31, మార్చి 2019, ఆదివారం

శ్రీ బండకాడి అంజయ్య గౌడ్ గారి అష్టావధానం

నిన్న 30-3-2019 (శనివారం) 'శంకరాభరణం' సమూహ సభ్యుల ఆత్మీయ సమావేశంలో శ్రీ బండకాడి అంజయ్య గౌడ్ గారి అష్టావధానం జరిగింది.
వేదిక - కవిశ్రీ సత్తిబాబు గారి నివాసం, మియాపూర్, హైదరాబాదు.
సంచాలకులు - కంది శంకరయ్య
ప్రార్థన -
శ్రీగిరిజావరనందన!
భోగీంద్ర విభూష! సకల బుధనుత దేవా!
ఓ గణనాయక! శుభకర!
బాగున నవధానమునకుఁ బల్కుల నిడుమా!

భారతి! దేవి! నిన్ను మదిఁ బ్రస్తుతిఁ జేసెద లోకమాత! యో
వారిజనేత్ర! నీదు పదపద్మములన్ భజియింతు భక్తితోఁ
జేరఁగ రమ్ము తల్లి! సువశీకరవౌచును నాదు జిహ్వపై
వారక నిల్చి మిక్కిలిగ వాక్కు లొసంగుము శారదాంబికా!

శ్రీ శంభో! ఫణిభూషణా! బుధనుతా! శ్రీకంఠ! లోకేశ్వరా!
యీశా! శాంభవి నాథ! భక్తవినుతా! యేణాంకచూడా! ప్రభూ!
కాశీక్షేత్రవిహార! శంకర! శివా! కారుణ్యగంగాధరా!
యాశీర్వాద మొసంగుమా శుభకరా! యానంద సంధాయకా!

శ్రీలక్ష్మీ హృదయాంతరంగ! జయహే శ్రీకంఠ సంసేవితా!
కాలాతీత! ముకుంద! కేశవ! హరీ! కారుణ్య రత్నాకరా!
లీలామానుష వేషధారి! వనమాలీ! లోక సంరక్షకా!
ధీలోలా! యవధానమున్ విజయమై దీపింప దీవింపుమా.

నను గన్న తల్లిదండ్రుల
మనమున స్మరియింతు నెపుడు మరువని భక్తిన్
ఘనముగ నవధానములో
నను విజయునిగా నొనర్చి నాణ్యత నొసఁగన్.

మాధవానంద యతివరున్ మదినిఁ దలఁచి
కంది శంకరార్యునకును వందన మిడి
యరయ సీవీ కుమారున కంజలించి
తక్కిన కవివరుల కెల్ల మ్రొక్కి యిచటఁ
జేసెద నవధానము నిదె వాసికెక్క.

1. నిషిద్ధాక్షరి - శ్రీ చిటితోటి విజయకుమార్ గారు
(శంకరస్తుతి)
[మొదటి రెండు పాదాలకే నిషేధం విధింపబడింది. కుండలీకరణంలో ఉన్నవి నిషిద్ధాక్షరాలు]
శ్రీ(గ)శ(మ)ంభో(హ)రా(ద)వే(హ)రా
ఈశా(భ)కా(ర)మా(న)క్షి(న)వ(ర)ంద్య హే(-)ర(క)మ్యా(-)ంగా.....

శ్రీ శంభో! రావే రా
ఈశా! కామాక్షివంద్య! హే రమ్యాంగా!
కాశీవిశ్వేశా! హర!
ఓ శంకర! వందన మిదె యోంకారేశా!

2. సమస్య - శ్రీ ధనికొండ రవిప్రసాద్ గారు
(వీడు వీడు వీడ వాడు వీడ)
లేడు లేడటంచు లేశమాత్రంబైనఁ
దలంపవలదు కలఁడు దైవ మిలను
హరిహరాదు లొకటె యంతట వారె పో
వీడు వీడు వీడ వాడు వీడ.

3. దత్తపది - శ్రీ తాతా ఫణికుమార్ శర్మ
(నీతి, జాతి, భాతి, రీతి పదాలతో ఎన్నికల ప్రచారంపై స్వేచ్ఛాచ్ఛందంలో పద్యం)
'నీతి' విడనాడి తిరుగుచు నేతలెల్ల
'జాతి' వైరమున్ గలిగించి భీతిలేక
'భాతి' కోసమై ప్రజలను బలి యొనర్చి
తిరుగుచున్నార లీ'రీతి' తెగువతోడ.

