18, నవంబర్ 2025, మంగళవారం

సమస్య - 5308

19-11-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తన సతి వివాహమున్ జూడఁ దాను నేఁగె”
(లేదా...)
“తన సతి పెండ్లి చూచుటకుఁ దానుఁ జనెన్ హితబంధుకోటితో”

12 కామెంట్‌లు:

  1. ఆరుపదుల ప్రాయంపువాడైననాడు
    బంధుమిత్రులు పరివార బలగమెల్ల
    ఇష్టపూర్తిన సల్పంగ షష్టిపూర్తి
    తన సతి వివాహమున్ జూడఁ దాను నేఁగె

    రిప్లయితొలగించండి
  2. చ.
    పనిగొని కష్టముల్ పడి విపత్తుల నిల్చుచు పొందితేను నా
    ధనమును దొంగిలించి యిలు దాటిన వాని కనుంగొనంగ నీ
    దినమున బూని పట్టెదము తెల్లము వాడొక మాయి పాడు గీ
    ర్తన సతి ! పెండ్లి జూచుటకు దాను జనెన్ హితబంధుకోటితో !

    రిప్లయితొలగించండి

  3. మనసు గెలిచిన పడతి తో మనువటంచు
    ప్రేమ తో వచ్చి మనలను పిలిచె కనుక
    వెళ్ళ వలయునటంచును వేడు కొనగ
    తన సతి, వివాహమున్ జూడఁ దాను నేఁగె.


    ధనమది లేనివాడు తన తమ్ముడు పట్టణ మందు వేడ్కగా
    మనసుకు నచ్చినట్టి యొక మానిని తో మనువంచు పిల్చెనే
    మనలను, కాదు కూడదన మంచిది కాదని యంచు పోరగా
    తన సతి, పెండ్లి చూచుటకుఁ దానుఁ జనెన్ హితబంధుకోటితో.

    రిప్లయితొలగించండి
  4. శర్వరుని బాణ మహిమన శైలసుతకు
    శంకరుని దోడ బెండిలి జరుగుచుండ
    పరువతపు రాజు కూతుగ పైకొనిన క
    తన , సతి వివాహమున్ జూడఁ దాను నేఁగె

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి
    పుట్టనుండెడి దేవునిఁ బురము చేర్చి
    కోవెలన్ గట్టి గోపన్న కూర్చి నగల
    మురిసి శ్రీరామనవమికి ముందు నడువ
    తన సతి, వివాహమున్ జూడఁ దాను నేఁగె

    చంపకమాల
    వనమున పుట్టలో గనుచు భక్తుడు గోపన రామమూర్తినిన్
    వినయము మీర కోవెలను విత్తము గూరిచి కట్టి భూషలన్
    ఘనముగ పేర్చ, భద్రగిరిఁ గన్నుల పండువఁ జేయ దీర్చఁగన్
    దన సతి, పెండ్లి చూచుటకుఁ దానుఁ జనెన్ హితబంధుకోటితో

    రిప్లయితొలగించండి
  6. ( ఒక యదార్థ సంఘటన ఆధారంగా...)

    చం. మా.

    మనువుకు ముందు వేరొకరు మానసమందు వసించ, నట్టి దా

    ని నెఱిగి కోపగించకను,నిల్చుచు భార్యకు నండదండగా...

    విని వశ మాట ప్రేమికుల పెండిలి జేయగ నిశ్చయించుచున్

    దన సతి పెండ్లి చూచుటకుఁ దానుఁ జనెన్ హితబంధుకోటితో


    ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  7. పెండ్లి చూడగ రమ్మను పిలుపు తోడ
    వినయ సంపన్ను డొక్కడు వేడుకొనగ
    విలువగు పలుకాన్కలతోడ, వెంటనుండ
    తనసతి, వివాహమున్ జూడఁ దాను నేఁగె

    వినయము చూపు సేవకుడు పెండ్లికి రమ్మని పిల్చి వేడగా
    ఘనమగు యోగ్యమైన పలు కానుక లిచ్చుట భావ్యమంచు తాఁ
    గనకపు భూషణమ్ములను కాన్కలఁ జేగొని, వెంటనుండగా
    తనసతి, పెండ్లి చూచుటకుఁ దానుఁ జనెన్ హితబంధుకోటితో

    రిప్లయితొలగించండి
  8. (ఈరోజు బాగా చదువుకున్న పిల్లలు career కే ప్రాముఖ్యత ఇస్తున్నారండి)

    తే॥ యువత యార్థిక వృద్ధియె యోగమనుచు
    మనువుకు విముఖతఁ గనఁగ మదినిఁ బిలువ
    జ్ఞాతి పెండ్లికి నరుదెంచఁ జనఁగఁ గలసి
    తన సతి, వివాహమున్ జూడఁ దాను నేఁగె

    చం॥ మనువన నేఁడు కుంటుపడె మక్కువ యవ్వనమందు వృద్ధిపై
    మనసిడి యార్థికోన్నతికె మాన్యత నిచ్చుచు నుండ నెల్లరున్
    వినఁబడ పెండ్లి పిల్పు నిజప్రీతినిఁ గాంచుచుఁ దోడు నంటఁగన్
    దన సతి, పెండ్లి చూచుటకుఁ దానుఁ జనెన్ హిత బంధు కోటితో

    రిప్లయితొలగించండి
  9. పెండ్లి పిలుపుకు స్పందించి వెడలి నట్టి
    పతికి తోడుగ భార్యయు పయన మౌచు
    నగలు ధరియించి ముందుగా నడచు చుండ
    తన సతి :: వివాహ మున్ జూడ తాను నే గె

    రిప్లయితొలగించండి
  10. మనమున జనింప ఘన సంభ్రమమ్ము తనకుఁ
    గనుల కింపు నొసంగఁగ ఘనతరముగ
    నప్పురమున జరుగు నంచుఁ జెప్పి నంతఁ
    దన సతి వివాహమున్ జూడఁ దాను నేఁగె


    ‌అనుజుఁడు కన్యకా మణిని నారసి చారు లతాంగి నొక్కెడన్
    మనసిజ పద్మ బాణ చయ మర్దన తప్తుఁడునై వరింపఁగా
    ననయము వెంట నుండు నలినాక్షి సరోజ నిభాస్య తోడు రాఁ
    దన సతి పెండ్లి చూచుటకుఁ దానుఁ జనెన్ హితబంధుకోటితో

    రిప్లయితొలగించండి

  11. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    పిలిచితిరి రేపు చెల్లెలి పెండ్లి యనుచు
    పంతములు వీడి యిపుడైన వారి తోడ
    కలసి పోదమనుచు వేడగా నయమున
    తన సతి; వివాహమున్ జూడఁ దాను నేగె.

    రిప్లయితొలగించండి
  12. బంధువులు యింట జరుగు వివాహమునకు
    తప్పకమనమేగవలయుత్వరితమగను
    తోడురమ్మనికోర సంతోషమూని
    *తన సతి,వివాహమున్ చూడ దానునేగె*

    రిప్లయితొలగించండి