మనస్సు
(మానస సీస నవరత్న మాలిక)
రచన : పొన్నెకంటి సూర్యనారాయణ రావు.
సీ. ఎచ్చోట వెదకిన నేపేరఁ జూచిన
కానరా దేరికి ఖండితముగ
ప్రాణికోటి
సలుపు పాపపుణ్యంబుల
సాక్షిగ నిల్చు నీ సమ్ముఖమున
పూర్వజన్మంపు
టపూర్వ ఫలిత మన
సంచరించును నిస్సందియముగ
కీర్త్యపకీర్తులన్
కేళిగా దెప్పించి
నింగిని నేలపై నిల్పుచుండు
తే. చంచలంబైన చిత్రంపు లంచగొండి
మరులు గొల్పెడు
మధురంపు మాయదారి
దారి తప్పగ
యత్నించు తపన గలది
“మనసు” తప్ప మరేముండు మాన్యులార! 1.
సీ. సన్యాస ముంగొని సర్వంబు త్యజియించి
యదిమిపట్టగలేని యద్భుతంబు
ఘోరతర తపము
తోరపు నిష్టతో
నమలు పరచలేని యద్భుతంబు
చిన్న పెద్దలలోన
చిందులు ద్రొక్కుచు
హనుమ రీతి దిరుగు నద్భుతంబు
పుష్పబాణునిచేతి
పూవింటి పగిదిని
నమరిన యపురూప మద్భుతంబు
తే. ఏది యేదని యేదంచు నిహము పరము
వెదకి జూచిన
దొరకునా వింతయైన
“మనసు” పేరున నొప్పెడు మాన్యమగుచు
బొమ్మకైనను
బుట్టించు రిమ్మ తెగులు. 2.
సీ. రావణబ్రహ్మయే రమణి సీతను బట్ట
దోహదపడినట్టి దుర్మనస్సు
రాజ్యాధికారియౌ
రాజరాజు కపుడు
దోహదపడినట్టి దుర్మనస్సు
భస్మాసురునిచేయి
భర్గుని శిరముంచ
దోహదపడినట్టి దుర్మనస్సు
కంసుని
ప్రేరేచి కన్నయ్య దునుమాడ
దోహదపడినట్టి దుర్మనస్సు
తే. ఇన్ని ఘోరాలు సలుపుచు నేహ్యమైన
పాపములకొడిగట్టె
నీ పాడు "మనసు"
జన్మ జన్మాల
వీడక జగతి దెచ్చి
నీడ వోలెను
చరియించు నివురుగప్పి. 3.
సీ. రాముని సైతము రాజ్యంబు బోనాడి
మాటనిల్పు మనిన మంచిమనసు
శిబిచక్రవర్తినే
చిఱు పావురమునకై
మాంసంబు నిడుమన్న మంచిమనసు
రామనామము
తప్ప రహివేరు లేదని
మార్గమ్ము సూచించు మంచిమనసు
పేద ధనికులన్న
భేదాలు లేవని
మమతను సూచించు మంచిమనసు
తే. జగతి పుణ్యాల నెలవుగా జంతుతతికి
కలుగజేయుచు
వేవేల కాంతులీని
జన్మ ధన్యత
గూర్చంగ చక్కగాను
కారణంబౌను
సన్మతి క్రమముగాను. 4.
సీ. నాప్రభావాన వినాశం బగునుగాదె
వంశవృక్షంబెల్ల వరలకుండ
నాప్రభావాననె
నవ్యంపు రీతి న
వాంకురంబెల్లను నందగించు
నాప్రభావాననె
నవరసా లొలికించు
కావ్యాలు ప్రభవించు ఘనముగాను
నాప్రభావాననె
నాట్యావధానముల్
మైమరచి సభల మరులుగొల్పు
తే. నేనె “మనసును”
మెదడను నింటనుండి
కర్తనై
, కర్మ బంధాలు కదలుచుండ
సర్వమున్నరసి
జగతి సాగరాన
నీదుచుంటిని
జన్మల నింతదనుక. 5.
సీ. అదుపులో బెట్టిన నందలమెక్కించి
రారాజుగాజేయు రాజు నేను
ప్రక్కకు
దిరుగంగ నొక్కటి వ్రేయంగ
చక్కనై వర్తించు సాధు నేను
పగవారి
జంపగ పన్నాగ మదియేల
వారిలో నున్నట్టి పోరు నేను
జగతిని
శాంతిని జరిపింప గోరిన
పూర్ణమౌ స్వచ్ఛ కపోతమేను
తే. నేను నేనన నేనేను నేనునేను
మేన నున్నట్టి
సుకుమార మీను నేనె
యెట్టి
యవతారమైనను మెట్టగలను
“మనసు” పేరిట బరగుచు మాన్యనైతి. 6.
సీ. కానరాకుండుటన్ లేనని యందురా?
విష్ణ్వంశ నాయందు విపులతరము
చలనంబు
లేదని తలఁపు మీ కుండెనా?
వాయువేగముమీరి వాలగలను.
కరుణ లేదని
మీరు కన్నెఱ్ఱ జేతురా?
కష్టజీవుల జూచి కరగిపోదు.
మంచిచెడ్డలు
నాకు మరిలేవనందురా?
మంచికి మంచిగా మసలుకొందు
తే. ఇంత సద్గుణ శోభిత వింతజీవి
“మనసు” నాబడు నేగాక మరొకటున్నె?
సత్య శోధన
జేసిన సర్వమందు
నిదియె
నిక్కంబని పరమేశుడనును. 7.
సీ. శస్త్ర ధారులునను చాకున బాకున
కండలుగాజీల్చ కానరాను.
బహువిధ
మంత్రాలు పఠియించినంగాని
బయటపడగలేను భస్త్రినుండి
భక్తుల
హృదయాన పరమాత్మ రూపాన
దాగియుందును నేను తప్పకుండ
ధ్యాన యోగములందు
ధ్యాసను నిల్పిన
నిశ్చలత్వముగల్గి నిలచియుందు.
తే. “మనసు” నేనేను సతతంబు మారుచున్న
మంచిచెడ్డలు
పరికించి మనిషి కెపుడు
సాయమొనరింతు
సంసారసాగరాన
మన్ననను
నాకొసంగుడు మాన్యులార! 8
సీ. ఖడ్గధారలకు నే గాయపడ నెపుడు
కఠినంపు మాటకే గాయపడుదు
విజ్ఞులు
తిట్టిన విలువజేతునుగాని
యజ్ఞాని నిందింప నహముకలుగు
గురుతుల్యు
నేవేళ కోరిమ్రొక్కెద నేను
శిష్యుల మాటన్న చేరిపిలుతు
ప్రేమతో
లాలింప ప్రియరాగముంజూపి
యక్కున కెప్పుడు హత్తుకొందు
తే. విశ్వమందలి పరమాత్మ విలువదెలిసి
“మనసు” కలిగిన మానవా! మసలుకొనుము
మానవాళికి
శ్రేయంబు మహిత యశము
నన్ను కాపాడుకొన్నను నాకమబ్బు. 9
ఉ. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మనాదు చే
తమ్మున
ప్రేమమై నవసుధారస ధారల గ్రుమ్మరించుచో
కిమ్మనకుండ
వ్రాసితిని కేలును నాపక “మానసంబు”పై
నెమ్మది
వీక్షజేయగను నే మదిగోరుదు పండితాళినిన్. 10