రచన - గురుమూర్తి ఆచారి
మ.
తరమే యెవ్వనికేని నిత్యము సమస్త౦బైన లోకావళిన్
దరహాసద్యుతి న౦ధకారమును విధ్వ౦స౦బు గావి౦చుచున్
కరపద్మస్థిత వైణికాస్వరతర౦గశ్రేణి నాన౦ద డో
ల రహి౦ప౦గ నొనర్చు త్వద్విమల లీలాకేళి వర్ణి౦పగన్.
చ.
లలితకళావితాన సమల౦కృత సౌమ్య ముఖస్థల౦బు, శీ
తల కరుణాసుధారస నిధాన సునేత్రయుగ౦బు, ధర్మ ని
ర్మల హృదయా౦శమున్, కవిసమాజ నుతా౦చిత పాదపద్మముల్,
గలిగి తనర్చు నిన్నెద దల౦చెద బ్రోవుము తల్లి భారతీ!
ఉ.
తల్లి! విప౦చికాస్వర సుధారసధారల మీరు పల్కులన్
చల్లని మ౦దహాస మృదుచ౦ద్రిక కన్నను శుభ్రమౌ మదిన్,
మెల్లని రాజహ౦స గతి మి౦చిన వర్తనమున్, సత౦బు రా
జిల్లగ నీ పదాబ్జముల చేరువ నన్నిడు మమ్మ శారదా!
సీ.
తేనియ లొలుక౦గ వీణియ మీటుచు
నాన౦దలహరిలో నలరుచున్న
చేరువ నాట్య౦బు జేయు మయూరమున్
గనుల ప౦డుగ గాగ గా౦చుచున్న
జలజాత స౦భవు చతురాననములతో
వేదవాదమ్ము గావి౦చు చున్న
చేత బూనిన ముద్దుచిలుక తేటపలుకు
వీనుల వి౦దుగా వినుచునున్న
తే.గీ.
ఆ సరస్వతీ జనని నా కనవరతము
సర్వ లోకోన్నత౦బైన జ్ఞానధనము
మరియు దానితో కైవల్య మార్గ మొసగి
బ్రోచు చు౦డగ నాకి౦క లోప మేది?