4. న్యస్తాక్షరి - శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు
(స,త్తి,బా,బు అన్నవి ప్రథమాక్షరాలుగా కవిత్వంపై ఆటవెలదిలో పద్యం)
'స'రసమైన కవిత సభలందు నిలిచి వ
'త్తి' పలుకవలెను గద దివ్యముగను
'బా'గు బాగనంగ భావికవుల నెల్లఁ
'బు'ట్టఁజేయు కవన పుణ్య మిలను.

5. వర్ణన - శ్రీ క్రొవ్విడి వేంకట రాజారావు గారు
(శిశిర ఋతువును వర్ణిస్తూ ఉత్పలమాల)
వ్రాలవె యాకులెల్లఁ జిగురాకులు వచ్చుటకోసమై ధరన్
కాలము మారు సూచనగ గాలులు వేడిమి హెచ్చి వీచఁగన్
ధూళియె లేచి యాకసము దూరిన యట్టుల తోఁచుచుండఁగన్
బాల వసంతమాస మిఁక వచ్చెడి చిహ్నము లెల్లఁ దోఁచెడిన్.

6. ఆశువు - శ్రీ కటకం వేంకటరామ శర్మ గారు
i) (అఖండయతిని గురించి పద్యం)
దండిగాను నే నఖండయతిని వేసి
చెప్పువాఁడ కవిత మెప్పుగాను
శంకరయ్య వంటి సత్కవీశులు కొంత
వలసు వలదు వలదనిను వదలఁబోను.

ii) (శ్రీ సత్యనారాయణ స్వామిని ప్రస్తుతిస్తూ పద్యం)
అవరోధము కావలదని
భువియందలి మానవాళి పూజింతురుగా
భవబంధములను బాపుచు
నవనీతముఁ గొన్న సత్యనారాయణుఁడున్.

iii) (సీతను చూచిన హనుమంతుని ఆనందాన్ని తెలుపుతూ పద్యం)
సీతమ్మను గనినంతనె
వాతాత్మజుఁ డందినట్టి బ్రహ్మానందం
బే తీరుగ వర్ణింతును?
నా తరమా? కాదు కాదు నమ్ముడి మీరల్.

7. వారగణనం - శ్రీ కవిశ్రీ సత్తిబాబు గారు
(పృచ్ఛకులు అడిగిన తేదీలు ఏ వారమో తెలిపారు)

8. అప్రస్తుత ప్రసంగం - శ్రీ భమిడిపాటి వేంకటేశ్వర రావు గారు.

సమాపన పద్యాలు, ఆతిథ్య మిచ్చిన కవిశ్రీ దంపతులపై చెప్పిన పద్యాలు నావద్ద లేవు.
అవధానానంతరం కవిశ్రీ సత్తిబాబు గారు అవధానిని, పృచ్ఛకులను దుశ్శాలువలతో సత్కరించారు. 

సమస్య - 2973 (రాముని రాజ్యమందు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రామరాజ్యాన ధర్మము రాక్షసమ్మె"
(లేదా...)
"రాముని రాజ్యమం దెపుడు రాక్షస ధర్మమె చెల్లుబాటగున్"

30, మార్చి 2019, శనివారం

సమస్య - 2972 (చీకటిని మించు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చీకటిని మించు వెలుఁగున్నదా కనులకు"
(లేదా...)
"చీకటి కంటె మేలయిన చెన్నలరారెడు కాంతి యున్నదే"

29, మార్చి 2019, శుక్రవారం

సమస్య - 2971 (రణము సెలరేఁగె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రములలోన"
(లేదా...)
"రణము సెలంగెరా తెలుఁగు రాష్టములందున నేమి చెప్పుదున్"

28, మార్చి 2019, గురువారం

సమస్య - 2970 (గౌతమీ స్నానము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గౌతమీ స్నాన మొనరించెఁ గాశి కేఁగి"
(లేదా...)
"కుతుకం బొప్పఁగఁ గాశి కేఁగి జరిపెన్ గోదావరీ స్నానమున్"

27, మార్చి 2019, బుధవారం

సమస్య - 2969 (సతియే కద...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సతియే కద పూరుషునకు సద్గురువు గనన్"
(లేదా...)
"సతియే భర్తకు నొజ్జయౌఁ బరమ సంస్కారమ్ము నేర్పింపఁగన్"

