    చంద్ర బింబమ్ము, లోన భాస్కరుడు వెలిగె

    రిప్లయితొలగించండి
  24. ఎల్ల లోకుల నేలుచు నుల్ల మలర
    కరుణ కిరణాల చల్లగా నరయు తల్లి
    మహిషు గనినంత భగ్గున మండి పడెను చంద్రబింబమ్ములోన భాస్కరుఁడు వెలిగె

    రిప్లయితొలగించండి
  25. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నవరపు సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి