5, అక్టోబర్ 2014, ఆదివారం

సమస్యా పూరణం – 1528 (తామరతూడు దారమున)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తామరతూడు దారమున దంతిని కట్టఁగవచ్చు సత్కవీ!
(ఆకాశవాణి వారి సౌజన్యంతో)

29 కామెంట్‌లు:

  1. ఏమనిచెప్పనేర్తును బుధేంద్ర! వధానమునందు పృచ్చకో
    ద్ధాములు కష్టసాధ్యవిషదగ్ధసమస్యలనివ్వజూప వి
    ద్యామహిమాన్వితంబున మహాద్భుతరీతి పరిష్కరింతురే
    తామరతూడుదారమున దంతిని కట్టగవచ్చు సత్కవీ.

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    ఆరాధన సినిమాలో చెప్పినట్టు
    ఆడదాని ఓరచూపుతో - జగాన ఓడిపోని ధీరు డెవ్వడూ ???
    అద్భుతమైన పాట - అందరూ వినండి !
    https://www.youtube.com/watch?v=AOB42ip2Ay0

    భట్టివిక్రమార్కలో చెప్పినట్టు
    కొమ్ములు తిరిగిన మగవారూ - కొంగు తగిలితే పోలేరు
    అద్భుతమైన పాట - అందరూ వినండి !
    https://www.youtube.com/watch?v=EMFR4R3Kyjw

    పెద్దనగారు వరూధిని ద్వారా వాక్రుచ్చినట్టు

    వారికంటెను నీ మహత్త్వంబు ఘనమె?
    పవన పర్ణాంబు భక్షులై నవసి, యినుప
    కచ్చడాల్‌ గట్టుకొను ముని మ్రుచ్చు లెల్లఁ
    దామరసనేత్ర లిండ్ల బందాలు గారె?

    చివరికి బెమ్మకైన పుట్టు - రిమ్మ తెగులు అన్నారు గదా
    స్ర్తీల కసాధ్యంబు గలదె - వాళ్ళు దేంతో అయినా దేన్నైనా కట్టేస్తారుగా :

    01)
    _____________________________________

    తామస పూర్ణుడైన ముని - దారిని మార్చెను నోరచూపుతో
    దామరనేత్రి, మేనకయె - ధాత్రిని బూర్వము దల్మి యాఙ్ఞతో !
    దామరచూలి యైన తన - ధర్మము తక్కును, స్త్రీలు దల్చినన్
    తామరతూడు దారమున - దంతిని కట్టఁగవచ్చు సత్కవీ !
    _____________________________________
    తామసము = కోపము
    వాలుచూపు = ఓరచూపు
    తామరనేత్రి = స్త్రీ
    తామరచూలి = బ్రహ్మ
    తామరచెలి = సూర్యుడు
    ఇంద్రుఁడు = దల్మి
    తక్కు = త్యజించు

    రిప్లయితొలగించండి
  3. దారాలు కూడా యెందుకు - చూపులే చాలు గదా :

    02)
    _____________________________________

    భామిను లోరచూపులను - వాల్జడ యొంపుల, మంజు హాసమున్
    సామజ యానమున్, మిగుల - చంచలమౌ తమ మేని చిన్నెలన్
    ధీమతు లైన, భీములను, - ధీరుల నైనను బంధి సేయరే !
    తామరతూడు దారమున - దంతిని కట్టఁగవచ్చు సత్కవీ !
    _____________________________________
    చంచల = మెఱపు
    ధీమతి = బుద్ధిమంతుడు
    భీముడు = భయంకరుఁడు
    ధీరుడు = శూరుడు

    రిప్లయితొలగించండి
  4. తెలివి గలిగితే దంతి నే గాదు దీప్తము నయినా :

