24, సెప్టెంబర్ 2025, బుధవారం

సమస్య - 5254

25-9-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గురు ధనము హరింపనొప్పగు జనుల్ మెచ్చన్”
(లేదా...)
“గురు ధనమున్ హరింపఁగఁ దగున్ జనులెల్లరు సూచి మెచ్చఁగన్”

17 కామెంట్‌లు:

  1. చ.
    పరులను మోసగించి పెనుభారము మోప ప్రభుత్వ గర్వమున్
    విరివిగ దెల్పి పన్నులను వేయుచు సొమ్ములు దోచె వాడు రా
    త్రి రయము తెచ్చెదం బలుక లేను రహస్యము నాదు గొంతు బొం
    గురు, ధనమున్ హరింపగ దగున్ జనులెల్లరు సూచి మెచ్చగన్ !

    రిప్లయితొలగించండి
  2. కందం
    పరమాత్మ సమానుడనన్
    గురువందు త్రిమూర్తులెల్ల గోచరమగుచున్
    గరపఁగ విద్యాదుల, నే
    గురు ధనము హరింపనొప్పు గుజనుల్ మెచ్చన్?

    చంపకమాల
    కరపుచు విద్యలన్ హృదికి గంధమునద్దెడు పూజ్యునట్లుగన్
    గురువు త్రిమూర్తి రూపుడనఁ గొల్చిరి రాముడు కృష్ణమూర్తియున్
    నిరతము వారి సేవలను నిల్చుటనొప్పు! వితండవాది! యే
    గురు ధనమున్ హరింపఁగఁ దగున్ జనులెల్లరు సూచి మెచ్చఁగన్?

    రిప్లయితొలగించండి
  3. కొరమాలు నీతుల నేర్పిరి ,
    జరుగుబడిని యిక్కుపాటు సలుపుచు దానున్
    విరివిగ సంపాదించిన
    గురు ధనము హరింపనొప్పు గుజనుల్ మెచ్చన్

    రిప్లయితొలగించండి
  4. సహదేవుడు ధర్మరాజుతో పలుకుట:-

    కురు కులమందు పుట్టితిమి, కూరిమి కౌరవులయ్యె వారలే!
    పరులను రీతి లోకమున పాండవులైతిమి! పోయె సంపదల్!
    పరువది పోయె! కానలకు వచ్చితిమిట్టుల! బాధ తగ్గగన్
    గురు ధనమున్ హరింపఁగఁ దగున్ జనులెల్లరు సూచి మెచ్చఁగన్!!

    తగ్గగన్ + కురు ధనము = తగ్గగన్ గురు ధనము

    రిప్లయితొలగించండి

  5. అరయగ త్రిమూర్తుల సముడు
    ధరణిని పూజ్యుండనుచును తలచెడి వానిన్
    దరిజేరుచు జ్ఞానమనెడి
    గురు ధనము హరింపనొప్పు గుజనుల్ మెచ్చన్.


    హరిహర ధాతతుల్యులని యక్షరమౌ యవభాస మిచ్చుచున్
    ధరణిని గౌరవింపదగు దక్షులటంచును వారలన్ సదా
    సురలుగ నెంచి కొల్వవలె సువ్రతులెప్పుడు జ్ఞానమంచనే
    గురు ధనమున్ హరింపఁగఁ దగున్ జనులెల్లరు సూచి మెచ్చఁగన్.

    రిప్లయితొలగించండి
  6. కఱకులు దుష్టవర్తనులు కామమదాదులు దోచినారుగా
    కరుకు కరంబు లందు చురకత్తులు పట్టి ధనంబు మిక్కిలిన్
    మరిమరి జొచ్చి వాసములు మానక చౌర్యము దోచినట్టి యా
    గురు ,ధనమున్ హరింపగ దగున్ జనులెల్లరు సూచి మెచ్చగన్

    గురు= మిక్కిలెక్కువ

    రిప్లయితొలగించండి
  7. తిరమగు విద్య యనె డి స
    ద్గు రు ధనము హరింప నొ ప్పు :: గుజనుల్ మె చ్చ న్
    ధరలో నేదియు జేయగ
    నరు లకు వల దంద్రు బుధులు నైతిక పరులై

    రిప్లయితొలగించండి
  8. పరులనుమోసగించి పలు పాపపుకృత్యములాచరించుచున్
    నిరతము విత్తమార్జనమునేతమ ధ్యేయముగా దలంచుము
    ష్కరుల దురాగతమ్ములను కట్టడి సేయఁగ నొక్కటయ్యి వే
    గురు ధనమున్ హరింపఁగఁ దగున్ జనులెల్లరు సూచి మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  9. అరయగ కొందరు నేతలు
    నిరతంబవినీతి పనుల నిల్చిన వారే
    మరివా రడకినదగు దో
    గురు ధనము హరింపనొప్పగు జనుల్ మెచ్చన్

    పరులను దోచుటే తనకు వచ్చిన విద్యని నేత హాయిగా
    నిరతము రాజకీయమున నిల్పుచు దృష్టిని నల్లడబ్బు పై
    మురియుచు వంచనార్జితము మూటలు గట్టుచు దాచినట్టి దో
    గురు ధనమున్ హరింపఁగఁ దగున్ జనులెల్లరు సూచి మెచ్చఁగన్

    [దోగురు = చౌర్యము, దొంగతనము]

    రిప్లయితొలగించండి
  10. కం:గురు విచ్చిన జ్ఞానధనము
    గురుతరకీర్తి నొసగె గద!గురువునె యెపుడున్
    స్మరియింపవె? యూరకె యెటు
    గురు ధనము హరింపనొప్పగు జనుల్ మెచ్చన్”?