26, మార్చి 2019, మంగళవారం

సమస్య - 2968 (కమలాప్తుఁడు....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కమలాప్తుఁడు చంద్రుఁ డనుట కల్ల యెటులగున్"
(లేదా...)
"కమలాప్తుండు శశాంకుఁ డౌననుట నిక్కంబే కదా మిత్రమా"

25, మార్చి 2019, సోమవారం

సమస్య - 2967 (విఘ్నం బగునని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"విఘ్నం బగునని గణపతి భీతిం జెందెన్"
(లేదా...)
"విఘ్నము సంభవించునని భీతినిఁ జెందె గణేశుఁ డత్తఱిన్"

24, మార్చి 2019, ఆదివారం

సమస్య - 2966 (పుస్తకావిష్కరణ....)

కవిమిత్రులారా,
నేడు విశాఖపట్టణంలో 
నా 'శంకర శతకము' ఆవిష్కరణోత్సవానికి 
అవకాశ మున్నవారు తప్పక రావలసిందిగా ఆహ్వానిస్తూ...
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పుస్తకావిష్కరణ సభఁ బోఁ దగ దఁట"
(లేదా...)
"గ్రంథావిష్కరణోత్సవమ్మునకు నేగన్ రాదు ముమ్మాటికిన్"

23, మార్చి 2019, శనివారం

సమస్య - 2965 (హరుఁడు గౌరితో...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హరుఁడు గౌరితో వెలసె సింహాచలమున"
(లేదా...)
"శివుఁ డంబాసహితుండు కోరి వెలసెన్ సింహాచలస్వామిగన్"

22, మార్చి 2019, శుక్రవారం

సమస్య - 2964 (మధుపానాసక్తులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"మధు పానాసక్తులు గద మౌని వరేణ్యుల్"
(లేదా...)
"మధుపానాంకిత మత్త చిత్తులు గదా మౌనుల్ సదాచారులున్"

21, మార్చి 2019, గురువారం

సమస్య - 2963 (సంసారుల కెందులకొ...)

కవిమిత్రులారా, 

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది....
"సంసారుల కెందులకొ యీ వసంతోత్సవముల్"
(లేదా...)
"వసంతోత్సవముల్ ముదంబు నిడునొక్కొ గృహస్థునకున్ దలంపఁగన్"
(ఛందోగోపనము)

20, మార్చి 2019, బుధవారం

దత్తపది - 155

హాయ్ - హలో - గుడ్ - బై 
పై పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో
నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి. 

19, మార్చి 2019, మంగళవారం

సమస్య - 2962 (కాకులు మానవులకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్"
(లేదా...)
"కాకులు మానవాళి కతి కష్టములన్ గలిగించు నెప్పుడున్"

సమస్య - 2961 (సరి రాఁ డెవ్వఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"బొంకఁగా హరిశ్చంద్రునిఁ బోలు నెవఁడు"
(లేదా...)
"సరి రాఁ డెవ్వఁ డసత్యమాడఁగ హరిశ్చంద్రాఖ్య భూజానికిన్"

17, మార్చి 2019, ఆదివారం

సమస్య - 2960 (సుజన పరాభవంబున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"సుజన పరాభవ మొసంగు సుఖ సంపత్తుల్"
(లేదా...)
"సుజన పరాభవంబున యశోవిభవంబులు దక్కు నెప్పుడున్"

16, మార్చి 2019, శనివారం

సమస్య - 2959 (ధనముం గోరి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"ధనముఁ గోరువాఁడె ధన్యజీవి"
(లేదా...)
"ధనముం గోరి పరిశ్రమించు నరుఁడే ధన్యుండు మోక్షార్థియౌ"

15, మార్చి 2019, శుక్రవారం

సమస్య - 2958 (శంకరు గెల్చి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"శంకరు గెల్చి రఘువరుఁడు జనులను బ్రోచెన్"
(లేదా...)
"శంకరు నాజి గెల్చి జనసంఘముఁ బ్రోచెను రామభద్రుఁడే"

14, మార్చి 2019, గురువారం

సమస్య - 2957 (సత్కవి కాని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"నాగఫణి శర్మ సుకవి యనం దగండు"
(లేదా...)
"సత్కవి కాని నాగఫణి శర్మ వధానముఁ జేయు టెందుకో"
(మొన్న బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి శతావధానంలో నేనిచ్చిన సమస్య)