    03)
    _____________________________________

    కోమలమౌ శశం బొక య - గోసకము న్నెదిరించి నేర్పుతో
    ధీమతి యౌట చేత నొక - దీర్ఘిక ముంచెను విస్మయంబుగా !
    కోమలమైన జంతువొక - క్రూరమృగంబును సంహరింపగా
    తామరతూడు దారమున - దంతిని కట్టఁగవచ్చు సత్కవీ !
    _____________________________________
    దీప్తము = సింహము
    అగోకసము = సింహము
    దీర్ఘిక = బావి

    రిప్లయితొలగించండి
  5. తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు- పట్టుదలతో :

    04)
    _____________________________________

    ధీమక మైన, దీప్తమును, - దీప్రపు శక్తి ద్రవించు రీతిగా
    సోమరి యౌట మాని, తమ - చూపులు చేతల నిల్పి; తీరుగా
    దామము గట్టు దాఖ్యమున - తద్దయు దీక్షను బూని నిల్చుచో
    తామరతూడు దారమున - దంతిని కట్టఁగవచ్చు సత్కవీ !
    _____________________________________
    ధీమకము = ఇనుము
    దీప్తము = బంగారము
    దీప్రము = అగ్ని
    తద్దయు = మిక్కిలి, విస్తారము, అత్యంతము
    దామము = హారము
    దాఖ్యము = నేర్పు
    దీక్ష = పట్టుదల

    రిప్లయితొలగించండి
  6. ఔనంటే-ఉత్తరకుమార ప్రగల్భములే :

    05)
    _____________________________________

    సీమల నెంచకుండ, కురు - సేనల మార్కొను నుత్తరు న్వలెన్
    కోమలమైన దారముల - క్రూరమృగంబుల గట్టు రీతిగన్
    ధీమస మింత లేక పలు - ధీరుల డీకొను రీతి; నెవ్విధిన్
    తామరతూడు దారమున - దంతిని కట్టఁగవచ్చు సత్కవీ !

    _____________________________________
    సీమ = ఎల్ల ,హద్దు
    సీమల నెంచకుండ = తన శక్తిని తా నెరుగకుండ
    ధీమసము = నేర్పు

    రిప్లయితొలగించండి
  7. గురువుగారు కందిశంకరయ్య గారు మన ప్రియకవిమిత్రులకు ఇచ్చిన సందేశంగా.....

    ఏమొకొ సందియమ్ములవి? యేనిటనుంటిని తీర్చనైతినే,
    తామసమింక వీడుమని దక్షతతోడుతఁ బల్కుచుంటి, ని
    ష్కామపు కర్మ మియ్యదని గట్టిగ నమ్మితి; యుద్యమించుచో
    తామరతూడు దారమున దంతిని కట్టఁగవచ్చు సత్కవీ!

    రిప్లయితొలగించండి
  8. పై పద్యములో పద్యముల మాట రాలేదని...

    ఏమొకొ సందియమ్ములవి? యేనిటనుంటిని తీర్చనైతినే,
    తామసమేల పద్యముల దక్షత తో పరికింతునంటి, ని
    ష్కామపు కర్మ మియ్యదని గట్టిగ నమ్మితి; యుద్యమించుచో
    తామరతూడు దారమున దంతిని కట్టఁగవచ్చు సత్కవీ!

    రిప్లయితొలగించండి
  9. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. మల్లెల వారి పూరణలు

    భూమిని గెల్వగాను బలమొక్కటె చాలద దెంచి చూడగా
    కోమలవాక్కు చాతురిమ గొప్పగ లొంగగ దీయు నేరినేన్
    ధీమతి యుక్తి తోడుతను తేలిక శత్రువు నొంచగల్గు,నా
    తామరతూడు దారమున దంతిని కట్టగవచ్చు సత్కవీ!

    తామటు లెల్ల వారలును ధారుణి నైక్యత మెల్గువారలై
    భూమిని పొందరే బలము,పోచగనున్నను త్రుంచవచ్చునా
    తామరతూటి దారమును, దానినె మోకుగ పేనినంతనే
    తామరతూడు దారమున దంతిని కట్టగవచ్చు సత్కవీ!