    రిప్లయితొలగించండి
  11. చం:గురు విడ జ్ఞానమన్ ధనము గొప్పగ నీవె యెరింగి నట్లు న
    ల్గురకును బోధ జేసెదవు,లోకము మెచ్చదు నిన్ను, నెట్టులన్
    గురు ధనమున్ హరింపఁగఁ దగున్ ?జనులెల్లరు సూచి మెచ్చఁగన్
    గురువును సంస్మరించు మిక ,కోట్ల నొసంగగ కోర డొజ్జయున్.
    (గురువు నీకు జ్ఞానధనాన్ని యిస్తే అదంతా నీ జ్ఞానం లాగా బోధిస్తూ కనీసం గురువు ను స్మరించవే! జనం మెచ్చే విధం గా గురువును స్మరించు.ఆ గురువు నిన్ను కోట్లు ఇమ్మని కోరడు కదా!స్మరిస్తే చాలు కదా!)

    రిప్లయితొలగించండి
  12. కం॥ గురు ధనమనంగ విద్యయె
    పెరుఁగుచు దోఁచిన తరగని పెన్నిధి యదియే
    ధరణిని శిష్యులటుల నా
    గురు ధనము హరింపనొప్పగు జనుల్ మెచ్చన్

    చం॥ గురు ధనమేది తెల్పఁగను గూరిమి తోడ నొసంగు విద్యయే!
    పెరుఁగు హరించ శిష్యుఁడది పెన్నిధియై నిలుచున్ గదా సదా!
    తరగదు దోఁచినంతనది దాచిన దాగున యద్ది యట్టిదౌ
    గురు ధనమున్ హరింపఁగఁ దగున్ జనులెల్లరు సూచి మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  13. చం:గురుసుత చెల్లెలౌ ననుచు గొప్పగ జెప్పకు మో ప్రియా! కచా!
    గురువె యొసంగె బ్రాణ మను గొప్ప ధనమ్ము, మరెట్టు లూరకే
    గురు ధనమున్ హరింపఁగఁదగున్? జను లెల్లరు సూచి మెచ్చగన్
    గురువుకు నల్లు డౌట సరి,కూడ దటం చను నేమి తండ్రియున్?
    (కచుని తో దేవయాని-నేను చెల్లెలి తో సమాన మని వంక చెప్పకు.మా నాన్న నీకు ప్రాణం అనే గొప్ప ధనం ఇస్తే ఊరికే హరించి వెళ్లి పోతావా? పోనీ నన్ను పెళ్లి చేసుకో కూడదని నా తండ్రి అన్నాడా?కాబట్టి గురు విచ్చిన ధనాన్ని ఊరికే పొందక నన్ను వివాహం చేసుకో.)

    రిప్లయితొలగించండి
  14. సమస్య:
    గురు ధనమును హరింపఁగ దగున్ జనులెల్లరు సూచి మెచ్చగన్

    చం.మా :

    గురువులు నేర్పిరే సతము గూరిమి మంచిని నాచరించగన్
    పరుగులు దీయు మానసము పట్టగ శక్యమ నీతిసూత్రముల్
    గురు ధనమున్ హరింపఁగ దగున్, జనులెల్లరు, సూచి మెచ్చగన్
    సరిసరి యంచు నవ్వి మరి చక్కని నమ్మిక వెన్నుపోటులన్

    రిప్లయితొలగించండి
  15. సురుచిరముగ సమరమునకుఁ
    జొరఁబాఱక గెలుపు నంది జూదం బందుం
    గురువంశాగ్రణి వినుమా
    గురు ధనము హరింప నొప్పగు జనుల్ మెచ్చన్

    [గురు ధనము = అన్నగారి ధనము]


    ఇరువునఁ జేరి కర్ణుఁడు హరింపఁడె భార్గవు నస్త్ర విద్యలన్
    నిరత మొసంగినం బెరుఁగు నిక్కముగాఁ బరికించి చూడఁగా
    నొరులకు నీయఁ బ్రీతి మెయి నొజ్జకు నున్న ధనమ్ము జ్ఞాన మా
    గురు ధనమున్ హరింపఁగఁ దగున్ జను లెల్లరు సూచి మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు
    హైదరాబాద్.

    గురువు పరమాత్మ సముడగు
    విరివిగ జ్ఞానమ్ము నిచ్చు విద్యార్థులకున్
    నిరతము సేవింపు; మెటుల
    గురుధనము హరింప నొప్పు గుజనుల్
    మెచ్చన్?

    రిప్లయితొలగించండి