13, మార్చి 2019, బుధవారం

సమస్య - 2956 (హరునిన్ మృత్యువు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"హరు మృత్యువు మ్రింగ లోక మానందించెన్"
(లేదా...)
"హరునిన్ మృత్యువు మ్రింగఁగా భువన మత్యానందమున్ బొందెరా"

12, మార్చి 2019, మంగళవారం

సమస్య - 2955 (క్రూరుని మార్గమే...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"క్రూరుని మార్గమ్మె మనకుఁ గూర్చును ముక్తిన్"
(లేదా...)
"క్రూరుని మార్గమే మనకుఁ గూర్చును ముక్తి నటన్న సత్యమౌ"

11, మార్చి 2019, సోమవారం

సమస్య - 2954 (కన్న కుమారుండె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కన్న కుమారుండె నా మగండని పల్కెన్"
(లేదా...)
"కన్న సుతుండె నా మగఁడు గాఁడె యటంచన మెచ్చి రెల్లరున్"

10, మార్చి 2019, ఆదివారం

సమస్య - 2953 (మరణము లేనివారు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"మరణమే లేనివారలు మనుజు లెల్ల"
(లేదా...)
"మరణము లేనివారు గద మానవు లెల్లరు దివ్యమూర్తులున్"

9, మార్చి 2019, శనివారం

సమస్య - 2952 (యుద్ధము శాంతి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"యుద్ధము శాంతి నొసఁగు జను లున్నతినిఁ గనన్"
(లేదా...)
"యుద్ధము శాంతిదాయక మహో జనపాళికి సౌఖ్య మిచ్చెడిన్"
(ఈరోజు పూరణలు ప్రసారమయ్యే ఆకాశవాణి వారి సమస్య)

8, మార్చి 2019, శుక్రవారం

సమస్య - 2951 (పరులు సేయనొప్పు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పరులు సేయ నొప్పు పాలనమ్ము"
(లేదా...)
"పరులు సమస్త రాజ్యమును పాలన సేయఁగ నొప్పు నెప్పుడున్"

7, మార్చి 2019, గురువారం

సమస్య - 2950 (కారాగారమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కారాగారమున మధుర గానము వింటిన్"
(లేదా...)
"కారాగారమునందు వింటి నవురా గాంధర్వ సంగీతమున్"

6, మార్చి 2019, బుధవారం

సమస్య - 2949 (ప్రేమించినఁ గీడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"ప్రేమించినఁ గీడు గల్గు ద్వేషింపు మిఁకన్"
(లేదా...)
"ప్రేమయె కీడొనర్చుఁ గద ద్వేషమె మేలొనఁగూర్చు నిచ్చలున్"

5, మార్చి 2019, మంగళవారం

సమస్య - 2948 (బస్సే సాధనము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"బస్సే సాధనము గద దుబాయినిఁ జేరన్"
(లేదా...)
"బస్సె దుబాయిఁ జేర్చఁదగు వాహన మన్యము లేలఁ గోరఁగన్"

4, మార్చి 2019, సోమవారం

సమస్య - 2947 (రామ భజన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రామ భజన సేయుము శివరాత్రికి భక్తిన్"
(లేదా...)
"శ్రీరఘురామ సద్భజన సేయఁ దగున్ శివరాత్రికిన్ దమిన్" 

3, మార్చి 2019, ఆదివారం

సమస్య - 2946 (కలహము సుఖమిచ్చు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కలహము సుఖ మిచ్చు ననెను గాంధీ మునుపే"
(లేదా...)
"కలహమ్ముల్ సుఖశాంతు లిచ్చు ననియెన్ గాంధీజి మున్పెప్పుడో"

2, మార్చి 2019, శనివారం

సమస్య - 2945 (బెదరుచుఁ గార్యముల్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"బెదరి కార్యముల్ విడుచుటె విజ్ఞత యగు"
(లేదా...)
"బెదరుచుఁ గార్యముల్ విడుటె విజ్ఞత కల్గు జయంబు లెల్లెడన్"
(ఈరోజు పూరణలు ప్రసారమయ్యే ఆకాశవాణి వారి సమస్య)

1, మార్చి 2019, శుక్రవారం

సమస్య - 2944 (క్షుద్బాధల్ సను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"క్షుద్బాధ దొలంగుఁ గాలకూటముఁ గొనినన్"
(లేదా...)
"క్షుద్బాధల్ సనుఁ గాలకూట విషమున్ గొన్నంత సత్యం బిదే"