    ధీమతు లెందరో మహిని తేలిరి మంత్రపు శాస్త్రవిద్యలన్
    కోమలమౌ తృణంబదియె గొప్పగు నస్త్రము నౌచు వెల్గదే!
    నేమము తోడమంత్రముల నింపుగ శక్తినిగూర్చు నత్తరిన్
    తామరతూడు దారమున దంతిని గట్టగవచ్చు సత్కవీ!

    భూమిని మాటలందునను పొల్పుగనెన్నియొ చెప్పవచ్చుతా
    నేమియు శక్తియు లేకయిన,నేరిని గెల్వగవచ్చునీతితోన్
    తామటు గెల్వ నైక్యతయె దండిగకావలె నల్ల పగ్గమౌ
    తామరతూడు దారమున దంతిని గట్టగవచ్చు సత్కవీ!

    రిప్లయితొలగించండి
  11. పూజ్య గురుదేవులు శంకరయ్యగారికి వందనములు ఆముగ ద్వంద్వయుద్ధమున యవ్వలి వీరులగెల్వ లేనిచో
    రాముని దండు యేకమయి రక్కసిమూకను చుట్టు రీతిగా గామలు యైకమత్యమున కాళము పట్టెడు రీతి నల్లుచున్
    తామరతూడుదారమున దంతిని కట్టగవచ్చు సత్కవీ.

    రిప్లయితొలగించండి
  12. పూజ్య గురుదేవులు శంకరయ్యగారికివందనములు
    కె.ఈశ్వరప్పగారి పూరణ
    నీమది నేనెరుంగుదును నిత్యముకార్యము నెంచిజూడ కా౦ తా!మరతూడు దారమునదంతిని కట్టగ వచ్చు.సత్కవీ!
    యేమిది?శ్లేషగామలచి నెంచెడి యర్ధమువచ్చు నట్లుగా ప్రేమనుగుర్తెరింగితిని పెద్దగ నీవిక సేయ నెంచగా .

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. కాముడనంగుడై జనుల కంపిల జేయడె పూలకోలలన్
    నీమము తోడ భాస్కరుడు నింగి జరింపడె కుంటి తేరుపై
    రాముడు కోతి సాయమున రావణు జంపడె యుక్తి గల్గుచో
    తామరతూడు దారమున దంతిని కట్టఁగవచ్చు సత్కవీ!

    రిప్లయితొలగించండి
  16. మిత్రులకు నమస్కారములు!

    చీమలు నైక్యయత్నమున జిహ్మగముం దెగటార్చునట్లుగన్
    వేమఱు వర్షముల్ గుఱిసి బిందువు బిందువు సంద్రమైనటుల్
    లేమినిఁ గుందు దీనుఁడు సిరిం శ్రమఁ జేసియుఁ బొందినట్టులన్
    దామరతూఁటి దారమున దంతినిఁ గట్టఁగవచ్చు సత్కవీ!

    రిప్లయితొలగించండి
  17. సోముని దీవెనల్కతన స్రుక్కగఁ జేసెను సైంధవుండు తా
    సోమము గల్గినట్టి కడు శూరులు పాండవ దిగ్గజంబుల
    న్నేమని జెప్పుదున్ హిమగిరీంద్రుని లీలలు, దైవ శక్తితో
    తామరతూడు దారమున దంతిని కట్టఁగ వచ్చు సత్కవీ

    రిప్లయితొలగించండి
  18. తామర నేత్రి యౌసతియె దక్షిణ దిక్పతి దారినడ్డగా
    పామరుడై నవాడె నిల పండితుడవ్వగ కాళిదాసుడే
    తామర కంటి చూపు లకు దాసులు కావగ ధర్మమూర్తులే
    తామరతూడు దారమున దంతిని గట్టగ వచ్చు సత్కవీ!

    రిప్లయితొలగించండి
  19. కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
    కోమలమౌవచస్సున నకు౦ఠమనస్సును మార్చవచ్చు,స
    త్సామరసాంతిక మ్మయిన చక్కనిదౌ దరహాస కాంతిచే
    తామస మార్గమెల్లయును దాటగ వచ్చును గాన లీలగా
    తామరతూడుదారమున దంతిని కట్టగవచ్చు సత్కవీ.

    రిప్లయితొలగించండి
  20. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘యుద్ధమున నవ్వలి...’ అనండి. ‘గామలు + ఐకమత్యమున’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. అక్కడ ‘గామలె యైకమత్యమున...’ అనండి.
    *
    కె. ఈశ్వరప్ప గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.
    ‘మరతూడు’.... అర్థం కాలేదు.
    *
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘రావణుఁ బోల్చెను గడ్డిపోచతో’ అంటే బాగుంటుందేమో? ‘భక్తిమార్గమన్/ దామరతూడు...’ అనండి. ‘మార్గ కెందామర..’ అంటే దుష్టసమాసం అవుతుంది.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పామరుడైనవాడె యిల...’ అనండి.
    *
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. శ్రీగురుభ్యోనమ:

    నీమనసెంత నున్నితము! నిర్మలవాక్కుల సత్కవిత్వది
    వ్యామృత పూర్ణకుంభము, సుభాషిత రత్నము,నీకసాధ్యమే?
    ధీమణి! పూరణల్ సలుప ధీరుడవీవు సమస్య గాంచుమా!
    "తామరతూడుదారమున దంతిని కట్టగవచ్చు సత్కవీ"

    రిప్లయితొలగించండి
  22. శ్రీపతి శాస్త్రి గారూ,
    ఒక అవధానిని సంబోధిస్తూ చెప్పిన పద్యంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. ఏమని యుగ్గడించగల మెన్ని విధంబులఁ జెప్పి చూచినన్
    లేమిని బుద్ధి యోచనలు లేశము మూర్ఖులలోన సుంత రా
    దేమియు మార్పు, మారుటది యే నిజమౌ నెడ సాధ్య మిద్దియున్
    తామరతూడు దారమున దంతిని కట్టఁగవచ్చు సత్కవీ!

    రిప్లయితొలగించండి
  24. రాముని నామ మంత్రమది రాక్షస శక్తిని గట్టి వేయనా
    రాముని యింతి సీత యును రావణు బోల్చెను గడ్డి పోచతో,
    కామము దంతి వంటిదన గట్టగ నెంచుచు భక్తి మార్గ మన్,
    దామర తూడు దారమున దంతిని కట్టగ వచ్చు సత్కవీ
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  25. ఏమి బలంబు యుండు గన?నెంచగ సన్నని పోగువంటి యా
    తామరతూడు దారమున; దంతిని కట్టగవచ్చు సత్కవీ!
    ప్రేమగ మావటీడు కర విస్తృతి సల్పగ పిల్లియౌను, పెన్
    భీమబలంబుతో నిలచి పెద్దగ సేవలు జేయులే జుమీ!

    రిప్లయితొలగించండి
  26. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘బలంబు + ఉండు’ అన్నప్పుడు యడాగమం రాదు, సంధి నిత్యం. ‘బలంబు గల్గు’ అనండి.

    రిప్లయితొలగించండి
  27. దోమల కాట్లు సైచకయె దుంకుచు గేటును జంతుశాలనున్
    నీమము వీడి పర్వులిడి నేరుగ జేరుచు మద్యశాలనున్
    గోముగ బీరు త్రాగుటను గొప్పగ మత్తున సొమ్మసిల్లగా
    తామరతూడు దారమున దంతిని కట్టఁగవచ్చు సత్కవీ!

    రిప్లయితొలగించండి